నాటి
నుండి నేటివరకు కేంద్ర మంత్రిమండలి కూర్పు
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(31-05-2019)
ప్రధానమంత్రిగా మరోమారు నరేంద్ర మోడీ పదవీ ప్రమాణం చేశారు. ఆయనతో సహా మొత్తం
58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పాతిమంది కాబినెట్ మంత్రులుగా, మిగతావారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఆరుగురు
మహిళలున్నారు. మంత్రివర్గంలో సహాయ మంత్రిగా తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ ఎంపీ
జి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాలతో పరోక్ష సంబంధం వున్న నిర్మలా సీతారామన్ కూడా వున్నారు.
కాకపోతే సంఖ్యాపరంగా చూస్తే తెలుగు రాష్ట్రాలకు అతికొద్దిమంది కంటే కొద్దిమందే-ఒకే
ఒక్కరు వున్నారు. ఇది తెలుగు రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. ఆదినుంచీ ఇలా జరుగుతూనే
వుంది. దానికి కారణాలు అనేకం వుండవచ్చు. 14 మంది ప్రధాన మంత్రులు తెలుగు
రాష్ట్రాలపట్ల ఒక విధంగా చూస్తే ఒకేరకంగా వివక్షతా ధోరణితో వ్యవహరించారనాలి. తెలంగాణ
రాష్ట్రానికి చెందిన ఒకరు ప్రధాన మంత్రిగా పని చేసి వుండవచ్చు. తెలుగువారిలో ఇద్దరు
రాష్ట్రపతి హోదాకు, ముగ్గురు లోక్ సభ స్పీకర్ పదవికి
చేరుకుని వుండవచ్చు. అయినా ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు
వారికి అన్యాయం జరుగుతూనే వుంది.
కేంద్ర
మంత్రివర్గం ఏర్పాటులో కాని, విస్తరణలో కాని, పునర్ వ్యవస్తీకరణలో కాని, రాజ్యాంగపరమైన నిబంధనలు,
పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతులు, పటిష్ఠమైన
సాంప్రదాయాలు ఎన్ని వున్నప్పటికీ, అవన్నీ రాజకీయ అనుకూలతలు-వెసులుబాటుల
ముందు దిగదుడుపే. వాటి విస్తృత పరిధులకు లోబడి పాటించాల్సిందే. కేంద్రంలో ఒకనాడు అధికారం
చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సంఖ్యాక పార్లమెంటు సభ్యులను
గెలిపించడంలోను, ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన
రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలోను అగ్రభాగాన వుండే అలనాటి ఉమ్మడి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి
దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుండేది. కేంద్ర స్థాయిలో పాలనలో
సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను
పొందడంలో కూడా విఫలమవుతూనే వుండేది. అది ఒకనాటి సంగతి. తెలుగు రాష్ట్రాలు
విడిపోయిన తరువాత కూడా మంత్రివర్గంలో అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ సరైన ప్రాతినిధ్యం దొరకలేదనే అనాలి.
తెలంగాణకు చెందిన ఒకే ఒక్కరికి...అదీ అతికొద్దికాలం మాత్రమే....కేంద్ర మంత్రిగా
పనిచేసే అవకాసం వచ్చింది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, ఇంతవరకూ,
కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన సుమారు 350
మందికి పైగా వున్న కాబినెట్ స్థాయి మంత్రులలో, తెలుగు రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య పట్టుమని పాతిక దాటలేదు. అంటే 6-7% మాత్రమే. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి 42
లోక్ సభ స్థానాలు దక్కినప్పుడైనా, ఎన్డీయే
ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగు దేశం-బిజెపి పార్టీలకు అత్యధిక స్థానాలు దక్కినప్పుడైనా,
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం నామ మాత్రమే. అదే
విధంగా ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా సహాయ మంత్రుల
పదవులు పొందగా, అందులో తెలుగువారి కోటా 30 కు మించలేదు....అంటే
కేవలం 5-6% మాత్రమే. 71 సంవత్సరాల
స్వతంత్ర భారత వర్తమాన రాజకీయ చరిత్రలో, కనీసం 50 మంది తెలుగు నాయకులు (దొరికినవారిలో కూడా అధిక శాతం అగ్ర కులాలకు చెందిన
వారే!) కూడా, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగి కేంద్ర
మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేక పోయారంటే, సగటున ఏడాదికి ఒక్కరైనా లేరంటే,
ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదనే అనాలి.
