శాతకర్ణి...బ్రాహ్మణ చక్రవర్తే
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (21-01-2017)
తెలుగువారైన శాతవాహన రాజుల తొలినివాసం
తెలంగాణలోని కోటిలింగాల. ప్రజానురంజకంగా పరిపాలించిన శాతవాహన వంశీయులు అసహాయ
శూరులు, అరివీర భయంకరులు. శాతకర్ణి బ్రాహ్మణుడే. బ్రాహ్మణ చక్రవర్తి అని
చెప్పడానికి ఎన్నో చారిత్రక పుస్తకాలలో సాక్ష్యాధారాలున్నాయి. అసలు సిసలు
బ్రాహ్మణుడైన గౌతమీపుత్ర శాతకర్ణిని బ్రాహ్మణేతరుడిగా చిత్రీకరించడం చరిత్రను
వక్రీకరించడమే!
"బ్రాహ్మణ రాజ్య సర్వస్వం"
పేరుతో స్వర్గీయ బి ఎన్ శాస్త్రి రచించిన సుమారు ఏడువందల పైచిలుకు
పేజీల బృహత్ గ్రంథానికి భూమిక రాసిన డాక్టర్ గంగాపురం హరిహరనాథ్, క్రీస్తు పూర్వం 184 ప్రాంతంలో, మగధ వంశంపు చివరి రాజైన
బృహద్రథుడిని, ఆయన భోగలాలసతను
సహించలేని మహామంత్రి పుష్యమిత్రుడు చంపి, సింహాసనాన్ని అధిష్టించిన తదనంతర పరిణామాలలో, ఏ విధంగా బ్రాహ్మణ
రాజ్యాలేర్పడ్డాయో పేర్కొన్నారు. ఆయన సింహాసనాన్ని అధిష్టించడంతో మంత్రి, సామంత, దండనాయక పదవులందున్న
బ్రాహ్మణులందరూ, స్వతంత్రులై
అఖిల భారత వ్యాప్తంగా స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన రాశారు. వారే
శుంగులుగా,
శాతవాహనులుగా, కాణ్వులుగా పేరొందారు. దక్షినాపథానికి
మహోజ్వల చరిత్రనందించడమే కాకుండా, భారత దేశ మహోన్నత చరిత్రకు శ్రీకారం చుట్టిన వారు
శాతవాహనులని, సుమారు 450 సంవత్సరాలు
పాలించిన వారి కాలంలో వైదిక ధర్మం వర్ధిల్లిందని హరిహరనాథ్ అంటారు. ఈ విషయాలతో పాటు బ్రాహ్మణ రాజ్యాలకు సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన
విషయాలు బిఎన్
శాస్త్రి
గారి గ్రంథంలో లభ్యమవుతాయి. బ్రాహ్మణులు కేవలం మంత్రి, దండనాయక, పురోహిత పదవులనే
అలంకరించారు కాని సామ్రాజ్యాలను స్థాపించలేదని మొండిగా వాదించేవారికి కనువిప్పు
కలిగేలా, ఈ సర్వస్వంలో, ప్రసిద్ధమైన 26 బ్రాహ్మణ
రాజ్య వంశాల గురించి పరిశోధనాత్మకంగా, సోదాహరణంగా,
నిరూపిస్తూ, విపులీకరించారు
శాస్త్రిగారు. ఈ సర్వస్వంలో ఇతర విషయాలతో పాటు ఆర్య బ్రాహ్మణులు, ఋగ్వేదం, ఋగ్వేద ఋషులు, రాజులు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఆర్యుల వ్యవసాయం, సాంఘిక అంశాలు, జనపదాలు, గణతంత్ర రాజ్యాల
సంక్షిప్త సమాచారం లాంటి అనేక విషయాలున్నాయి. అందులో భాగంగానే గౌతమీపుత్ర
శాతకర్ణి వంశమైన శాతవాహనుల గురించి కూడా వివరించడం జరిగింది.
