“జనకాత్మజ సంబంధమున రాముం డప్రమేయ పురుతేజుం డయ్యె”
వనం
జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి,
హైదరాబాద్ కేంద్రం ఆదివారం ఉదయం ప్రసారం
పద్నాలుగు వేలమంది రాక్షస శ్రేష్టులు, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు, శ్రీరాముడి
చేతిలో చావడం కళ్లారా చూసిన శూర్పనఖ, ఏడ్చుకుంటూ, రావణుడు
పాలించే లంకకు పోయింది. పోయి అక్కడ తన అన్నను చూసి తనకు జరిగిన అవమానం, ఖర దూషణాదుల
చావు గురించి వివరంగా చెప్పింది.
“ఓరీ! నీ పక్కనే కాచుకున్న మృత్యుదేవతను కనుక్కోలేక పోతున్నావుకదా!
వేగులవాళ్ళను ఏర్పాటుచేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎవరు
మిత్రులో, ఎవరు
శత్రువులో తెలుసుకోలేకుండా, వున్నావు. నీకు సరైన వేగులు లేనందున నీ
జనస్థానంలో నీ బంధువులందరూ చచ్చిన వార్త నీకెలా తెలుస్తుంది? ఖరదూషణాది
బంధువులతో సహా పద్నాలుగువేల మంది రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే యుద్ధభూమిలో
నాశనం చేశాడు. నీకు విరోధులై, నీ కీడు కోరే రాక్షసులకు ఇక రావణుడి వల్ల భయం
లేదు. తాను రక్షిస్తానని చెప్పాడు. దండకారణ్యంలో నీ వాళ్ల భయం లేకుండా కూడా
చేశాడు. ఇవన్నీ అతిబలవంతుడైన రామచంద్రుడు ఒక్కడే చేశాడు” అని అంటుంది. ఇంకా ఏవేవో
మాటలతో దెప్పి పొడిచింది.
ఈ విధంగా శూర్పనఖ చెప్పిన మాటలకు రావణుడు
ఆమెను, రాముడు
ఎలాంటి పరాక్రమం కలవాడు, ఏ ఆయుధం కలవాడు, మనుష్యుడా? దేవతా? అని తనకు
కావాల్సిన విషయాల గురించి ప్రశ్నించాడు. శూర్పనఖ రాముడి ఆకారం మరిచిపోదామన్నా
మరువలేక, కళ్ళకు
కట్టినట్లు వుండడం వల్ల, ఆయన ఆకార సౌందర్య వర్ణనతో జవాబిచ్చింది.
తమ్ముడు లక్ష్మణుడి పరాక్రమం గురించీ, సీత సౌందర్యం గురించీ
కూడా వర్ణించింది.
“సీత ఎవరికి భార్యో, ఎవరిని ఆమె
సంతోషంగా కౌగలించుకుంటుందో, ఆ పురుషుడు మూడులోకాలలో ఇంద్రుడి కంటే
గొప్పవాడై పేరుతెచ్చుకుంటాడు. చక్కటి సౌందర్యం, నడవడి కలిగి
స్త్రీలలో శ్రేష్టురాలైన ఈ సీత నీకు తగిన భార్య. ఆమెకు నువ్వు తగిన భర్తవి.
ఇద్దరినీ పోల్చి చూసి ఆ సీతను తెచ్చి నీకివ్వాలని భావించి నేనక్కడికి పోయాను. నా
ఆలోచన తెలుసుకున్న లక్ష్మణుడు నేను మొత్తుకుంటున్నా వినకుండా, నన్ను
పట్టుకొని నా ముక్కు, చెవులు మొదలంటా కోశాడు. నువ్వే స్వయంగా పోయి ఆ
సొగసుగత్తెను కళ్లారా చూస్తే, ఆమె కావాలని పట్టుబట్టుతావు. నువ్వు జానకిని
భార్యగా చేసుకోవాలంటే అది సాధించడానికి తక్షణం బయల్దేరు. ఇప్పుడే దండకారణ్యంలో సీత
వున్న చోటుకు పో. రామలక్ష్మణులను యుద్ధంలో చంపు. సీతను తీసుకొచ్చి నీ ఇష్ట ప్రకారం
సుఖపడు” అని అన్నది.
శూర్ఫనఖ మాటలు విన్న రావణుడు, మంత్రులతో
ఆలోచించి, కార్యం ఎలా
చేయాలో నిర్ణయించుకొని, వాళ్లను పొమ్మని పంపి, ఎలా
ముందుకుపోవాలో ఆలోచన చేశాడు. రావణుడిలా అనుకుంటాడు: “ప్రాణం పోగొట్టుకొనైనా మానం రక్షించుకోవాలి.
