ఆదర్శ ఆచార్యులు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (05-05-2019)
మహబూబాబాద్ జిల్లా జయ్యారం గ్రామంలో జన్మించిన ఆచార్య డాక్టర్ మారంరాజు
సత్యనారాయణ రావు, విద్యారంగంలో అనేక ఉన్నత శిఖరాలను
అధిరోహించారు. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఉపకులపతి పదవి మినహా,
రిజిస్ట్రార్, రాజకీయ శాస్త్రం విభాగానికి ఆచార్యుడుగా అనేక పదవులను
నిర్వహించారు. ఆచార్య పదవులే కాదు, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో
పాల్గొని వీరోచిత పోరాటం కూడా చేశారు. చారిత్రిక, రాజకీయ
గ్రంథకర్త, సామాజిక సేవకుడు కూడా అయిన ఆచార్య సత్యనారాయణరావు
శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో మరణించడం ఎంతోమందికి
విషాదాన్ని మిగిల్చింది. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
1965 లో, ఖమ్మం కాలేజీలో పొలిటికల్ సైన్స్
లెక్చరర్‌గా బదిలీ మీద వచ్చిన ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావుతో, సీపీఎం పార్టీకి
నాయకత్వం వహిస్తున్న స్వర్గీయ గండ్లూరి కిషన్ రావు ద్వారా పరిచయం అయింది. మారంరాజు
ప్రభుత్వ ఉద్యోగంలో వున్నప్పటికీ మార్క్సిస్ట్ కమ్యూనిస్టులతో సన్నిహిత
సంబంధాలుండేవి. అధ్యయనపరంగా, రాజకీయ శాస్త్ర అధ్యాపకుడిగా
మార్క్సిజం అన్నా, కమ్యూనిజం అన్నా వీలున్నప్పుడల్లా "మేధో మధనానికి"
సిద్ధపడేవారు. మాజీ రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి
వంటి "మేధావుల" ప్రభావం ఆయన మీద చాలావరకు పడి అధ్యయన పరంగా ఆ దృక్ఫదం
వున్న వారితో ఇతరులకంటే కొంచెం ఎక్కువ సాన్నిహిత్యం కలిగి వుండేవారు. మారంరాజు
సత్యనారాయణ రావు పొలిటికల్ సైన్స్ తరగతుల్లో పాఠాలు చెప్పే విధానాన్ని చాలా మంది
మా స్నేహితులు ఎంతో అభిమానంగా-గౌరవంగా వివరించేవాడు. చక్కటి సందర్భోచిత ఉదాహరణలతో
వర్తమాన రాజకీయాలకు అన్వయించుకుంటూ, పొలిటికల్
సైన్స్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాఠ్య పుస్తకాల్లోని విషయాలను సులభంగా అందరికీ
అర్థమయ్యే విధంగా బోధించేవాడు.
ఇంటర్మీడియట్, బియ్యే, ఎంఏ
(పొలిటికల్ సైన్స్) హైదరాబాద్ నిజాం కళాశాలలో ముగించుకున్న మారంరాజు సత్యనారాయణ
రావు "ఆంధ్ర ప్రదేశ్ (ఉమ్మడి) రాష్ట్ర మంత్రివర్గాల" మీద 1979-1983 మధ్య కాలంలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్
తెచ్చుకున్నారు. ఆయనకు "పీహెచ్‌డీ" వచ్చిన విషయం అందరికి తెలిసే అవకాశం
వున్నా, తన పరిశోధనలో భాగంగా ఎవరెవరిని కలిసిందనే విషయం
బహుశా చాలామందికి తెలియకపోవచ్చునేమో! ఆయన కలిసి విషయ సేకరణలో అభిప్రాయాలు పొందిన
ప్రముఖుల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, స్వర్గీయులు కాసు
బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహా రావు, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయ భాస్కర రెడ్డి
వున్నారు. పీవీ గారిని కలిసినప్పుడు మిగతా విషయాలకు అదనంగా "భూ
సంస్కరణల" విషయం ప్రస్తావనకొచ్చింది. జవాబును దాటవేసిన పీవీ, ఆ విషయాలను గురించి నిష్పక్షపాతంగా తెలుసుకోవాలంటే, తన
చుట్టు పక్కలున్న వారిని, తన ఆంతరంగికులైన వ్యక్తిగత
కార్యదర్శిని, ఆఖరుకు తన డ్రైవర్‌ను కలిస్తే బాగుంటుందని
సూచించాడట.