ప్రజానురంజకంగా పరిపాలించిన శాతవాహన రాజులు అసహాయ
శూరులు....అరివీర భయంకరులు...అప్రతిమాన ప్రతిభా విశేషాలు కలవారని శ్లాఘించారు
శాస్త్రిగారు. తెలుగువారైన శాతవాహనుల తొలినివాసం తెలంగాణలోని కోటిలింగాల. ఇదే వారి
గణతంత్ర రాజ్యంగా వుండేది. శాతవాహన వంశీయులు అశ్వగణానికి చెందినవారు. మత్స్య, వాయు పురాణాలలో శాతవాహనుల చరిత్ర
గురించి వుంది. గ్రీకు రచయితలు,
చైనా యాత్రీకులు కూడా వీరి
గురించి రాశారు. ఈ రాజవంశపు రాజుల్లో హాల శాతవాహన చక్రవర్తి గొప్ప కవే కాకుండా తన
ఆస్థానంలో కుమారిల,
శ్రీపాలిత లాంటి మహాకవులను
పెట్టుకున్నారు. ఈ వంశీకులకు సంబంధించిన అనేక కథలు, గాథలు
ప్రచారంలో వున్నాయి. ఇటీవలి కాలంలో సినిమా రూపంలో కూడా వెలువడుతున్నాయి. కాకపోతే
వీటిలో చాలా భాగం చారిత్రకంగా ప్రామాణికాలు కావు. గాథా సప్తశతి, బృహత్కథ, జాతక కథలు, జానపద కథలు కొన్ని, కొంతవరకు శాతవాహనుల చరిత్రను తెలియ
చేస్తాయి. బిఎన్ శాస్త్రి తన పుస్తకంలో శాతవాహన వంశానికి చెందిన 30 మంది రాజుల
గురించిన వివరాలు పొందుపరిచారు.
శాతవాహన వంశానికి
మూలపురుషుడు శ్రీముఖుడు రాజకీయ చతురుడు, పరాక్రమవంతుడు.
ఇతడి తండ్రి శాతవాహనుడు. అశోక చక్రవర్తి మరణానంతరం స్వతంత్రుడై, విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు
చేసుకుని పాలించాడు. శ్రీముఖుడికి పూర్వం కోటిలింగాల పరిసరాల పట్టణ సమాఖ్యను
పాలించిన రాజు శాతవాహనుడు. తండ్రి మీద గౌరవంగా శాతవాహన పేరును వంశనామంగా శ్రీముఖుడు
పెట్టుకున్నాడు. శ్రీముఖుడు మహారాష్ట్ర లోని కొంత ప్రాంతాన్ని జయించి మరాఠీ
అమ్మాయితో తన కుమారుడు మొదటి శాతకర్ణి వివాహం జరిపించాడు. శ్రీముఖుడి మరణానంతరం
కొడుకు చిన్నవాడైనందున అతడి సోదరుడు కృష్ణుడు కొంతకాలం పాలించి శాతకర్ణి
యుక్తవయస్కుడైన తరువాత రాజ్యాన్ని అప్పగించాడు. దక్షినాపథాన వున్న సమస్త రాజ్యాలను
జయించిన శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక
రాజసూయ యాగం చేశాడు. మొదటి శాతకర్ణి ప్రతిభావంతుడు, పరిపాలనా
దక్షుడు, మహా బలవంతుడు. మొదటి శాతకర్ణి తరువాత
పూర్ణోత్సంగుడు, స్కంద స్తంబి పాలించారు. ఆ తరువాత
రాజ్యాన్ని అధిష్టించిన వాడు రెండవ శాతకర్ణి. ఇతడు 56 సంవత్సరాలు శాతవాహన
రాజ్యాన్ని పాలించినట్లు, విదేశీయుల దురాక్రమణను ఎదుర్కొని, దేశీయుల
దండయాత్రలను నిరోధించి,
అణచి, శాతవాహన సామ్రాజ్యంలో శత్రు భయం
లేకుండా చేసినట్లు ఆధారాలున్నాయి.
మగధ సామ్రాజ్యాన్ని సహితం
జయించి చక్రవరి పదవిని పొందాడు.
