ఎన్నికల వేళ రాజకీయ విచిత్రాలు....
వ్యూహమే విజయ సోపానం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (21-09-2018)
తెలంగాణా రాష్ట్ర
శాసనసభకు అనుకున్నదానికంటే ముందుగా ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ
వ్యూహ-ప్రతివ్యూహాల్లో తలమునకలై వున్నాయి. అధికార పక్షం మరే పార్టీతో పొత్తు
లేకుండా ఎన్నికల బరిలో దిగుతుంటే, దాన్ని
ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఎటూ పాలుపోక ఏకమవుతున్నాయి. మహాకూటమనే పేరుతో
భావసారూప్యం లేని పార్టీలన్నీ ఒకటవుతున్నాయి. ప్రజాహితం కన్నా, పార్టీల హితమే ముఖ్యంగా అవి కలుస్తున్నాయి. అధికార పక్షాన్ని అందరూ కలిసి
ఓడించాలన్నదే వారి ఏకైక లక్ష్యంగా కనిపిస్తున్నది. కాకపోతే అందరూ కలిసినా అది
సాధ్య పడకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల, ఎన్నికల సర్వేల
అంచనాగా కనిపిస్తున్నది.
ఎన్నికల బరిలో
వుండే పార్టీలు మానిఫెస్టోలలో ఒక్కో రకమైన నినాదంతో ముందుకు వస్తాయి. “గరీబీ
హటావో”, “రెండు రూపాయలకే కిలో బియ్యం”, “ఉచిత విద్యుత్”, “ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా?”, “సుస్థిర ప్రభుత్వం”, “సంపూర్ణ
మద్యపాన నిషేధం”.... ..... ఇలా ఒక్కో సారి ఒక్కో రకమైన నినాదాలతో గతంలో ఎన్నికల
బరిలోకి దిగిన రాజకీయ పార్టీలు గెలిచిన సందర్భాలూ, ఓడిన
సందర్భాలూ వున్నాయి. గెలిచినవారు వాళ్ల వాగ్దానాలను, హామీలను
నెరవేర్చనూ వచ్చు...నెరవేర్చలేకపోవచ్చు. అయితే గెలిచిన ప్రతిసారీ కేవలం నినాదాల
కన్నా వాటికి ప్రజల విశ్వసనీయత ప్రధానం. ఆ విశ్వసనీయతను ఓటర్లకు తెలియచెప్పడం
అంతకంటే ముఖ్యం. దానికో వ్యూహం కావాలి. ఈ పాటికే కొన్ని ప్రతిపక్షాలు అది
చేస్తాం...ఇది చేస్తాం...అని అంటున్నాయి. “గోదావరీ-కృష్ణా నదులను పూడ్చి, ఆ జాగాలో
పేదలకు ఇళ్లు కట్టిస్తాం” లాంటి నినాదాలు కూడా కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి.
తమను అధికారంలోకి తీసుకువస్తే, ఏక ధాటిగా, ఒకే ఒక్క సారి, ఒకే నెలలో వేలకోట్ల రూపాయల భారం ప్రభుత్వ ఖజానామీద పడేలా, అన్ని అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చి, ఉద్యోగుల జీత-భత్యాలు కూడా ఇవ్వకుండా, వ్యవసాయ
రుణాలను మాత్రం మాఫీ చేస్తామని ఒక రాజకీయ పార్టీ హామీ ఇస్తున్నది. సాధ్యా-సాధ్యాలు
చూడకుండా చేసే ఇలాంటి హామీలమీద ఎన్నికల సంఘం ఒక కన్నేసి వుంచాలి.
ఎన్నికల
ప్రణాళికలో పొందుపరిచే ప్రజాకార్షణ పథకాలు కేవలం నినాదం కొరకు చేరిస్తే సరిపోదు.
