విలీనాలు అనర్హతకు అతీతం
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక
(05-05-2019)
తెలంగాణ
అసెంబ్లీలోని భారత జాతీయ కాంగ్రెస్ గుర్తుపై ఎన్నికయిన శాసన సభ్యుల్లో మూడింట
రెండు వంతుల మంది ప్రత్యేక బృందంగా ఏర్పడాలని నిర్ణయించుకుంటే, ఆ మేరకు తమకు ప్రత్యేక బృందంగా గుర్తింపు ఇచ్చి టిఆర్‌ఎస్‌లో విలీనానికి
అనుమతించాలని వారు స్పీకర్‌ను కోరిన పక్షంలో వారి అభ్యర్థనను మన్నించడం తప్ప
స్పీకర్‌కు ప్రత్యామ్నాయం ఉండదు. అటువంటి చర్య ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలోకి రాదు
కూడా. అయితే తెలంగాణ హైకోర్టు ఫిరాయింపులకు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ
అంశం చర్చనీయమవుతున్నది.
అధికారులు
అక్రమాలకు పాల్పడి ఉంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి)ని టిఆర్‌ఎస్
లెజిస్లేచర్ పార్టీ( టిఆర్‌ఎస్‌ఎల్‌పి)లో విలీనం చేయడాన్ని చెల్లనేరనిదిగా
ప్రకటించే అధికారం తమకు ఉందని హైకోర్టు ధర్మాసనం ఇటీవల పేర్కొంది. అసెంబ్లీ
స్పీకర్ సిఎల్‌పి విలీనానికి సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా వెలువరించడానికి ముందు
సభ్యులుగా వారిని అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్
ఎంఎల్‌ఎలు భట్టి విక్రమార్క, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు
దాఖలు చేసిన పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు
ధర్మాసనం స్పష్టం చేసింది. జూన్ 11న ఈ పిటిషన్లపై విచారణ
జరపాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలో చీలికలు, సభలో విలీనాలు,
ఫిరాయింపుల నిరోధక చట్టంఇవన్నీ ఎప్పుడూ ఆసక్తికర
అధ్యయనాంశాలే. స్పీకర్ చట్టసభకు, సభ గౌరవ మర్యాదలకు
స్వేచ్ఛకు ప్రతినిధి. దేశ లేదా సంబంధిత రాష్ట్రాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు
సభాధ్యక్ష వ్యవస్థ ప్రతీకగా నిలుస్తుంది. ఈ వవస్థ నిర్ణయాన్ని గౌరవించి
కట్టుబడాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం
తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు సబబైనవా, కాదా?
అనేది ప్రశ్న. రాజకీయ పునరేకీకరణ అవసరాన్ని గుర్తించిన
కారణంగా ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలు గణనీయ సంఖ్యలో ఒకరి
తర్వాత ఒకరుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. ఈ పరిణామం కొందరికి సబబుగా
కనిపించవచ్చు. కానీ మరి కొందరికి మాత్రం ఇది అసమంజసం అనిపించవచ్చు. నియోజక వర్గాల
అభివృద్ధికి పాటుపడతామని తాము ప్రజలకు మాట ఇచ్చామని, దీనిని నిలబెట్టుకోవడానికే తాము పార్టీ మారామని పార్టీ ఫిరాయించిన సందర్భంగా
కొంతమంది ఎంఎల్‌ఎలు స్వయంగా చెప్పడం జరిగింది. అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరితేనే
అది జరుగుతుందని వారు భావించడం సరయినదే కావచ్చు. అయితే అదే సమయంలో ప్రజాస్వామిక
వ్యవస్థలో అత్యవసరమైన ప్రతిపక్ష బాధ్యతలనుంచి ఈ ఎంఎల్‌ఎలు వైదొలగుతున్నారనే అంశం
కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. నియమరహిత ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయడమే
ఫిరాయింపుల నిరోధక చట్ట మౌలిక ఉద్దేశం.
అదే సమయంలో
విలీనాలు,
పొత్తుల ద్వారా రాజకీయ శక్తుల పునరేకీకరణ అంశం కూడా ఇక్కడ
ప్రస్తావనకు వస్తోంది. ఫిరాయింపులు అన్నీ కూడా నియమాలను గట్టున పెట్టి జరిగేవే అని
చెప్పడం కూడా సరి కాదు. వాస్తవానికి దేశంలో పలువురు రాజకీయ దిగ్గజాలు, పార్టీలలో పేరు మోసిన వారు ఎప్పుడో ఒకప్పుడు పార్టీ అధినాయకత్వంతో నిఖార్సయిన
విభేదాల కారణంగా తమ రాజకీయ విధేయతను మార్చుకున్న వారే. అదేపని ఇప్పుడు చేయడంలో
తప్పేముందనే ప్రశ్న వస్తోంది. అయితే తమది జాతీయ పార్టీ అని, ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనమవుతుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న
వాదనలో పస లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో రాజకీయ పార్టీ స్వరూప ప్రస్తావనలో
స్పష్టమైన విభజన రేఖలను నిర్దేశించారు.
