Thursday, October 17, 2019

ఐదున్నర దశాబ్దాల క్రితం నాటి హైదరాబాద్ : వనం జ్వాలా నరసింహారావు


ఐదున్నర దశాబ్దాల క్రితం నాటి హైదరాబాద్
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (18-10-2019)
          1964 జూన్ నెలలో మొదటిసారి హైదరాబాద్ వచ్చాను. ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూడా బస్ స్టాండ్ చేరుకునే సరికి సాయంత్రం ఏడు దాటింది. అప్పట్లో ఎక్స్ ప్రెస్ బస్సు కాదది. ఒకరకమైన ఫాస్ట్ పాసింజర్ లాంటిది. చిక్కడపల్లి వెళ్లడానికి గౌలిగూడా నుంచి రిక్షా కుదుర్చుకున్నాం. రిక్షా వాడిని మొదలు "చల్తే క్యా" అని అడగాలి. అంతా హింది-ఉర్దూ కలిసిన భాష. "కహా జానా సాబ్" అని వాడు అడగడం...మేం చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" అని చెప్పడం, అంగీకరించిన రిక్షా వాడు "బారానా" (75 పైసలకు సమానం) కిరాయి అడుగుతే, మేం "ఛె ఆనా" (వాడడిగిన దాంట్లో సగం) ఇస్తామనడం, చివరకు "ఆఠానా" కు కుదరడం జరిగిపోయింది. గౌలిగూడా, ఇసామియాబజార్, సుల్తాన్ బజార్, బడీ చావిడి, కాచి గుడా చౌ రాస్తా, వై.ఎం.సి.ఏ మీదుగా చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" లో వున్న మామయ్య ఇంటికి చేరుకున్నాం. అలా మొదలైంది నా హైదరాబాద్ అనుభవం.

1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. విద్యా నగర్ అడ్డీకమేట్ లో ఒక గది అద్దెకు తీసుకున్నాను. నెలసరి అద్దె పది రూపాయల లోపే! అప్పట్లో నాన్న గారు నాకు నెలకు వంద రూపాయలు ఖర్చులకొరకు పంపేవారు. ఎంత ఖర్చు చేసినా ఇంకా డబ్బులు మిగిలేవి. అప్పట్లో, నారాయణ గుడాలోని "యాక్స్" టైలర్ దగ్గర కాని, "పారగాన్" టైలర్ దగ్గర కాని బట్టలు  కుట్టించుకుంటే కుట్టు కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. మొదట్లో "బాటం వెడల్పు" గా వుండే పాంట్లు కుట్టించుకునే వాళ్లం. ఆ తరువాత "గొట్టం" పాంట్ల ఫాషన్ వచ్చింది. అవి పోయి "బెల్ బాటం" వచ్చాయి. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫాషన్‌గా వుండేది.

విద్యా నగర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి "3-డి" బస్సు ఎక్కి, నారాయణ గుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని. ఒక్కో సారి "చారనా" బాడుగ ఇచ్చి "చార్మీనార్ చౌ రాస్తా" (ఇప్పటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ నుంచి "7-సి" బస్సెక్కి, వై.ఎం.సి.ఏ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని కాలేజీకి. చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండేదప్పట్లో. చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), గోలకొండ సిగరెట్ (నీలం రంగు పాకెట్ లో వచ్చే) కర్మాగారం అక్కడే వుండేవి. చార్మీనార్ చౌ రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి పక్కా రోడ్డు లేదప్పట్లో. ఆ మార్గంలో సిటీ బస్సులు నడవకపోయేవి. విద్యా నగర్ పక్కనే జమిస్తాన్ పూరాకు వెళ్లడానికి "రామ్ నగర్ గుండు" మీద నుంచి వెళ్లే వాళ్లం.

చార్మీనార్ చౌ రాస్తా-ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్ బండ్‍ను కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండ్‍ను కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. దానిని తొలగించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొదట్లో సాధ్యపడలేదు. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి టాంక్ బండ్ పక్కగా ప్రస్తుతం వున్న "ఫ్లయిఓవర్" కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకుని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. డ్రైవర్ కాకుండా ముగ్గురికంటే ఎక్కువగా టాక్సీలో కూర్చోనీయక పోయే వాళ్లు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. ఆటోలలో ఇద్దరు పాసింజర్లకే పర్మిషన్. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు.

