‘ప్రత్యామ్నాయ
ప్రస్థానం’ ఫలించేనా?
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (01-06-2019)
అలనాటి మనజాతీయ మహనీయ నాయకులు ఉహించుకున్న భారతదేశానికీ, ప్రస్తుతం మనం వుంటున్న దానికీ అగాధమంత
వ్యత్యాసం వుందని పలువురు భావించడంలో పొరపాటు లేదనే అనాలి. తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామానికి చెందిన పైడిమర్రి వెంకట
సుబ్బారావు అనే ప్రముఖ తెలుగు భాషా రచయిత, ప్రభుత్వోద్యోగి, స్వతంత్ర-గణతంత్ర దినోత్సవాలనాడు భారతీయులు సర్వసాధారణంగా పఠించే భారత
జాతీయ ప్రతిజ్ఞను రాసి, స్వరకల్పన చేశారు. 1962 లో విశాఖపట్నంలోజిల్లా ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో ఆయన
దీన్ని రాసి, స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం ద్వారా అప్పటి
విద్యాశాఖ మంత్రి స్వర్గీయ పీవీజీ రాజుకు అందచేసారు. అచిరకాలంలోనే అది బహుళ
ప్రచారంలోకి వచ్చింది.
భారత జాతీయ ప్రతిజ్ఞ ఇలా సాగుతుంది: “భారతీయులందరూ నా
సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి
సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని,
పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా
దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ
చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం”.
స్వాతత్ర్య
సమరంలో పాల్గొని, ప్రస్తుతం వర్తమాన కాలంలో మన
మధ్యలేని ఆ సమరయోధులను గుర్తుచేసుకుంటూ, ఒక్కసారి వాళ్ల
ఆశయాలు, ఆకాంక్షలు ఎంతమేరకు వాళ్ళు కోరుకున్న స్థాయిలో
నేరవేరాయి, అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు ఆశ్చర్యకరంగా
వుంటుందనడంలో సందేహం లేదు. మన మధ్య సోదర-సోదరీమణి అనే భావన అసలు లేశమంతైనా వుందా? మన అపార ప్రాచీన, మహత్తర వారసత్వ సంపద పట్ల మనం
గౌరవం చూపుతున్నామా? మన దేశంలో వుండాల్సిన విధంగా మనం
వుంటున్నామా? మనం అసలు దేశానికి గర్వకారణమా? దేశాన్ని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా చేయడానికి జాతీయ స్థాయిలో
ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ నాయకత్వం సరిపోతుందా? మనకసలు దేశ
ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోగల జాతీయ ఎజెండా ఏమన్నా వుందా? ప్రపంచంలోని మన తోటి దేశాలతో పోటీపడగల సత్తా మనకుందా? మన పయనం ఎటు? మన మార్గం ఏమిటి? ఇవన్నీ జవాబు దొరకని అంతులేని వింత ప్రశ్నలు.
ఏమైందిటీవల
జరిగిన సారవత్రిక ఎన్నికల్లో?
పోటా-పోటీగా ఒకవైపు మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా సారధ్యంలోవున్న ఎన్డీయే, మరోవైపు రాహుల్ గాంధీ-సోనియా, ప్రియాంకా గాంధీల
నాయకత్వంలోని కాంగ్రెస్ సారధ్యంలో వున్న యూపీఏ, ఇంకోవైపు
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా ప్రాంతీయ పార్టీలు, అరా-కొరగా
వున్న వామపక్ష పార్టీలు కదనరంగంలో దూకారు. జాతీయ అతివాదానికీ, లౌకికవాదానికీ, వారసత్వ రాజకీయ వాదానికీ, ప్రాంతీయ వాదానికీ మధ్య జరిగిన పోరాటం అది. కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అంధ్రప్రదేశ్
రాష్ట్ర (మాజీ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,
కాంగ్రెస్-బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమవంతు ప్రయత్నాలు చేశారు. చివరకు
జరిగిందేమిటి? యావద్భారతదేశ ఓటర్లు వారూ-వీరూ అనే భేదం
లేకుండా, ప్రాంతాలకు అతీతంగా, ఇజాలకు
అతీతంగా, అందరినీ కాదని మోదీకి, జాతీయ అతివాదానికి, మోదీయిజానికి
అఖండమైన మెజారిటీ ఇచ్చారు.