కాకపోతే, ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా,
వాటిని అధిగమించి, ఇదే రాష్ట్రానికి చెందిన
పీవీ నరసింహారావు, ప్రప్రధమ తెలుగువాడిగా, తెలంగాణవాడిగా ప్రధాన మంత్రి పదవిని పొందగలిగారు. మొట్టమొదటి సారి,
నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వాడిగా, అయిదేళ్ల
పూర్తి కాలం అధికారంలో వుండగలిగి, దేశ దేశాల మన్ననలను పొందిన
ఆర్థిక సంస్కరణలను అమలు పరచగలిగాడు ఆయన. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది
నుంచీ ఇలా అన్యాయం చేయడంలో, కాంగ్రెస్ సారధ్యంలోని
ప్రభుత్వమైనా, బిజెపి సారధ్యంలోని ప్రభుత్వమైనా ఒకే పద్ధతిని
అవలంబించాయి.
రాజ్యాంగం
ప్రకారం భారత ప్రధాన మంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రివర్గ
సభ్యులందరినీ, నియమించే అధికారం రాష్ట్రపతి కుంది. కాకపోతే,
ప్రధాన మంత్రిగా నియమితులు కాబోయే వ్యక్తికి, పార్లమెంటు
దిగువ సభకు ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ సభ్యుల మద్దతు తప్పనిసరిగా వుండాలి. అలా
వున్న వ్యక్తిని, వుందని రాష్ట్రపతి భావించిన వ్యక్తినే ప్రభుత్వం ఏర్పాటు చేయమని
రాష్ట్రపతి కోరుతారు. ఇది మనం అనుసరిస్తున్న బ్రిటీష్ పార్లమెంటరీ సాంప్రదాయం.
పాలనా సౌలభ్యం కొరకు మంత్రులకు పోర్టుఫోలియోలు ప్రధాన మంత్రి సూచన మేరకు
రాష్ట్రపతి కేటాయించినప్పటికీ, మంత్రులందరూ, వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రధానికి, ప్రధాని ద్వారా
రాష్ట్రపతికి, పార్లమెంటుకు బాధ్యులవుతారు. దీన్నే "మంత్రివర్గ సమిష్టి
బాధ్యత" అంటాం. ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే అధికారం, పోర్టుఫోలియోలను కేటాయించే అధికారం, పూర్తిగా
ప్రధానిదేనని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ, వాస్తవానికి,
ఆ అధికారం కొన్ని హద్దులకు లోబడి వుంటుందని సాంప్రదాయాలు
చెపుతున్నాయి. ప్రధాని, అధికార పార్టీ అధినేత వేర్వేరు
వ్యక్తులైనప్పుడు, ఆ హద్దు స్పష్టంగా కనిపిస్తుంది. అదే
విధంగా సంకీర్ణ ప్రభుత్వాలకు సారధ్యం వహించిన ప్రధాని కూడా ఇష్టానుసారంగా
మంత్రివర్గం ఏర్పాటు కాని, విస్తరణ కాని, పునర్ వ్యవస్తీకరణ కాని చేయలేరు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సర్వ
స్వతంత్రుడు (కాకపోతే....మోడీని, బీజేపీని శాసించేది, ఆదేశించేది ఆరెస్సెస్ కదా?)
కాబట్టి ఆయన నిర్ణయమే అందరికీ శిరోధార్యం.
కేంద్ర మంత్రి మండలిలో జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి ఇంతవరకు,
350 మందికి పైగా కాబినెట్ మంత్రి హోదా,
సుమారు 70 మంది వరకు స్వతంత్ర ప్రతిపత్తి
కలిగిన సహాయ మంత్రుల హోదా, మరో 500 మంది
దాకా సహాయ మంత్రుల హోదా, 70 మందికి డిప్యూటీ మంత్రుల హోదా
లభించింది. మొదట్లో మంత్రి మండలి మూడంచెల పద్దతిలో, కాబినెట్-సహాయ-డిప్యూటీ
మంత్రులతో, ఏర్పాటు చేసే ఆనవాయితీ వుండేది. అయితే
రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలంటూ ఏదీ లేదు. కేవలం బ్రిటీష్ సాంప్రదాయాన్ని అనుకరించే
ఇది కూడా జరిగింది. పాలనా సౌలభ్యం కొరకు కూడా ఆ ఏర్పాటు పనికొచ్చింది. వాస్తవానికి,
మంత్రులందరూ మంత్రి మండలి సభ్యులే. జీత భత్యాల విషయంలోనే కొంత
తేడాలున్నాయి. కాకపోతే, ప్రధాన మంత్రి సమాన స్థాయి
మంత్రులందరిలో ప్రథముడుగా పేర్కొంటారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నప్పుడు
డిప్యూటీ మంత్రుల స్థాయికి స్వస్తి పలికారు. రాజీవ్ గాంధి మళ్లీ
పునరుద్ధరించినప్పటికీ, అనతి కాలంలోనే, వారందరినీ సహాయ మంత్రులుగా పదోన్నతి కలిగించారు. ఇక ఆ తర్వాత అందరూ అదే
పద్ధతిని అవలంబిస్తున్నారు. కాకపోతే, సహాయ మంత్రులలో
కొందరికి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆనవాయితీ మొదలైంది.