తన పరిశోధనల కోసం సత్యనారాయణ రావు కలిసిన మరో ప్రముఖ వ్యక్తి స్వర్గీయ కల్లూరి
చంద్రమౌళి. ఎడిన్ బరో లో పీహెచ్‌డీ చేసిన కల్లూరి ఒక పల్లెటూరు రైతులా మారంరాజుతో
ముచ్చటించారు. ఆయనను కలవడానికి వెళ్లిన సత్యనారాయణ రావుకి "అల్లుడి
మర్యాదలు" చేశారాయన. విజయభాస్కర్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారట. ఆయన కలిసిన
రోజున బిజీగా వున్న విజయభాస్కర్ రెడ్డి, మర్నాడు
రమ్మని చెప్పారట. మర్నాడు కూడా ఆయన బిజీగా వుండొచ్చుకదా అన్న సందేహం వ్యక్త
పరిచారు మారంరాజు. వెంటనే, తన ఆంతరంగిక సిబ్బందిలో ఒకరిని
పిలిచి, మర్నాడు మారంరాజు వచ్చిన సమయంలో, తాను "బాత్ రూమ్” లో తప్ప ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా,
ఆయనను తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశాలిచ్చారట. కలిసిన రోజున ఐదారు గంటల సమయం ఇచ్చి అభిప్రాయాలు
వేల్లదిమ్చారట. అదీ, మారంరాజుకున్న విలువ.
1960 లో ఎంఏ పూర్తిచేసిన ఆయన మొదట సిద్దిపేట కాలేజీలోను,
తర్వాత రాజమండ్రి, ఖమ్మం, నల్గొండ, సత్తుపల్లి కళాశాలలలోను పొలిటికల్ సైన్స్
లెక్చరర్ గా పనిచేశారు. రెండవ పర్యాయం ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు అప్పటి
సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి రాంరెడ్డి, సత్యనారాయణ రావు ప్రతిభను
గుర్తించి, అక్కడ పనిచేసేందుకు ఆయనను ఒప్పించారు. డాక్టర్
మారంరాజు సత్యనారాయణ రావు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఒక్క ఉపకులపతి
పదవి మినహా అన్ని పదవులను నిర్వహించారు. రిజిస్ట్రార్ గాను, రాజకీయ
శాస్త్రం విభాగానికి ఆచార్యుడు గాను పనిచేసే రోజుల్లో, ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలమీద పరిశోధనాత్మక గ్రంథం రాశారు. రాజకీయ శాస్త్రానికి
సంబంధించిన అనేక అంశాలపై పుస్తకాలు రాశారు. 1983 ఎన్ టీ ఆర్
ఎన్నికల విజయంపై "ఎన్నికల రాజకీయాలు" అనే పరిశోధనాత్మక గ్రంథం రాశారు.
ఇందిరా గాంధీ మెదక్ లోక్ సభకు పోటీ చేసి గెలిచినప్పుడు, నియోజకవర్గంలో
విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశారు.
ఆచార్య మారంరాజు మూడేళ్ళ క్రితం “ఇదీ తెలంగాణ” పుస్తకం రాశారు. అతిరథ-మహారథ
రచయితల, పాత్రికేయుల సమక్షంలో ఈ పుస్తక
ఆవిష్కరణ జరిగింది. ఎనభై ఏళ్ల వయసు దాటినా అపారమైన తన జ్ఞాపక శక్తితో కలకాలం
పదిమంది గుర్తుంచుకోవాల్సిన విషయాలెన్నో ఈ పుస్తకంలో రాశారు సత్యనారాయణరావు.