కాబట్టి వూరుకోవడం మానహానికరం. అపకీర్తికరం. ప్రతీకారం చేయాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? బహిరంగంగా
యుద్ధానికి పోవాలా? యుద్ధంలో నేనే జయిస్తానని నమ్మకం ఏంటి? కాబట్టి ఇది
అపాయం. వంచన చేసి సీతను అపహరించి తెస్తే, ఎక్కడో వున్న వాళ్లను
ఇంటిమీదకు నేనే తెచ్చినట్లు అవుతుంది. వారిక్కడికి వస్తే వూరికే పోరు. మరో విధంగా
ఆలోచిస్తే,
రామలక్ష్మణులు నా గురించి తెలుసుకొనడం, తెలిసినా సముద్రాన్ని
దాటడం, లంకకు రావడం, యుద్ధంలో
గెలవడం, ఇరువురు
మనుష్యులకు అసంభవం. ఒకలా వేళ అలా కాకపోతే, భార్యను
కోల్పోయిన బాధతో, అవమానంతో, చావనే చస్తే మరీ మంచిది. సీతను వశపర్చుకుంటే
నాకే భయం లేదు. ఆ విషయం వాళ్లకు తెలియగానే చస్తారు”.
ఇలా నిశ్చయించుకొని, మనస్సు దృడం
చేసుకొని, రహస్యంగా
రథాన్ని సిద్ధం చేసి తీసుకొని దానిమీద ఆకాశ మార్గాన రావణాసురుడు సముద్రాన్ని
దాటాడు. ఆ వనంలో ఒక ప్రదేశంలో, నిర్మలమైన స్థలంలో, మితాహారుడై, చలించని
ఇంద్రియ నిగ్రహంతో, జింక చర్మం ధరించి, జడలతో, నారవస్త్రాలు
కట్టుకుని తపస్సు చేస్తున్న మారీచుడి దగ్గరకు పోయాడు రావణుడు. మారీచుడు అతడిని తగు
విధంగా మర్యాదలు చేశాడు. మళ్లీ ఎందుకు వచ్చావని అడిగాడు రావణుడిని మారీచుడు.
మారీచుడి ప్రశ్నకు జవాబుగా రావణుడు.
“ఆర్తుడనై వచ్చాను. మహాత్మా! నా ఆర్తి పోగొట్టడానికి నువ్వు తప్ప నాకు వేరే గతి
లేదు. నా తమ్ములు ఖరుడు, దూషణుడు, ముద్దుల
చెల్లి శూర్ఫనఖ, అతి శూరుడైన
త్రిశిరుడు, పద్నాలుగు
వేలమంది రాక్షసులు రాముడి మీద కోపంతో యుద్ధానికి పోగా, అతడు వారందరినీ
చంపాడు. అంతే కాకుండా మునులంతా దండకారణ్యంలో భయం లేకుండా తిరగొచ్చని చెప్పాడు.
రాముడు నాతో విరోధం లేకున్నా నిష్కారణంగా నా చెల్లెలి ముక్కు-చెవులు బలగర్వంతో
కోశాడు”.
రాముడు ఇలాంటివాడు కాబట్టే,
దేవతాస్త్రీతో సమానమైన సౌందర్యం కల అతడి భార్య జానకిని తీసుకురావడానికి తాను
పోతున్నాననీ, మారీచుడు
తనకు తోడుగా రావాలనీ, తన తమ్ములు, మారీచుడు, తనకు సహాయంగా
వుంటే యుద్ధంలో దేవతలనైనా గడ్డిపోచలాగా చూస్తాననీ, ఇది తన
నిశ్చయం అనీ, అంటాడు
రావణుడు మారీచుడితో.
రావణుడు చెప్పిన రాముడి వృత్తాంతాన్ని
ఆసాంతం విన్న మారీచుడు, రామచంద్రమూర్తి శౌర్యం తెలిసనవాడైనందున, తన
ప్రాణానికే ముప్పు వచ్చిందికదా! అని గుండెలు ఝల్లన భయపడ్డాడు. నిశ్చేష్టుడయ్యాడు.
తెప్పరిల్లి, వణకుతూ, నోట
తడిలేకపోవడంతో పెదవులు నాకుతూ, ధైర్యం చెడి శవంతో సమానమై పోయి, రావణుడిని
చూస్తూ భయంతో, రెండు చేతులూ
జోడించి, తనకు
క్షేమకరమైన విధంగా ఇలా అంటాడు. “రావణా! రామచంద్రుడితో విరోధం వద్దని
మొన్ననే నేను చెప్పాను. సరే అని అంగీకరించి పోయావు. ఇంతలో మనస్సు మార్చుకొని మళ్లీ
వచ్చావు. నీ మేలు కోరేవాడిని కాబట్టి నీకు లాభం చేకూరే మాటలనే చెప్తా”.
