Tuesday, October 22, 2019

అశోక్ నగర్ మా తోడల్లుడు ఇంట్లో .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-12 : వనం జ్వాలా నరసింహారావు


అశోక్ నగర్ మా తోడల్లుడు ఇంట్లో
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-12
వనం జ్వాలా నరసింహారావు
మా చెల్లెలు పెళ్లి అయిన కొన్నాళ్లకు స్కూల్ సెలవులు అయిపోవడంతో నేను ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వచ్చేశాను. అప్పట్లో మా ఇంటి సామాను చాలా తక్కువ. మల్లికార్జునరావు గారింట్లో వున్నప్పుడు అప్పట్లో రు.200 ఖరీదు చేసే ఒక “సోఫా కం బెడ్” కొన్నాం. అది కాకుండా, బెండులతో చేసిన రెండు మోడాలు, రెండు కుర్చీలు వుండేవి. ఎవరొచ్చినా వాటిమీద కూర్చోవాల్సిందే. అందరి ఇళ్లలోలాగా డబుల కాట్ మంచాలు లేవు. డైనింగ్ టేబుల్ కూడా లేదు. రెండు నవారు మంచాలుండేవి. మేం వాటిమీద, మా ఇంట్లోనే వుంటున్న బావమరది వెంకన్న సోఫా కం బెడ్ మీద పడుకునే వాళ్ళం. బందువులు (ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చేవారు) వస్తే సర్దుకు పోవాల్సిందే. అదనంగా సౌకర్యాలు కలిగించేవాళ్లం కాదు. ఇవి కాకుండా మా ఆవిడ అన్నగారు డాక్టర్ రంగారావు ఇంగ్లాండ్ నుండి తెచ్చిన ఒక పెద్ద ట్రంక్ పెట్టె కూడా వుండేది. దాన్ని కూడా పైన ఒక మెత్తటి గుడ్డ పరిచి ఆసనంలాగా ఉపయోగించే వాళ్లం. వేసవి సెలవులకు ఇంటికి పోయేటప్పుడు మాకున్న కొద్దిపాటి సామాను ఈ పెట్టెలో సదిరి, ఇల్లు ఖాళీ చేసి, వాటిని మా తోడల్లుడు ఇంట్లో పెట్టి పోయాం.

         మల్లిఖార్జునరావు గారిల్లు ఖాళీ చేసిన తరువాత సెలవులనుండి తిరిగి వచ్చాక, సమీపంలోనే అశోకనగర్లో, పీపుల్స్ హై స్కూల్ పక్కనున్న గల్లీలోని మా తోడల్లుడు జూపూడి హనుమత్ ప్రసాద్ ఇంట్లోకి మారాం. ఆ ఇంటికి ఆ సందులోంచి కూడా మొత్త వుంది. ఇంట్లోకి అంటే, ఇంట్లోకి కాదు వాస్తవానికి. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. ప్రసాద్ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేని ఒకానొక సందర్భంలో హైదరాబాద్ లో వుండాల్సిన అవసరం కలిగినప్పుడు ఆ ఇల్లు కొన్నారు. ఆ ఇంట్లో అప్పట్లో ఒక పోర్షన్లో నాటి విద్యారణ్య స్కూల్ ప్రిన్సిపాల్ (ఒక ఆంగ్లో ఇండియన్), మరో పోర్షన్లో ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయశాస్త్రం ఆచార్యుడు ప్రొఫెసర్ సుభాష్ చందర్ రెడ్డి కుటుంబం అద్దెకుండేవారు. వెనుకవైపు గరాజ్ ద్వారా లోపలికి వస్తే ఒక హాలు, కిచెన్ వుంది. అందులోకి చేరాం మేం అద్దె తక్కువని. అందులో సుమారు ఏడాదిపాటు, అంటే 1976 వేసవి సెలవుల వరకూ వున్నాం. మా తోడల్లుడు ఆ ఇంటిని ఆ తరువాత సుమారు పదిహేనేళ్ళకు అమ్మారు.

         ఆ ఇంట్లో వున్నప్పుడే మొట్టమొదటిసారి మాకు హైదరాబాద్ నగరంలో ఫోన్ వాడకం అలవాటైంది. మెయిన్ పోర్షన్లో వున్న సుభాష్ చందర్ రెడ్డి గారింట్లో ఫోన్ వుంది. ఆ నంబరే మేం మాకు బాగా తెల్సిన వాళ్లకు ఇచ్చాం. సుభాష్ చందర్ రెడ్డి గారు కాని, ఆయన కుటుంబ సభ్యులు కాని విసుక్కోకుండా మమ్మల్ని మాకు ఫోన్ వచ్చినప్పుడల్లా పిలిచేవారు. మేం ఎప్పుడన్నా అత్యవసరంగా ఎవరికైనా ఫోన్ చేయాలంటే అభ్యంతరం చెప్పక పోయేవాళ్ళు.

