Friday, October 25, 2019

ఛందస్సు, అవధానం, మానవ పరిణిత మేధా సృష్టి : వనం జ్వాలా నరసింహారావు


ఛందస్సు, అవధానం, మానవ పరిణిత మేధా సృష్టి
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (25-10-2019)
"శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము"...ఈ ఆరు షట్ శాస్త్రాలు. ఇవి అధ్యయనం చేసిన వాడే పండితుడు. షట్ శాస్త్రాలలో "ఛందస్సు" వేదాలను నడిపించేది. "ఛందౌపాదౌతు వేదశ్చ" అని శాస్త్రం. శరీరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాంటివో వాజ్మయ శరీరానికి గురు-లఘువులు అలాంటివి. చాలా సందర్భాలలో ఛందో రహితమైన కావ్య శరీరం శ్వాసించదు. పాఠకులను శాసించదు.

         ఛందస్సు ప్రాచీన మానవ పరిణిత మేధా సృష్టి!

         ఛందశ్శాస్త్రానికి ఒక గురు పరంపర ఉంది. "లయ" కారకుడైన మహాశివుడు ఆది శాస్త్రజ్ఞుడు. ఆయన బృహస్పతికి - గుహునికి చెప్పాడు. బృహస్పతి - ఇంద్రునికి, ఇంద్రుడు - శుక్రునికి, శుక్రుడు - మాండవ్యునికి, మాండవ్యుడు - సైతవునికి, సైతవుడు - యాస్కునికి, యాస్కుడు - పింగళునికి, పింగళుడు - గరుత్మంతునికి, ఛందస్సు బోధించినట్లు ఒక గురు పరంపర!

         ఇక గుహుని ద్వారా సనత్కుమారుడు, సనత్కుమారుని ద్వారా మళ్లీ బృహస్పతి, ఇంద్రుడు, వారి నుండి మళ్లీ పతంజలి, పతంజలి నుండి పింగళుడు, తద్వారా గరుత్మంతుడు...ఇదొక పరంపర! ఇలాంటి 30 రకాల ఛందో గురుపరంపరలున్నాయి! ఈ విషయమంతా "యుధిష్టిరమీమాంస" లో ఉన్నాయి. ఎంతో మేథా మథనం జరిగింతర్వాత పింగళుని దగ్గర సర్వ ఛందశ్శాస్త్రం నిక్షిప్తమైందని తెలుస్తోంది.

వేదాంగాల్లో పద్య లక్షణాలను తెలియచేసే ఛందస్సు ఒక భాగం. పద్యం ఎలా రాయాలి, ఏ ఏ లక్షణాలతో ఎటువంటి పద్యాలుంటాయి, ఆ పద్యాలు రాయడంలో పాటించాల్సిన నియమాలేంటి వివరించేది ఛందశ్సాస్త్రం. పద్యాలతో కవిత్వం చెప్పదల్చుకున్న రచయిత మదిలో పుట్టిన భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొంది, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఒక లయలాగా సాగడాన్ని ఛందస్సు అనవచ్చు. పద్యం ఒక నియమానుసారం "పాదాలు" గా విభజించబడతాయి. ఆ పాదాలు "గణాల" మీద ఆధారపడతాయి. గణాలు వాటి స్వభావాన్ని బట్టి-స్వరూపాన్ని బట్టి రకరకాలుగా నియంత్రించ బడ్డాయి. గణాల కలయిక వల్ల ఏర్పడిన పాదాలన్నీ కలిసి పద్యంగా ఏర్పడుతుంది. భాషలో వున్న అక్షరాల స్వరూప-స్వభావాలను బట్టి ఛందశ్సాస్త్రంలో "గురువు"-"లఘువు" లని వ్యవహరించబడతాయి. గురు-లఘువుల కూడికే గణాలు అంటారు. గురువు-లఘువు ఎలా ఏర్పడతాయో, ఏ ఏ అక్షరాలు గురువు-లఘువులుగా గుర్తించ వచ్చో ఛందస్సుతో కవిత్వం రాసే వారందరికీ తెలుసు. అలానే సూర్య గణాలనీ, ఇంద్ర గణాలనీ, చంద్ర గణాలనీ కూడా వుంటాయి.

