శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-24
శ్రీరాముడితో సల్లాపాలాడిన అగస్త్యుడు
వనం జ్వాలా
నరసింహారావు
"శ్రీరామచంద్రా! లక్ష్మణా! మీరు సీతాదేవితో సహా నన్ను
చూడడానికి రావడం నాకు మిక్కిలి సంతోషాన్నించింది. మీరు అలసటతో వున్నారు.
సీతాదేవికి కూడా బడలిక తీర్చుకోవాలని వుంది. ఈమె రాచకూతురు కదా! సుకుమార దేహం
కలది. ఎన్నడూ కష్టపడలేదు. అలాంటి చిన్న వయసుది కష్టాలకు నిలయమైన అడవులకు భర్తమీద
కల గాఢమైన ప్రేమవల్ల నీ వెంట వచ్చి, అసాధ్యకార్యం చేసింది.
కాబట్టి నువ్వు ఆమెకు ఏది సుఖమో దానినే చేయి. మీరిక్కడే హాయిగా వుండవచ్చు. నీ
ఇల్లాలు సీతాదేవిలో చంచల మనసున్న స్త్రీలలో వుండే దోషం ఒక్కటైనా స్వల్పంగానైనా
లేదు. ఈమె పతివ్రతలతో పూజించతగింది. ఆ అరుంధతే ఈమెకు సమానురాలు. ఇలాంటి సీతాదేవి,
అలాగే, నీ సేవకై స్వార్థం, సర్వం త్యాగం చేసిన ఈ లక్ష్మణుడు, ఇలాంటి వారి సేవకు
యోగ్యుడవైన నువ్వు, ఇక్కడుంటే రామచంద్రా, ఇది మిక్కిలి శోభాయమానంగా పవిత్రమవుతుంది" అని చెప్పగా
శ్రీరామచంద్రమూర్తి అగస్త్యుడితో ఇలా జవాబిచ్చాడు.
"భార్యతో, తమ్ముడితో, భయంకరమైన అడవిలో తిరుగుతున్న నా గుణాలు మీకు సంతోషం కలిగించాయి కాబట్టి నీ
దయవల్ల నేను ధన్యుడనైనాను. నీటి సౌకర్యం కలిగి, దట్తమైన
అడవులుండే ప్రదేశాన్ని చూపిస్తే, అక్కడే వ్రతకాలం
పూర్తయ్యేదాకా కాలం గడుపుతాం" అని శ్రీరామచంద్రమూర్తి అడగ్గా, అగస్త్యుడు కాసేపు ఆలోచించి శ్రీరాముడితో ఇలా అన్నాడు.
"శ్రీరామభద్రా! విను. విస్తారమైన మూలాలు, ఫలాలు,
నీళ్లు కలిగి, నానావిధములైన మృగాలతో కూడిన
’పంచవటి’ అనే ఒక గొప్ప స్థలం ఇక్కడికి రెండామడల దూరంలో వుంది. అది సుఖమైన ప్రదేశం.
మీరు విధించుకున్న పద్నాలుగు సంవత్సరాల గడువులో చాలా కాలం గడిచిపోయింది. తక్కిన
కాలం మీరక్కడ ఆశ్రమం స్థాపించుకుని తండ్రి వాక్యాన్ని నెరవేర్చండి. రామచంద్రా!
నువ్వు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తానని చేసిన ప్రతిజ్ఞ పూర్తిగా నెరవేర్చి
రాజువై సుఖిస్తావు”.
“నువ్వు పెద్దకొడుకువు అయినందున నీ తండ్రి కోరిక మేరకు
రాజ్యం ఏలుతావు. దసరథుడి మీద నాకున్న ప్రేమవల్ల అతడి కొడుకైన నీ చరిత్ర అంతా,
నీలోని ఆలోచనా విధానమంతా, నా తపోబలం వల్ల
తెలుసుకున్నాను. నేనేం ఆలోచన చేశానో చెప్పమంటావా? నీ
అభిప్రాయం ప్రకారమే మిమ్మల్ని ఇక్కడ వుండమని అన్నాను. నువ్వు నా అభిప్రాయం
తెలుసుకొని నిండారు అడవులున్న ఆశ్రమ ప్రదేసం చెప్పమని అడిగావు. తదనుగుణంగానే
మిమ్మల్ని పంచవటికి పొమ్మని చెప్పాను. మిమ్మల్ని మొదట నా దగ్గర వుండమని
చెప్దామనుకున్నా కాని, మీ అభిప్రాయం ప్రకారమే పంచవటికి
పొమ్మన్నాను. నీ సంకల్పానికి విరుద్ధంగా నేనెలా చేస్తాను? శ్రీరామచంద్రా!
ఇది ఇది మిక్కిలి మెచ్చుకోవాల్సిన ప్రదేశం. చాలా అందమైంది. గోదావరి నది సమీపంలో
వుంది. పళ్లు, పూలు బాగా లభిస్తాయి. పక్షులు, మృగాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. జనులుండరు. సీతాదేవికి చాలా సంతోషం
కలిగిస్తుంది. ఇక్కడికి ఎక్కువ దూరం కూడా కాదు. మీరు జానకితో ఆ ప్రదేశంలో వుండి
మునులను రక్షించి, గొప్ప పేరు తెచ్చుకోండి. అక్కడి పోయే దారి
చూపిస్తాను. రామచంద్రా! ఇదిగో చూడు....ఇప్పతోపు కనిపిస్తున్నది....దానికి ఉత్తరంగా
పోతే ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ తరువాత మిట్ట ప్రదేశం, చెట్లు లేని స్థలం కనిపిస్తుంది. అది దాటిపోతే ఒక పర్వతం వుంటుంది. దాని
దగ్గరలోనే పంచవటి వుంది".
అని చెప్పగా రామలక్ష్మణులు మునీశ్వరుడికి నమస్కారం చేసి, ఆయన దగ్గర శలవు తీసుకుని, ఆయుధాలు
ధరించి, అగస్త్యుడు చెప్పిన మార్గంలో పంచవటికి మెల్లగా
పోయారు.
No comments:
Post a Comment