ఆపద్ధర్మం కాదు...ధర్మబద్ధమే
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-09-2018)
తెలంగాణ ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర శాసనసభను రద్దుచేయాలని తన మంత్రిమండలి చేసిన
తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ కు అందచేసిన కాసేపట్లో ఒకవైపు గవర్నర్ కార్యాలయం
నుండి, మరోవైపు సాధారణ పరిపాలన శాఖ నుండి
వెంట-వెంట వెలువడిన నోటిఫికేషన్లలో కేసీఆర్, ఆయన మంత్రివర్గం, ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుందని పేర్కొన్నాయి. పార్లమెంటరీ
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పాలన చేస్తున్న దేశాలన్నింటిలో అవసరమైనప్పుడల్లా ఇలా
ఆపద్ధర్మ ప్రభుత్వాలు అప్పుడప్పుడూ రావడం ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీనే.
పార్లమెంటరీ
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆపద్ధర్మ ప్రభుత్వం అనే పదం సాంప్రదాయంగా ఎప్పటినుండి
వాడుకలోకి వచ్చిందో అని తెలుసుకోవడం ఒకవిధంగా ఆసక్తికరమైన విషయమే. 1945లో, రెండవ ప్రపంచయుద్ధం జరిగిన సమయంలో,
ఇటలీ-జర్మనీ ఓటమిపాలైన తరువాత, అప్పట్లో ఇంగ్లాండు ప్రధానిగా
వున్న బ్రిటీష్ కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు విన్స్టన్ చర్చిల్ ఒక ప్రతిపాదన
తెరమీదకు తెచ్చాడు. బ్రిటీష్ లేబర్ పార్టీ నాయకుడు క్లెమెంట్ అట్లీని, బ్రిటీష్ లిబరల్ పార్టీ నాయకుడు సర్ ఆర్చిబాల్డ్ సింక్లెయిర్ ను, జపాన్ మీద గెలిచేదాకా, యుద్ధకాలపు సంకీర్ణ
ప్రభుత్వం కొనసాగాలని చర్చిల్ విజ్ఞప్తి చేశాడు. ఇద్దరూ వివిధ కారణాల వల్ల
అంగీకరించలేదు.
దరిమిలా, యుద్ధంలో గెలుపొందిన వ్యక్తిగా చర్చిల్ పైన ఆయన పార్టీ
కార్యకర్తల నుండి త్వరగా ఎన్నికలు
నిర్వహించాలన్న వత్తిడి పెరగడంతో, ప్రధానమంత్రి
పదవికి రాజీనామా చేశాడాయన. ఎప్పుడైతే యుద్ధకాలపు సంకీర్ణ ప్రభుత్వ కాలపరిమితి మే
నెల 1945 తో ముగిసిందో, నాటి బ్రిటీష్ రాజు
కింగ్ జార్జ్ మెజారిటీ కన్సర్వేటివ్ పార్టీ సభ్యులతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు
చేయాల్సిందిగా విన్స్టన్ చర్చిల్ ను ఆహ్వానించాడు. ఆ జాతీయ ప్రభుత్వమే, అనధికారికంగా, రాతపూర్వకంగా అమల్లో లేని
బ్రిటీష్ రాజ్యంగ ప్రకరణలతో నిమిత్తం లేకుండా, ఆపద్ధర్మ
ప్రభుత్వంగా సంబోధించడం జరిగింది. ఇక అప్పటినుండి ఈనాటిదాకా పార్లమెంటరీ
ప్రజాస్వామ్య దేశాల్లో ఆ పదం వాడుకలోకి వచ్చింది.
భారత రాజ్యాంగంలో
కానీ, ఆమాటకొస్తే ఏ పార్లమెంటరీ ప్రజాస్వామ్య
రాజ్యాంగంలో కానీ, ఆపద్ధర్మ ప్రభుత్వం అనే పదమే లేదు. కాకపోతే
తదనుగుణంగా నెలకొన్న కొన్ని సాంప్రదాయాలు, న్యాయస్థానాల
తీర్పులు, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏం చేయవచ్చు-ఏం చేయకూడదు అనే
విషయాలలో కొంత స్పష్టత ఇచ్చాయి. ఆపద్ధర్మ ప్రభుత్వమనేది బ్రిటీష్ సాంప్రదాయక
పద్దతిగా అందరూ అనుసరిస్తూ వస్తున్నారనేది సత్యం. అదికూడా విన్స్టన్ చర్చిల్ కాలం
నుండి అమల్లోకి వచ్చింది.
మెజారిటీ పార్టీకి
చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధుల నాయకుడి ఆధ్వర్యంలో కార్యనిర్వాహక వర్గం
ప్రభుత్వం ఏర్పాటయ్యే పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో ఈ సాంప్రదాయం
పాటిస్తున్నారు. ఎన్నికల తదనంతరం అధికారంలోకి రాబోయే ప్రభుత్వానికి పూర్వరంగంలో
పాలనా బాధ్యతలు నిర్వహించడానికి ఏర్పాటయ్యే ప్రభుత్వాన్నే ఆపద్ధర్మ ప్రభుత్వంగా
నిర్వచించవచ్చు. దానికీ మామూలు ప్రభుత్వంలాగానే విధులూ, బాధ్యతలూ, హక్కులూ, అధికారాలూ లాంటివి వుంటాయి.
