శబరికి దర్శనం ఇచ్చి పంపాతీరం చేరిన రామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-83
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (20-10-2019)
పడమటి
దిక్కుగా పోతున్న రామలక్ష్మణులు దారిలో కొండలు,
తీయటి పండ్లున్న అడవులు, చెట్లు
చూసుకుంటూ పోయి కొండ దగ్గర ఆరాత్రి గడిపి, సూర్యోదయం
అవగానే పరిశుద్ధ జలాల పంపానదిని చూస్తూ తిరిగి ప్రయాణం కొనసాగించారు. పడమటి
దిక్కున వున్నా ఒడ్డులో వెతికి అక్కడ శబరి వుండే రమ్యమైన ఆశ్రమాన్ని చూసి
సమీపించారు. (పంప ఒడ్డున ఈ ఆశ్రమం ఇప్పటికీ వుందట. ఈ గుహవాకిట్లో పట్టపగలు ఎండలు
మండిపోతున్నప్పటికీ, దుప్పటి కప్పుకోనేంత చల్లటి గాలి
వీస్తుంది). శబరి వీరిని చూసి చేతులు మోడ్చి,
వారిపాదాలను అంటి నమస్కరించి, పాద్యం
ఇచ్చి, తగిన ఉపచారాలను అన్నింటినీ శాస్త్ర ప్రకారం కావించింది. ఆ తరువాత
నిలబడి వున్న ఆమెను చూసి శ్రీరామచంద్రుడు పలకరించాడు.
“సాధుచారిత్రా! నీ తపస్సులు,
వ్రతాలు విఘ్నం లేకుండా జరుగుతున్నాయికదా?
కోపంలోను, ఆహారంలోను నిర్మలమైన మనస్సుకలదానా! నియమం వుంది కదా?
నువ్వు నియమించుకున్న వ్రతాలు నెరవేరుతున్నాయా?
మనస్సు సర్వదా ప్రసన్నంగా, శాంతంగా
వుందికదా? గురుసేవలు కొనసాగుతున్నాయి కదా?
దానివల్ల ఫలితం అనుభవానికి వస్తున్నదా?” అని
రామచంద్రమూర్తి శబరిని ప్రశ్నించగా, తపస్సు
ధనంగాకల ఆ పుణ్యస్త్రీ,
ముక్తులైన వారికి సమ్మతమైన నడవడికల ఆ యోగసిద్ధురాలు, కౌసల్యా
పుత్రుడిని చూసి మిక్కిలి భక్తితో, వినయంతో
ఈ విధంగా అన్నది.
(గురువు,
గురుపుత్రులు లేరుకదా! ఇప్పుడేమి శుశ్రూష అనకూడదు. గురువు పోయినా నిజమైన శిష్యులు
గురుపాదుకలు వుంచుకుని వాటికి గురుపూజ చేసినట్లే చేస్తారు. మనస్సు,
వాక్కు, కాయం శుద్ధంగా వుంచుకుని గురుభక్తి,
దైవభక్తి కలిగుంటే భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ తానె వస్తాడని శబరి-రామ చరిత్రం
వల్ల అర్థమవుతున్నది. భగవత్ దర్శనాపేక్ష వుంటే చాలు. రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ
పోయి దర్శించడం శబరికి సాధ్యమయ్యేదా?).
“అపహతపాపా! నా గురుశుశ్రూషకు ఫలం నిన్ను
చూసిన తరువాత ఇప్పుడే కదా ఫలించింది?
గురుశుశ్రూషకు ఫలం భగవత్సాక్షాత్కారం. అది నాకు ఇప్పుడే కలగడం వల్ల గురుశుశ్రూష
ఇప్పుడే ఫలించింది. అలాగే నా తపాలకు, వ్రతాలకు
ఫలమేంటి? భగవత్సాక్షాత్కారమే! అదికూడా నీ దర్శనభాగ్యాన ఇప్పుడే ఫలించింది
పుండరీకాక్షా! భూమ్మీద జన్మించిన వారిలో సార్థకజన్ముడు ఎవడు?