సర్దార్ వల్లభాయి పటేల్, అంబేడ్కర్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్,
సీడి దేశ్ ముఖ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ,
రాజగోపాలాచారి, బాబు జగ్జీవన్ రాం, కృష్ణ మీనన్, బహుగుణ, ఎంసీ
చాగ్లా, కే ఎం మున్షి, అద్వాని,
వీ వీ గిరి, వైబి చవాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, టీ టీ కృష్ణమాచారి, గోబింద్ వల్లభ్ పంత్, మోహన్ కుమార మంగళం, ఉమా శంకర్ దీక్షిత్, శంకర్ దయాళ్ శర్మ, జార్జ్ ఫెర్నాండెజ్, సుబ్రమణ్యం స్వామి, రామ్ జీత్మలాని, కరణ్ సింగ్, జస్టిస్
హెచ్ ఆర్ ఖన్నా, ఆర్ వెంకటరామన్, గ్యానీ
జైల్ సింగ్, అశోక మెహతా, ప్రణబ్
ముఖర్జీ, అరుణ జైట్లీ, రాజనాథ్ సింగ్,
పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్,
సురేష్ ప్రభు లాంటి ప్రముఖులు కాబినెట్ మంత్రులుగా పనిచేశారు. కేఆర్ నారాయణన్,
సంతానం, షీలా దీక్షిత్, ఓం
మెహతా, ఎం జీకే మీనన్, నందినీ సత్పతి
లాంటి ప్రముఖులకు మంత్రి మండలిలో స్థానం లభించినా, సహాయ
మంత్రులుగానే పనిచేయాల్సి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొత్త రఘురామయ్య, జలగం వెంగళ రావు, బెజవాడ గోపాల రెడ్డి,
కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర
రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం
సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, శివశంకర్,
వెంకట స్వామి, కే చంద్ర శేఖర రావు, ఉపేంద్ర, వెంకయ్య నాయుడు, బండారు
దత్తాత్రేయ, ఎర్రం నాయుడు, జైపాల్
రెడ్డిలకు కాబినెట్ హాదా లభించింది. టీ అంజయ్య, రేణుకా చౌదరి,
మల్లికార్జున్, బంగారు లక్ష్మణ్, ఎస్ బీ పట్టాభి రామారావు, రంగయ్య నాయుడు, జగన్నాథరావు, కె ఎల్ రావు, విద్యాసాగర్
రావు, అంకినీడు ప్రసాద రావు, ఎస్
బీపిబికే సత్యనారాయణ రావు, కేవి రఘునాథ రెడ్డి, వెంకట సుబ్బయ్య, కృష్ణం రాజు, వేణుగోపాలాచారి,
పనబాక లక్ష్మి, పళ్లంరాజు, సాయిప్రతాప్, పురంధరేశ్వరి లకు సహాయ మంత్రుల హోదా
లభించింది. డిప్యూటీ మంత్రులుగా జేబీ ముత్యాల రావు, ఎం సంజీవ
రావు, ఎం తిరుమల రావు, పీ వెంకట రెడ్డి
లకు స్థానం లభించింది.
అత్యధిక కాలం-సుమారు 32 సంవత్సరాల పాటు
కాబినెట్ మంత్రి హోదాలో పని చేసిన ఘనత బాబూ జగ్జీవన్ రాంకు దక్కింది. అతి తక్కువ
కాలం-కేవలం ఐదు రోజులు మాత్రమే కాబినెట్ మంత్రిగా వుంది జస్టిస్ హెచ్ అర్ ఖన్నా. ఉమ్మడి
అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నంతవరకు ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహారావు,
కొత్త రఘురామయ్యలు సుమారు 15 సంవత్సరాల పాటు
కాబినెట్ మంత్రులుగా వున్నారు. రఘురామయ్య అదనంగా మరో ఐదేళ్లు సహాయ మంత్రిగా కూడా
పనిచేశారు. ఉప ప్రధానులుగా సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ
దేశాయ్, చరణ్ సింగ్, వై బి చవాన్,
జగ్జీవన్ రాం, దేవీ లాల్, అద్వానీలు పని చేశారు. వీరిలో మొరార్జీ, చరణ్ సింగ్
ప్రధానులు కాగలిగారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఏ మాత్రం లేని రాజీవ్ గాంధి,
చంద్ర శేఖర్ నేరుగా ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు.