ఈ నేపధ్యంలో ఉత్పన్నమయ్యే
మౌలికమైన ప్రశ్న.....ఆపద్ధర్మ ప్రభుత్వం ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు? అనేదే. సాధారణ
ఎన్నికలయ్యేదాకా, ఆతరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా, పరిపూర్ణ అధికారంతో పాలన సాగించడానికి ఏర్పాటైన ప్రభుత్వమే ఆపద్ధర్మ
ప్రభుత్వం అనేది సుస్పష్టంగా విదితమవుతున్నది. అంతర్లీనంగా కానీ, బహిర్గతంగా కానీ, రాజ్యాంగంలోనైనా, మరెక్కడైనా, ఫలానా ప్రధాన విధాన నిర్ణయమైనా, ఫలానా ఆర్థికపరమైన నిర్ణయమైనా, అదికూడా వచ్చే
ప్రభుత్వం తప్పకుండా అమలుచేయాల్సినదైతే, ఆపద్ధర్మ ప్రభుత్వం
తీసుకోరాదని చెప్పడం జరగలేదు. ప్రజాస్వామ్యంలో నిరంతర పాలన కొనసాగడానికీ, అట్టడుగు-దళిత-అణగారిన వర్గాల లబ్దికి అభివృద్ధి-సంక్షేమ పథకాలు
నిరాటంకంగా అమలుకావడానికీ, ఆర్థికభారంతో నిమిత్తం లేకుండా, నిర్ణయాలు తీసుకోవడానికి ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆంక్షలు వుండకూడదు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, మనందరికీ అనుభంలో
ఉన్నట్లుగా, ప్రజల అవసరార్థం, వారి
లాభంకొరకు, ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే రాజకీయ
పార్టీ ప్రభుత్వం అయినా కొనసాగించాల్సిందే కదా? కాకపొతే, ఇక్కడ, తెలంగాణాలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి
అంచనా వేస్తే, ఇదే ప్రభుత్వం కొనసాగి తీరుతుంది కదా? ఇక అలాంటప్పుడు నిర్ణయాధికారంలో ఆంక్షల అవసరం ఏముంది?
ఇంతకీ ఆపద్ధర్మ
ప్రభుత్వాలు ఎప్పుడు, ఎందుకు
ఏర్పాటు కావాలి? పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో
అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారంలో వున్న ప్రభుత్వం ఓటమి పాలైనప్పుడు కానీ, లేదా, తెలంగాణాలో జరిగినట్లు,
మంత్రిమండలి తీర్మానం ఆధారంగా మెజారిటీ శాసనసభ సభ్యుల మద్దతున్న ముఖ్యమంత్రి, సభను రద్దు చేయాలని కోరినప్పుడైనా, ఆపద్ధర్మ
ప్రభుత్వ అవరసం ఏర్పడుతుంది. అదే జరిగింది ఇప్పుడు తెలంగాణాలో. నిర్ణీత
కాలవ్యవధిలో ఎన్నికలు జరిగి ఓ ప్రభుత్వం వచ్చేంతవరకూ ఆపద్ధర్మ ప్రభుత్వం
మధ్యంతరంగా కొనసాగుతుంది అని అనడంలో పెద్దగా తప్పులేదు కానీ,
ఆ ప్రభుత్వం విధానపరమైన ప్రాముఖ్యతాంశ నిర్ణయాలు తీసుకోకూడదని అనడం పూర్తిగా
అసమంజసం, పెద్ద తప్పు కూడా. శాసనసభ రద్దుకూ, ఎన్నికలై కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకూ మధ్యకాలంలో, అవసరార్థం అధికారంలో వుండాల్సిన ప్రభుత్వం అయినంతమాత్రాన, పాలనాపరమైన ప్రజప్రయోగకరమైన నిర్ణయాలు, అవి
చిన్నవైనా-పెద్దవైనా తీసుకోకూడదని ఆంక్షలు విధించడం, విధించమని
విపక్ష రాజకీయ నాయకులు కోరడం కూడా సరైంది కాదు. ఫలానా నిర్ణయం తీసుకోవడానికి
వీల్లేదని అధికారికంగా ఆదేశాలు ఇవ్వడానికి బదులు, ఆంక్షలు
విధించడానికి బదులు, ఈ పాటికే ఈ విషయంలో నెలకొన్న కొంచి మంచి
సాంప్రదాయాలేమైనా వుంటే, వాటిని పరిగణలోకి తీసుకొని
నిర్ణయాధికారం వుంటే మంచిది. పాలననేది ఒక నిరంతర ప్రక్రియ.