"అతి ప్రాచీనమైన చరిత్ర ఉన్న దక్కన్ పీఠభూమిలో అంతర్భాగమే తెలంగాణ
ప్రాంతం. తెలుగు మాట్లాడే
గణంగా ఈ ప్రాంతాన్ని గుర్తించే వారు కాబట్టి తెలంగాణ అనే పేరొచ్చింది. తిలింగపదం కాకతీయుల కాలం నుంచి వాడుకలోకి వచ్చింది. 1766 నుండి హైదరాబాద్ రాజధానిగా
పాలించిన నైజాం పరిపాలన కింద భూభాగమంతా తెలంగాణ ప్రాంతంగా గుర్తించబడింది. అంతకుముందు తెలంగాణ ప్రాంతంలో శాతవాహనులు కోటి లింగాల (కరీంనగర్ జిల్లా) నుంచి పాలన చేశారు. శాతవాహనుల తరువాత
ఇక్ష్వాకులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. వీరికి సమాంతరంగా వాకాటకులు ఉత్తర తెలంగాణ జిల్లాలను పాలించారు. వాకాటకుల తరువాత విష్ణుకుండినులు ఏడవ శతాబ్దం దాకా
పాలించారు. అ తరువాత బాదామి
చాళుక్యులు, రాష్ట్రకూటులు,వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు తమ పాలనను విస్తరించారు. వరంగల్ కేంద్రంగా కాకతీయులు (1163-1323) దక్షిణ భారతదేశంలోనే సువిశాల
సామ్రాజ్యాన్ని పాలించారు. కాకతీయుల కాలంలో
తెలంగాణ ప్రాంతం దేదీప్యమానంగా వెలిగిపోయింది. గొలుసు కట్టు చెరువుల ద్వారా వ్యవసాయం లాభసాటిగా సాగింది”.
“1500 ప్రాంతంలో బహమనీ రాజ్యం ఐదు చిన్న రాజ్యాలుగా
విడిపోయింది. విడిపోయిన వారిలో
కుతుబ్ షాహీలు కూడా వున్నారు. కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్య స్థాపకుడు. 1592 లో రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్ కు మార్చాడు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అప్పట్లో దాని పేరు భాగ్యనగరం. గోల్కొండ కోట మొఘల్ చక్రవర్తుల ఆధీనమైన తరువాత
నిజాముల్ ముల్క్ సుబేదారుగా నియమించబడ్డాడు. ఆయనే స్వతంత్రం ప్రకటించుకుని ఆసఫ్ జాహీ వంశ పాలనకు శ్రీకారం చుట్టాడు. ఏడవ రాజైన నిజాం ఉస్మాన్ మీర్ అలీఖాన్ తో ఆసఫ్ జాహీ
వంశం అంతరించింది. ప్రస్తుతం వున్న
జిల్లాల వ్యవస్థ, రెవెన్యూ పాలనా
వ్యవస్థకు అప్పటి ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్ జంగ్ (1829-1883) కారకుడు. జిల్లా బందీ విధానం ఆయనే ప్రవేశ పెట్టాడు.జిల్లా బందీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ తో
కలుపుకుని తెలుగు మాట్లాడే పది జిల్లాలను ఒక ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అదే ఇప్పటి తెలంగాణ ప్రాంతం”.
“భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో హైదరాబాద్ ప్రాంతం భారత్ లో
అంతర్భాగం కాదు. పోలీసు చర్య
తదనంతరం హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసింది. హైదరాబాద్ స్వతంత్ర రాజ్య హోదా కోల్పోయి భారతదేశంలోని ఓ రాష్ట్రంగా మారింది. పోలీసు చర్య అనంతరం ఏజంట్ జనరల్ గా కె ఎం మున్షి
నియామకం, కమ్యూనిస్టుల సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. 1950 లో పౌర ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఎం కే వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యారు. 1952 ఎన్నికల వరకు బూర్గుల రామకృష్ణారావు మంత్రిగా ఉన్నారు. 1952 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ విజయం సాధించి, బూర్గుల
రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు అయింది".
