Saturday, May 18, 2019

సీతను ఎత్తుకుని పరుగెత్తిన రావణుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-61 : వనం జ్వాలా నరసింహారావు


సీతను ఎత్తుకుని పరుగెత్తిన రావణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-61
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (19-05-2019)
          ప్రాణాలు వెడలిపోవడానికి సిద్ధంగా వున్న ఆ పక్షిరాజు జటాయువును చూసి సీతాదేవి ఎంతో పరితాపంతో కన్నీళ్లు కాల్వలుగా పారేట్లు ఏడ్చింది. ఏడుస్తూ రామచంద్రుడిని తలచుకుని ఇలా అంటుంది బిగ్గరగా. “కాబట్టి రామచంద్రా! నాకు కలిగిన కష్టం తెల్సుకోవడానికి నీకు ఎడమకన్ను, ఎడమభుజం అదిరి వుండాలి కదా! పాలగరుడ భరద్వాజాలు తప్ప ఇతర రకాల పక్షులన్నీ కుడివైపు నుండి ఎడమగా పరుగెత్తి వుండాలికదా? ఈ అపశకునాల వల్ల నాకేదో కీడు కలిగిందని నువ్వు ఉహించి త్వరగా రావచ్చుకదా? రామచంద్రా! నీ శరీరంలో, నువ్వున్నచోట, మృగపక్ష్యాదుల వల్ల కనపడే అపశకునాలే కాకుండా, ఇక్కడ వుండే మృగాలు, పక్షులు కూడా నీ దగ్గరికి గుంపులు-గుంపులుగా వస్తున్నాయి. వీటిని చూసైనా నాకు కలిగిన కష్టాన్ని తెలుసుకుని వుండవచ్చు కదా? ఇంతదాకా నీ భార్యకు కలిగిన అవమానం నీకు తెలవకపోవడం అంటే, నేను మహాపాపం ఏదో చేశానని అనుకోవాలి. అల్ప పాపం అయితే ఇంతవరకు నేను అనుభవించిన దాంతో సమసిపోయి వుండాల్సింది”.

         “నా పాపం పెద్దదే అనడానికి నావార్త నీకు తెలియకపోవడం అనే ఒక్క కారణమే కాదు. నన్ను రక్షించడానికి ప్రయత్నించిన ఆ పుణ్యధనుడు జటాయువు, ఈ నీచుడి చేతిలో హతమయ్యాడు. నా పాపపం పెద్దది కాకపోతే జటాయువు జయించే వుండేవాడు. కాని, నా పాలిటి పెద్దమ్మ, నాలాంటి పాపాత్మురాలికి సహాయం చేయాలనుకున్న ఆయన్ను ఎందుకు బతకనిస్తుంది? మహాపాపాత్ములకు సహాయం చేయడానికి ప్రయత్నించినవారికీ పాపాత్ముల పాపం వారిని ఆ సహాయం చేయకుండా బాధిస్తుంది. రామా! నేను సీతను. భూమి పుత్రిని. నన్నీ రాక్షసుడు పట్టుకుని పోతున్నాడు. రక్షించడానికి రా. తండ్రీ! లక్ష్మణా! త్వరగా రా!”.

         ఈ ప్రకారం, సీతాదేవి, రామలక్ష్మణులు సమీపంలో వుంటే తన అరుపులు విని వస్తారేమోనని ఏడ్చింది. “రామా! రామా! రఘురామా!” అని పెద్దగా ఏడుస్తుంటే రావణుడు, సీత తల వెంట్రుకలను పట్టి ఈడ్చాడు. ఆ సమయంలో, జంగమ స్థావరాలతో లోకాలు గాఢమైన చీకటితో వ్యాపించబడి, స్వస్థావస్థ తప్పి, బాధతో సోలిపోయింది. గాలి ఆగి పోయింది. సూర్యుడు వెల-వెలపోయాడు. బ్రహ్మదేవుడు రావణుడు సీతను బాదిస్తుమ్తే చూసి, “దేవకార్యం చక్కబడ్డది. రావణుడు చావడం ఖాయం” అనుకుంటాడు. దేవతలు, ఋషులు సీత పడ్తున్న బాధలు, కష్టాలు చూసి దుఃఖపడ్తారు. కాబోయే రావణుడి చేటుకు సంతోషించారు.

         “రామా! రామా! లక్ష్మణా!” అని ఏడుస్తున్న సీతాదేవి ఆకాశమార్గాన తీసుకుని అతి వేగంగా పరుగెత్తాడు రావణుడు. నల్లటి మేఘంలాంటి కాంతికల రావణుడి పక్కన, బంగారువన్నెకల సీతాదేవి తొలకరి మెరుపులాగా ప్రకాశించింది. బంగారుమయమైన ఆమె పైట కొంగు గాలికి ఎగిరి, రావణుడిని కప్పడం చూస్తుంటే, కాలుతున్న కొండలాగా అతడు కనబడ్డాడు. మంగళకారిణి అయిన సీత కట్టిన పట్టువస్త్రం, ఆకాశంలోని సూర్య కిరణాలు తగలడంతో ఎర్రటి మేఘంలాగా కనిపించింది. రావణాసురుడి తొడమీద వున్న ఆ సీతాదేవి చక్కని ముక్కు కల ముఖం రాముడు దగ్గర లేనందున కళతప్పింది. మంచి నొసలు కల, ముంగురుల దాకా వ్యాపించిన, అందమైన, దోషరహితమైన, వికసించిన కమలాలతో సమానమైన, సీతాదేవి ముఖం మేఘాన్ని పగలతీసుకుని వచ్చి కనబడే చంద్రుడిలాగా కనిపించింది.