సంకీర్ణ
ప్రభుత్వాల ఏర్పాటు అదేపనిగా అవసరమవుతున్న దేశాల్లో కానీ, మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కానీ,
తరచుగా ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏర్పాటుకావడం సహజం. వాటికి ఆంక్షలు విధించడం కూడా
సహజమే. ఎన్నికలైన వెంటనే, ఏ పార్టీకూడా మెజారిటీ స్థానాలు
పొందకపోయినా, లేదా, ఒక సంకీర్ణ
ప్రభుత్వం కూలిపోయి మరొకటి తరచూ ఏర్పడ్డా, ఆపద్ధర్మ
ప్రభుత్వాల అవసరం వుంటుంది కొంతకాలం. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటైన
ఆపద్ధర్మ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా రోజువారీ పాలనకు
పరిమితమైతే అభ్యంతరం వుండదు. అలా కాకుండా, మెజారిటీ శాసనసభ
సభ్యుల మద్దతు వుండి, పూర్తికాలం అధికారంలో వుండడానికి అవకాశం
వుండి, ప్రగతి రథచక్రాలు ఆగిపోకూడదనే ఆలోచనతో, మంత్రివర్గ తీర్మానం మేరకు సభను రద్దుచేయమని గవర్నర్ ను సీఎం కోరిన
నేపధ్యంలో ఏర్పాటైన ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ రకమైన
ఆంక్షలు వుండకూడదు. అలా ఏర్పాటైన ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు...ధర్మబద్ధమైన
పూర్తి స్థాయి ప్రభుత్వమే ముమ్మాటికీ!!!
కాకపోతే, శాసనసభ రద్దు అనంతరం, ఎన్నికల కమీషన్
కనుక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే, మోడల్ కోడ్ ఆఫ్
కండక్ట్ అమల్లోకి వస్తే, అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం భారీ
విధాన నిర్ణయాలు తీసుకోవద్దు అని అనడంలో తప్పులేదు. కారణం, ఆ
క్షణం నుండి, అసలైన ఆపద్ధర్మ ప్రభుత్వంగా అది మారిపోతుంది.
అంతవరకూ ధర్మబద్ధమైన ప్రభుత్వమే. ఆ విధంగా, ఎన్నికలై, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకూ ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుంది.
ఏదేమైనా, తెలంగాణాకు సంబంధించినంతవరకు,
టీఆరెస్ఏతర ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది జరగదని స్పష్టమైన సంకేతాలున్నాయి. ఆపద్ధర్మ
ముఖ్యమంత్రిగా నియమించిన కొద్ది సేపట్లో, శాసనసభను
రద్దుచేయడానికి కారణాలను పత్రికా సమావేశంలో వివరించిన సీఎం కేసీఆర్, దానికి ప్రధాన కారణం, తెలంగాణ రాష్ట్రం, రాజకీయ దౌర్బల్యాన్ని, దుర్బలత్వాన్నీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ భరించలేదని అని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం
వివిద రంగాల్లో త్వరితగతిన అభివృద్ధిపథాన పురోగమిస్తుంటే,
రాజకీయ దౌర్బల్యం వల్ల ఆటంకాలు కలగకూడదనే శాసనసభను రద్దుచేయమని కోరానన్నారు సీఎం.
ఆర్థికాభివృద్దిలో
అగ్రగామిగా వున్న తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేకానేక పథకాలు అవిచ్చిన్నంగా, ఆటంకం లేకుండా కొనసాగాలన్న ఆలోచనతో,
అనుకున్నదానికంటే ముందుగా ఎన్నికలకు పోవాలన్న నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
ధర్మబద్ధ ముఖ్యమంత్రే కాని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. అభివృద్ధి ఉద్యమాన్ని, ఆపద్ధర్మ ప్రభుత్వం పేరుతో ఆపకూడదు. ఆర్థికపరమైన,
విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని ఆంక్షలు వుండడానికి వీల్లేదు. అభివృద్ధి
నమూనాగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి వున్న పేరు అలాగే కొనసాగడానికి
ఆపద్ధర్మ ప్రభుత్వానికి అన్ని అధికారాలివ్వాలి.
ఆపద్ధర్మ
ప్రభుత్వంగా నామకరణం చేయబడ్డ కేసీఆర్ ప్రభుత్వం,
గడచినా ఏబైఒక్క నెలల్లో ఏ విధంగానైతే ప్రజోపయోజనమైన పథకాల నిర్ణయం తీసుకుని అమలు
చేసిందో, అలాగే, అవసరమైనంత మేరకు, అలాగే కొనసాగిస్తే, ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వం
కూడా కొనసాగించాల్సిందే. అయినా, ఆ వచ్చేది ఎలాగూ కేసీఆర్
ప్రభుత్వమే కాబట్టి ఇబ్బంది అసలే లేదు. అందుకే ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం
మాత్రమేకాదు... వంద శాతం ధర్మబద్ధమైన ప్రభుత్వం.
No comments:
Post a Comment