చట్టసభలకు వెలుపల
చలామణిలో ఉండేది సంస్థాగత పార్టీ అయితే చట్టసభలలో విధులు నిర్వర్తించేది
లెజిస్లేచర్ పార్టీ. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమ పిటిషన్‌లో పేర్కొన్న అనర్హత వేటు
విషయానికి వస్తే ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల్లో స్పష్టత ఉంది. ఒక రాజకీయ
పార్టీకి చెందిన సభ్యుడు కానీ, సభ్యురాలు కానీ పార్టీ
జారీ చేసే ఆదేశాలకు విరుద్ధంగా సభలో ఓటు వేసినప్పుడు మాత్రమే అటువంటి సభ్యులు
అనర్హత వేటుకు గురి కావలసి ఉంటుంది. ఇక్కడ ఇటువంటి పరిణామం ఇప్నటివరకు జరగలేదు.
పిటిషన్‌లో అనర్హత వేటుకు ప్రస్తావించిన సభ్యుల్లో ఎవరు కూడా టిఆర్‌ఎస్‌లో
చేరాలన్న తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేశారే తప్ప ఆ పార్టీలోకి అధికారికంగా, అందులోను లిఖితపూర్వకంగా చేరలేదు. ఇది ఫిరాయింపుల నిబంధనల పరిధిలోకి వస్తుందా
అనేది కీలక ప్రశ్న.
ఇక సభ్యుడిపై
ఫిరాయింపుల కోణంలో అనర్హత వేటు కొన్ని సందర్భాల్లో వర్తించదు. తమ మునుపటి పార్టీలో
చీలిక వచ్చిందని,
తాను ఇతర సభ్యులు కొందరు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడ్డామని, తమ గ్రూపులో సదరు పార్టీకి చెందిన సభ్యులు మూడింట ఒక వంతుకన్నా తక్కువ సంఖ్యలో
లేరని పేర్కొంటూ పార్టీ మారితే అది అనర్హత పరిధిలోకి రాదు. దీని ప్రకారం కాంగ్రెస్
పార్టీ టికెట్‌పై గెలిచిన మూడింట ఒక వంతు మంది( తెలంగాణ విషయానికి వస్తే ఏడుగురు
ఎంఎల్‌ఎలు) తమది ప్రత్యేక బృందంగా ప్రకటించుకుంటే పార్టీ నిరోధక చట్ట పరిధిలో వారి
సభ్యత్వంపై వేటు వేయడానికి వీలు లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఎన్నికయిన
వారిలో మూడింట రెండు వంతుల మంది(అంటే తెలంగాణ విషయంలో 19 మందిలో 13 మంది) వేరే రాజకీయ పార్టీలో విలీనానికి అంగీకరిస్తే వారిపై అనర్హత ప్రభావం
పడదు. సభ్యులు ఈ అంశాన్ని పాటించినట్లయితే అంతా పద్ధతి ప్రకారమే జరిగినట్లవుతుంది.
ఇందులో చట్ట వ్యతిరేకత ఏమీ ఉండదు.
ఈ రెండు విషయాల్లో
దేనిలో కూడా స్పీకర్ తనకు తానుగా పార్టీలో చీలిక విషయంలో ఆరా తీయాల్సిన అవసరం
లేదు. అయితే పార్టీని వదిలిపెట్టిన సభ్యుడు లేదా సభ్యుల గురించి వారిని అనర్హులుగా
ప్రకటించాలని కోరుతూ సాధికారిక అభ్యర్థన అందితే తప్ప స్పీకర్‌కు దీనిపై
దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఉండదు. అలాంటి సందర్భంలో ఒక పార్టీ గుర్తుపై
ఎన్నికయిన సభ్యుడికి చెందిన లెజిస్లేచర్ పార్టీలో చీలిక వచ్చిందా లేదా అనే
విషయాన్నిస్పీకర్ నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఇది ఈ స్థానంలో ఉన్న వారి బాధ్యత. ఈ
అంశంపై లోక్‌సభలో చర్చించినప్పుడు సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ‘సభ్యులు
పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లయితే, అలాంటి వారు పార్టీకి
చెందిన చట్టసభ సభ్యుల్లో మూడింట ఒక వంతుకు మించి ఉన్నట్లయితే అది జాతీయ స్థాయి
చీలికా లేక రాష్ట్ర స్థాయి చీలికా అనేది అప్రస్తుతం అవుతుంది. చీలికదార్లకు ఢోకా
ఉండదు. వారు అనర్హతకు గురి కావడం జరగదు’ అని సభ తేల్చి చెప్పింది.
పార్లమెంటరీ
ప్రజాస్వామిక వ్యవస్థకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నిజమైన పునాది. ఒక కూటమిని లేదా
పొత్తును ఏర్పాటు చేసుకోవడం సంబంధిత హక్కుగా ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక
హక్కులుగా ఇవి ఉన్నాయి. ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిధిలోంచే రాజకీయ పార్టీలు
అవతరిస్తాయి. వీటికి అనుగుణంగానే ఉమ్మడి లక్షాలను ఖరారుచేసుకుని సమిష్టిగా సంబంధిత
ఫలాలను అనుభవిస్తూ ఉంటాయి. ఇక ఏదేని రాజకీయ పార్టీ సిద్ధాంతాలతో లేదా సంబంధిత
పార్టీ నేతలతో ఏదో ఒక సందర్భంలో తలెత్తే వైరుద్ధాలు లేదా పొడసూపే విభేదాలు, సదరు నేతలతో వ్యతిరేకించడం దరిమిలా తలెత్తే అసమ్మతి వంటి పరిణామాలతో సభ్యులు
పార్టీని వీడడం లేదా వేరే పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ విధంగా చేసే అధికారం, స్వేచ్ఛ సదరు సభ్యుడికి లేదా సభ్యురాలికి పూర్తిగా ఉంటుంది. ఫిరాయింపుల నిరోధక
చట్ట పరిధిలోని నిబంధనలు పార్టీల్లో చీలికలు, వేరే పార్టీలలో విలీన
సందర్భాల్లో వర్తించవు.
అయితే ఈ చీలికలు, లేదా విలీనాలకు సంబంధించి మూడింట ఒక వంతుకన్నా తక్కువ కాకుండా సభ్యులు తమ సొంతపార్టీనుంచి
విడిపోయినట్లు తెలియజేసుకోవలసి ఉంటుంది. లేదా పార్టీ విప్ జారీకి వ్యతిరేకంగా
వ్యవహరించవచ్చు. ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చు లేదా విప్‌నకు వ్యతిరేకంగా ఓటు
వేయవచ్చు. ఇక పార్టీ సంఖ్యాబలంలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు కలిసి తాము
పార్టీ విప్‌ను వ్యతిరేకిస్తున్నట్లు స్పీకర్‌కు తెలియజేసుకున్నట్లయితే వారిలో
ఎవరిపైనా అనర్హత వేటు పడకుండా ఉంటుంది.
ఈ సందర్భంగా
హర్యానా శాసన సభ స్పీకర్ చర్యలను గుర్తు చేసుకోవలసి ఉంటుంది. 1992లో బిజెపికి చెందిన ఒక ఎంఎల్‌ఎ అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆయనను అనర్హుడిగా ప్రకటించాలనే అభ్యర్థనను విధాన సభ స్పీకర్ తోసిపుచ్చారు. దీనికి
ఆయన చూపిన కారణం ఆ శాసన సభ్యుడు బిజెపినుంచి విడిపోయి బిజెపి(కె) అనే వేరే
పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక పార్టీ ఏర్పాటు దశలో ఆ ఎంఎల్‌ఎ
అభ్యర్థనను గుర్తించినట్ల్లు పేర్కొన్న స్పీకర్ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో
చేరడం ఫిరాయింపుల పరిధిలోకి రాబోదని, అనర్హత వేటు పరిధినుంచి
తప్పించుకున్నట్లేనని స్పష్టం చేశారు.
ఉత్తర ప్రదేశ్
అసెంబ్లీలో కూడా ఇటువంటి పరిణామమే జరిగింది. లెజిస్లేచర్ పార్టీ సభ్యుల బలంలో
మూడింట ఒక వంతు మందితో ఒక సభ్యుడు పార్టీని వీడినా లేదా ఆ సభ్యుడు లేదా సభ్యురాలు
అసెంబ్లీలోని తమ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మందితో వేరే పార్టీలో
విలీనమైనా సదరు సభ్యుడు లేదా సభ్యులపై అనర్హత వేటు పడేందుకు అవకాశం ఉండదు. అటువంటి
లెజిస్లేటర్లను సభ్యత్వ అనర్హతకు గురి చేయడం లేదా వారి సభ్యత్వం రద్దుకు దిగడం
వంటి శిక్షలకు అవకాశం ఉండదు. చట్ట సభల పరిధిలో ఇంతకు ముందు జరిగిన పరిణామాలను, అనర్హత వేటు పూర్వాపరాలను తెలంగాణ రాష్ట్ర వర్తమాన రాజకీయాలతో బేరీజు
వేసుకుంటే ప్రస్తుత చర్చలోని వాదనల బలాబలాలు తేలుతాయి.
No comments:
Post a Comment