నాటి నగదు రహిత లావాదేవీలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (13-01-2017)
ఇటీవలి కాలంలో ఎవరి నోట విన్నా ఒకటే మాట..."నగదు రహిత లావాదేవీలు"....ఫలానా వూరు దేశంలోనే మొట్టమొదటి నగదు రహిత లావాదేవీల
గ్రామమని దాదాపు అన్ని రాష్ట్రాలలోని నాయకులు ప్రకటించుకున్నారు...కుంటున్నారు కూడా. వాస్తవానికి నగదు రహిత లావాదేవీలు గ్రామీణ తెలంగాణాలో...ఆ మాటకొస్తే...గ్రామీణ భారతదేశంలో కొత్తేమీ కాదు. అసలు మన సమాజం మొదలైందే నగదు రహిత లావాదేవీలతో. ఎంతో కాలం క్రితం కాదు...నాకు తెలిసి నా చిన్నతనంలో, అంటే ఓ ఏబై-అరవై ఏళ్ల క్రితం మా వూళ్లో అన్న్నీ నగదు రహిత
లావాదేవీలే. ఉదాహరణకు పల్లెల్లో
ప్రధానమైన వ్యవసాయ సంబంధిత లావాదేవీలనే తీసుకుందాం. భూస్వాముల దగ్గర పాలేరులుగా పని చేస్తున్న వారికి నెల-వార్షిక జీతమంతా ధాన్యం రూపేణా ముట్టేది. వారి ఇతర అవసరాలైన పొగాకు, లేదా ధరించే పాద రక్షలు, లేదా దుస్తులు లాంటివన్నీ వస్తు రూపేణా ముట్టేవే కాని
నగదు ఇవ్వడమనే ఆచారం లేకుండేది. అలానే
నాటు కూలీ కాని, కోత కూలీ కాని, మరే ఇతర రకమైన వ్యవసాయ కూలీ కాని అంతా ధాన్యం ఇవ్వడమే
కాని నగదు ముచ్చటే లేదు. జొన్న
కోతలకు ప్రతి వంద కట్టలకు నాలుగో-ఐదో
కట్టలు కూలీ ఇచ్చేవారు. వేరు
శనగలు కొట్తే కుండకు ఇన్ని అని కాయ కొట్తే వచ్చే పప్పు ఇచ్చే వారు కూలీ కింద. భూస్వామి కూడా కూలీ ఇవ్వగా మిగిలిన శనగ పప్పులో కొంత
ఖర్చు కింద ఇచ్చి మిగతాది వంట నూనెగా తెచ్చుకునేవాడు. పచారి కొట్టువాడు నెలంతా రాసుకుని చివర్లో అమ్మిన వాటికి
బదులుగా కొన్న వాడి నుండి సరిపడా ధాన్యం తీసుకునే వాడు. గ్రామాల్లో
వివిధ వృత్తుల వారికి జీతాల బదులు ఇనాంలు వుండేవి. గ్రామం మొత్తంలో ఏ ఒకరో ఇద్దరో
నగదు లావాదేవీలు నడిపేవారు కాని మిగతా అందరూ నగదు రహిత లావాదేవీలే. ఒకవేళ ఎవరి దగ్గరన్నా కొంత పైకం వుంటే వాళ్లకు బాంకు కూడా
గ్రామంలోని ఒకరిద్దరు మోతుబరి రైతులే. మళ్లీ మొదటికొచ్చాం ఇప్పుడు మోదీ పుణ్యమా అని. కాకపోతే ఒకనాటి నగదు రహిత లావాదేవీల్లో "కమ్మర్షియల్" కోణం లేదు...అంతా అవసరార్థమే! ఇప్పుడేమో అంతా వాణిజ్యమయమే!