ఉత్తర, పశ్చిమ, తూర్పు, మధ్య భారత రాష్ట్రాలలో దాదాపు అన్నిచోట్లా మోడీ (అమిత్ షా) సారధ్యంలోని
బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీ కూటమి తప్పకుండా మెజారిటీ సీట్లు సాధిస్తుందని అందరూ భావించారు.
అది జరగలేదు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా బీజేపీది సంపూర్ణ విజయం. శాసనసభ ఎన్నికల్లో
అత్తెసరు మార్కులతో బీజేపీ అధికారంలోకొచ్చిన గుజరాత్ లో సహితం బీజేపీదే విజయం.
మహారాష్ట్ర, బీహార్ కూడా అంతే. ఒకానొక రోజుల్లో పాతిక సంవత్సరాలు పైగా వామపక్ష
అతివాద మార్క్సిస్ట్ కంచుకోటగా వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, మధ్యేవాద మమతా
బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాదని జాతీయ అతివాద బీజేపీకి పలుస్తానాలలో
గెలిపించారు వోటర్లు. ఇక మిగిలిన రాష్ట్రాలలో కూడా అదే జోరు. ఒరిస్సాను సహితం మోడీ
గాలి వదలలేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే అంత జోరు లేకపోయినా బీజేపీ
గణనీయమైన విజయాలను సాధించింది అనాలి. కర్ణాటకలోనూ ఘన విజయమే. తమిళనాడు, కేరళ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక్క సీటు రాకపోయినా,
తెలంగాణలో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలిచింది బీజేపీ.
తెలంగాణలో
బీజేపీ గెలుపు ఎలా అర్థం చేసుకోవాలి? శాసనసభ ఎన్నికలు జరిగి, తెరాస అఖండ విజయం సాధించి పట్టుమని నాలుగు నెలలు
కాలేదింకా. ఆ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలలో డిపాజిట్లు కోల్పోయిన భారతీయ జనతా
పార్టీకి జంటనగరాల నడిబొడ్డున వున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానంతో పాటు ఉత్తర
తెలంగాణ ఆయువుపట్లయిన కరీంనగర్, నిజామాబాద్ నియోజక వర్గాలతో సహా
మహారాష్ట్ర సరిహద్దులోని గిరిజన నియోజకవర్గమైన ఆదిలాబాద్ లో విజయం లభించింది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనేది ఎవరూ కాదనరు. అంతమాత్రాన ఏ ప్రాతిపదికపైన
ఓటర్లు ఫలానా పార్టీని గెలిపించడం, ఓడించడం జరుగుతుందో
ఉహకందని విషయంగా మారిపోయింది. గతంలోనూ, ఇటీవలిదాకా సిట్టింగ్
ఎంపీగానూ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి బహువిధ సేవలందించిన కరీంనగర్
తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ ఓటమిపాలు కావడానికి కారణం ఏమిటి? అదే విధంగా నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి బలమైన కారణాలున్నాయా? ఆదిలాబాద్ విషయం అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల విషయం కూడా
లోతుగా ఆలోచించాల్సిన విషయమే. మోడీ మాజిక్ అందామా అంటే, మూడు
స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎలా విశ్లేశించాలి? పోనీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అనైతిక అవగాహన వుందందామా? కాదనలేం.
మల్కాజిగిరి లాంటి కొన్ని చోట్ల నోటా పుణ్యం కూడా వుంటే,
భువనగిరి లాంటి కొన్ని స్థానాలలో ట్రక్ గుర్తు తెరాస ఓటమికి కారణమై
వుండవచ్చు.