భగవంతుడిని సాక్షాత్కరింపచేసుకున్నవాడే! ఇప్పుడు నేను నిన్ను కళ్లారా ప్రాకృత
చక్షువులతో చూడగలగడం అంటే నా జన్మ సార్థకం అయినట్లే కదా?
దేవతా శ్రేష్టుడా! నిన్ను చేతులారా పూజించి మోక్షం పొందుతాను. నీ దయార్ద్ర దృష్టి
వల్ల పాపాలు నశించాయి. అరిషడ్వర్గం హతమయింది. మోక్షం లభించింది”.
“శ్రీరఘురామచంద్రా! నేను శుశ్రూష చేస్తుండే నా గురువులు,
మీరు చిత్రకూటానికి వచ్చారనీ,
ఇక్కడికి వస్తారనీ, మీ దర్శనం చేసుకుంటే నాకు మళ్లీ
జన్మలేని లోకం లభిస్తుందనీ చెప్పిన కారణాన మీ కొరకు వేచి చూస్తున్నాను. సంతోషంగా
మీ కోసం మంచివి, ఏరి-కోరి నానా రకాలైన కందమూల ఫలాలు సంపాదించాను”. శబరి మాటలకు ఆమెను
చూసి రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “అమ్మా! నీ గురువుల ప్రభావం విన్నాను. అది
ప్రత్యక్షంగా చూడాలని కోరికగా వుంది. కాబట్టి నీకిష్టం వుంటే ఆ చిత్రాలను
చూపించు”.
రామచంద్రమూర్తి అడిగినదానికి బదులుగా
శబరి, ఆయనతో ఇలా జవాబిచ్చింది. “రామచంద్రా!
వర్షించే మేఘాలలాగా నల్లగా వ్యాపించి మృగాలతో,
పక్షులతో నిండి వున్న ఈ మతంగవన స్థలంలో తమ మంత్రాల శక్తితో మా గురువులు తీర్థాలను
కల్పించారు. పడమటి వేదిమీద మా స్వాములు ముసలితనంతో వణకుతున్నప్పటికీ భగవదారాధన
మానకుండా పూలతో పూజించేవారు. వారి తపోమహిమ వల్ల వేదులు వాళ్లు లేకున్నా
దిక్కులన్నిటినీ ప్రకాశింప చేస్తున్నాయి. శుష్కోపవాసాలు చేసి బలహీనులై నడవలేని
కారణాన సముద్రాలకు పోలేకపోతే, వాళ్ల
పిలుపు మేరకు సముద్రాలే ఇక్కడికి వచ్చాయి. చూడు....రామచంద్రా. మా గురువులు
స్నానాలు చేసి తడిసిన నారవస్త్రాలు ఈ చెట్లకొమ్మల మీద వుంచి పోయారు. వారి
తపఃప్రభావం వల్ల నేటికీ అవి ఆరలేదు. వారు దేవతారాదనలో పూజించిన పూలు ఇప్పటికీ
వాడిపోలేదు. వినతగినవన్నీ విన్నావు....చూడతగినవన్నీ చూశావు. ఇక నేను నా
గురువులున్న చోటుకు పోయి వాళ్ళను దర్శించాలి. నాకు ఆజ్ఞ ఇవ్వు”.
ఆ పుణ్యాత్మురాలు చెప్పిన అమతలన్నీ విన్న
రామచంద్రుడు ఆమె గురుభక్తికి, దైవభక్తికి
మెచ్చి, ఇలా అన్నాడు. “సాధుచారిత్రా! నువ్వు చేయాలనుకున్న సత్కార్యాలన్నీ
గ్రహించినట్లే భావించు. నీ కోరిక ప్రకారం వెళ్లిపో”.