         పద్య లక్షణాలలో ముఖ్యమయినవి "యతి-ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. దీన్ని ప్రతి పద్యానికి దాని స్వభావాన్ని బట్టి, ప్రతిపాదానికి ఏర్పాటుచేయడం జరుగుతుంది. ప్రతిపాదానికి మొదటి అక్షరమైన యతి, తిరిగి ఆయా పద్యాల్లో పేర్కొన్న స్థలాల్లో చెప్పాలని ఛందస్సు శాస్త్రం చెప్తుంది. యతికి పర్యాయ పదాలు కూడా వున్నాయి. పద్యపాదంలో మొదటి అక్షరం యతి అవుతే, రెండవ అక్షరం ప్రాస అవుతుంది. యతి-ప్రాసలకు వున్న నియమాలన్నీ పద్యకవిత్వం చెప్పేవారు తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. పద్యంలో వున్న మొదటి అక్షరంతో (యతి) సమానమైన అక్షరాన్ని నియమించిన స్థానంలో నిలపడం కుదరనప్పుడు, ప్రాసగా వున్న రెండవ అక్షరాన్ని యతి స్థానం పక్కన వచ్చే విధంగా చేస్తే దాన్ని "ప్రాస యతి" అంటారు. ప్రాస యతిని వాడేటప్పుడు కూడా నియమ-నిబంధనలుంటాయి.


         ఇలా గణాలను, యతి-ప్రాసలను, ప్రాస యతులను నియమబద్ధంగా వాడుతూ పద్యకవిత్వం చెపుతారు కవులు. పద్యాల్లో వృత్తాలని, జాతులని, ఉప జాతులని వుంటాయి. అక్షర గణాలతో ఏర్పడేవి వృత్తాలు. మనందరికీ బాగా తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటివి వృత్తాలు. తెలియనివీ, విననివీ ఎన్నో వున్నాయి. వృత్తాల్లో కూడా భేదాలున్నాయి. జాతులంటే కందం, ద్విపద, మంజరీ ద్విపద, తరువోజ, ఉత్సాహం, అక్కరలు, రగడలు లాంటివి. ఇందులో అందరికి తెలిసింది కందం. ఉప జాతుల్లో తేటగీతి, ఆటవెలది, సీసం లాంటి పద్యాలున్నాయి.

ఛందస్సును విరివిగా ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రక్రియల్లో మొదటిగా పేర్కొనాల్సింది అవధానం. కాగితం మీద కలం పెట్టి, ఆలోచిస్తూ, ఛందోబద్ధమైన కవిత్వం చెప్పేవారు కొందరైతే, అలవోకగా, ఆశువుగా, శ్రోతలను ఆకట్టుకుంటూ అవధానం చేస్తూ ఛందోబద్ధమైన పద్యాలను ధారణ చేసేవారు మరి కొందరు. అవధానం చేయాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి. సరస్వతి నాలుకమీద నిలవాలి. అందరికీ అది సాధ్యం కాదు. మాడుగుల నాగ ఫణిశర్మ, నరాల రామిరెడ్డి, జీఎం రామశర్మ, మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, మలుగ అంజయ్య అవధాని లాంటి అతి కొద్దిమంది మాత్రమే వర్తమాన కాలంలో అవధానాలు చేయగలుగుతున్నారు. ఇటీవల రవీంద్ర భారతిలో అమెరికాకు చెందిన 18 సంవత్సరాల ఆదిత్య స్వయంగా, సొంతంగా ఆన్ లైన్లో శిక్షణ పొంది ద్విభాషావధానం అద్వితీయంగా చేశారు.

అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాషలోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం. కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తికి, పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. అవధానంలో అనేక అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతడిని పృచ్ఛకుడు అని అంటారు. అవధాని పాండిత్యాన్ని, సమయస్ఫూర్తినీ పరీక్షిస్తూ తగు ప్రశ్నలను సంధిస్తూ ఉంటారు పృచ్ఛకులు. వీటిలో నిషిద్ధాక్షరి, నిర్దిష్టాక్షరి, దత్తపది, సమస్యా పూరణం, వర్ణన, ఆశువు, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం, వ్యస్తాక్షరి, ఛందోభాషణం లాంటివి వుంటాయి. ఇవన్నీ అయిపోయిన తరువాత ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అప్పగించడం మరో ఎత్తు.