శాసనసభకు
లోకం సభ కంటే నాలుగు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
మొదటి విడత 51 నెలల పరిపాలన ఫలాలను అందుకున్న ఓటర్లు బ్రహ్మ రథం పట్టారు. సుమారు
90 స్థానాలలో విజయం అందించారు. మరి నాలుగు నెలల్లోనే ఆయన పాలనను తప్పుపట్టాల్సిన
ఆగత్యం ఓటర్లకు ఎందుకు వచ్చింది? అంటే, ఏడు స్థానాలలో ఆయన పార్టీ ఓటమికి, ఆయన చేపట్టి అమలుపరచిన అనేకానేక
సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధం లేనేలేదనాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో
అమలు చేయనన్ని అభివృద్ధి-సంక్షేమ పథకాలు తెలంగాణాలో అమలయ్యాయే! భారతావని అంతా
తెలంగాణ మోడల్ అని చెప్పుకునే స్థితికి రాష్ట్రం ఎదిగిందే! కోట్లాదిమందికి ఒకటి
కంటే ఎక్కువ సంక్షేమ పథకాల ఫలితాలు లభించాయే! ఇవన్నీ వ్యర్థమేనా? ప్రజల ఆలోచనల్లోకి వారి అభివృద్ధి, సంక్షేమం కంటే
ప్రభావితం చేసే వేరే అంశాలు కూడా వుంటాయా? బహుశా లోతుగా
అధ్యయనం చేస్తే ఇది లౌకిక వాదానికి, జాతీయ అతివాద మతమౌఢ్య వాదానికి జరిగిన పోరాటం అనాలి. ఆ పోరాటంలో జాతీయ అతివాద మతమౌఢ్య వాదం గెలిచింది. ఇది భవిష్యత్ లో దేనికి దారితీస్తుందో ఉహించడం
కష్టం ఇప్పుడప్పుడే.
స్వాతంత్ర్యం
వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఇంకా ఇలానే వుంటే నష్టపోతాం. దేశానికి కావాలి
ఉత్తేజపూరితమైన నూతన నాయకత్వం...నూతన మార్గదర్శకత్వం. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం
తర్వాత కూడా కనీస అవసరాలకు నోచుకోలేని బీద-సాద-పేద వారు కోట్లల్లో వున్నారు.
పేదరికం ఇంకా తాండవిస్తోంది. చాలామంది నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మనుగడ సాగిస్తున్నారు. మనతో
పాటే స్వాతంత్ర్యం తెచ్చుకున్న అనేక దేశాలు, ఆదిలో బీదరికంలో
వున్నా, రోజులు గడుస్తున్నాకొద్దీ బ్రహ్మాండమైన వృద్ధి, అభివృద్ధి సాధించి, ఆర్థికంగా పుంజుకొని, మనకంటే గణనీయంగా పురోగతి సాధించాయి. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
ఇతర
దేశాలతో పోల్చి చూస్తే, అనేక రంగాల్లో, మనదేశం ఎలాంటి నిస్సార ప్రగతిలో వుందో తెలుసుకోవడానికి చాలా
ఉదాహరణలున్నాయి. మన దేశానికి కావాల్సింది, మన అవసరాలకు
అనుగుణమైన వాతావరణం....దాన్ని సరిగ్గా వాడుకునే నాయకత్వం. మన ఆర్ధిక వ్యవస్థ
పరపతినీ, మన సంపదనూ, మన అంతర్గత
శక్తి-సామర్థ్యాలనూ, మన అపార వనరుల సంపదనూ సక్రమంగా
ఉపయోగించుకొలేమా? అలా జరక్కుండా ఎవరు నిరోదిస్తున్నారు? ఇదేమీ అత్యంత క్లిష్టమైన, అసాధ్యమైన కార్యం
కాదు....కావాల్సిందల్లా మనసు పెట్టి మార్గం ఆలోచించడమే!!! గత 71 సంవత్సరాల
మాదిరిగా, మూసపద్ధతిలో ఆలోచనలు చేయకుండా, వినూత్నంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే
భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం అసాధ్యం కానేకాదు. అందరూ అంటుండే “ఉత్తమ
విధానాలు” అనే మాటకు స్వస్థిపలికి, “భవిష్యత్ విధానాలు” అనే
నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలి. అనాదిగా అవలంభిస్తూ వచ్చిన ఆచరణలకు సుదూరంగా
కదిలి, భారత దేశాన్ని పునర్నిర్మించడం,
పునర్వికాసం పొందేట్లు చేయడం, తద్వారా భారత దేశాన్ని ఒక
అభివృద్ధి కేంద్రంగా మలచి ముందుకు సాగడం జరగాలి. అభివృద్ధి కుంటుబడడానికి ఇంతకాలం
దారితీస్తున్న ఆలోచనల బీదరికానికి తక్షణం వీడ్కోలు పలికి,
ఘనమైన, ఉన్నతమైన, నూతన ఆలోచనా
విధానానికి స్వాగతం పలకాలి.
