Sunday, September 30, 2018

సీతాదేవికి ఏమైందోనని భయపడ్డ హనుమంతుడు ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవికి ఏమైందోనని  భయపడ్డ హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (01-10-2018)

ఈ తతంగమన్తా జరిగాక హనుమంతుడు, మండుతున్న అగ్నిని, తోకను, సముద్రంలో ముంచి చల్లారుస్తాడు. పట్టణమంతా కాలి వుండడం గమనించి, ఎంత పాడు పనిచేసాను! అని విచారించసాగాడు. లంకంతా కాల్చివేసి, ఆలోచనలేకుండా తానెంతో చేయరానిపని చేశానే అని బాధపట్తాడు. ఆ దిగులుతో తన్ను తానే నిందించుకుంటాడు. మండుతున్న అగ్నిని నీళ్లల్లో ముంచి చల్లార్చినట్లే, పెరుగుతున్న కోపాన్ని బుధ్ధిమంతుడిలా ఆలోచించి, అణచుకోగలవాడే ధన్యుడు, గొప్పమనస్సున్న వాడు. కోపం అణచు కోలేనివాడు, గురువునైనా చంపుతాడు, గుణవంతులనూ తిట్తాడు. కోపి చేయని పాపంలేదు. కోపం వున్నవాడికి, ఒకడిని ఈమాట అనవచ్చునా, అనగూడదా అన్న ఆలోచనేరాదు. ఎంతగొప్పవారినైనా, ఎంతమాటైనా అనగలరు. కోపికి చేయరాని పని, చెప్పలేని మాట లేనేలేదు.

పాము జీర్ణించిన కుబుసాన్ని(దేహంపొర), వదిలిపెట్టినట్లు, కోపాన్ని నేర్పుగా ఎవరు విడిచిపెట్ట గలడో వాడే పురుషుడు. తానెంత సిగ్గులేనివాడిననీ, పాడుబుధ్ధికలవాడిననీ, పాపాత్ములలో పాపాత్ముడననీ, ఆలోచనలేక సీతాదేవిని కాల్చి స్వామిద్రోహం చేసినవాడినైనాననీ, బాధపడ్తాడు హనుమంతుడు. లంకంతా కాలి బూడిదయితే, ఆమంటల్లో  సీత కూడా తగులుకుని నశించి వుండాలికనుక, తాను చేసిన పని తానే పాడుచేసాననీ, తెలివిలేక జానకి వున్నదన్న ఆలోచనలేక క్రూరమైన పనిచేసి రామకార్యం పాడుచేసాననీ, కుమిలిపోతాడు హనుమంతుడు.

ఆన్జనేయుడిలా అనుకుంటాడు తనలో: "ఈ లంకను దహించివేయడం చాలా చిన్నపని. ఇంతచేసినా ప్రయోజనమేంటి? ఆలోచనలేక నేను బాగుచేద్దామనుకున్న పనిని నేనే పాడుచేసానే? తొందరపడి పని చేసేవాడికి బుద్ధి వుంటుందా? ఎంతకొద్దిసమయంలో, నేనుపడ్డ కష్టమంతా వ్యర్ధమైపోయింది! రోషంతో, చెడిన మనస్సుతో, స్వామికార్యాన్ని సమూలంగా వరదపాలు చేసానే! రావణుడి నగరం కొంచెమైనా మిగలక సర్వం నాశనమైపోయింది. ఈ ప్రళయంలో సీతాదేవి కూడా చావక ప్రాణమెట్లు కాపాడుకోగలుగుతుంది? ఆమెకూడా కాలిపోయుండాలి. తెలివితక్కువతో నేను చేసినపనికి, నా ప్రాణత్యాగమే ఈ సమయంలో ఉత్తమమైన పని. అగ్నిలోపడాల్నా? సముద్రంలో దూకాల్నా? బడబాగ్నిపాలు కావాల్నా? ఎలామరణించాలి?"

"రామలక్ష్మణులు, సుగ్రీవుడు అప్పచెప్పిన పనిని పాడుచేసి, వారిదగ్గరకు పోయి, వాళ్లముఖాలెట్లా చూడాలి? కోపంతో నా స్వభావసిధ్దమైన కోతిబుధ్ధిని పోగొట్టుకోలేకపోతినికదా! దండించే పెద్దవారు లేనందున, నా బుద్ధి చెడిపోయి, రక్షించే శక్తి వుండికూడా, కోపాతిశయంతో, జానకీదేవిని కాపాడలేకపోతినికదా! జానకి మరణిస్తే, రామలక్ష్మణులు బ్రతకరు, వారుపోతే బంధువులతో సహా, సుగ్రీవుడు చచ్చిపోతాడు. ఇదంతావిన్న భరత శత్రుఘ్నులు చనిపోతారు. ఈ విధంగా సూర్యవంశం నశించిపోతే, ప్రజలు శోకంతో తపించి పోతారు. ఇంత అనర్ధానికి, ధర్మార్ధ హీనుడను, అదృష్టహీనుడను, కోపమనే పాపంతో మనస్సు చెడిపోయినవాడిని, దుర్మదుడను, పొగరుబోతును నేనే కారణం. నావల్ల లోకనాశనం జరగడం నేనుచూడాల్సివస్తోంది. ఇందులో సందేహంలేదు" అని శోకంతో ఆలోచించసాగాడు.


