పంపను వర్ణించి శబరికి దర్శనం ఇమ్మని చెప్పిన కబంధుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-82
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (13-10-2019)
ఇంతదాకా
రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. తూర్పు,
దక్షిణం, పడమర సముద్ర తీరాలలో అంధ్ర,
పాండ్యాది దేశాలున్నాయి. కాబట్టి వాళ్లు తూర్పుకు పోలేదు. అదీకాకుండా కొండలు కూడా
అడ్డం వస్తాయి అటుపోతే. జటాయువు కూడా దక్షిణం వైపే పొమ్మని సలహా నిచ్చాడు. ఈ
మార్గానికి కిష్కింధ పడమరగా వుంది. అంటే కాకుండా శబరి ఆశ్రమానికి పోవడానికి తూర్పు
వైపు తప్ప మిగతా వైపున మార్గం లేదు. కొండలు అడ్డం వస్తాయి. కాబట్టి వీళ్లు
పడమరగానే పోయి, ఆ తరువాత తూర్పుకు తిరగాల్సి వుంటుంది. నాసిక దగ్గర పంచవటి అనే వాదన
చేసేవారికి ఇది వ్యతిరేకం.
ఈ నేపధ్యంలో సీత లభించే ఉపాయం చెప్పిన
కబంధుడు, ఇంకా ఇలా అన్నాడు. “ఇక్కడినుండి పడమరగా పోతే పండ్లతోనూ,
పూలతోనూ నిండిన తోటలు కనిపిస్తాయి. అందులో మారేళ్ళు,
నేరేళ్ళు, గన్నేరులు, గోగులు,
పనసలు, రేగులు, రావులు,
మామిడిలు, క్రోవులు,
ముంతమామిడిలు, వారిజాలు, కడపలు
లాంటి ఎన్నో చెట్లున్నాయి. ఆ చెట్ల పండ్లు తింటూ మీరు మరింత ముందుకు పోతే,
అక్కడ పూసిన చెట్ల వనం వుంటుంది. నందనవనంలాగా వున్న ఆ తోటలో అన్ని ఋతువుల్లో
అన్నిరకాల పండ్లు, పూలు లభ్యమవుతాయి. మేఘాలతోను,
పర్వతాలతోను, సమానంగా పండిన పండ్ల బరువుతో వృక్ష సమూహాలు నెలకు ఒరిగి వుండి
శోభిల్లుతూ అలరారుతాయి. పండ్లు తినుకుంటూ అడవీ-అడవీ, కొండా-కొండా
చూసుకుంటూ పొండి”.
పంపా సరస్సును వర్ణిస్తూ కబంధుడు
రాముడితో ఇలా అంటాడు. “బెగ్గురులతో,
రాజహంసలతో, చక్రవాకాలతో, మనోహర
ధ్వనులతో, పాచితీగలులేని జలాలతో,
ఇసుకనేలతో ప్రకాశిస్తూ వుంటుంది పంపా సరస్సు. నిర్మలమైన గట్టి చదరపు నేలల తీరాలు,
కొత్తగా వికసించిన కమలాలు, కలువలు,
మంచి వాసనలతో గుమ-గుమలాడే జలప్రవాహాలు కలిగిన పంప ఇంతవరకూ అనుభవించని సంతోషాన్ని
కలుగచేస్తుంది. అక్కడి జలాల్లో విహరించే పక్షులు మనుష్యులు తమదగ్గరికి
వచ్చినప్పటికీ, బెదరక, చలించక,
సంతోషంతో తిరుగుతూ వుంటాయి. ఆ సరస్సులో గండుచేపలు, చారలు,
రొయ్యలు, కొర్రలు,
బొమ్మడాయలు, వాలుగాలు,
ముళ్లులేని చేపలు నివసిస్తుంటాయి. మీకు కావాల్సినవి తీసుకోండి. లక్ష్మణుడు వాటిని
బాణాలతో కొట్టి, చర్మం ఒలిచి, రెక్కలు
పీకి, ఇనుపకడ్డీలకు గుచ్చి నిప్పులో పక్వం చేసి ముళ్లు తీసివేసి నీకు
భక్తితో తెచ్చి ఇస్తాడు. తృప్తిగా తిని, తామరాకుల
వాసనతో, సుఖకరమైన చల్లదనంతో,
స్ఫటికంలాగా తెల్లదనంతో,
సంతోషకరంగా వున్నా పంపాసరోవర జలాలను నీ తమ్ముడు తామరాకు దొప్పలో తెచ్చి ఇస్తే
సంతోషంగా తాగు. అడవిపందులు నీళ్ళు తాగడానికి పంపాతీరానికి రావడం నువ్వు చూస్తావు.
సాయంకాలం తిరుగుతుంటే విశేషించి పూసిన పూలను, చల్లటి
నీళ్ళను చూడవచ్చు”.