ఈ యావత్ ప్రక్రియ ముందే చెప్పుకున్నట్లు కొందరికి భగవత్ దత్తం అయితే, కొందరికి అభ్యాసం ద్వారా సిద్ధిస్తుంది. నేర్చుకుంటే రానిదేదీ లేదంటారు. కాకపొతే నేర్పేవారు వుండాలి. కాలం గడిసిపోతున్న కొద్దీ అవధానాలు చేసేవారు తగ్గిపోతున్నారు. ఆస్వాదించేవారూ తగ్గిపోతున్నారు. దాదాపు వేళ్లమీద లెక్కించగలంత మందే ప్రస్తుతం అవధానాలు చేస్తున్నారు. వేల యేండ్ల చరిత్ర గల ఈ ఛందశ్శాస్త్రం, అవధాన ప్రక్రియ ఈనాడు సుప్త చేతనావస్త-హైబర్నేషన్లో ఉంది. దీన్ని వెలికి తీసి ప్రచారం చెయ్యక పోవడం దేశ ద్రోహం కన్నా పెద్ద నేరం! ఈ విద్య అంతరించి పోకూడదు. ఎవరైనా దీనికి నడుం బిగించాలి. సరిగ్గా ఇదే జరిగిందిప్పుడు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణిశర్మ దీనికి పూనుకున్నారు. అంతరించి పోతున్న ఈ విద్యకు పునరుత్తేజం కలిగించడానికి ఒక బృహత్తర శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాక్షాత్ సరస్వతీ మూర్తులు బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ. పారిజాత తరువైన అవధాన విద్యకు పునరుత్తేజం కలిగిస్తున్నారు.

అవధాన సరస్వతీ పీఠం ఆధ్వర్యంలో “అవధాన విద్యారక్షణ-వ్యాప్తి, అవధాన బోధనకై పాఠ్యప్రణాళిక” అనే అంశాలపై మాడుగుల నాగఫణి శర్మ అధ్యక్షతన ఇటీవల ఒక ఆదివారంనాడు ఒక గోష్ఠి నిర్వహించి శర్మ పలువురు విద్వాంసుల సూచనలు సలహాలు తీసుకున్నారు. అవధాన బోధన పాఠ్యప్రణాళిను మూడు భాగాలుగా చేశారు శర్మ. మొదటి ఆరునెలలు ప్రాథమిక శిక్షణ, తరువాత ఆరు నెలలు ప్రవేశిక సర్టిఫికేట్ కొరకు మరో ఆరు నెలల శిక్షణ, చివరిగా ఒక సంవత్సరం పాటు డిప్లొమా పొందడానికి శిక్షణ అవధాన బోధనలో వుంటాయి. శిక్షణలో అంశాలుగా, గణ విభజన, ఛందోబోధన, పద్య సాధన, ఉచ్చారణా సౌష్ఠవం, శతక బోధన, భారత-భాగవతాలలోని పద్య అద్యయనం, ఛందోదర్పణం, పలువురు పురాతన-ఆధునిక కవుల రచనల అధ్యయనం, కావ్య ప్రకాశం, ధ్వన్యాలోకం, కావ్యాదర్శం, శ్రీనాధుడి లాంటి మహాకవుల రచనల అధ్యయనం, బాలవ్యాకరణం, ప్రబంధకావ్యాల అద్యయనం లాంటివి దిగ్దర్శనంగా తెలుసుకోవాలి విద్యార్థి. అవధాన బోధనను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు అవధాన సరస్వతీ పీఠం పక్షాన ప్రజాబాహుళ్యంలో వారు నేర్చుకున్న విద్యను ప్రదర్శించబడి, ఆ సభలో “అష్టావధాని”, “శతావధాని” యోగ్యతా ప్రమానపత్రం ఇవ్వడం జరుగుతుంది.

మాడుగుల నాగఫణి శర్మ అనధికారికంగా అవధాన విద్యాబోధన ఎప్పటి నుండో చేస్తున్నప్పటికీ దానికొక సాధికారికత కల్పించి, ఒక పూర్తిస్థాయి బోధన చేపట్టడం గొప్ప విషయం. అవధానులందరికీ సహజంగా పూర్వజన్మ సుకృతం, దైవానుగ్రహం వుంటుంది. వారిలాగే శర్మగారి దగ్గర నేర్చుకోబోతున్న విద్యార్థులకూ దైవ కృప, ముఖ్యంగా సరస్వతీ దేవి కృప కలగడానికి బోధనలో పాఠ్యాంశ౦గా ఏదైనా అమ్మవారి పూజ, మంత్రం, ఉపదేశం లాంటి అనుగ్రహం కలిగిస్తే బాగుంటుంది. ఆద్యతన భవిష్యత్ లో మాడుగుల ఆధ్వర్యంలో ఇదొక విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకోవడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రానికే ఇదొక మణిమకుటం కావాలి. అవధానం, పద్యవిద్య సార్వజనీనం కావాలి. పద్యం సాధారణ మానవుడినీ కదిలించాలి. ఈ అవధాన పరంపర నిర్విరామంగా, ఆచంద్రతారార్కం కొనసాగాలి. అవధాన పండుగలు నిర్వహించుకునే రోజులు మళ్లీ-మళ్లీ రావాలి.   

No comments:

Post a Comment