ఇలా ఆలోచిస్తున్న హనుమంతుడికి, దేహంలో శుభశకునాలు కనిపించసాగాయి. కుడికన్ను, కుడిభుజం అదరడం, హృదయం ప్రసన్నం కావడంతో, వేరేవిధంగా ఆలోచిస్తాడిలా:

"సీతాదేవిని అగ్నిదహించడమా? నా తెలివి తెల్లారే ఆలోచనకదా ఇది! సీత రాక్షసస్త్రీలాంటిది కాదుకదా! అగ్నిని అగ్ని ఎలా దహిస్తుంది? ప్రపంచంలో ప్రసిధ్ధిగన్న మహాత్మురాలు, సదాచార సంపన్నురాలు, పుణ్యపు నడవడిగల శ్రీరామచంద్రుడి దేవేరి, నిర్మల పాతివ్రత్ర్యం సదా రక్షిస్తున్న జానకీదేవిని తాకేశక్తి అగ్నిహోత్రుడికి వుందా? శ్రీరామచంద్రుడి మహాత్మ్యంవల్ల, సీతాదేవి పాతివ్రత్య సంపదవల్ల, నాదేహాన్నే కాల్చే సమర్ధత లేనివాడు అగ్నిహోత్రుడు. అలాంటిది లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో మహాలక్ష్మిలాగా పూజించబడుతూ, శ్రీరామచంద్రమూర్తికి ప్రేమపాత్రురాలైన ఆయన ప్రియురాలిని కాల్చేశక్తి అగ్నిహోత్రుడికి వుందా? రామచంద్రమూర్తి దాసుడనైన నేను, ఆయన కార్యంపైన లంకాదహనం చేస్తుంటే, నా తోక కొనవెంట్రుకలనైనా కాల్చనివాడు, అలాంటి మహానుభావురాలిని తాకగలడా?"

తను లంకకు వచ్చేటప్పుడు, సముద్రం మధ్యనున్న మైనాక పర్వతం తనకు వూరట కలిగించేందుకు వచ్చిందంటే, అది రామానుగ్రహమేననుకుంటాడు హనుమంతుడు. అలాంటి ఆయన అనుగ్రహానికి పాత్రురాలై, సత్యవాక్య సంపదవల్ల సమస్త లోకాలను జయించే శక్తికలదై, నిర్మలమైన పాతివ్రత్యమనే తపస్సు చేస్తున్నదై, భర్త ధ్యానంలోనే సంతోషాన్ని పొందగలిగే మనసున్నదైన జానకీదేవి తల్చుకుంటే, అగ్నిహోత్రుడినే దహించగలదని తలుస్తాడాయన. తనకెందుకీ పనికిమాలిన, కుచ్చితపు సందేహాలొచ్చాయని, సీతా మహాత్మ్యం గురించి ఆలోచించసాగాడు అదేపనిగా. సరీగ్గా అదేసమయంలో, ఆకాశంలో తిరుగుతున్న ఋషులు, చారణులు, మునులనుకుంటున్న మాటలు హనుమంతుడి చెవుల్లో అమృతం పోసినట్లు వినిపించాయి. వారిలా అనుకుంటున్నారు:

"ఆశ్చర్యం-ఆశ్చర్యం! హనుమంతుడివల్ల అగ్నిదేవుడు, తోరణాలతో, ప్రాకారాలతో, బురుజులతోసహా లంకానగరాన్నంతా దహించి వేసాడు. ఇది అసాధ్యకార్యం. తమతమ ఇళ్లు వదిలి పారిపోయిన రాక్షసబాలురు, వృధ్ధులు, స్త్రీలు, గుహల్లో చేరి ఏడుస్తుంటే, లంకా నగరమే గుహల్లో చేరి ఏడుస్తున్నదేమో అనిపిస్తోంది. ఎవ్వరూ చేయలేని ఘనకార్యం హనుమ చేసాడు. మంటల్లో యావత్తూ మసి అయిపోయినా అశోకవనంలో సీత చెక్కు చెదర లేదే! ఎంత ఆశ్చర్యం? ఆమెను అగ్ని సమీపించనేలేదు" అన్న మాటలను వింటాడు హనుమంతుడు.

శుభశకునాలు కలగడంతో, సీతాదేవి మహాత్మ్యం ప్రత్యక్షంగా చూసినవాడు కావడంతో, ఋషుల మాటలవల్ల సీతాదేవి క్షేమంగా వున్నదని తెలుసుకున్న హనుమంతుడు సంతోషిస్తాడు. అయినా ఆ మహాపతివ్రతను మరొక్కసారి కళ్లారా చూసి, స్వయంగా దర్శించుకుని, క్షేమసమాచారం తెలుసుకుందామనుకుంటాడు. ఆ తర్వాత ప్రయాణమైతే, చేయాల్సిన పని నిర్విఘ్నంగా, సంపూర్ణంగా నెరవేర్చినట్లవుతుందని తలుస్తాడు హనుమంతుడు. 

No comments:

Post a Comment