సరైన వ్యూహంతో వ్యవహరించి తాము చేస్తున్న వాగ్దానాలను ఓటర్లు విశ్వసించేట్లు
చేయగలగాలి. ఓటర్లు విస్వసనీయతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇచ్చిన హామీలను ఏపార్టీ
నిజంగా అమలు చేయగలదో అనే అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు.
వ్యక్తైనా, వ్యవస్థ అయినా, రాజకీయ పార్టీ అయినా, రాజకీయేతర కార్యకలాపలైనా ....ఆమాటకొస్తే లక్ష్యం,
గమ్యం ఎంచుకున్న ఎవరైనా, ఏదైనా, వాటిని అధిగమించేందుకు
రూపొందించుకునే ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాన్నే శాస్త్రీయ పరిభాషలో వ్యూహం
అంటారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు, ఒక్కోసారి
మంచో-చెడో చూసుకోకుండా వ్యూహాత్మకంగా ముందుకు పోవడం ఒక నిత్యకృత్యం. ఏ చిన్న
పొరపాటు జరిగినా వ్యూహం బెడసికొట్టి ఫలితం తీవ్రంగా వుండవచ్చు. ఇలాంటి వ్యూహంలో
భాగంగానే, మహాకూటమి పేరుతో ఒక అనైతిక ఒడంబడికకు
తెరలేవబోతున్నది మన రాష్ట్రంలో. ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే బద్ధ
విరోధులైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వాటిని ఒకానొక రోజు తీవ్రంగా విమర్శించిన కోదండరాం సారధ్యంలోని తెలంగాణ
జనసమితి, ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి తోకపార్టీగా వుండే
కమ్యూనిస్ట్ పార్టీ మహాకూటమిగా కలవబోతున్నాయి. కాకపోతే ఎన్నికల్లో ఒకటి ప్లస్ ఒకటి
రెండు కాకపోవచ్చనే సంగతి వాళ్లకు అంతగా అర్థం కాకపోవచ్చు. అంటే ఈ పార్టీలన్నీ
గతంలో తమ-తమ పార్టీకి అప్పుడు వచ్చిన ఓట్ల శాతాన్ని ఇప్పుడు కలుపుకుని, ఆ లెక్కన
అధికార పక్షాన్ని ఓడించగలమనుకోవడం ఉహాజనితమే!
మరో విషయం, వీరంతా
కలసి పోటీ చేయదలచుకున్నా, ప్రతిపార్టీ తమ పార్టీకి సంబంధించినంతవరకు భాగస్వామ్య
పక్షాలకంటే అధికంగా ఎలా లబ్దిపొందాలనే ఆలోచనలోనే వుంటుంది. వీరి విలీనాలు ఏ
పార్టీకి లాభం చేకూరుస్తాయో, ఏ పార్టీకి నష్టం
చేకూరుస్తాయో చెప్పడం కష్టమే. అదీ కాకుండా సీట్ల పంపకంలో నాయకుల ఆలోచనా ధోరణి
ఒకవిధంగా వుంటే కింది స్థాయి కార్యకర్తల, ఎన్నికల బరిలో వుండాలనుకున్న ఆశావహుల
ఆలోచనా ధోరణి మరోలావుంటుంది. ఒకానొక సందర్భంలో అన్ని సీట్లకూ పోటీ చేస్తామని
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ
జనసమితి గతంలో ప్రకటించినప్పుడు నియోగకవర్గ స్థాయి నాయకులు ఎవరికి వారు తమకే
టికెట్టు లభించినట్లు భావించి ప్రచారం కూడా మొదలెట్టి వుంటారు. ఇప్పుడు సీట్ల
పంపకం వల్ల వారి పరిస్థితి డోలాయమానంగా అయిపోతుంది. వారంతా కూటమికి వ్యతిరేకంగా
పనిచేయడం ఖాయం. అది మాహాకూటమికి నష్టం కలిగించడం తధ్యం.
