Friday, October 18, 2019

గండ్లూరి కిషన్ రావు, వనం శ్రీరాంరావులతో తలెత్తి, సమసిన వివాదం .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-11 : వనం జ్వాలా నరసింహారావు


గండ్లూరి కిషన్ రావు, వనం శ్రీరాంరావులతో తలెత్తి, సమసిన వివాదం
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-11
వనం జ్వాలా నరసింహారావు
1975 వేసంగి స్కూల్ సెలవుల్లో ఖమ్మంలో ఉన్నప్పుడే మా కుటుంబపరంగా అనేకానేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకదానికి మరోదానికి లింకులున్నాయి. మాకు వరసకు సమీపబందువైన (స్వర్గీయ) కందిబండ రంగారావు గారి ఐదో కుమారుడు నరసింహారావుతో చెల్లెలు ఇందిర వివాహం నిశ్చయమైంది. వివాహం తేదీ (నాకు గుర్తున్నంతవరకు) 20, మే నెల 1975. సరిగ్గా అదే ముహూర్తానికి మాకు ఇబ్బంది కలిగించే ఒక దత్తత స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు చేశారు నాకు వరసకు మామయ్య అయిన (స్వర్గీయ) కమ్యూనిస్ట్ నాయకుడు గండ్లూరి కిషన్ రావు. మేమంతా చెల్లెలు పెళ్లి పనుల్లో తలమునకలై వున్న అదను చూసుకుని, మా మీద దెబ్బతీయాలని ఆ నిర్ణయం తీసుకున్నాడాయన. ఆ వివరాలన్నీ మా కుటుంబానికి సంబంధించినంతవరకు చాలా రకాల ఆసక్తికరమైనవే.

మా నాన్న వనం శ్రీనివాసరావు ముత్తాత వనం శేషయ్య గారికి  ఇద్దరు కొడుకులు, నరసింహారావు గారు (ధర్మపత్ని: సీతమ్మ గారు), నరహరి రావు గారు (ధర్మపత్ని: లక్ష్మీకాంతమ్మ గారు). నరహరి రావు గారికి ముగ్గురు కొడుకులు....వెంకట చలపతి రావు (ధర్మపత్ని: వెంకట్రామనర్సమ్మ గారు), వెంకట రంగారావు గారు (ధర్మపత్ని: కనకమ్మ గారు-మొదటి, ఆమె మరణానంతరం రాధమ్మ గారు-రెండవ), వెంకట అప్పారావు గారు, ఒక కూతురు కలిగారు. వెంకట రంగారావు (మా తాత గారు) కనకమ్మ (మా నాన్నమ్మ) దంపతులకు , నాన్న వనం శ్రీనివాసరావు గారు ఏకైక కుమారుడు. నాన్న కన్నతల్లి ఆయనకు ఒక సంవత్సరం మీద పది నెలల వయసున్నప్పుడు చనిపోయింది.  కన్న తండ్రి వెంకట రంగారావు గారు నాన్న వయస్సు 6 సంవత్సరాల, 4 నెలల, 17 రోజులు వున్నప్పుడు చనిపోయారు!

అప్పటి నుండి ఆయన పెద తండ్రి, పెద తల్లి, పెంచారు. కొన్నాళ్ళకు నాన్న పెదతండ్రి గారు కూడా స్వర్గస్తులైనారు. అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పడంలో, ఉపనయన-వివాహానికి అత్యుత్సాహం చూపిన నాన్నగారి పెద్దతల్లి వెంకటరామనర్సమ్మ హటాత్తుగా మారిపోయి నాన్నను ఇబ్బందులకు గురిచేసింది.  చనిపోయిన తన పెదనాన్నగారి నిత్యకర్మలు అతికష్టం మీద జరిపించారు నాన్న. ఆ పెద్ద తల్లి వెంకటరామ నర్సమ్మ గారి పేరుమీద ఆమె జీవితాంతం అనుభవించడానికి, ఆతరువాత మా నాన్నకు చెందడానికి సుమారు 30 ఎకరాల సుక్షేత్రమైన ఎర్రమట్టి చేను ఆయన భర్త రాసిపోయారు. అదే ఈర్ష్యాసూయలకు దారి తీసింది.