రెండవ
శాతకర్ణి అనంతరం, గౌతమీపుత్ర శాతకర్ణి కంటే ముందు, రాజ్యాన్ని పాలించిన వారు వరుసగా....లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి శాతకర్ణి, స్కంద స్వాతి, మృగేంద్ర శాతకర్ణి, స్వాతివర్ణ, పులోమావి, గౌరకృష్ణుడు, హాల శాతవాహనుడు, మందూలకుడు, పురేంద్ర సేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివ స్వాతి. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి అనంతరం
పాలించినవారు వరుసగా....రెండవ పులోమావి, శివశ్రీ, శివస్కంద, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయ శాతకర్ణి, చందశ్రీ, నాల్గవ పులోమావి. వీరిలో, హాల శాతవాహనుడు ఆ వంశపు రాజన్యులలో
సాహిత్య పోషకుడిగా,
మహా కవిగా, సంస్కృత ప్రాకృత భాషల అభిమానిగా-ఆదరించి పోషించిన వాడిగా, ప్రసిద్ధికెక్కాడు. ఇతడి కాలంలోనే గాథా సప్తశతి
రూపుదిద్దుకుంది. ఆయన ఆస్థానానికి వచ్చిన కవుల గాథలను, ఏర్చి కూర్చి గాథా సప్తశతి గ్రంథాన్ని
తయారు చేశారు. చంద్రశ్రీతో శాతవాహన వంశపు ప్రధాన శాఖ
అంతరించిందనే అనాలి. నాల్గవ పులోమావి శాతవాహన వంశంలో మరో శాఖకు చెందినవాడు.
శాతవాహన వంశపు చివరి రాజులు అంతఃకలహాలలో మునిగి వివిధ ప్రాంతాలలో చిన్న-చిన్న
రాజ్యాలను స్థాపించుకుని పాలించారు.
శాతవాహన
వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప
చేసిన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అగ్రగణ్యుడు. క్రీస్తు శకం 104 లో
సింహాసానానికి వచ్చి 21 సంవత్సరాలు పాలించాడు. ఆయన పాలనా పగ్గాలు చేపట్టే నాటికి
శాతవాహన రాజ్యం చాలా చిన్నదిగా వుండేది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి వీరమాత గౌతమీ
బాలశ్రీ. ఇతడిని "ఏక బ్రాహ్మణ" అనే బిరుద నామంతో సంబోధించేవారు. అసిక, అశ్మక, ములక, విదర్భ మొదలైన
రాజ్యాలను జయించి, క్షహరాట వంశాన్ని నిర్మూలించి, "క్షహరాట వంశ నిరవశేషకర" అనే బిరుదు కూడా
పొందాడు. ఆయన మహాసామ్రాజ్య నిర్మాణంలో భాగంగా పూర్వీకులు కోల్పోయిన ప్రాంతాలనే
కాకుండా, అనేక ఇతర రాజ్యాలను జయించాడు. సహపాణుడిపై విజయం
సాధించిన తరువాత, విజయ సూచనగా, ఆతడి పేరుమీద వున్న
నాణేలను పునర్ముద్రించాడు. శాతవాహన వంశ ప్రతిష్టను ఉద్ధరించడమే కాకుండా, తన రాజ్యంలో చక్కటి పాలనా వ్యవస్థను ప్రవేశ పెట్టాడు. ప్రజానురంజకంగా
పాలన చేశాడు. వింధ్య, అచీవతి, వింధ్య పర్వత
ప్రాంతం, ఆరావళీ పర్వతాలు, పశ్చిమ కనుమలలోని
సహ్యాద్రి పర్వత పంక్తి, నీలగిరులకు పడమట వున్న కన్హగిరి, మలయ పర్వతం, మహేంద్రగిరి, చకోర పర్వతం, శ్రీశైల శ్రేణులు, సెటగిరి, సిరికణ పర్వత శ్రేణులతో శాతకర్ణి
రాజ్యం వ్యాపించి వుండేది. ఇతడి రథాశ్వాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయని శాసనాలలో
రాయబడింది.