"కాకతీయుల కాలంలో కట్టించిన గొలుసు కట్టు చెరువుల ఆధారంగా
సాగుతున్న వ్యవసాయానికి అదనంగా, సాలార్ జంగ్ నిజాం రాజులను ఒప్పించి కృష్ణా నదికి వెళ్లే వరదలను సముద్రం పాలు
కాకుండా నివారించడానికి డిండి, మూసి, పాలేరు, వైరా జలాశయాలను కట్టించాడు. ఇప్పటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును మొదటగా ఆలోచించి
డిజైన్ చేసి, నిర్మాణానికి
ప్రయత్నం ఆయన కాలంలోనే జరిగింది. హైదరాబాద్ నగరానికి వరదలు తెచ్చే ప్రాంతంలోని నీటిని నియంత్రించేందుకు ఉస్మాన్
సాగర్, హిమాయత్ సాగర్
రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ శక్తి వ్యవస్థ నెలకొల్పారు. వీటి నిర్మాణంలో అలీ నవాజ్ జంగ్ కృషి వుంది. 1918 లో ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజీ, ఆసిఫియా గ్రంధాలయం
ఏర్పాటయ్యాయి. పోలీసు చర్య
తదనంతరం ఆంధ్ర ప్రాంత అధికారుల పెత్తనం పెరిగిపోయింది. నిజాం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పే
ప్రయత్నం జరగలేదు. 1926 ప్రాంతంలో గోలకొండ పత్రిక స్థాపించారు. 1930 వ దశకంలో హైదరాబాద్ స్టేట్ లో రాజకీయ ఉద్యమాల ప్రారంభం. 1918 ప్రాంతంలో రాజ్ బహద్దూర్
వెంకట్రామిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా రెడ్డి హాస్టల్ ప్రారంభం.....దరిమిలా వైశ్య, గౌడ, పద్మశాలి, మున్నూరు కాపు హాస్టల్ల స్థాపన. మరి కొన్నాళ్లకు మాడపాటి హనుమంతరావు బాలికా పాఠశాల
ప్రారంభం".
ఇటువంటి విలువైన సమాచారం వున్న ఈ గ్రంథం గురించి రాస్తే మరో గ్రంథం అవుతుంది.
మారంరాజు ఇతర రచనల విషయానికొస్తే, “గ్రామాయణం” పుస్తకంలో రెవెన్యూ
సంస్కరణలకు సంబంధించిన అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ గ్రామీణ
ప్రాంతంలోని భూసంబంధాలు, గ్రామీణ పాలనా వ్యవస్థ, భూ రికార్డులకు సంబంధించిన పటేల్-పట్వారీ
వ్యవస్థ, శిస్తు విధానం, రెవెన్యూ విధానం లాంటి విషయాలను
సత్యనారాయణరావు కూలంకషంగా విశదీకరించారు. అనాదిగా తెలంగాణ గ్రామాలలో అనుసరిస్తూ
వస్తున్న గ్రామీణ వ్యవస్థ ఎలాంటిదో, ఆ అనుభవంతో భవిష్యత్ లో ఏం చేయవచ్చో
తెలుసుకోవాలంటే ఈ అముద్రిత పుస్తకం చదివితీరాల్సిందే. చారిత్రాత్మక ఖమ్మం గురించి మారంరాజు సత్యనారాయణ రావు
ఒక కరదీపిక రాసారు.
మారంరాజు సత్యనారాయణ రావుది విలక్షణమైన వ్యక్తిత్వం. తనకు చేతనైనంత
సహాయపడాలనే మనస్తత్వం ఆయనను చాలా మందికి సన్నిహితుడిని చేసింది. పాతిక-ముప్పై
సంవత్సరాల క్రితం ఆయన బంధువుల ఇళ్లల్లో వివాహాలు జరిగినప్పుడు, ఇప్పటిలా కాకుండా, అనేక విషయాల్లో "బరువు
బాధ్యతలు" నిర్వహించాల్సిన వ్యక్తుల అవసరం బాగా వుండేది. ఇప్పటిలా అప్పట్లో
అన్నీ కాంట్రాక్టుకు ఇచ్చే ఆనవాయితీ లేదు. చాలా పర్యాయాలు, చాలా
మందికి ఆ విషయాల్లో తోడ్పడి "ఆదుకున్న వ్యక్తి" మారంరాజు సత్యనారాయణ
రావు. వివాహాల్లో ఆడ పెళ్లి వారి పక్షాన "నిలబడి", మగ పెళ్ళి వారికి కావాల్సిన సామానులను బధ్ర పరిచిన "స్టోర్స్"
బాధ్యతను నిర్వహించేవారు. ఆచార్యుడిగా, ఉద్యమకారుడిగా, రచయితగా, సేవాపరాయుణుడిగా ఎందరికో ఎన్నిరకాలుగానో
తోడ్పాటునిచ్చిన మారంరాజు సత్యనారాయణ రావు అందరి హృదయాల్లో ఆత్మీయుడుగా ,
ఆత్మబంధువుగా నిలిచిపోతారు.
No comments:
Post a Comment