మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గమా?
వనం
జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం ఆదివారం (27-12-2020) ప్రసారం
సీతాదేవి
కనపడనందుకు, చింతించి జగత్ సంహారానికి సిద్ధపడ్డ శ్రీరాముడిని
శాంతింప చేసే ప్రయత్నంలో లక్ష్మణుడు అన్నకు ఎన్నో విషయాలను చెప్తాడు. ఆయన పాదాలమీద
పడి నమస్కరించి, “అన్నా! పూర్వజన్మలోనే కాకుండా ఈ జన్మలోనూ విస్తారంగా తపస్సు చేసి,
ఎన్నో అశ్వమేధయాగాలను చేసి, మరెన్నో
గొప్ప పుణ్యకార్యాలను చేసి, మన
తండ్రి అతి కష్టంతో దేవతలు అమృతాన్ని సంపాదించినట్లు నిన్ను కన్నాడు” అని అంటాడు.
శ్రీరామచంద్రమూర్తిని
అమృతంతో పోల్చడం అంటే, అమృతం వల్ల దానికేమీ లాభం లేదు
కాని, దాన్ని అనుభవించిన దేవతలకే లాభమని అర్థం. అలాగే శ్రీరాముడు దేవతలకు,
లోకులకు భోగ్యుడై వారికి మేలు చేయడానికి పుట్టాడని అర్థం. లోకాన్ని ఉద్ధరించడానికి
పుట్టిన శ్రీరాముడు లోకాలను నాశనం చేయడం తగదని లక్ష్మణుడు అంటున్నాడు. అలాగే,
అమృతాన్ని సంపాదించడం కోసం ముప్పైమూడు కోట్ల దేవతలు కష్టబడ్డారు కానీ,
రాముడి కొరకు ఒక్క దశరథుడే కష్టపడ్డాడని భావన. అమృతం ఎలా రాక్షసుల వినాశనానికి
కారణమైందో అలాగే రాముడు కూడా రాక్షస సంహారం చేయాలని చెపుతున్నాడు లక్ష్మణుడు.
అందుకే, దేవతలమీద, ఇతర
భూతాల మీద కోపం చూపకుండా,
అమృతంలాగా ఎల్లప్పుడూ నిర్మలంగా వుండాలని సూచన ఇచ్చాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడు
ఇంకా ఇలా చెప్పాడు రాముడికి. “నీలో తప్ప ఇతరుల్లో లేని నీ కళ్యాణగుణాలకు సంతోషించి
మన తండ్రి నిన్ను ఎడబాసిన కారణాన మరణించాడని భరతుడు చెప్పాడు కదా?
అలాంటి కళ్యాణగుణాలను వదిలి ఇలాంటి హేయగుణాన్ని చేపట్టి,
లోకానికి ఉపద్రవం కలిగిస్తే, మన
తండ్రి నీవిషయంలో ఏమని భావిస్తాడు? రాముడు
సౌమ్యుడు, సాధువు, జితేంద్రియుడు,
శాంతుడు అనుకున్నానే? ఇంతటి క్రూరుడా,
అని అనుకోడా? నువ్వు
చేయాలనుకున్న లోకోపద్రవం తండ్రికి కూడా చేసినట్లే కదా?
తన నాశనానికా తండ్రి నిన్ను కన్నది?
కకుత్థ్సుడి వంశంలో పుట్టిన వాళ్లలో శ్రేష్టుడివైన నువ్వు, మహాశుద్ధసత్త్వం
కల నువ్వు, అప్రాకృతుడవైన నువ్వు,
కకుత్థ్సుడిలాగా దేవతలను, లోకులను
రక్షించాల్సిన నువ్వు, శోకంతో సహించలేని విధంగా
పరితపిస్తుంటే, ప్రకృతిబద్ధులైన ఇతరులందరూ దుఃఖం సహించగలరా?
అలాంటి వారిలోనే దుఃఖం అణచుకునేవారు
కనిపిస్తుంటే నువ్వు దుఃఖపడడం శోచనీయం”.