సిటీ బస్సుల్లో ప్రయాణం ఇప్పటి లాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం చేసే వాళ్లం. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది. కనీస చార్జ్ ఒక "అణా"-ఆరు "నయాపైసలు" వున్నట్లు గుర్తు. ఉదాహరణకు విద్యా నగర్ నుంచి నారాయణ గుడాకు కాని, చార్మీనార్ చౌ రాస్తా నుంచి వై.ఎం.సి.ఏ కు కాని "అణా" లేదా ఆరు పైసలు రేటుండేది.

ఇంతకీ "అణా" ఏంటనే ప్రశ్న రావచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో కొన్నాళ్ల వరకు-బహుశా ఒక ఆర్నెల్ల వరకనుకుంటా, ఇంకా అణా-బేడలు చలామణిలోనే వుండేవి. అందుకే ఇక్కడ కొంత మన నాణాల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందేమో! ఆగస్ట్ 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అమల్లో వున్న కరెన్సీ నాణాలు "దశాంశ" తరహా నాణాలు కావు. రూపాయను పదహారు "అణా” లుగా, ఎనిమిది "బేడ” లుగా, నాలుగు "పావలా” లుగా, రెండు "అర్థ రూపాయ” లుగా విభజించి చలామణిలో వుంచారు. ఒక "అణా” కు నాలుగు పైసలు...రూపాయకు 64 పైసలు. 1957 లో "డెసిమల్" పద్ధతిలోకి చలామణిని మార్చింది ప్రభుత్వం. అయితే 1964 (నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల) వరకు, నాన్-డెసిమల్ (అణా, బేడ, పావలా...), డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా-పచ్చ రంగులో వుండేవి. ఆ తరువాత నాన్-డెసిమల్ నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో "నయా పైస” లుగా పిలిచేవారు. 1, 2, 5, 10, 20, 25, 50 (నయా) పైసల నాణాలు చలామణిలో వుండేవి.


విద్యా నగర్ నుండి హిమాయత్ నగర్ కు మారాం. ఒక గది అద్దెకు తీసుకున్నా. అద్దె పది రూపాయలు. ఇద్దరం వుండేవాళ్లం. చెరి ఐదు రూపాయలు. కాలేజీకి వెళ్లే దారిలో వై.ఎం.సి.ఏ కి ఎదురుగా "ఇంద్ర భవన్" అనే ఇరానీ రెస్టారెంటులో ఆగుతుండేవాళ్లం ఒక్కొక్కప్పుడు. అక్కడ కాకపోతే, కాలేజీ ఎదురు గుండా (ఇప్పటికీ వుంది) "సెంటర్ కెఫే" కి పోయే వాళ్లం. ఇరానీ "చాయ్" (బహుశా) 15 పైసలిచ్చి తాగే వాళ్లం. ఒక్కోసారి "పౌనా" తాగే వాళ్లం. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లం. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి "సాయిబాబా మిఠాయి భండార్" లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు.

చిక్కడపల్లి రోడ్డు మీద వున్న మరో హోటెల్ "గుల్షన్ కెఫే" కి కూడా వెళ్తుండేవాళ్లం. గుల్షన్ కెఫే సమీపంలో "రూబీ ఆర్ట్ స్టూడియో" వుండేది. పక్కనే "ప్రజా ఫార్మసీ మెడికల్" షాప్, దానికి ఎదురుగా "మహావీర్ మెడికల్ షాప్" వుండేవి. శెలవుల్లో హిమాయత్ నగర్‌లో వున్న "గాయత్రీ భవన్" కు కాని, నారాయణ గుడాలో వున్న తాజ్ మహల్ కు కాని టిఫిన్ తింటానికి వెళ్లే వాళ్లం. ఇక భోజనం ఎప్పుడూ నారాయణ గుడా తాజ్ మహల్ హోటల్లోనే. అప్పట్లో తాజ్ మహల్ లో 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కునే వాళ్లం. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లగలిగే వాళ్లం. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. నేను స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్ మహల్ హోటెల్ లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి!

నారాయణ గుడా తాజ్ మహల్ హోటెల్ లో సాయంత్రాలు కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ "ముర్కు" తిని, "వన్ బై టు" కప్పు కాఫీ తాగి (బహుశా అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట పడే వాళ్లం. తాజ్ మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్ పక్కనున్న పార్క్ లో కూచుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఒక్కో సారి స్నేహితులతో కలిసి, హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, తిరిగి తాజ్ మహల్ హోటెల్ కు వచ్చి భోజనం చేసి రూమ్ కు వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ వై.ఎం.సి.ఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్ బజార్, కోఠి తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం. హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత వెళ్లాలంటే కొంచెం భయమేసేది కూడా.

హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా నారాయణ గుడాలో "దీపక్ మహల్", హిమాయత్ నగర్ లో "లిబర్టీ", సికిందరాబాద్ లో "పారడైజ్", "తివోలీ" థియేటర్లుండేవి. సికిందరాబాద్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు. ముషీరాబాద్‌లో "రహమత్ మహల్" టాకీసుండేది. అలానే నారాయణ గుడా దీపక మహల్ పక్కన "రాజ్ కమల్" బార్ అండ్ రెస్టారెంట్ వుండేది. బహుశా అందులో మద్యపానం అలవాటు చేసుకోని వారు అరుదుగా వుంటారేమో! నాకు బాగా గుర్తుంది….. డిగ్రీ పరీక్షల్లో, చివరిగా, మాడరన్ ఫిజిక్స్ పేపర్ అయిపోయిన తరువాత, మధ్యాహ్నం పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, "గోల్డెన్‌ ఈగిల్" బీర్ తాగాను. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ నన్ను వదలలేదు. అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు వంద దాటి పోయింది...అప్పట్లో కేవలం గోల్డెన్‌ ఈగిల్ లాంటి ఒకటి-రెండు బ్రాండులే వుండగా, ఇప్పుడు లెక్క లేనన్ని వున్నాయి! 

1 comment:

  1. వ్యాసం చాలా బాగుంది, జ్వాలా గారు. Full of nostalgia. మీ బ్లాగ్ మీ ఇష్టమే అనుకోండి గానీ ... ఇటువంటివి ఎక్కువ వ్రాయండి మీ బ్లాగులో, ... ప్రభుత్వాన్ని పొగిడే పని కాక ... అని నాదొక ఉచిత సలహా.

    హైదరాబాదుకు మీరు 1964లో వచ్చానన్నారు, నేను కొద్ది కాలం తరువాత వచ్చాను. రిక్షాను "చల్తే క్యా" / "ఆతే క్యా" అని అడగడం నాకూ గుర్తుంది :). ఇక సినిమా హాళ్ళ గురించిన నా జ్ఞాపకాల దొంతర ప్రకారం ... సికింద్రాబాదులో Plaza Theatre, Lamba, గన్-ఫౌండ్రీ దగ్గర Lighthouse Theatre, నాంపల్లి సమీపంలో Asok, ప్రక్కనే Lata, కాచిగుడాలో Prabhat, నారాయణగుడా తాజ్ ప్రక్కన Venkatesa, YMCA Narayanguda Police Station ఎదురుగా Santi, మీ న్యూ సైన్స్ కాలేజ్ దగ్గర Shalimar వగైరా సినిమా హాళ్ళు కూడా ఉండేవి ... మరి ఇవన్నీ కూడా మీరు వచ్చేనాటికే ఉన్నాయో లేదా తర్వాత కాలంలో కట్టారో మీరే చెప్పాలి.

    పాత జ్ఞాపకాలను వర్ణిస్తున్నప్పుడు అప్పటి ధరల గురించి చెబుతూ ... ఫలానా వస్తువు మూడు రూపాయ"లే" ఉండేది, పావలా"కే" పళ్ళు దొరికేవి ... అంటారు చాలా మంది. నా అభిప్రాయంలో ... అప్పటి ధరలు అప్పటి ఆదాయాలకు తగినట్లుగానే ఉండేవి ... అని. కాబట్టి ఆ రోజుల్లో అన్నీ బాగా చౌకగా దొరికేవి అనే false అభిప్రాయం ఇప్పటి పాఠకులకు కలిగించినట్లవుతుందేమో?

    ReplyDelete