Saturday, September 15, 2018

పంచవటిలో సీతారామలక్ష్మణులు, పర్ణశాల నిర్మించిన లక్ష్మణుడు...శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-26: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-26
పంచవటిలో సీతారామలక్ష్మణులు, పర్ణశాల నిర్మించిన లక్ష్మణుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (16-09-2018)
అనేకానేక సర్పాలతో, మృగాలతో నిండిన ఆ పంచవటిని చూసిన శ్రీరాముడు, తన అన్నా-వదినెలకు శుశ్రూష చేయడానికి తగిన స్థలం దొరికిందికదా అని సంతోషిస్తున్న లక్ష్మణుడితో తియ్యని మాటలతో ఇలా అన్నాడు. "లక్ష్మణా! పంచవటి అని ప్రఖ్యాతిగన్న ప్రదేశం ఇదే. చక్కగా పూసిన తీగలు, చెట్లు, గుంపులు-గుంపులుగా, కన్నుల పండుగగా కనపడుతున్నాయి. ఇక్కడ సీతకు, నీకు, నాకు, మన ముగ్గురికి అనుకూలమైన, సంతోషకరమైన స్థలమేదో చూడు. నీటికి దూరంగా వుండకూడదు. మనసుకు ఇంపైనదిగా, నీటికి దూరం లేకుండా, స్వేచ్చా విహారానికి యోగ్యమైందిగా వుందాలి. నేల చదునుగా, పడుకోవడానికి సుఖంగా వుండాలి. నువ్వు తేవడానికి అవసరమైన పూలు, కట్టెలు, దర్భలు దండిగా దగ్గరలోనే వుండాలి. గట్టి నేల కాకుండా పడుకోవడానికి, కూర్చోవడానికి, అనుకూలంగా మెత్తని నేలగా వుండాలి. పెంట, పేడ కుప్పలు లేకుండా నిర్మలంగా వుండాలి. మనం కొన్నాళ్లు ఇక్కడే వుంటాం. కాబట్టి అనుకూలమైన ప్రదేశమైతే మంచిదు కదా? అందుకే మన ముగ్గురికీ సౌఖ్యమైన స్థలాన్ని చూడు".

ఇలా శ్రీరామచంద్రమూర్తి చెప్పగా లక్ష్మణుడు చేతులు జోడించి, నమస్కారం చేసి, సీతాదేవి సమక్షంలో ఇలా అన్నాడు. "భూజనులను సంతోషింప చేయగల స్వభావం కలవాడా! మీరిక్కడ వందలేళ్లు సంతోషంగా, స్థిరంగా వున్నప్పటికీ మీకు నేను దాసుదనే కానీ, స్వతంత్రుడిని కాను. కాబట్టి మీరే ప్రేమతో మీకిష్టమైన, సమ్మతమైన స్థలంలో ఆశ్రమం నిర్మించ్డానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి" అన్నాడు. (లక్ష్మణుడు రామకైంకర్యమే చిహ్నంగా వున్నవాడు). లక్ష్మణుడు ఇలా చెప్పగానే ఆయన మాటలకు సంతోషించిన శ్రీరాముడు తగిన స్థలాన్ని నిశ్చయించి, తమ్ముడు చేయి పట్టుకుని, ఆ ప్రదేశం మిట్టపల్లాలు లేకుండా చదరంగా వున్నదనీ, అక్కడ ఆశ్రమం నిర్మించమనీ అంటాడు. "ఎర్రతామరలతో నిండి, అందమై, లక్ష్మీదేవి సేవించే తామరకొలను దగ్గర్లోనే వుంది. మనమక్కడి నీళ్లనే వాడుకోవచ్చు. అగస్త్యుడు చెప్పిన గోదావరి నది కమలాలు, హంసలు, చక్రవాకాలతో కూడి ప్రకాశిస్తున్నదిక్కడే. ఇదెక్కువ దగ్గరలో లేదు, దూరంగా కూడా లేదు. నెమిళ్ల ధ్వనులతో, పెద్ద వృక్షాలతో నిండిన పర్వతాలు ఎక్కువ దూరంలో కాకుండా, మరీ దగ్గరలో కాకుండా వున్నాయి. తమ్ముడా...అనేకమైన లోహాలతో ఈ భూప్రదేశం రంగులు పూసిన ఏనుగులా వుంది చూశావా? పర్వతాలు ప్రకాశిస్తున్న ఈ ప్రదేశం శ్లాఘ్యంగా వుంది. మృగాలు, పక్షులు వుండడంతో అందంగా వుందీ ప్రదేశం. పుణ్యం కూడా ఇస్తున్నదిది. కాబట్టి ఇక్కడే మనకు జటాయువు తోడుండగా వుందాం. త్వరగా పర్ణశాల నిర్మించు" అని శ్రీరాముడు అనగానే, లక్ష్మణుడు ఒక ఆకుల ఇంటిని కట్టాడక్కడ.


భూమిలో పునాది తీసి, చక్క్గా గోడలు కట్టి, లావాటైన వెదుళ్లు స్థంబాలుగా నాటి, వాటిమీద బక్కటి, సన్నటి వెదుళ్లను పరచి, జమ్మికొమ్మలు వాసాలుగా చేసి, నారలతో గట్టిగా బిగించి, ఆ వెదుళ్ల మీద బోద రెల్లును దట్టంగా కప్పి, నేలను చదరంగా, నున్నగా చేసి, దిమ్మెసతో మూడు-నాలుగు సార్లు నీళ్లు చల్లి కుటీరాన్ని సిద్ధం చేశాడు లక్ష్మణుడు. ఇలా కుటీరాన్ని సిద్ధం చేసిన లక్ష్మణుడు, గోదావరి నదికి పోయి, స్నానం చేసి, ఆలశ్యం చేయకుండా పళ్ళు, పూలు తెచ్చి, వాస్తు బలి ఇచ్చి, శాంతి కార్యాలు పూర్తిచేసి, ఆశ్రమాన్ని అన్నకు చూపించాడు. సీతతో కలిసి శ్రీరాముడు దాన్ని చూసి సంతోషించి, తమ్ముడిని కౌగలించుకుని ప్రేమతో, ఆయన చేసిన గొప్ప పనికి తానేమి సమానమైన కానుక ఇవ్వగలను అని అంటూ, ప్రేమతో మళ్లీ కౌగలించుకున్నాడు. ఇంకా ఇలా అన్నాడు: "చిన్నవాడా! నీ శక్తిని ఏమని మెచ్చుకోగలను? పాపరహితుడా! నా అభిప్రాయాన్ని నేను చెప్పకుండానే తెలుసుకోగలవు. నీతిని ఎరిగినవాడివి. ఏదెలా చేస్తే నాకు ఇష్టమో తెలిసినవాడివి. ఇలాంటి నిన్ను, మిగుల శుద్ధుడిని కని ధర్మాత్ముడైన తండ్రి మరణించినా నా పాలిటికి బతికే వున్నవాడు. నువ్వుండబట్టి ఆయన లేడే అన్న కొరత రావడం లేదు" అని చెప్పి సుఖంగా, స్వర్గంలో విష్ణువు లాగా అక్కడే కొంతకాలం నివసించారు.

No comments:

Post a Comment