“జగాలను
పుట్టించే భారం బ్రహ్మదేవుడిది. సంహరించే భారం రుద్రుడిది. రక్షించే భారం నీది.
అలాంటి నువ్వు ధర్మాన్ని వదిలి లోకులను సంహరించాలనుకుంటే భూప్రజలకు రక్షకుడెవరు
దొరుకుతారు? పైరును రక్షించడానికి వేసే కంచే పైరును మేయడానికి సిద్ధపడితే ఇక
దాన్ని రక్షించే ఉపాయం ఏమిటి? లోకంలో
నువ్వొక్కడివే దుఃఖమనుభవించుతున్నానని అనుకోవద్దు. నీకున్నంత దుఃఖం ఎవరికీ
లేదనుకోవద్దు. ఎంత మహాత్ములైనా, దేవతా
శ్రేష్టులైనా, దైవ సంకల్పాన్ని దాటగలరా? ఎవరైనా
కష్టాలను ఎదుర్కోకుండా కాలమంతా సుఖంగా గడుపుతారా?
లేరుకదా? కాబట్టి ప్రాణులకు మేలు-కీడు స్వభాసిద్ధంగా వస్తాయి”.
“సీతాదేవి
రాక్షసుల చేతిలో చచ్చినా కూడా అందుకోసం నువ్వు గుండెలు పగిలేలా ఏడవవద్దు. అది
జ్ఞానంలేనివాడు చేయాల్సిన పని. నువ్విలా ఏడుస్తుంటే సీతాదేవి వస్తుందా?
ఏడ్వడం వల్ల దేహం, మనస్సు చెడడమే తప్ప మరేం లాభం
లేదు. జ్ఞానంకలవాడు దేనికీ దుఃఖపడడు. జీవకోటుల యథార్థస్థితి అయిన జననమరణాలు,
సుఖదుఃఖాలు, శోకసంతోషాలు,
సంయోగవియోగాలు లాంటివి నిత్యం జరిగేవి కావు. రావడం,
పోవడం వాటి స్వభావగుణాలు. కాబట్టి వాటికి
పరితాపపడడం మంచిదికాదు. నీచమైన హృదయ దౌర్బల్యం వదిలి, గొప్ప
మనస్సు చేసుకుని, ఇలా వ్యసనపడడం నీకు తగునేమో
ఆలోచించు. జ్ఞానం కలవారు స్వభావసిద్ధమైన బుద్ధిబలంతో మేలు-కీడులను పరీక్షిస్తారు”.
“పూర్వం
చేసిన పుణ్యపాపకర్మల గుణాలు కానీ, దోషాలు
కానీ, మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేం. మనం ఈ కర్మ చేశాం, మనకీ ఫలం
కలుగుతుంది, అని నిశ్చయంగా చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. ఈ కర్మ ఈ విధంగా చేయడం వల్ల
ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని కర్మ చేసిన విధం చెప్పడం కూడా సాధ్యపడదు.
కాని, కారణం లేకుండా ఏదీ జరగదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి,
దీనికి కారణమైన కర్మ ఎదో, ఎప్పుడో
చేశాం అని మాత్రం చెప్పగలం. అలాంటి కర్మ చేయడం వల్లే ఈ ఫలం కలిగిందని చెప్పవచ్చు.
మనకు కారణం తెలిసినా, తెలియకున్నా,
అనుభవించడం తప్పదు. కాబట్టి సుఖం అనుభవానికి వచ్చినప్పుడు మనం చేసిన పుణ్యం వల్లే
ఇది కలిగిందని కాని, దుఃఖం కలిగినప్పుడు మనం పూర్వం
ఏదో పాపం చేశామని అందుకే ఇది కలిగిందని భావించరాదు. సుఖం కలిగినందువల్ల పుణ్యమే
చేయాలని కాని, దుఃఖం కలగడం వల్ల పాపం చేయరాదని అనుకుని మనస్సు ధృడ పరచుకోవాలి.
సంతోషానికి పొంగక, దుఃఖానికి బాధపడక వుండాలి”.
“రామచంద్రా!