శబరి పరమపదానికి పోగా,
ఏకాగ్రమనస్కుడై, తన తమ్ముడు లక్ష్మణుడిని చూసి రామచంద్రుడు మతంగముని గురించి
చెప్పాడిలా. “ఆహా! ఏమి, ఈ ఋషుల
మహిమ? అవి చూస్తూ వుంటే చాలా ఆశ్చర్యంగా వుంది. లక్ష్మణా! ఇక్కడ జింకలు,
పులులు, మచ్చికతో సహజ విరోధం వదిలి నమ్మకంగా తిరుగుతున్నాయి. మునీశ్వరులు
వున్నప్పుడే కాకుండా వాళ్లు పోయిన తరువాత కూడా వాళ్ల తేజస్సు వ్యాపించి ఉన్నందున
హింస అనేది కనబడడం లేదు. మునీశ్వరుడు సృష్టించిన సముద్ర జలాలతో పితృ తర్పణం చేశాం.
ఇది మనకు మేలు చేస్తుంది. లక్ష్మణా! మన కష్టకాలం పోయింది. ఇక సౌఖ్యమే కలుగుతుంది.
ఇక్కడికి సుగ్రీవుడు వుండే పర్వతం దగ్గరే. ఎంతో దూరం లేదు. ఇక మనం పంపకు పోదాం.
అక్కడే కదా సుగ్రీవుడు వానరులతో వుండే ఋశ్యమూకం వున్నది. మనం సుగ్రీవుడిని
చూడడానికి పోదాం పద. సీతను వెతికే పని అతడిదే కదా?”.
అన్న మాటలకు లక్ష్మణుడు తానూ ఆ విషయమే ఆలోచిస్తున్నానని అన్నాడు. వాళ్లు పంపాతీరం
చేరారు.
పంపా సరోవరం చూసిన రామలక్ష్మణులు దాని
సౌందర్యానికి, వ్రతనిష్ఠ కల మునులతో కూడిన దాని మహిమకు ఆశ్చర్యపడి నేత్రానండంగా
దాన్నే చూసుకుంటూ పోయారు. దానికి కొంచెం దూరంలో వున్నమతమ్గు కొలనులో స్నానం చేసి ఆ
రాజకుమారులు సమీపంలోని అందమైన వనాలను చూస్తూ పోసాగారు. అలా పోతున్న వారికి అందమైన
తీగలతో ప్రకాశించే బొట్టుగు చెట్లు, మాదిఫల
వృక్షాలు, గన్నేరులు,
మొల్లతీగెలు, మర్రులు, ఏడాకుల
అరటులు, మొగలి చెట్లు, ఎర్ర
గన్నేరులు, మామిడితోపులతో కూడిన ఆ వనం అలంకరించబడిన పడుచులాగా వుంది. చిలుకలు,
గుడ్డికొంగలు, నేమిళ్ళు లాంటి మనోహరమైన పక్షుల ధ్వనులు వింటూ సంతోషంగా పంప చేరారు.
అప్పుడు రాముడు లక్ష్మణుడితో,
“ఈ పంప ఒడ్డున వున్న ఋశ్యమూకపర్వతం మీదనే కదా ఆ పుణ్యాత్ముడు సుగ్రీవుడున్నది?
శోకతప్తుడినై రాజ్యాన్ని కోల్పోయి, భార్యను
పోగొట్టుకుని ఎలా బతకాలి? కాబట్టి
మన పనికోసం నువ్వు సుగ్రీవుడిని చూడడానికి వెళ్లు. నేను పోవడం మర్యాద కాదు”. ఇలా
లక్ష్మణుడితో చెప్తూ, రామచంద్రమూర్తి అధికమైన దుఃఖంతో
పంపాతీరాన్ని చూడడానికి అనువైన స్థలానికి తమ్ముడితో కలిసి చేరాడు. అందమైన ఆ కొలను
చూసిన వారికి ఇన్నాళ్లు కలగని సంతోషం కలిగింది.
(సమాప్తం)
No comments:
Post a Comment