         1975 వేసవి సెలవులు అయిపోయిన తరువాత నేనైతే హైదరాబాద్ వచ్చాను కాని మా ఆవిడ ఖమ్మంలోనే ఉండిపోయింది. కొన్నాళ్లు మా ఇంట్లో, కొన్నాళ్లు వాళ్ల అమ్మగారి ఇంట్లో వున్నది. బహుశా ఐదో నెల గర్భిణీగా వున్నప్పుడు, ఆగస్ట్ నెలలో హైదరాబాద్ వచ్చినట్లు గుర్తు. ఇంగ్లాండులో వున్న మాఆవిడ రెండో అన్నయ్య మనోహర్ రావు అదే సంవత్సరం స్వదేశానికి తిరిగొచ్చాడు. చిక్కడపల్లిలోనే అద్దెకు చిన్న పోర్షన్ తీసుకునే ముందర కొన్నాళ్లు మేం వున్న ఆ చిన్న ఇంట్లోనే మాతోపాటు ఆయన కుటుంబం కూడా వుంది.


అదే సంవత్సరం, జూన్-జులై నెలల్లో మాఆవిడ రెండో మేనమామ భండారు రామచంద్ర రావు గారు (భార్య విమలాదేవి-నలుగురు పిల్లలు) హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోనే చమన్ దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని వున్నారు. ఆయన స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్ ప్రొబేషనరీ ఆఫీసర్. చీఫ్ జనరల్ మానేజర్ గా రిటైర్ అయ్యారు. ఆయన ఇంటికి సమీపంలోనే వున్న మాకు దాదాపు ప్రతి ఆదివారం వాళ్ళింటినుండి ఏదో ఒక కూరో-పచ్చడో తెచ్చి ఇస్తుండేవారాయన. రామచంద్ర రావుగారు వచ్చిన కొన్నాళ్లకు ఆయన తమ్ముడు, మాఆవిడ చిన్న మేనమామ, నాకు స్కూల్ క్లాస్మేట్ భండారు శ్రీనివాసరావు (భార్య నిర్మల-ఇద్దరు పిల్లలు) కూడా ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కు వచ్చాడు. హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో భండారు శ్రీనివాసరావుకు విలేఖరిగా ఉద్యోగం వచ్చింది. ఆయన దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో వార్తావిభాగం ఎడిటర్ గా పదవీ విరమణ చేశాడు. శ్రీనివాసరావు కూడా రామచంద్రరావు గారింట్లోనే ముందు భాగంలో వుండేవాడు కొద్దికాలం. ఆ తరువాత మరో ఇంటికి మారారు.

మేం మా తోడల్లుడు ఇంట్లో, ఆచిన్న పోర్షన్లో వున్నప్పుడే ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఒకరు, అప్పట్లో నిజామాబాద్ లో జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న జంధ్యాల హరినారాయణ్ (ఆయన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు), ఇంకొకరు, భద్రాచలంలో సబ్-కలెక్టర్ గా పనిచేస్తున్న జయేందర్ సింగ్ (ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు) అక్కడికి వచ్చి మా ఆతిధ్యం (మా మోడాలమీదే ప్లేట్లు పెట్టుకుని, బెండు కుర్చీల మీద కూర్చుని) స్వీకరించారు. అలా ఎంతో మంది, మాకున్నదాంట్లోనే, మాతో కలిసి భోజనం చేశారు ఆ ఇంట్లో వున్నప్పుడు.

ఒకరోజు సాయంత్రం మొదటి ఆట సినిమా చూసొచ్చి నేను, మా ఆవిడ అన్నయ్యలు ఇద్దరు, భండారు అన్నదమ్ములిద్దరూ, ఐఏఎస్ అధికారి జయేందర్ సింగ్, అప్పట్లో డీఎస్పీ గా పనిచేస్తున్న బొమ్మకంటి శంకర్ రావు, మేమున్న ఇంటి ముందు రోడ్డు మీద మా ఇంటికి ఆనుకుని ఇసుక పోసి వుంటే దానిమీద కూర్చుని రాత్రి పొద్దుపోయేదాకా కబుర్లు చెప్పుకుంటూ వున్నాం. బహుశా రాత్రి పన్నెండు అయిందనుకుంటా. ఆ సమయంలో ఒక పోలీసు అధికారి (బహుశా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కావచ్చు) అటువైపుగా వచ్చి, మమ్మల్ని చూసి ఇంగ్లీష్ లో “Gentlemen neither this is time nor the place to sit and chitchat. It’s disturbing neighbors. Please get into the house” అని చెప్పాడు. మేమంతా ఆయన మాటలకు క్రమశిక్షణ కలవారిగా లేచి ఎవరింటికి వాళ్లం పోయాం.

ఆ ఇంట్లో వుండగానే 1975 సంవత్సరం క్రిస్మస్ సెలవుల్లో ఖమ్మం పోయాం. మాఆవిడ కొన్నాళ్ళ క్రితమే వెళ్లింది. క్రిస్మస్ కు ఒకరోజు ముందర డిసెంబర్ 24 న ఆ ఆదిత్య ఖమ్మం ఆంధ్రజ్యోతి ఆసుపత్రిలో పుట్టాడు.

No comments:

Post a Comment