“రాముడి వృత్తాంతాన్ని నీవెరుగవు. ఆయనకే
కోపం వస్తే లోకంలో రాక్షస జాతి అనేది పేరుకుకూడా వుండదు. రాముడి నుండి సీతను వేరు
చేద్దామని చూస్తున్నావా? ఇది నీకు సాధ్యమా?
రామచంద్రమూర్తి వల్ల ఆమె రక్షించబడుతున్నది. రాముడి నుండి వేరు చేస్తే రక్షకుడు
లేనందువల్ల నువ్వు చెప్పినట్లు వింటుందని అనుకుంటున్నావు. ఆమె తన పాతివ్రత్యంతో
తనను తానూ కాపాడుకుంటున్నది. తన రక్షాభారం ఇతరుల మీద వేయలేదు. కాబట్టి నువ్వు
అపహరించినా ఆమె నీకు లోబడుతుందని భావించకు. తమను తాము కాపాడుకోలేని వారేకదా
పరరక్షణ కోరేది? కాబట్టి నీ
ఉద్దేశం కొనసాగదు. సీతాదేవిని నువ్వు అపహరించాలని చూస్తున్నావు. ఆమె సమీపంలోకి
నువ్వు పోగలిగితే కదా, నువ్వు ఆమెను అపహరించడం? ఆమెను
రాముడనే అగ్నిహోత్రం చుట్టుకొని రక్షిస్తున్నది. ‘జనకాత్మజ సంబంధమున రాముం డప్రమేయ
పురుతేజుం డయ్యెను’. సీతాదేవి సంబంధమున చేసి రాముడు ఛేదింపరాని గొప్ప తేజం
కలవాడయ్యాడు. అలాంటి రాముడి విల్లు రక్షిస్తుంటే సీతను తేవడం నీకు సాధ్యమా? నువ్వు
రాముడికి కోపం వచ్చినా చెడుతావు. సీతకు కోపం వచ్చినా చెడుతావు. ఇక, ఇరువురికీ
కోపం వస్తే నీ గతేంటి? ఆలోచించి ఆ వైపుకు వెళ్లు” అంటాడు.
“రాక్షసరాజా! రామచంద్రమూర్తితో
విరోధిస్తే నీ కోరికలు, రాజ్య భోగాలు, సుఖాలు, ప్రాణం, వీటిలో
ఒక్కటైనా మిగలదు. కాబట్టి నీకింకా కొంతకాలం సుఖపడాలనుకుంటే,
రామచంద్రమూర్తి మనస్సు నొచ్చుకునే పనేమీ చేయొద్దు. నిన్ను నేను
ప్రార్థిస్తున్నాను. నువ్వు లంకకు వెళ్లిపో. అక్కడ నీ మేలుకోరే
విభీషణుడులాంటివారిని రహస్యంగా కాకుండా నిండు సభలో చూడు. నువ్వు అనుకున్న పనిలో
గుణమెంతో వాళ్లు చెప్తే విను. దాంట్లో ఏది బలమో, ఏది దుర్బలమో, నీ బలమెంతో, రాముడి
బలమెంతో నిశ్చయం చేసుకో. ఆ తరువాత ఇది మనకు మేలనీ, ఇది మనకు
కీడనీ తేల్చుకుని ముందుకుపో. నాకు తోచింది నేను చెప్పాను. రామచంద్రుడిని నువ్వు
యుద్ధరంగంలో సమీపించవద్దు. నా మాట విను. నీకు మేలు కలుగుతుంది” అని అంటాడు. శ్రీరాముడి
బలపరాక్రమాలను వివరంగా, విడమర్చి చెప్పిన మారీచుడు, అంతటితో
ఆగకుండా, శ్రీరాముడితో
తాను పడ్డ పాట్లు చెప్పాడు రావణుడితో.
మారీచుడి హితవాక్యాలు రావణుడికి
రుచించలేదు. రావణుడు మారీచుడితో నిష్టూరాలు పలుకుతూ ఇలా అన్నాడు. “ఓరీ! మారీచుడా!
నిన్నెవడురా ఈ కథలు చెప్పమని అడిగాడు? రాముడు మనుష్యుడు, మూర్ఖుడు, పాపాత్ముడు.
