అయోధ్యలో రామాయణాన్ని గానం చేసిన కుశ లవులు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-37
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-12-2020)
ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ
లవులు ఎంతో సమర్థతతో,
వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో,
మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ
సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గానం చేస్తున్న వారి సొంపు-గానం-ఇంపు-కథ
పెంపు, వెరసి కర్ణ రసాయనంగా వినడం వల్ల, శ్రోతల కళ్ల నుండి ఆనంద
భాష్పాలు జల-జల రాలాయి. రామచంద్రమూర్తి చేస్తున్న అశ్వమేధ యాగం చూడడానికి వచ్చిన
మునీశ్వరులందరు కుశ లవులు గానం చేస్తున్న రామాయణాన్ని విని, ఆశ్చర్యపడి,
సంతుష్ట మనస్కులయ్యారు. ముని కుమారుల వేషంలో, మనోహర సుందరకారంలో,
సంగీత విద్యలో శ్రేష్ఠులై వున్న కుశ లవులను, మునీశ్వరులు మేలైన మాటలతో మెచ్చుకున్నారీవిధంగా: " ఆ హాహా, ఏమీ పాటల నీటు ! అరే ఏమీ పద్యాల హృద్యత ! సెబాసు ! ఏమీ అర్థపుష్ఠి ! ఔరా, ఏమి చిత్రం ! ఎంత కాలం క్రితం జరిగిన సంగతి? వీళ్లిప్పుడు పాడుతుంటే, ఇప్పుడే జరుగున్నట్లుందే
! ఏం ఆశ్చర్యం".
(ఇది జరిగినప్పుడు శ్రీరాముడికి 54-55 సంవత్సరాల వయస్సుంటుంది. సీతాదేవికి 47-48 సంవత్సరాలుంటాయి.
వాల్మీకి ఆశ్రమంలో విడిచి పెట్టినప్పుడు సీత వయస్సు 34 సంవత్సరాలు).
వాల్మీకి తమలాంటి ఋషే ఐనప్పటికి, ఆయన రచించిన గ్రంథాన్ని, ఏ మాత్రం అసూయపడకుండా, మునీశ్వరులందరూ ముక్త కంఠంతో పొగిడారు. ఎవరికి వారే మేలు-మేలని స్తుతించారు. వారిస్తున్న
ప్రోత్సాహంతో ఉప్పొంగి పోయిన కుశ లవులు, స్వరం-లయ-గ్రామం-మూర్ఛనలతో
రక్తికట్టిస్తూ,
వినే వాళ్లు పరవశించే విధంగా, మనోహరంగా మళ్లీ - మళ్లీ పాడారు. విని సంతోషించిన మునులు వారికెన్నో
బహుమానాలిచ్చారు. కొందరు చిత్రాసనాలిస్తే ఇంకొందరు జంద్యాలిచ్చారు. మోంజిలు, పాత్రలు,
కమండలాలు, దండాలు, ఇతరత్రా ప్రియమైన వస్తువులెన్నో ఇచ్చారు మునులందరూ. ఏమీ ఇవ్వలేనివారు
దీర్ఘాయుష్యులు కమ్మని దీవెనలిచ్చారు. (ఇవన్నీ బహుమానాలే కాని, దానాలు కావు. భగవత్ కథలు, పురాణాలు చెప్పేవారు
ప్రతి ఫలాపేక్ష లేకుండానే చెప్పాలి-వినేవారు మాత్రం వారిని సత్కరించాలి).
గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో, సందుల్లో-గొందుల్లో,
రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. పాడుతున్న బాలకులు, నెత్తిపై ముందున్న వెంట్రుకలను ముడేశారు - వెనుకనున్న వెంట్రుకలను
జారవిడిచారు. పౌర్ణమి నాటి చంద్రుడిని బోలిన ముఖంపైన గోపీ చందనాన్ని రేఖగా
దిద్దారు. ఎడమ భుజంపైన వీణ దండాన్ని-ఎడమ చేతిలో సొరకాయ బుర్రను వుంచారు. మెడలో
ఒంటి జంద్యముంది. నడుంపైన చిన్న నార వస్త్రం చుట్టారు. లేత కుడిచేతి వేళ్ళతో
వీనతంత్రులను మీటుతూ,
మనోహరమైన రాగాలతో కాలం-తాళం తప్పకుండా, వాడ-వాడ తిరుగుతూ,
రామాయణ గానం చేశారు కుశ లవులు.
(వీణలు రెండు రకాలు. శ్రుతి వీణ, స్వర వీణ. 22 శ్రుతులకు ఉపయోగించేది శ్రుతి వీణ. సప్త స్వరాలకుపయోగించేది స్వర వీణ. ఏక
తంత్రికి బ్రహ్మ వీణన్న పేరుంది. రెండు తంత్రులుంటె నకులం అంటారు. విపంచికి ఇరవై
ఒక్కటుంటాయి. మత్తకోకిలం,
స్వర మండలం, ఆలాపిని, కిన్నరి,
పినాకి, పరివాదిని, నిశ్శంక గా మరి కొన్నిటిని పిలుస్తారు. సరస్వతి వీణను కచ్ఛపి అని, నారదుడి వీణను మహతి అని, తుంబురుడి వీణను కళావతి
అని, విశ్వావసు వీణను బృహతి అని అంటారు).
అయోధ్యలోని యజ్ఞ శాలలో వున్న
జనులు-మునులు అందరూ,
వాల్మీకి రచించిన కావ్యం గురించి-దాని మహిమ
గురించి-శ్రేష్ఠత గురించి,
వీధి-వీధిలో చెప్పుకోవడం జరిగింది. ఆ మహర్షి ఎంతటి
మహిమాన్వితుడో కదా అని ఆయన్ను పొగడసాగారు. భావితరాల కవీశ్వరులు రచించబోయే
కవితలకు-కావ్యాలకు వాల్మీకి రామాయణం ఆధారమౌతుందని, రాగాలకు యోగ్యమైనదిగా భావించబడుతుందని, ఓపికగా వినేవారి చెవులకు
అమృత ధార అవుతుందని,
చదివినవారి ఆయువు వృద్ధి చెందుతుందని పొగడ్తలతో దాన్ని
గురించి చెప్పసాగారు. సముద్రంలో వున్న రత్నాలలాగా, రామాయణంలో వున్న సద్గుణాలు అనంతమని, నవరసాలకు నిలువ నీడైనదని, వ్యాధులను వుపశమించే దివ్యౌషధమని, ఆత్మ జ్ఞానాన్ని వృద్ధి
చేస్తుందని పొగిడారు దాన్ని. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి, వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.
No comments:
Post a Comment