మా నాయనమ్మ వెంకటరామనర్సమ్మకు మేనల్లుడైన మా ప్రాంతపు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు (స్వర్గీయ) గండ్లూరి కిషన్ రావుకు ఒక సుముహుర్తాన ఒక ఆలోచన వచ్చింది. దాన్ని కార్యరూపంలో పెట్టడానికి సరిగ్గా మా చెల్లెలు వివాహ లగ్నాన్నే ఎంచుకున్నాడాయన. గండ్లూరి కిషన్ రావు స్వగ్రామం బాణాపురం మా వూరికి ఆరేడు మైళ్ల దూరంలో వుంటుంది. ఆయన దగ్గరే వెంకటరామ నర్సమ్మ గారు వుండేవారు ఆరోజులలో. సాధారణంగా మా ఇంట్లోనే వుండేది. నా మీద అమితమైన ప్రేమ కూడా ఆమెకు. వయసు పైబడుతున్న కొద్దీ ఆలోచన చేసే స్థితిలో లేని నేపధ్యంలో ఆమెను తమకనుకూలంగా ఒప్పించారు గండ్లూరి వారు.

ఒప్పందం ప్రకారం, వరసకు మా పెదనాన్న (మాపాలివారు...నాకు రాజకీయంగా గురువు), మా నాన్నకు “భాయీ సాబ్”, మా పక్క వూరు వల్లాపురం గ్రామ వాసైన వనం శ్రీరాంరావు కొడుకును (వెంకట అప్పారావు ఉరఫ్ బాబయ్య) వెంకటరామ నర్సమ్మ గారికి దత్తత చేసి, ఆమె పేరున వున్న 30 ఎకరాల భూమిని అతడి పేరుమీద వారసత్వ హక్కుగా మార్పించి, అతడికి గండ్లూరి కిషన్ రావు కూతురును ఇచ్చి వివాహం చేయాలని. దీనివల్ల మా నాన్న గారికి ఆ 30 ఎకరాలు దక్కకుండా పోవడం, వల్లాపురం శ్రీరాంరావు ప్రత్యక్షంగా, గండ్లూరు కిషన్ రావు పరోక్షంగా లాభ పడడం జరగాలనేది ఆలోచన. దత్తత ముహూర్తాన్ని సరిగ్గా మా చెల్లెలు పెళ్లి ముహూర్తానికే నిర్ణయించారు. దీన్నంతా అత్యంత రహస్యంగా వుంచారు. చెల్లెలు పెళ్లి ఇంకా మూడు-నాలుగు రోజులే వుందనగా మాకు తెలిసింది. అప్పటికి నా వయసు 27 సంవత్సరాలు.

వెంటనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. గండ్లూరి కిషన్ రావు పేరు పొందిన సీపీఎం నాయకుడు. పాలేరు సమితి (అప్పట్లో) ప్రాంతంలో ఆయన మాటకు తిరుగు లేదు. ఆయనంటే చాలామందికి అమితమైన గౌరవం. ఆయన నాయకత్వంలో పార్టీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పట్టు సంపాదించుకుంది. ఆయన్ను గెలవాలంటే అంత సులభం కాదప్పట్లో. నాకు వరసకు బాబాయి, మా ఆమ్మకు మేనమామ కొడుకు, కమలాపురం గ్రామ సర్పంచ్ (ఆపట్లో) వనం నర్సింగరావు కూడా పేరుపొందిన సీపీఎం నాయకుడే. కాకపోతే గండ్లూరికి జూనియర్. ఆయన సహాయం కోరాను. నేను కూడా అప్పట్లో సీపీఎం పార్టీ అభిమానినే. జిల్లా నాయకుల్లో, తాలూకా నాయకుల్లో చాలామందితో పరిచయాలున్నాయి. నర్సింగరావు నన్ను వెంటనే తాలూకా పార్టీ కార్యదర్శి, పార్టీలో పలుకుబడి కలిగిన ప్రముఖ వ్యక్తి, నిరాడంబరుడు, అజాతశత్రువు (స్వర్గీయ) రావెళ్ళ సత్యం గారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయనకు విషయమంతా చెప్పాం. గండ్లూరి చేస్తున్నది తప్పని ఆయన దృష్టికి తెచ్చాం. ఆయన మా వాదనను అంగీకరించాడు. అప్పట్లో సెల్ ఫోన్లు అసలే లేవు. లాండ్ లైన్లు కూడా అరుదుగా వున్నాయి. గ్రామాల్లో అసలే లేవు. ఏదైనా విషయం చెప్పాలంటే వ్యక్తిగతంగా పోవాల్సిందే.