ఇదిలా వుంటే, ఎన్నికల వేల పార్టీ టికెట్ల హడావుడి మామూలే. ఎన్నికలు
సమీపిస్తుంటే ఒక పార్టీలో టికెట్ రానివారు మరో పార్టీని ఆశ్రయించి, టికెట్ పొందడం
కూడా మామూలే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ మీద శాసనసభ టికెట్లు
అమ్ముకున్నారన్న ఆరోపణ విపరీతంగా వుండేది. ఇక కాంగ్రెస్ పార్టీలో టికెట్లు
అమ్ముకుంటారన్న ఆరోపణ ఆ పార్టీకి చెందినవారే ఎక్కువగా చేస్తుంటారు. శాసనసభ
టికెట్టుకు ఇంతనీ, పార్లమెంటు టికెట్టుకు ఇంతనీ ధర కూడా
వాళ్ళే నిర్ణయిస్తారు. ఈ నేపధ్యంలో ఇంకా శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటించకముందే
ఫలానా వాళ్లకు (105 మందికి) ఫలానా
నియోగావర్గం నుంచి టికెట్ ఇస్తున్నట్లు తెరాస అధ్యక్షుడు,
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియా ముఖంగా ప్రకటించడం ఒక
సత్సంప్రదాయానికి తెరతీసినట్లనుకోవాలి. మున్ముందు తమ పార్టీలో చేరబోయే వాళ్లు
టికెట్టు ఆశించకుండా పార్టీ కార్యకర్తలలాగా మాత్రమే వుండాలన్న సూచన కూడా ఇందులో
వుంది.
ఎన్నికల ప్రవర్తనా
నియమావళి లాంటి ఆంక్షలనే ఎన్నికలకు కనీసం నాలుగు నెలల ముందు ఒక పార్టీవారు టికెట్
ఆశించి మరో పార్టీలో చేరకూడదనీ, ఒక వేల పార్టీలో
చేరినా వారికి పార్టీ టికెట్ కేటాయించ కూడదనీ, ఎన్నికల
కమీషన్ నిబంధనలను విధించాలి. కుంభకర్ణుడు లాగా ఐదేళ్లు నిద్రపోయి కేవలం ఎన్నికల
సమయంలోనే అధికారాలు ఉపయోగించే బదులు, ఆహార్నిషలూ,
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే నిర్మాణాత్మకమైన చర్యలు ఎన్నికల కమీషన్ చేపట్టితే
ప్రజాబాహుళ్యం, రాజకీయ పార్టీలు హర్షిస్తాయి.
ఈ నేపధ్యంలో
పోటీలో వుండబోతున్న అన్ని పార్టీలకంటే, ప్రతి విషయంలోనూ అగ్రభాగాన వుంది తెలంగాణ
రాష్ట్ర సమితనేది స్పష్టంగా కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో గెల్చి అధికారంలోకి
వచ్చిన మరుక్షణం నుండీ ఎన్నికల మానిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలాగా భావించి
అనునిత్యం తన దగ్గరే వుంచుకుని ప్రజోపయోగమైన ప్రతి పథకానికీ రూపకల్పన చేశారు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అభివృద్ధి,
సంక్షేమం సమపాళ్ళలో పరిగణించి, ఏ సమయంలో ఏది అమలు ఎలా చేయాలో
ఆలోచించి మరీ చేశారాయన. అది మిషన్ కాకతీయే కావచ్చు, మిషన్
భగీరథ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులే కావచ్చు, వివిధ రకాల ఆసరా పించన్లు కావచ్చు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలే కావచ్చు, ఉద్యోగుల జీత-భత్యాల విషయమే కావచ్చు, కోతలు లేని నిరంతర విద్యుత్ సరఫరా అంశమే కావచ్చు,
గొర్రెల పంపిణీనే కావచ్చు, రైటుబంధు-రైతు భీమా కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు, బస్తీ దవాఖానాల ఏర్పాటే
కావచ్చు, కంటి వెలుగు పథకమే కావచ్చు...ఇలా అనేకానేక పథకాలకు
రూపకల్పన చేసి అమలు చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిది. మానిఫెస్టోలో చెప్పిన ప్రతి
అంశాన్నీ, ప్రతి హామీని నిలబెట్టుకున్నదీ ప్రభుత్వం. చేయని
72 హామీలను కూడా పథకాల రూపంలో అమలు పరుస్తున్నదీ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా అమలు
చేయని 60 కి పైగా పథకాలు తెలంగాణాలో అమలవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే
మానిఫెస్టోను 172 శాతం అమలు చేసిన పార్టీగా రికార్డుల్లోకి ఎక్కిమ్దనాలి. ఇవన్నీ
ప్రజల నమ్మకాన్ని చేకొన్నాయి.