ఆగస్ట్ 15, 1947 న స్వతంత్రం వచ్చిన తర్వాత,
ఇప్పటి వరకు 14 మంది ప్రధాన మంత్రి పీఠాన్ని
అధిష్టించారు. ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అత్యధిక
కాలం-సుమారు 16 సంవత్సరాల 9 నెలలకు
పైగా పదవిలో వుండి, 63 పర్యాయాలు మంత్రి మండలి
విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ఆయన కూతురు ఇందిరా గాంధి కూడా దాదాపు కొంచెం
తక్కువగా, రెండు విడతలుగా, సుమారు 16
సంవత్సరాల కాలం ప్రధానిగా పనిచేసి, 67 సార్లు
విస్తరణలు-భారీ మార్పులు చేపట్టారు. ఇక ఆ కుటుంబ వారసుడు, ఇందిరా
గాంధి అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధి, కేవలం
ఐదేళ్ల కాలంలోనే, 36 సార్లు మంత్రి మండలిలో మార్పులు
చేయాల్సి వచ్చింది. అటల్ బీహారీ వాజ్ పాయ్ ఆరేళ్ల పాటు ప్రధానిగా వుండి, 27
పర్యాయాలు విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ప్రధాన మంత్రులుగా పని
చేసిన మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల 4 నెలల
కాలంలో, లాల్ బహదూర్ శాస్త్రి ఏడాదిన్నర కాలంలో చెరి పది
సార్లు; చరణ్ సింగ్ ఆరు నెలల్లో ఆరు సార్లు; దేవె గౌడ పది నెలల పదవీ కాలంలో నాలుగు పర్యాయాలు; గుజ్రాల్
పది నెలల్లో రెండు సార్లు; వీపి సింగ్ 11 నెలల్లో, చంద్రశేఖర్ ఏడు నెలల్లో ఒకే ఒక్క సారి
మంత్రి మండలిలో మార్పులు-చేర్పులు చేశారు. పీ వీ నరసింహారావు ఐదేళ్ల కాలం
ప్రధానిగా వున్నప్పటికీ, కేవలం తొమ్మిది పర్యాయాలు మాత్రమే విస్తరణ
చేపట్టారు. వీరందరితో పాటు, గుల్జారీలాల్ నందా రెండు సార్లు
తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. మోడీ తన మొదటి
టర్మ్ ఐదేళ్ళలో రెండు-మూడు పర్యాయాలే విస్తరణ చేపట్టారు.
నరేంద్ర
మోడీ టర్మ్ లో, మొదటి కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా అనుకున్నట్లే
అటు ఆంధ్ర ప్రదేశ్ నుంచి కాని, ఇటు తెలంగాణా నుంచి కాని
ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తీసుకోకపోతే వేరే విషయం. తెలంగాణా రాష్ట్రం
నుంచి అంతవరకూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క మంత్రిని కూడా పక్కన పెట్టారు. దత్తాత్రేయను తొలగించడంతో తెలంగాణా నుంచి ఎవరూ లేకుండా పోవడం మాత్రం
జరిగింది. కాకపోతే ఒకే ఒక్క తృప్తి....తెలంగాణాతో, హైదరాబాద్
తో ఎంతో కొంత అనుబంధం వున్న నిర్మలా సీతారామన్ ను రక్షణ మంత్రిగా కాబినెట్ హోదాలో అప్పట్లో
నియమించడం.
మంత్రి
మండలి ఏర్పాటు చేసినప్పుడల్లా, మార్పులు చేసినప్పుడల్లా, విస్తరణ చేపట్టినప్పుడల్లా, అది జరిగిన వెంటనే,
ప్రధాని మంత్రి సన్నిహిత వర్గాల నుంచి మీడియాకు ఒక సందేశం రావడం
ఆనవాయితీ. అతి త్వరలో, మంత్రివర్గ విస్తరణ వుండబోతున్నదని,
కొత్త వారికి అవకాశం కలిగిస్తామని, దాని
సారాంశం. ఆశావహుల ఆశలు అలా సజీవంగా వుంచడం అనాదిగా జరుగుతున్నదే! అలా ఆద్యతన
భవిష్యత్ లో జరిగితే, తెలుగు రాష్ట్రాలకు మరింత న్యాయం
జరుగుతుందని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు! END
తెలుగువారికి ఎవరో అన్యాయం చేయలా. వాళ్లకు వాళ్లే చేసుకున్నారు. కేంద్రం తో ఎప్పుడూ తగవు పెట్టుకుంటే చేతికి మిగిలేది చిప్పే. ఇప్పుడైనా కేసీఆర్ జగన్ బీజేపీ మోడీ తో అనుకూలంగా ఉంటే ఆమెతో ఇంతో మేలు జరుగుతుంది. ఏ పొత్తూ లేని తెరాస వైకాపా కు పదవులు ఎవరైనా ఇస్తారా. అందుకే లోక్ సభకు ప్రాంతీయ చిల్లర పార్టీలు పనికిరావు.
ReplyDelete