హిందూ
సంప్రదాయంలో సీమంతం
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక (08-01-2017)
అపురూపమైనది ఆడజన్మ. ఇంకో ప్రాణిని
సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మాతృదేవత గా మారుతుంది స్త్రీ. అందుకే, ఆమెకు
ఆ సమయంలో, ఏ కష్టం కలగకుండా ఉల్లాసంగా ఉంచుతూ, శాయశక్తులా సంతోష పెడుతుంటారు భర్త, అత్త-మామలు, తల్లి-తండ్రులు. హిందువుల ఆచారం ప్రకారం గర్భిణీ స్త్రీలకు
"సీమంతం" జరిపించాలి. సాంప్రదాయం ప్రకారం, స్త్రీ గర్భం ధరించిన తొమ్మిదో
నెలలో తల్లి గారింట్లో సీమంతం జరుపుతారు. ప్రసవ సమయంలో తల్లి పక్కనుండాలని
భారతదేశంలో పుట్టి-పెరిగిన వారందరూ సహజంగా అనుకుంటారు. హిందూ ఉమ్మడి కుటుంబ
వ్యవస్థలో అది ఒక సర్వసాధారణ విషయం. గర్భిణీ స్త్రీకి తన తల్లి పక్కనుంటే అదో
ధైర్యం. సీమంతం చేసే సమయంలో అందుకే గర్భిణీ స్త్రీ తల్లి తప్పకుండా కూతురు పక్కనే
వుంటుంది.
ఈ సీమంతానికి గర్భిణి అత్తగారు చీర, రవిక,
పూలు పండ్లు, తిను బండారాలతో సారెను పెడ్తారు.
ఈ సారెను “కడుపు సారె” అని కూడా
అంటారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును
కోరుతూ చేసేది సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక,
మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె-భర్త పాటించవలసిన నియమాలు
కూడా ఈ సంస్కారంలో భాగమే. గర్భవతికి సీమంతం చేసే రోజు సాయంత్రం జడను పూలతో కుట్టి
అలంకరించి కుర్చీలో కూర్చొబెట్టి ఆశీర్వదింపజేస్తారు. సీమంతం అంటే పాపిడి తీయడమని
అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. సీమంతం నాడు
ఉదయమే గర్భిణికి హారతి పట్టి, మంగళ స్నానం చేయించాలి.
సాయంకాలం పట్టుచీర ధరింపచేసి కుర్చీలో కూర్చోపెట్టి, తల్లి తాను చెచ్చిన తెల్ల పట్టుచీరను బొట్టుపెట్టి
కూతురు చేతికిస్తుంది. అది కట్టు కొచ్చిన తర్వాత, ఆ చీరె
పమిటను ఒడిలా చేసి, అందులో మొదలు చలివిడిని (బియ్యపు పిండితో
చేసిన తీపి పదార్ధం) మూడు వుండలుగా చేసి తల్లి పెట్టాలి. తర్వాత అదే ఒడిలో,
తొమ్మిదేసి చొప్పున, ఐదు రకాల తీపి పదార్ధాలను
(ఉదాహరణకు: అరిసెలు, లడ్డులు, మైసూరు
పాక్, పాలకోవా, బాదూషా), మూడు రకాల పండ్లను (ఉదాహరణకు: బత్తాయి, ఏపిల్,
కమలా ఫలాలు), కొన్ని తమలపాకులు, పోకచెక్కలు (తాంబూలం) పెట్టి హారతిస్తారు. బంగారు ఆభరణాలను (గాజులు) చేతికి తొడుగుతారు. హారతిచ్చిన తర్వాత
ఆహ్వానిత బంధు-మిత్రులు తమకు తోచిన విధంగా కానుకలను గర్భిణి ఒడిలో వుంచి
బహుమతులివ్వడం ఆనవాయితి. సాయంకాలం పేరంటంలో ఆమెకు రక రకాల గాజులు తొడిగి, వచ్చిన ముత్తైదువులకు ఆమెతో గాజులిప్పించుతారు. కొన్ని ప్రాంతాలలో ఇదే
సీమంతాన్ని " గోద్ భరై" అని కూడా పిలుస్తారు. వేడుక మాత్రం అంతటా ఒకటే.
సీమంతం వేడుక జరిపిన తరువాత కొద్ది
రోజులకే, ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. కాకపోతే కొంత ఆలస్యంగా కూడా రావచ్చు.
ప్రసవం అయి, కూతురో, కొడుకో పుట్టడం
జరుగుతుంది. ప్రసవం ఐన పదకొండో రోజున, శాస్త్రోక్తంగా
చేయాల్సిన పనులు కొన్ని వుంటాయి. ఉదయాన్నే ఇంటిల్లిపాదీ పురిటి స్నానం చేయాలి.
ముఖ్యంగా తల్లి తల స్నానం చేయాలి. అంతకంటే మొదలే, బాలింత
తల్లి గారు బేబీకి స్నానం చేయించి పీట మీద తడితోనే పడుకోబెట్టాలి. నీళ్ల తడి
వుండగానే పాపాయి బొడ్డు మీద బంగారపు గాజునుంచి, నీళ్లు చల్లి
చేతుల్లోకి తీసుకుని తుడవాలి. ఆ తర్వాత పాపాయికి సరైన దుస్తులు ధరింపచేయాలి.
దుస్తులేసిన తర్వాత తిరిగి ఆ బంగారపు గాజును మరో మారు పాపాయి మీదుంచాలి. ఈ తతంగం
అంతా ముగిసాక (తల్లికి) నలుగు స్నానం చేయించి, బట్టలు
మార్చుకున్న తర్వాత, పాపాయి దగ్గరకు తీసుకొస్తారు
తల్లి-తండ్రులు. ఊయలలో నిద్ర పుచ్చే ముందర, పాపాయికి కొత్త
దుస్తులేసి, తల్లితో బొట్టు పెట్టించి, అమ్మమ్మ మొలతాడు కడుతుంది. తల్లి మంచం మీద కాసేపుంచాలి పాపాయిని. మంచం
నాలుగు కోళ్ల వైపున, కాళ్ల వైపున పొంగలి పెట్టాలి. వంశాభి
వృద్ధి జరగాలని దీవించి, పాపాయిని ఎత్తుకెళ్లి ఊయలలో
పడుకోబెట్టాలి. ఇవన్నీ శాస్త్రోక్తంగా చేయాలి. పురుడు అయిపోయింది కాబట్టి పసుపు
నీళ్ళతో ఇల్లంతా చల్లి, శుద్ధి చేయాలి.
No comments:
Post a Comment