ఇన్ని పథకాలను-మానిఫెస్టోలో చెప్పినవీ, చెప్పనవీ అమలు
పరుస్తున్న తెరాస పార్టీ రాబోయే ఎన్నికల ప్రణాళికలో కూడా అవి అమలు చేయగల పథకాలనే
వాగ్దానం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సహజంగానే ఇతర పార్టీలకంటే తెరాస
పార్టీని ఓటర్లు విశ్వసిస్తారనడంలో కూడా అనుమానం లేదు. గత నాలుగున్నర ఏళ్లగా అమలు
చేస్తున్న పథకాలను స్థిరీకరించడం, ప్రామాణీకరించడం, ఏకీకరణ చేయడంతో పాటు, అమలుకు సాధ్యమయ్యే మరిన్ని కొత్త పథకాలను మాత్రమే తెరాస
ప్రకటించవచ్చు. ఇప్పుడు అమల్లో వున్న పథకాలన్నీ ఎలాగూ రాబోయే తెరాస ప్రభుత్వం
కొనసాగిస్తుంది.
ఎన్నికల వ్యూహంలో నినాదాలు కానీ, వాగ్దానాలు కానీ, హామీలు కానీ, పథకాలు కానీ, ఓటరును ఆకర్షించుకునేలా వుండడమే
కాకుండా, ఓటరు ఇష్టపడిన హామీయే మిగిలినవాటికంటే గొప్పదనీ, తనతో పాటే తోటి ఓటరు కూడా అలానే ఇష్టపడాలనీ, మెజారిటీ ఓటర్లు
అనుకున్నప్పుడే రాజకీయ వ్యూహం ఫలించినట్లవుతుంది. అలాగే, తెరాస అధ్యక్షుడు,
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాగా, ఏ పార్టీ నాయకుడైతే ఇతరులకన్నా
భిన్నంగా, మిన్నగా ఆలోచించగలడో, ఇతరులకూ తనకూ తేడా వుండాలని నమ్ముతాడో, భవిష్యత్ గురించి కలలు కంటాడో, తాను తప్ప
ఇతరులెవరికీ స్సాధ్యపడని పనులు చేయగలడో, అతడే నిజమైన
వ్యూహకర్త. విజయం నూటికి నూరు పాళ్లు అలాంటి నాయకుడిదే. ఆయన్నే విజయం
వరిస్తుందనడంలో సందేహం లేనేలేదు.
భజన చేసే విధము తెలియండి జనులార మీరు భజన చేసి మోక్షమందండి.
ReplyDeleteతొమ్మిది నెలల ముందే ఈ ముదనష్టపు ఎన్నికలు ఎందుకో చెప్పుండ్రి.
అనానిమస్ గారు, ఈ బ్లాగు ఓనరు ఒక కరడు గట్టిన తెలంగాణావాది. KCR కి వీరాభిమాని. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి కూడా కాబట్టి విపరీతమైన భజనపరుడు. ఈయన రాసే రాతలు ఇలాగే ఉంటాయి. చదివేవాళ్ళ ఖర్మ అంతే.
ReplyDelete