గౌతమీపుత్ర
శాతకర్ణి దృఢకాయుడని,
స్ఫురద్రూపి అని, అతడు ముద్రించిన నాణేల మీద వున్న
చిత్రాల ఆధారంగా భావించాలి. సమున్నత శరీరం కల శాతకర్ణి అరివీర భయంకరుడని, సమర శిరసి విజిత రిపు సంఘాతుడని, ఉదార పాలకుడని, ప్రజల సుఖ దుఃఖాలను తెలిసినవాడని, వైదిక ధర్మ నిరతుడని, ఆగమ నిలయుడని, ఏక బ్రాహ్మణుడని, బ్రాహ్మణులను ఆదరించి వేద విద్యలను
ప్రోత్సహించాడని, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిని
పొందిన మహామనీషి అని "బ్రాహ్మణ రాజ్య సర్వస్వం" లో బీఎన్ శాస్త్రి గారు
వర్ణించారు. తల్లి గౌతమీ బాలశ్రీ ప్రోత్సాహంతో బౌద్ధ సన్యాసులకు దాన ధర్మాలిచ్చిన
తనయుడు శాతకర్ణి "అవిపన్న మాతృ శుశ్రూషక" అన్న
బిరుదు కూడా పొందాడంటారు శాస్త్రి గారు. అతడి పాలనా కాలంలో శాతవాహన రాజ్యం సమున్నత
స్థితిలో వుండి, తెలుగువారి కీర్తి దిగ్దిగంతాలలో
వ్యాప్తి చెందింది. అప్పుడే తెలుగువారు సముద్రయానం చేసి ప్రాక్పశ్చిమ దేశాలతో
వ్యాపారాలు కూడా సాగించారు.
సుమారు నాలుగున్నర శతాబ్దాలు దక్షిణాపథాన్ని, దక్షిణ భారత దేశాన్ని, ఉత్తరాపథాన్ని, మగథ సామ్రాజ్యాన్ని, తమ ఏలుబడిలోకి
తెచ్చుకొని ప్రజానురంజకంగా పాలించిన శాతవాహన రాజుల చరిత్ర తెల్సుకోవడానికి అనేక
ఆధారాలు శాసనాల రూపంలో,
పురాణాలు-గ్రంథాల
రూపంలో, దేశ విదేశీయుల
రాతల రూపంలో, నాణేల రూపంలో , అప్పటి బౌద్ధారామాల రూపంలో, కథలు,
గాథల
రూపంలో సులభంగా లభ్యమవుతున్నాయి. శాతవాహనులు తెలుగువారైనందువల్ల ఈ ప్రాంతంతో
వారికి పటిష్టమైన సంబధ బాంధవ్యాలున్నాయి. శాతకర్ణి బ్రాహ్మణుడే, బ్రాహ్మణ
చక్రవర్తే అని చెప్పడానికి ఒక్క " బ్రాహ్మణ రాజ్య సర్వస్వం" పుస్తకమే
కాకుండా మరెన్నో పుస్తకాలలో పలు ఆధారాలున్నాయి. నాణేలలో కనిపించే ఆయన రూపు రేఖలు
గౌతమీపుత్ర శాతకర్ణి అసలు సిసలైన బ్రాహ్మణుడే అనడానికి స్పష్టమైన నిదర్శనం.
అలాంటప్పుడు చరిత్ర వక్రీకరించి గౌతమీపుత్ర శాతకర్ణిని, బ్రాహ్మణేతరుడిగా, చిత్రీకరించడం భావ్యమా?
to do wars kings must be powerful. they must had to kill people in wars. do Brahmans did that. Did they eat meat to be worthy to fight in wars?
ReplyDeleteJust curiosity n want to know some historical truths.
https://www.change.org/p/pmo-india-tv9-is-spreading-hatred-towards-hindu-community?recruiter=38064904&utm_source=share_petition&utm_medium=email&utm_campaign=share_email_responsive
ReplyDeleteClick the link, Sign a petition
రాజ్యపాలన చేసే సత్తా, హక్కు బ్రాహ్మణేతరులకి మాత్రమే ఉందని కొంతమంది అభిప్రాయమేమో?
ReplyDelete