ఈ
విషయాలు ప్రస్తావనకొచ్చినప్పుడు, అంబేద్కర్
సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఆచార్య మారంరాజు సత్యనారాయణ
రావు గ్రామీణ తెలంగాణ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. తెలంగాణాలో
చరిత్రకు పూర్వం నుంచీ ఎలాంటి వ్యవసాయ వ్యవస్థ నెలకొని వుందీ, గ్రామీణ ప్రజల కట్టుబాట్లు ఎలా వుండేవీ, గ్రామం-గ్రామాధికారుల చరిత్ర మూలాలేంటీ...వాళ్ల
అధికారాలేంటీ, తాసీల్దార్...గిర్దావర్
అని ఎవరిని పిల్చేవారు, భూమి
శిస్తు వసూళ్లు ఎలా జరిగేవీ, భూముల
సర్వే ఎలా మొదలైందీ...ఎలా రికార్డులుండేవీ, బంచరాయి-పోరంబోకు భూములంటే ఏమిటీ, సర్ఫెఖాస్ భూములంటే ఏమిటీ, ఆబీ...తాబీ...ఖరీఫ్...రబ్బీ...తరీ...ఖుష్కీ లాంటివి
ఏమిటి, ఇనాంలు ఎందుకిచ్చేవారు, రక్షిత కౌలుదారీ వ్యవస్థ ఎప్పటి నుంచి మొదలైందీ......ఇలా
ఎన్నో విషయాలను ఎనిమిది పదులు నిండిన మారంరాజు గారు ఒక్కొక్కటీ జ్ఞాపకం చేసుకుంటూ
వివరిస్తుంటే మన "గ్రామాయణం" రామాయణం కన్నా ప్రాచీనమైందనిపించింది.
ఇతర దేశాలకు భిన్నమైన చరిత్ర మన భారతదేశ చరిత్ర. గ్రామాలు ఆ చరిత్ర అంతర్భాగాలు. ప్రతీ గ్రామం ఒక "రిపబ్లిక్" లాంటిది. గ్రామంలో తలెత్తే ప్రతి సమస్యనూ (ఇప్పటికీ కొన్ని చోట్ల) గ్రామస్తులే పరిష్కరించుకునేవారు. మరీ ప్రాచీన కాలంలోకి పోకుండా నిజాంల కాలం నుంచి గ్రామీణ
వ్యవస్థను విశ్లేషించి చూస్తే చాలా విషయాలు అవగతమౌతాయి. నిజానికి 19 వ శతాబ్దం మధ్యకాలం దాకా తెలంగాణ జిల్లాలలో ఒక
నిర్దుష్టమైన వ్యవస్థ లేదు కాని, గ్రామాలు
మాత్రం ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న సాంప్రదాయాలనే కొనసాగించారు. అలాగే ప్రాచీన కాలం నుండి రాజులకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా గ్రామాధికారులుండేవారు. కాకతీయుల కాలం వరకూ రాజులకు ప్రత్యేకించి ప్రజాసంక్షేమం
అనే ఎజెండా లేకుండేది. గ్రామాల
సంక్షేమం గ్రామస్థులకే వదిలి వేసేవారు. ఇలా కాల చక్రంలో కాకతీయుల తరువాత బహమనీలు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు పాలకులయ్యారు. కులీన వర్గానికి చెందిన మొదటి సాలార్జంగ్ 19 వ శతాబ్దం ఆరంభంలో నిజాంకు ప్రధాని అయ్యాడు. ఆయన సంస్కరణలలో భాగంగా సుబాలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామాలు అనే పాలనా వ్యవస్థ వేళ్లూనుకుంది. గందరగోళ
పరిస్థితుల్లో వున్న గ్రామీణ పాలనా వ్యవస్థ పటిష్టతకు జీవం పోశాడు సాలార్జంగ్. తహసీల్దార్, సేగేదార్ లతో పాటు క్షేత్ర స్థాయిలో గ్రామాల స్థితిగతులను
మెరుగుపరిచేందుకు "గిర్దావర్" లను నియమించాడు.
సాలార్జంగ్ ప్రధాని అయ్యాక భూములన్నింటినీ సర్వే
చేయించాడు. గ్రామంలోని రైతుల భూముల
నక్షాను (పటం) శాశ్వతంగా వుండే విధంగా సిల్కు గుడ్డ మీద నల్ల సిరాతో
రాయించి ఏర్పాటు చేశారు. అవి
ఈ నాటికీ చెక్కు చెదరకుండా వున్నాయి. ప్రతి గ్రామానికీ నివాసం కొరకు కొంత భూమిని "గ్రామకంఠం" గా, పశువుల
దాణాకు కొంత భూమిని "బంచరాయి" గా, ఎందుకూ
పనికి రాని భూములను "పోరంబోకు" గా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ గ్రామంలో కూడా గ్రామకంఠం తప్ప మిగిలినవేవీ
మిగల్లేదు. గ్రామకంఠానికి దూరంగా అనేక
ఇళ్లు కట్టుకున్నారు. అలాగే
రైతుల భూముల్లో వ్యవసాయానికి పనికిరాని స్థలాన్ని "ఫూట్ కరాబ్" అని పిలిచి దానికి శిస్తు వసూలు చేయకపోయేవారు. భూముల సర్వే జరిగాక ప్రతి రైతూ వ్యవసాయం చేసుకునే భూమి
వివరాలన్నీ ఒక శాశ్వత రిజిస్ట్రర్ గా వ్యవస్థీకరించారు. దాన్నే "సేత్వార్" అని అంటారు. ప్రతి భూ కమతానికీ నంబర్లిచ్చారు. వీటినే సర్వే నంబర్లంటున్నాం. వీటి ఆధారంగా ప్రతి ఏటా పట్వారీ రెండు ముఖ్యమైన
రిజిస్టర్లు రాసేవాడు. ఒకటి
"పహాణీ", రెండోది
"చౌఫసలా". పహాణీ
ప్రతి పేజీకి పది సర్వే నంబర్ల వివరాలు మాత్రమే రాయాలి. సర్వే నంబర్, దాని విస్తీర్ణత, వర్గీకరణ, సొంతదారు, దున్నేవారెవరు, పంట ఏంటి లాంటి వివరాలుండాలి. చౌఫసలా లో ఆసామీవారీగా నాలుగు పంటల రికార్డులుంటాయి. వీటిలోని ప్రతి పేజీ మీద తహసీల్దార్ సంతకం, కార్యాలయం ముద్ర వుండేది. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల గ్రామాలలో
రైతులకు, తమ భూ యాజమాన్య విషయంలో
కాని, శాంతి భద్రతల నిర్వహణ
విషయంలోకాని ఒఎద్ద భరోసా లభించింది.
ఈ రికార్డులన్నీ కాపాడే
బాధ్యతను వూరి "కరణం" లేదా "పట్వారీ" కి అప్ప చెప్పారు. అలాగే శాంతి భధ్రతల బాధ్యతను "మున్సబ్" లేదా "పోలీసు
పటేల్" కు
అప్పచెప్పారు. శిస్తు వసూలుకు పట్వారీకి
సహాయపడేందుకు "మాలీ
పటేల్" ను
నియమించారు. శిస్తు చెల్లించినందుకు
రశీదుగా "పావుతీ బహీ" అన్న అధికారిక పుస్తకంలో నమోదు చేసేవారు. వీరంతా "వతన్ దారులు". వతన్ అంటే స్థిర నివాసం అని అర్థం. వీరికి తోడు షేక్ సింధీ, నీరడి కూడా వున్నారు. షేక్ సింధీ చేతిలో పొడుగాటి కర్ర, దానికి బల్లెం లాంటి ఇనుప మేకు వుండేది. చెరువులో నీళ్లు విడుదల చేయడం, కట్టడి చేయడం నీరడి పని. వీరెవరికీ నెల నెలా జీతాలుండేవి కావు. షేక్ సింధీ, నీరడి లకు ఇనాం భూములుండేవి. పట్వారీ, మాలీ పటేల్ కు వారు వసూలుచేసిన భూమి శిస్తులో "స్కేలు" ప్రకారం
కొంత తగ్గించుకుని మిగతా పైకాన్ని ప్రభుత్వ ఖజానాలో జమచేసేవారు. పోలీస్ పటేల్ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు ప్రతివారం "రోజునాంచా" సమర్పించాలి. దానిలో జనన మరణాలు, అంటు రోగాలు, తగాదాలు, కొత్త వ్యక్తుల రాకపోకలు లాంటి పది అంశాలుండేవి. పంచాయితీరాజ్ వ్యవస్థ వచ్చేంతవరకూ గ్రామాలలో
ప్రభుత్వాధికారమంతా పటేల్ పట్వారీలే నిర్వహించే వారు.
శిస్తు వసూలు చేసేటప్పుడు
పట్వారీ, మాలీ పటేల్ అడుక్కోళ్లు
అనే సాంప్రదాయాన్ని పాటించేవారు. "అరక" కు ఇంత అనే లెక్కన రైతులు
ఉదారంగా ఇచ్చేవారు. కుల వృత్తులవారు కాకుండా మిగిలినవారు, వ్యవసాయం సొంతంగా చేసుకోలేని రైతుల నుండి కౌలుకు భూమి
దున్నేవారు. ఇదే కౌలుదారీ వ్యవస్థకు నాంది. పోలీసు చర్య తరువాత జరిగిన సంఘటనల
నేపధ్యంలో మిలిటరీ గవర్నర్ ఆదేశంతో రక్షిత కౌలుదారీలుగా భూమి దున్నేవారిని
గుర్తించడం జరిగింది. వీరిని, వారు
వ్యవసాయం చేస్తున్న భూముల నుండి వెళ్లగొట్టకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది.