ఇంతకూ
ఇదంతా ఇలా జరగడానికి, ఈ దేశం ఇతర దేశాలతో పోల్చి
చూస్తే వెనుక పడడానికి ఎవరు బాధ్యులు? సహజంగానే ఈ ప్రశ్న
ఉత్పన్నం కాకమానదు. జవాబు కూడా దొరికి తీరాలి. గత 71 సంవత్సరాలుగా అధికారంలో వున్న
కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని నెహ్రూ-గాంధీ నాయకత్వం,
జనతా-నేషనల్ ఫ్రంట్ సారధ్యంలోని మొరార్జీ-వీపీ సింగ్ నాయకత్వం, బీజేపీ-ఎన్డీయే సారధ్యంలోని వాజపాయి-మోదీ నాయకత్వం,
మధ్య-మధ్యలో కాంగ్రెస్ కు చెందిన పీవీ-మన్మోహన్ నాయకత్వం,
తదితరులంతా బాధ్యులే. కేంద్రంలో ఎవరు పాలన సాగించినా,
అధికారంలో ఎక్కువ కాలం-దాదాపు పూర్తి కాలం వున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా, బీజేపీ ప్రభుత్వం. అయినా, మళ్లీ ప్రజలు పాత మూస పద్ధతిలోనే తీర్పిచ్చారు.
ప్రప్రధమ
ప్రధానమంత్రి, నవభారత నిర్మాతగా పేరొందిన
పండిట్ జవహర్లాల్ నెహ్రూ విదానాలైన వ్యవసాయ సంస్కరణలు,
పారిశ్రామికీకరణ...తద్వారా విదేశీ వస్తువుల స్థానంలో స్వదేశీ వస్తువుల ఉపయోగం, మిశ్రమ ఆర్ధిక విధానం భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలపడడానికి, అభివృద్ధికి, ఆధునీకరణ చెందడానికి ఉపయోగపడ్డాయా? లేదా? ఆలోచించాల్సిందే. ఇందిరాగాంధీ, దేశాన్ని ప్రగతిపథాన తీసుకెళ్లగలిగిందా? లేదా? అనేది కూడా అధ్యయనం చేయాలి. జాతీయం చేయబడ్డ బ్యాంకులు ఏ మేరకు సామాన్య
ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడ్డాయో అనేది, దేశం ఆర్థికంగా
పురోగతి సాధించడానికి ఆ చర్య ఏమన్నా తోడ్పడిందా అనేది లోతుగా ఆలోచించాల్సిన అంశం.
రాజీవ్ గాంధీ హయాంలో చోటుచేసుకుందని అనుకుంటున్న సాంకేతిక విప్లవం, పురోగతి, ఆయన వుండగానే స్థిరీకరణకు నోచుకోలేదు.
బోఫార్స్ లాంటి కుంభకోణాలలో ఇరుక్కుని అందులోంచి బయటపడే ప్రయత్నంతోనే ఆయన కాలం
అంతా గడిచింది. ఆయన హయాంలో అంతా కుంటుబడిన అభివృద్దే! ఒక విధంగా విశ్లేషిస్తే, బహుశా, దేశంలో ఏదైనా అభివృద్ధి జరిగితే, అది పీవీ కాలంలోనే అనాలి.
మన్మోహన్
సింగ్ గ్రామీణ వైద్య మిషన్, ఆధార్ ప్రయోగాలు, సమాచార హక్కు చట్టం ఒక విధంగా ప్రయోజనం చేకూరేవే అయినా, వాటి ద్వారా ప్రత్యక్షంగా దేశాభివృద్ధి జరిగే అవకాశాలు అంతగాలేవనే అనాలి.
మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానిగా అయిదేళ్ళ పాటు అధికారంలో వున్న బీజేపీ నాయకుడు
అటల్ బిహారీ వాజపాయి బహుశా పోఖ్రాం ప్రయోగం తప్ప దేశాన్ని ఉద్ధరించిన పనులేం
చేయలేదు. సర్వ శిక్షా అభియాన్, జాతీయ రహదారుల అభివృద్ధి
ప్రాజెక్ట్ లాంటి చెప్పుకోదగ్గ
కార్యక్రమాలున్నా, ఆయన ఇండియా షైనింగ్ ప్రచారం ఒక
పెద్ద విఫల ప్రయోగం అని చెప్పాలి. ఇక మోదీ సంగతి చెప్పక్కరలేదు. ఏ వర్గానికీ, ఏ రాష్ట్రానికీ, ఆ మాటకొస్తే పదికాలాల పాటు పదిమంది
చెప్పుకునే ఏ అంశానికీ ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ మోడీకి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చి పెట్టాయి. దేశ
ఆర్థికాభివృద్ధికి అవెలా ఉపయోగపడతాయో ఆయనకూ తెలియదు...ఇతరులకూ తెలియదు. ఇక ఇతర
ప్రధానుల రోజుల, నెలల పాలనలో చెప్పుకోదగ్గ గోప్పలేమీ
లేవనాలి. ఇంత నేపధ్యంలోనూ మళ్లీ రెండు జాతీయ పార్టీలలో ఒకదానికి ప్రజలు
మూసపద్ధతిలోనే పట్టం కట్టారు.
వామపక్ష, ఫెడరల్ వాద, లౌకిక
పార్టీల ఐక్యత ప్రస్తుతం దేశాన్ని శాసిస్తున్న జాతీయ అతివాద రాజకీయ వ్యవస్థకు
ప్రత్యామ్నాయం అయినట్లయితే బాగుండేది. మరి అది జరగలేదే?
కింకర్తవ్యం?
మూడో ఫ్రంట్,మూడో ఫ్రంట్ అంటున్నారు, ఇదెలా సాధ్యమో మాత్రం చెప్పలేరు. స్థానిక పార్టీలు బలంగావున్న రాష్ట్రాలు బంగాలు,ఉ.ప్రదేశ్,బీహార్,మహారాష్ట్ర,ఆం.ప్ర,తెలంగాణా,తమిల్నాడు. ఇందులో కొన్ని రాష్ట్రాలలో బి.జె.పి, కాంగ్రెస్ కూడా ఉన్నవి. వీటిలోని ఎమ్.పి ల నంబరు ౪౨+౪౦+౮౦+౪౮+౨౫+౧౭=౨౧౨ ఇది లోక్ సభలో సగానికి తక్కువే. ఈ స్థానాలని లోకల్ పార్టీలు ఆలిండియా పార్టీలు పంచుకుంటాయి. మరి స్థానిక పార్టీలకెన్ని స్థానాలొస్తాయి? ఈ స్థానిక పార్టీలన్నిటికి ఒకదానికొకటంటే పడదు. రాష్ట్రంలో కుస్తీ కేంద్రంలో దోస్తీ అంటే జనాలెలా చేస్తారో మొన్న ఉ.ప్ర. తెలిసినా ఇంకా దానినే పట్టుకు వేలాడటం అర్ధం కానిదే.
ReplyDeleteతెలంగాణాలో లోకల్ పార్టి ఒక్కటే బలంగా ఉన్నదని మిగిలిన పార్టీలన్నీ మట్టిగొట్టుకుపోయాయనుకుంటే పొరబాటే! మొన్న ఎన్నికలలో బి.జె.పి కాంగ్రెస్ లు ఎలా పుమ్జుకున్నాయి? మరో లోకల్ పార్టీ మీ దగ్గరా పుట్టచ్చు, అప్పుడు మీగతేంటి?
లోక్ సభలో సగం స్థానాలు కూడా పోటీ చేయలేనివాళ్ళు ప్రభుత్వం ఎలా స్థాపిస్తారు? ప్రజల్ని గందరగోళపరచడమే ఇది.
మీకు నచ్చనిదంతా జాతీయ అతివాదమా?