వనం శ్రీరాంరావు గారికి నచ్చ చెప్పడానికి జీప్ వేసుకుని మేం ముగ్గురం, నర్సింగరావు, నేను, రావెళ్ళ సంత్యం గారు వల్లాపురం చేరుకున్నాం. తర్జన-భర్జనలు జరిగాయి. మా ఇంట్లో మా చెల్లెలు పెళ్లి అయ్యేంతవరకూ దత్తత వాయిదా వేసుకోమని సత్యం గారు అన్నారు. ఎంతకూ శ్రీరాంరావు గారు అంగీకరించలేదు. చేసేదేమీ లేక బాణాపురం బయల్దేరాం. మేం వెళ్లి గండ్లూరి కిషన్ రావుతో చర్చిస్తుంటే శ్రీరాంరావు గారు తన మందీ-మార్బలంతో అక్కడికి చేరుకున్నాడు. అందరం చర్చించాం. సత్యంగారు వల్లాపురంలో చేసిన దత్తత వాయిదా  ప్రతిపాదన బాణాపురంలో కూడా చేశారు. శ్రీరాంరావు గారు అంగీకరించలేదు. కిషన్ రావు సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు సత్యంగారు తన చివరి అస్త్రాన్ని వేశాడు. తాలూకా పార్టీ కార్యదర్శిగా గండ్లూరిని ఆదేశిస్తున్నట్లు, దత్తత వాయిదా వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సొంత ఇంటి పనులకు, పార్టీకి సంబంధం ఏంటని శ్రీరాంరావు వాదించాడు. అయితే ఒక క్రమశిక్షణ కల పార్టీ కార్యకర్తగా గండ్లూరి కిషన్ రావు, సత్యంగారి ఆదేశం మేరకు నడుచుకోవడానికి అంగీకరించాడు. మా చెల్లెలు పెళ్లి అయిన తరువాత కొన్నాళ్లకు పెద్ద మనుషుల సమక్షంలో సంప్రదింపులు జరగాలనీ, పెద్ద మనుషుల సూచన మేరకు ఇరు పక్షాలు నడుచుకోవాలనీ నిర్ణయం జరిగింది. అలా ఆ సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం దొరికింది. అంతా మా చెల్లెలి పెళ్లికి హాజరయ్యారు.

ఆ తరువాత గండ్లూరి వారి పక్షాన పెద్దమనిషిగా కిషన్ రావు అన్నగారు (స్వర్గీయ) గండ్లూరి నారాయణరావు గారు (మా నాన్నకు ఆప్తమిత్రులు), మా నాన్న పక్షాన మాజీ సమితి అధ్యక్షుడు (స్వర్గీయ) రావులపాటి సత్యనారాయణ రావు గారు ఇరు పక్షాల వాదనలు పలుమార్లు విన్నారు. చివరకు మా నాన్న వాదనకే మద్దతు పలికారు. వెకట్రామనర్సమ్మ గారు బతికున్నంత కాలం ఆమె పోషణకు సరిపడా ఇవ్వడానికి ఆమెపేరుమీద వున్న 30 ఎకరాల భూమిని (ఎర్రమట్టి చేను) అమ్మి అందులో కొంత ఆమెకు చెందేలా చేయడం జరిగింది. కిషన్ రావు రెండో కూతురు జ్యోతిని మా తమ్ముడు (స్వర్గీయ) శ్రీనాథ్ కిచ్చి పెళ్లి చేయాలని కూడా పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదిరింది. దరిమిలా గండ్లూరి కిషన్ రావు రాజకీయ హత్యకు గురయినప్పటికీ ఆయన కూతురును మా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. కథ సుఖాంతం.

No comments:

Post a Comment