పట్వారీ తన విధుల్లో
భాగంగా, వర్షాకాలం ఆరంభం నుంచి, గ్రామంలోని చెరువులో ఎంత నీరు వుంది, కొత్తగా ఎంత నీరు చేరింది అనే వివరాలను "బారిష్ తఖ్తా" పేరుతో ప్రతి నెలా ప్రభుత్వానికి పంపాల్సి వుండేది. అనా వృష్టి, అతి వృష్టి మూలంగా పంట నష్టం వివరాలను, శిస్తు మాఫీ కొరకు నమోదు చేసే బాధ్యత కూడా పట్వారీదే. అలాగే చెరువుల్లో నీళ్ల స్థాయిని బట్టి రెండవ పంటకు
నీళ్లివ్వాలా? వద్దా? అనే విషయం గిర్దావర్ తో కలిసి "తహబంధీ" ద్వారా
నిర్ణయం చేసేవారు. నీటి ఆధారిత పంటలను ఆబి, తాబి అని, మెట్ట పంటలను ఖరీఫ్, రబ్బీ అని పిలిచేవారు. భూములను తరీ, ఖుష్కీలుగా విభజించేవారు. వీటిలో పంట వేసిందీ, లేందీ నమోదు చేయడానికి పట్వారీ "చారుమహి", "హస్త్ మాయి" విచారణ పేరుతో భూముల చుట్టూ తిరిగి నిర్ణయించేవారు. సాలార్జంగ్ సంస్కరణల పుణ్యమా అని గ్రామ పట్వారీ పదవి
ప్రాధాన్యత సంతరించుకుని, ఆయన
తయారు చేసిన రికార్డులే ప్రభుత్వానికి ఆధారమయ్యాయి. పట్వారీ తనకున్న అధికారంతో రైతులందరినీ తనవైపే
వుంచుకునేవాడు. ఎవరు కూడా భూముల విషయంలో
పట్వారీతో తగాదా పడెవారు కాదు.
పహాణీ, బారిష్ తఖ్తా ఆధారంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత
"జమా బందీ" జరిగేది. అంటే, ఆ వ్యవసాయ సంవత్సరం (ఫసలీ) లో ఎంత భూమిలో పంటలు పండాయి, ఎంత శిస్తు వసూలైందీ అనేది తహసీల్దార్ పరిశీలించేవారు.
ఆయన జమా బందీని కలెక్టర్ పునఃపరిశీలించేవారు. దీంతో శిస్తు మొత్తం ఖజానాకు చేరిందా? లేదా? అనేది
తేలిపోయేది. జమా బందీ ఆధారంగా పట్వారీ "పైసల్ పట్టీ" అన్న రికార్డు
తయారు చేసేవాడు. ప్రతి దసరా పండుగ నాడు పట్వారీ రెవెన్యూ రికార్డులను
ఆరంభించడానికి పూజలు చేసేవాడు. రికార్డులు భద్రపరిచే వస్త్రం స్థానికమైన చేనేత
వారు ఇచ్చేవారు. ఒక విధంగా వ్యవసాయ సంవత్సరం దసరాతో ముడిపడి వుండేది. ప్రభుత్వం
దగ్గర పట్వారీలు తయారు చేసిన రికార్డులు మినహా మరే విధమైన రికార్డులుండేవి కావు.
ప్రతీ గ్రామంలో వివిధ
కులాల వారు పరస్పర అవగాహనతో సహజీవనం సాగించేవారు. కులకట్టుబాట్లుండేవి.
వైషమ్యాలేమన్నా వుంటే చర్చించుకుని పరిష్కరించుకునేవారు. గ్రామంలోని రజక, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, దళిత తదితరులు వస్తుమార్పిడి విధానం ద్వారానే
సేవలందించేవారు. దీన్నే మేర అనేవారు. ఇవన్నీ నగదు రహిత లావాదేవీలే. కాల గమనంలో, వస్తు మార్పిడి విధానం సేవలకు బదులుగా ఇచ్చే ప్రతిఫలం, నగదుగా మారింది. మళ్లీ కాల చక్రం గిర్రున తిరిగి మరో
రకమైన నగదు రహిత లావాదేవీలకు గ్రామాలు కూడా వేదిక కానున్నాయి. "పాత"
మేలా?"కొత్త" మేలా? చరిత్రే
నిర్ణయించాలి! End
No comments:
Post a Comment