         అందమైన తెల్లటి దంతాలు, సంపెంగ మొక్క లాంటి ముక్కు, బంగారు సొమ్ముల విలాసం, పడుతూ-ఎగురుతూ వుండే వెంట్రుకలు, దొండపండు లాంటి పెదవి కలిగి రావణాసురుడి అంకాన వున్న సీతాదేవి ముఖం పగలు ఉదయించిన చంద్రబింబం లాగా వుంది. సీతాదేవి సహజ సౌందర్యం బొగ్గులో పొదిగిన మణిలాగా రావణుడి దగ్గర వుండడం వల్ల కాంతిహీనంగా కనపడింది. నల్లటి శరీరం కల రావణుడి దగ్గర వున్న బంగారు వన్నెకల సీత, బంగారపు ఒడ్డాణం నీలమణితో కలిసి ప్రకాశించినట్లుంది. చక్కటి అందమైన బంగారు ఆభరణాలతో ఇంపుగా, కమలంలాగా కాంతికల సీత, రావణుడి దగ్గర, మేఘం దగ్గరి మెరుపులాగా వుంది. పగడపు తీగలాంటి సీత నల్లటి రావణుడి ఒడిలో బంగారపు గొలుసుతో కట్టబడిన ఏనుగులాగా ప్రకాశించింది. సీతాదేవి ధరించిన బంగారపు సొమ్ముల ఘల్లు-ఘల్లను ధ్వని రావణుడిని మెరుపులతో, ఉరుములతో కూడిన మేఘంలాగా కనబడేట్లు చేసింది.

సీతాదేవి తల నుండి రాలిన అందమైన పూలు నేలమీద పడుతూ, రాక్షసుడి పరుగెత్తే వేగానికి కలిగిన సుడిగాలికి, అవి కూడా సుళ్లు పెట్టుకుంటూ, వాడి చుట్టూ తిరిగి నేలమీద పడడం చూస్తుంటే, నక్షత్రాలు మేరు పర్వతాన్ని చుట్టి తిరుగుతున్నట్లుగా వుంది. రత్నాలు చెక్కబడిన సీతాదేవి ధరించిన కాలి కడియం జారి భూమ్మీద మధుర ధ్వనితో చక్రాకారం లాగా మెరుగుతీగలా పడింది. రావణుడు సీతను బలవంతంగా తీసుకుని పోవడం, ఆయన ఇంట్లో కాల్చడానికి కొరివిని తీసుకుపోయినట్లు వుంది. ఆమె ధరించిన అగ్నికాంతి కల బంగారపు సొమ్ములు ఆకాశాన్నుండి చుక్కలు రాలినట్లు నేలమీద పడ్డాయి. ఆమె మెడలో ధరించిన ముత్యాలసరం ఆకాశగంగలాగా కనిపించింది. పక్షులతో సహా గాలికి కదులుతున్న కొమ్మలున్న చెట్లు ఎగురుతున్న కొమ్మలకు భయపడవద్దని సైగలు చేసినట్లుంది.

సింహాలు, పులులు, పక్షులు, మృగాలు అన్నిచోట్లా తిరుగుతూ, సీతాదేవి నీడను చూసి, గుర్తించి, ఆకాశంవైపు చూస్తూ అరిచాయి. రావణుడు భూమ్మీద దిగినట్లయితే వాడిని ఇవన్నీ పీక్కుని తినేవేమో! పర్వతాలన్నీ, మోసంతో సీతాదేవికి కలిగిన విపత్తుకై ఏడ్చాయి. సూర్యమండలం కాంతిహీనమై బాధతో మెల్లగా పోయినట్లు కనిపించింది. “ఈ వంచకుడు సీతాదేవిని దిక్కులేనిదానిలాగా మోసగించి కఠినంగా హరించి తీసుకుపోతుంటే, లోకంలో ఇందరు వుండికూడా ఒక్కరైనా అయ్యో! పాపం! నీకి తగదని, విడవమని అనరేంటి? లోకంలో ఇంకా ధర్మం, సత్యం, రుజుత్వం, దయ అనేవి మిగిలాయా? ఈ గుణాలు కలవారు లేరులేరు” అని భూతాలన్నీ ఏడ్చాయి.

పెద్ద మృగాలు సీత నీడ వెంట పరుగెత్తుతుంటే పిల్ల మృగాలు ముఖాలు వేళ్లాడతీసుకుని భయంతో వణకుతూ, కన్నీళ్లు పొరలి-పొరలిరాగా సీతాదేవి పోయే మార్గాన్ని కనురెప్ప కూడా వాల్చకుండా చూసి-చూసి బాగా దుఃఖపడ్డాయి. భూమ్మీదకు చూస్తూ, మనోహర ధ్వనితో “రామా! లక్ష్మణా!” అని ఏడుస్తూ, పుణ్యాత్ములు, మంచి మనసున్నవారు ఎవరైనా అడ్డం రాకపోతారా? విడిపించరా? అని దిక్కులు చూస్తున్న సీతను చూసి వనదేవతలు పెద్దపెట్టున ఏడ్చారు. ముత్తెపుసరులు తెగిపోగా; పెదవి ఆరిపోగా;, పగుళ్లువారగా; తిలకం, కాటుక, కరగగా; వెంట్రుకలు చెదరగా వున్న సీతాదేవిని తన చావుకొరకే రావణుడు పట్టుకుని పోతుంటే, తెల్లబారిన ముఖంతో భయంతో సీతాదేవి బాధపడింది. ఏడవడం వల్ల, కోపం వల్ల, కళ్ళు రెండూ ఎర్రగా కాగా రావణుడి మర్మాలు ఛేదించే భయంకర వాక్యాలతో సీత ఆయన్ను సంబోధించింది.

No comments:

Post a Comment