నువ్వు మూర్ఖుడివి కాదు. కార్యాకార్య, ధర్మాధర్మ
విషయంలో నీకుకల స్థిరజ్ఞానం దేవతలకు కూడా లేదు. అయినప్పటికీ దుఃఖాతిశయం వల్ల నీ
జ్ఞానం నివురుగప్పిన నిప్పులాగా నిద్రబోతున్నది. మనుష్యులను చూద్దామా,
వాళ్ళు నీదగ్గరకు వచ్చి తమ మీద కోపం ఎందుకని అడిగే సాహసం కూడా చేయలేరు. దేవతలేమో
నీమూలాన బాగుపడేవారు. కాబట్టి నీకు అపరాధం చేయరు. కాబట్టి వాళ్ళను ఎందుకు
బాధించాలి? వ్యర్థ కోపం వల్ల, వ్యర్థ
శోకం వల్ల ఏ పనీ కాదు. మనకపకారం చేసినవాడు ఎవడో కనిపెట్టి శూరుడివైన నువ్వు వాడిని
దండించు. దానివల్ల నీకు సీత మళ్లీ లభిస్తుంది. కీర్తీ కలుగుతుంది”.
చిన్నవాడైనా
తమ్ముడు లక్ష్మణుడు చెప్పగా విన్న పెద్దవాడైన రామచంద్రమూర్తి,
దాంట్లోని సారాన్ని గ్రహించి,
కోపంతో లోగడ చేద్దామనుకున్న పనిని వదిలి, విల్లు
ఆధారంగా నిలబడి, “నాయనా! లక్ష్మణా! సీతను వెదకడానికి ఏం చేయవచ్చు?
ఎక్కడికి పోదాం?” అని అడిగాడు. లక్ష్మణుడు జవాబుగా ఇలా చెప్పాడు. “ఈ జనస్థానంలో
పెద్ద-పెద్ద మృగాలు, గుహలు,
కొండలు, చొరలేని మార్గాలు వున్నాయి. కిన్నరుల ఇండ్లున్నాయి. భయంకరమైన
రాక్షసుల దీనంలో వుందిది. పెద్ద-పెద్ద చెట్లున్నాయి. కాబట్టి రాక్షసులు సీతను
తెచ్చి ఇక్కడే, ఎక్కడో దాచిపెట్టి వుంటారు. కాబట్టి సీతాదేవిని ఇక్కడే ఎక్కడో
వెతకాలి. నీలాంటి బుద్ధి సంపదకలవాడు ఆపద వస్తే చలించాలా?
ఎంత గట్టిగా గాలి వీచినా కొండలు కదులుతాయా?”.
ఇలా చెప్పగా రామచంద్రమూర్తి తమ్ముడు తనవెంటరాగా అడవి ప్రదేశమంతా వెతికాడు.
ఇలా వెతుక్కుంటూ పోగా-పోగా,
ఆ పర్వతం దగ్గరే ఒకచోట పెద్ద కొండలాగా వున్న, నెత్తుటితో
తడిసిన, పుణ్యాత్ముడిని, ప్రాణం
పోయినా సరే స్వామికార్యం చేయాలన్న భక్తి కలవాడిని,
పక్షి శ్రేష్టుడిని, జటాయువును చూశారు రామలక్ష్మణులు. అతడు
రాక్షసుడని భ్రమించి, జటాయువుకు ఎదురుగా పోయి,
ఒక తీవ్ర బాణాన్ని సంధించగా భూతలం వణికింది. అప్పుడు గద్గద స్వరంతో పక్షిరాజు
రామచంద్రుడితో ఇలా అన్నాడు.
“సీతను,
రావణుడు అపహరించాడు. బలవంతంగా ఆమెను ఎత్తుకుని ఆకాశమార్గాన పోసాగాడు. అది చూసిన
నేను, విసురుగా వాడికి అడ్డం పోయాను. వాడిని ఎదిరించి వాడితో బలం కొద్దీ
యుద్ధం చేసి వాడి రథాన్ని నేలపడగొట్టాను. వాడిని కింద పడేశాను. నేను విరిచిన
విల్లు ