రహదారి భద్రతకు ’సేవా కేంద్రాలు’
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (05-01-2017)
దేశవ్యాప్తంగా వున్న అన్ని జాతీయ రహదారులను, రాష్ట్రాల పరిధిలోని ప్రధాన రాష్ట్ర రహదారులను అనుసంధానం
చేస్తూ, సమీకృత అత్యవసర సహాయ సేవా కేంద్రాలను (ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స్ (ఐ.ఇ.ఆర్.సి) ఏర్పాటు చేయడం
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధన్యాతంశాలలో ఒకటిగా భావించాలి. బహుళ ప్రయోజన
లక్ష్యంగా ఏర్పాటైన "హైవే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ యాక్సిడెంట్
మిటిగేషన్" (హెచ్.ఇ.ఆర్.ఎ.ఎమ్) అనే వ్యవస్థ విజయవంతంగా చేపట్టి అమలు చేసిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా
రూపొందించిన నివేదికలో ఈ విషయం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. భారత ప్రభుత్వ
ఆధ్వర్యంలో నడుస్తున్న "ఇన్సురెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ (ఐ.ఆర్.డి.ఎ.), "జనరల్ ఇన్సురెన్స్
కౌన్సిల్" (జి.ఐ.సి.) సంయుక్త భాగస్వామ్యంలో హెచ్.ఇ.ఆర్.ఎ.ఎమ్ ఈ నివేధికను తయారుచేసింది. 108 ఆంబులెన్స్ సర్వీసుల రూపశిల్పి డాక్ట్రర్ ఎ. పి. రంగారావు నేతృత్వంలో ఈ సంయుక్త భాగస్వామ్య బృందం, అధ్యయనం చేసి, సాక్ష్యాధారాలతో, శాస్త్రీయ గణాంకాలతో
నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
అనేక కారణాల వల్ల భారత దేశం ఊహించని రీతిలో రహదారి ప్రమాదాల బారిన
పడుతున్నది. ప్రపంచంలోని దేశాలన్నింటి కంటే భారతదేశంలోనే రోడ్డు ప్రమాదాలు అధికంగా
వున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితిని జాతీయ సమస్యగా
గుర్తించాల్సన అవసరం, ఆవశ్యకత కూడా వుంది. రోడ్డు ప్రమాదాలు సాధారణం మానవ తప్పిదాలే. మానవాళి మనుగడకే అవి ఒక విధంగా
ప్రశ్నార్థకంగా మారాయి. "కాంపౌండ్ మాన్యువల్ గ్రోత్ రేట్" (సి.ఎ.జి.ఆర్.) రూపొందించిన గణాంకాలా
ప్రకారం భారతదేశంలో 1994 నుండి 2004 మధ్యకాలంలో, రహదారి ప్రమాద మరణాల సంఖ్య 3.7 శాతం పెరిగింది. అలాగే 2005-2015 మధ్యకాలంలో 4.4 శాతం పెరిగాయి.
2014 సంవత్స్రరం తో పోలిస్తే 2015 సంవత్సరంలో మొత్తం రోడ్డు ప్రమాదాలు 2.5 శాతం పెరగగా, మృతులు 4.6 శాతం, గాయపడినవారి సంఖ్య 1.4 శాతం పెరిగాయి. 2014 సంవత్సరంలో జరిగిన 4, 89,000 ప్రమాదాల్లో మృతి చెందిన
వారు 1, 39,671 మంది కాగా 4,93,474 మంది గాయపడ్డారు అని అంచనా. ఇదే 2015లో 5,01,423 ప్రమాదాల్లో మృతులు 1,46,133 మంది కాగా మిగతావారు గాయపడ్డవారిగా గణాంకాలు చూపుతున్నాయి. రమారమి ప్రతిరోజు ప్రతి గంటకు 57 ప్రమాదాలు జరుగుతుండగా 17 మంది ప్రాణాలు
కోల్సోతున్నట్లు ఈ వివరాలు తెలియచేస్తున్నాయి. 2015 లో జరిగిన ప్రమాదాల్లో ముఖ్యంగా గమనించాల్సింది
మరణిస్తున్న వారిలో 54.1 శాతం మంది 15 నుండి 34 వయస్సులోపు వారే. మొత్తం జరుగుతున్న రహదారుల ప్రమాదాల్లో జాతీయ రహాదారులపై 28.4 శాతం, రాష్ట్ర రహాదారులపై 24.0 శాతం, ఇతర రోడ్లపై 47.6 శాతం గా 2015 లెక్కలు చూపుతున్నాయి. అలాగే 2015లో జరిగిన ప్రమాదాల్లో
జాతీయ రహదారుల్లో మరణించిన వారి సంఖ్య 35.0 శాతం ఉన్నట్లు 2014 – 15 సంవత్సరంలో గాయపడిన వారి
సంఖ్య 7.5 శాతం పెరిగినట్లు ఆధారాలు చూపుతున్నాయి. ప్రణాళిక సంఘం అధ్యయనం ప్రకారం 2002 సంవత్సరంలో రోడ్డు
ప్రమాదాలకు లోనయిన వారి మూలంగా జరిగిన సామాజికపరమైన వ్యయం రూ. 55 వేల కోట్లు గా
గుర్తించారు. ఇది స్థూల దేశియోత్పత్తిలో (జి.డి.పి.)లో 3.5 శాతం గా కూడా విశ్లేషించారు.
ఈ నేపధ్యంలో, జాతీయ రహాదారుల్లో ప్రమాద
నివారణకు ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా "ఐ.ఆర్.డి.ఎ.", "జి.ఐ.సి." ని కోరటం జరిగింది. తద్వారా తక్షణ అత్యవసర సహాయ సహాకారలను అందించటంతో పాటుగా మరణాల సంఖ్య నిరోధించడానికి, వైధ్య సహాకారం అందించడానికి, భీమా పత్రాలను తక్షణం
పరిశీలించడానికి, ప్రాణాపాయం నుండి కాపాడడానికి ఏఏ చర్యలు తీసుకోవచ్చు అనే అంశాలను
పరిశీలించవలసిందిగా కోరటం జరిగింది. డాక్టర్ ఎ.పి. రంగారావు నేతృత్వంలోని అధ్యయన కమిటీ ఒక ప్రాథమిక సమగ్ర నివేధికను
రూపొందించి, సెప్టెంబర్ 1, 2012 లో ఐ.ఆర్.డి.ఎ కు అందించారు. ఈ ప్రాథమిక నివేధికలో నాలుగు ముఖ్య మైన ప్రతిపాదనలున్నాయి.
మొదటిది: ప్రమాదాల
నివారణకు తీసుకోవల్సిన చర్యలలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ ల జారీలో పక్కా నిబంధనలు
పాటించడం, వాహన వేగం నిరోధించటం లేదా వేగానికి కొన్ని నిబంధనల్ను నిర్ధేశంచడం, వాహన చోదకుడు మత్తు
పదార్ధాలను సేవించి నడపకుండా ఉండేట్లు చూడటం, సీటు బెల్టులను, హెల్మెట్లను తప్పనిసరిగా
ధరించడం, లాంటివి పక్కాగా అమలుచేయడం; రెండవది: ప్రమాదం చోటుచేసుకున్న తక్షణం సహాయం
అందించేందుకు తగురీతి ఆంబులెన్స్ లను డిజైన్ చేసి, వాటిని ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించేందుకు కొన్ని
కీలక కూడళ్ళ వద్ద ఏర్పాటు చేయడం, "గోల్డెన్ అవర్"-అంటే ప్రమాదం సంభవించిన అతికొద్ది సమయంలో సమీప
ఆసుపత్రికి తరలైంచడంతో పాటు, బాధితులను తరలిస్తున్న అంబులెన్స్ లలో ప్రాణాపాయ వనరులను సమకూర్చడం; మూడవది: ప్రమాదానికి గురైబ వారికి
తక్షణ సహాయం లభించేందుకు, అన్ని రకాల వైద్య సహాయం
దొరికేందుకు, అవసరమైన సమాచార మాధ్యమాలను అందుబాటులోనికి తీసుకురావటం, తరలింపు చర్యలను
క్షణాల్లో పూర్తి చేయగల వసతి కల్పించటం; నాలుగవది: ప్రమాదం జరిగిన
వెంటనే పటిష్టమైన సమాచార వ్యవస్థ ద్వారా పోలీసులకు సమాచారం అందచేసి, వివరాలను సేకరించటం, డాక్యుమెంట్ చేయడం ....అనేవి
ప్రధానంగా వున్నాయి.
మూడు లేదా నాలుగు అంకెల ప్రమాద టోల్
ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి, ఆ నెంబరుకు దీర్ఘ కాల వినియోగం వుండేలా చూడటం, తద్వారా అది నలుగురికీ
గుర్తుండి పోయేలా వుండేందుకు దోహద పడడం అవసరమని కూడా అధ్యయన కమిటీ భావించింది.
నివారణ అత్యవసర సమాచార వ్యవస్థకు సంబంధించిన ఈ ఫో నంబర్ కు ఫో కాల్స్ రిసీవ్
చేసుకోవడానికి, తక్షణమే సహాయ చర్యలు చేపట్టడానికి, ప్రమాద స్థలం నుండి వైద్యం లభించే వరకూ, మార్గ మద్యం యావత్తూ
అప్రమత్తం చేసేందుకు వీలు కల్పించేలా ఒక కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలని
సూచించింది కమిటీ.
జి.ఐ.సి. బృందం ఈ ప్రాథమిక నివేదిక
పూర్వాపరాలను పరిశీలించిన తరువాత
కొద్దిపాటి వ్యయంతో కూడుకున్న "హైవే ఎమర్జెన్సీ రిలీఫ్ మ్యానేజ్ మెంట్
సిస్టమ్ (హెచ్.ఇ.ఆర్.ఎ.ఎమ్)" అనే సమగ్ర ప్రణాళికను తయారు చేసి, 230 కి.మీ. నిడివిగల విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహాదారి మధ్య ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ఐ.ఆర్.డి.ఎ. కు సమర్పించింది. ఇందుకు డాక్టర్ ఎ.పి. రంగారావు ను ప్రధాన
సలహాదారునిగా ఎంపికచేసి, పథకం అమలు బాధ్యత ఆయనకు అప్పగించింది. ఐ.ఆర్.డి.ఎ. అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు వినియోగానికి రు.885 లక్షలు కేటాయించగా అందులో
కేవలం రు.574 లక్షలు మాత్రమే వ్యయం చేయటం జరిగింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా, సమీకృత అత్యవసర సహాయ సేవా
వ్యవస్థను రూపొందించి, ఐదు అంబులేన్స్ లను, ఒక కాల్ సెంటర్ ను, 1033 టోల్ ఫ్రీ నంబర్ ను వినియోగంలోనికి తీసుకొని రావటం జరిగింది. జాతీయ రహాదారుల
ఉపయోగానికి ఈ 1033 నంబర్ ను శాశ్వతంగా కేటాయించింది భారత ప్రభుత్వం. ఈ నంబర్ ను భవిష్యత్ లో
ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా వాడుకోవచ్చు. దరిమిలా, పైలట్ ప్రాజెక్టు చేపట్టిన రెండేళ్లలో పెద్ద సంఖ్యలో
ప్రమాదాలను నిరోధించేందుకు ఈ వ్యవస్థ దోహద పడింది. ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని నిరోధించటం లోనూ ఈ
వ్యవస్థ తోడ్పడింది. ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక అంబులెన్స్, అందులో శిక్షణ పొందిన
ట్రేయిన్డ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ టెక్నీషియన్ (ఇ.ఎమ్.టి.) లను ఉంచడం, కాల్ సెంటర్ ఏర్పాటు, వైద్యాధికారి, ప్రణాళికా బద్దమయిన
నివేధికలు ఇ.ఎం.టీ.ల ద్వారా సిద్దం చేయటం, పోలీసులను అప్రమత్తం చేయటం, క్రేన్ ఆపరేటర్లు అందుబాటులో వుడేలా చూడటం, టోల్ గేట్ల వద్ద, ఆసుపత్రుల వద్ద అప్రమత్తం
చేయటం, ఆటోమేటిక్ యూనిక్ యాక్సిడెంట్, విక్టిమ్ ఐ.డి. పద్దతులను పాటించడం వీటిలో భాగం అయ్యాయి.
సమీకృత అత్యవసర సహాయ సేవా వ్యవస్థ పనితీరు మూలాన ప్రమాదాల తీవ్రత
ప్రాజెక్టు అమలు కాలంలో 42.7 శాతం నుండి 39 శాతానికి 2014–15 లోనూ, 38.1 శాతానికి 2015–16 సంవత్సరంలోనూ తగ్గించడానికి వీలుకలిగింది. దీనితో పాటుగా సమీకృత అత్యవసర
సహాయ సేవా వ్యవస్థ వల్ల ప్రమాద సమయంలో అత్యవసర వైద్యం అందించటంతో పాటు, పోలీసులను అప్రమత్తం
చేయటంలో, వాహన చోదకులకు అవగాహన కల్పించటంలో ఎంతో సమర్థవంతంగానూ, చాకచక్యంగా
వ్యవహరించేందుకు దోహద పడింది. పెట్రోలింగ్ పోలీసు అధికారులు ప్రమాద స్థలాలకూ చేరుకోవడం, మత్తు పదార్ధాలు ఏ
స్థాయిలో తీసుకున్నది పరిశీలించటం, వారు ఎంత మత్తు స్థాయితో
తమ వాహనాలు అదుపులో నడుపుతున్నది పరిశీలించడం, ద్విచక్ర వాహన చోదకులు హెల్మెంట్లు తప్పనిసరిగా
ధరించేట్లు చేయడం లాంటివి కూడా ఈ వ్యవస్థ వల్ల జరిగాయి.
పైలట్ ప్రాజెక్టు అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు
వెలుగులోకొచ్చాయి. 14.8 శాతం ప్రమాదాలు కేవలం మత్తు పదార్థాలు సేవించటం వల్ల జరుగుతున్నట్లు, 27.3 శాతం ప్రమాదాలు అతివేగం
వల్ల సంభవిస్తున్నట్లు, 29.19 శాతం ప్రమాదాలు చోదకులు నిద్ర మత్తులో వుండటం వల్ల జరుగుతున్నట్లు తేలింది. వీటీలో 70 శాతం వరకు ప్రమాదాలను
నిరోధించడానికి ఆస్కారం వుంది. ఎన్.హెచ్.65 మార్గంలో పలు జనావాసాలున్నాయి. ఇక్కడ మత్తు మందు
అమ్మకాలు చట్టపరంగా లేనప్పటికీ మందు సులభంగా దొరికేందుకు అనేక మార్గాలున్నాయి. మందు నియంత్రణ సమగ్రంగా
చేపట్టకపోవటమూ ఒక రకంగా ప్రమాదాలకు
కారణమనే చెప్పాలి. ప్రజలలో అవగాహన కల్పించేందుకు వారికి శిక్షణ అవసరం. ప్రభుత్వాలు, రహదారుల అధికారులు ప్రమాద
నివారణ చర్యలు తీవ్రతరం చేయాల్సిన ఆవశ్యకతా లేకపోలేదు. భీమా కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రమాద సంబంధ క్లెయిమ్స్
పూర్తి చేయడం కూడా అవసరం. అలాగే తగు సంఖ్యలో ట్రౌమా కేంద్రాల ఏర్పాటు జరగాలి. ప్రయోగాత్మకంగా చేపట్టిన జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 కాలంలో అంబులెన్స్ ల
పాత్ర, ఇతర ప్రమాదాలనివారణ చర్యలు పెద్ద సంఖ్యలో ప్రమాదాలను, మరణాలను తగ్గించగలిగాయి.
జాతీయ రహదారులను, రాష్ట్రాల పరిధిలోని
ప్రధాన రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ, సమీకృత అత్యవసర సహాయ సేవా కేంద్రాలను (ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ
రెస్పాన్స్ సెంటర్స్ (ఐ.ఇ.ఆర్.సి) ఏర్పాటు చేయడం కొరకు ఒక సమగ్ర ప్రణాళిక రూపకల్పన జరగాలని, కేంద్రంతో పాటు
రాష్ట్రాలు కూడా దీనికి పూనుకోవాలని, అది జరుగుతుందన్న ఆశాభావాన్ని, ప్రాజెక్ట్ రూపకర్త, అమలు కారకుడు డాక్టర్ ఏపీ
రంగారావు వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చి 1033 కాల్ సెంటర్ ను
ఉపయోగించుకుని విస్తృత స్థాయిలో ప్రమాద నివారణ చర్యలకు పూనుకొవచ్చు అని ఆయన
అంటున్నారు.End
No comments:
Post a Comment