కబంధుడు ఇంకా ఇలా చెప్పాడు రాముడితో. “వికసించిన కమలాలు,
కలువలు, శ్రేష్టమైన ఇంపైన పూలతో నిండిన కానుగచెట్లు, బొట్టుగు
చెట్లు, మనోహరమైన పలురకాల ఇతర చెట్లు మీకు సంతోషం కలిగిస్తాయి. ఆ పూలను
మనుష్యులెవరూ ధరించరు. అవి ఎప్పటికీ వాడిపోవు. తొడిమలు వూడవు. ఆ స్థలంలో మతంగుడనే
మహాముని తపస్సు చేస్తుంటే అతడి శిష్యులు అడవినుండి కందమూలాదులు తెచ్చేవాడు. ఆ
సమయంలో ఆ శిష్యుల శరీరం నుండి చెమటలు రాలగా వాటివల్ల పుట్టినవి కాబట్టి అ అపూలకు
అలాంటి మహిమ కలిగింది. చెమట వల్ల పుట్టినవి కాబట్టి ఎవరూ ధరించరు. వారంతా ఆ స్థలం
వదిలిపోయారు కాని, వారి దాసిమాత్రం ఆ చోటు వదలలేదు.
దీర్ఘకాలం జీవించి వున్న, యతి
ధర్మాన చరిస్తున్న, గురుశుశ్రూష అనే పరమ ధర్మం
అనుష్టిస్తున్న ఆమె భగవత్సమానుడవైన నిన్ను,
సర్వ భూతాలచే నమస్కారాలు అందుకుంటున్న నిన్ను,
దర్శించి స్వర్గం చేరాలనుకుంటున్నది. నీరాక కొరకు వేచి చూస్తున్నది”.
“ఆ వనప్రదేశంలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది కాని మతంగుడి తపోమహిమవల్ల
ఒక్క ఎనుగైనా ఆ పక్కకు రాదు. ఆ సరస్సుకు పడమట మిక్కిలి రహస్యమైన ఆశ్రమం ఒకటి
వుంది. అక్కడ ఆ స్త్రీరత్నం ఎల్లప్పుడూ తపస్సు చేస్తుంటుంది. దేవతలా వనంతో,
ఇంద్రుడి నందనవనంతో సమానమై వింత-వింత పక్షుల గుంపులతో నిండిన ఆ అడవిలో నువ్వు
సంతోషంగా గడుపుతావు. అక్కడ ఆమెను చూసిన తరువాత పంపాసరోవరానికి పో. ఆ సరోవర
తీరంలోనే పూసిన చెట్లతో, మనోహరంగా
కనిపించే ఋష్యమూక పర్వతం వుంది. అక్కడ ఏనుగులు విశేషంగా తిరుగుతుంటాయి. ఆ కొండమీద
నిద్రపోయేవాడు కలలో ఏ సొమ్ము చూస్తాడో మేలుకోనగానే అది లభిస్తుంది. పాపాత్ములు ఆ
కొండమీద నిద్రపోకూడదు. ఒకవేళ పోతే, నిద్రలో
వారిని రాక్షసులు కొట్టుతారు. రామచంద్రా! ఇది బ్రహ్మ చేసిన ఏర్పాటు. మతంగాశ్రమం
సమీపంలో వుంటూ, పంపాతీరంలో తిరిగే ఏనుగు పిల్లల ఘీంకారాలు కొండమీదికి
వినపడతాయిఅక్కడి. పరిశుద్ధమైన అక్కడి చల్లటి కొలను నీళ్లను తాగిన అడవి ఏనుగులు
ఇష్టప్రకారం సుఖంగా వుంటాయి”.
“అక్కడి ఎలుగుబంట్లు, పులులు,
జింకలను చూడగానే నీకు శోకం ఉపశమిస్తుంది. ఆ పరవతంలో ఒక పెద్ద గుహ వుంది. దానికి
పెద్ద రాతిమూత వుంది. దాంట్లోకి ప్రవేశించడం మంచిదికాదు. ఆ గుహకు తూర్పు దిక్కుగా
ఒక మంచినీళ్ల మడుగుంది. ఆ మడుగు ఒడ్డున మంచి ఫలాలతో కూడిన చెట్లు,
జింకల మందలు వున్నాయి. ఆ గుహలో సుగ్రీవుడు వాలి భయంతో నలుగురు వానరులతో
నివసిస్తున్నాడు. ఒకానొకప్పుడు పర్వతం పైభాగంమీద సుగ్రీవుడు గుహ వదిలి
వస్తుంటాడు”.
ఇలా చెప్పి కబంధుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు పొమ్మని
ఆజ్ఞాపించారు. కబంధుడు సంతోషంగా పోయాడు. రామలక్ష్మణులు త్వరగా పడమటి దిశగా
పయనమయ్యారు.
No comments:
Post a Comment