అలాంటివాడిని నాతో సమానం అనుకొని యుద్ధానికి పోతానా? ఏమీ నీ
అహంకారం? నేనొక
పనిచేద్దామని నీ సహాయం కోరితే, అది రాచధర్మం అని తెలుసుకోకుండా, తెలివిలేక, ఏవేవో
పనికిరాని మాటలు ఇంతసేపు చెప్పావు. నువ్వు నాకు చేయాల్సిన సహాయం గురించి చెప్తా
విను. వెండి చుక్కలు కల బంగారు జింకగా మారు. రామాశ్రమం దగ్గర సీత ఎదురుగా
సంచరించు. నీ వ్యవహారం చూసి నువ్వు నిజమైన జింక అని నమ్మి, ఆశ్చర్యపడి, సీతాదేవి
నిన్ను పట్టుకొని రమ్మని మగాడిని పంపుతుంది. నువ్వు ఆరాముడిని దూరంగా తీసుకుపోయి
అక్కడ జానకీ! లక్ష్మణా! అని చనిపోయేవాడి గొంతుతో రాముడు గొంతులా అనిపించేట్లు
బిగ్గరగా అరువు. అది రాముడి గొంతని నమ్మి సీత భయంతో రాముడిని చూసి రమ్మని
లక్ష్మణుడిని పంపుతుంది”.
“అన్న మీద ప్రేమతో లక్ష్మణుడు రాముడిని
వెతకడానికి పోతాడు. ఆ రాజకుమారులు ఇరువురూ లేనప్పుడు రాముడి భార్యను అపహరించి
భార్యగా చేసుకొని సుఖపడతాను. ఈ మాత్ర్తం సహాయం నువ్వు చేసి నీ ఇష్టం వచ్చిన చోటుకు
వెళ్లు. పని పూర్తి కావడానికి నువ్వు ముందు పో. నీ వెనకాలే నేను రథం మీద వస్తాను.
రాముడిని మోసం చేసి సీతను అపహరించి, యుద్ధమనేది లేకుండా సుఖంగా కొంచెం సేపట్లోనే
ఇంటికి పోతాను. నువ్వు దీనిని చేయకపోతే నిన్ను ఇప్పుడే చంపుతాను. అలా కాకుండా నేను
చెప్పింది నీకు అంగీకారమైతే నేను చెప్పినట్లే చేయి. అలా కాదని, నీకిష్టం
లేదంటావా,
నీ
చేత బలవంతంగానైనా చేయిస్తాను. తప్పదు. కాబట్టి తెలివి తెచ్చుకో. నేను చెప్పినట్లు
అక్కడికి పోతే నువ్వు చావడం సందేహం, తప్పించుకోవచ్చు కూడా. ఇక్కడ ఇలానే వాగుతుంటే
నా చేతిలో నీకు చావు తధ్యం. అక్కడికి పోవడం మేలో, లేదా ఇక్కడ
చావడం మేలో, ఆలోచించి తగిన
విధంగా చేయి”.
రావణుడిలా రాజులాగా ఆజ్ఞాపించడం విన్న
మారీచుడు, నిష్టూరంగా, ఆయన మాటలకు
విరుద్ధంగా, ప్రతికూలమైన
మాటలతో జవాబిచ్చాడిలా: “నేను పోవడమంటే చావడమే! ఆయన కళ్లకు కనబడ్డ దాకే నా జీవితం.
ఇక్కడ నేనొక్కడినే చస్తాను. నువ్వేమో సీతను అపహరించుకుని పోయి బంధువులతో సహా
చస్తావు. ఇది నమ్ము. నన్ను చంపించి నువ్వు బతకడం కల్ల. సీతాదేవిని ఎత్తుకుపోతే
అందరూ నాశనమే!”.
ఇదంతా చెప్పిన మారీచుడు రావణాసురుడిని
చూసి, ఇంకా తాను
ఆయన మాట వినడం ఆలశ్యం చేస్తే, వెంటనే చంపుతాడేమో అన్న భయంతో పోవడానికి
సిద్ధమయ్యాడు. ఆశ్రమం సమీపానికి పోయారిద్దరూ. నిమిషంలో మారీచుడు శ్రేష్టమైన
జింకలాగా ఆ అరణ్యంలో తిరుగుతూ, రాముడి తపోవనం సమీపించాడు. జానకీదేవిని
మోసగించడానికి ఆ రాక్షసుడు జింక వేషంలో అక్కడే ఎక్కడ తిరిగితే తనను సీత చూడగలడో
అక్కడే తిరగసాగాడు. అలా తిరుగుతూ, దూరంగా పరుగెత్తుతూ,
వెనుకా-ముందుకూ కదలుతూ సమయం కోసం వేచి చూడసాగాడు. ఈ ప్రకారం అడవిలో తిరుగుతున్న ఆ
మృగాన్ని చూసి ఇతర మృగాలు నిజమైన మృగమని భ్రమించి దగ్గరకు వచ్చి వాసన చూసి బెదిరి
పోసాగాయి. ఇలా అది తిరుగున్న సమయంలోనే జానకీదేవి కంట పడింది.
(వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment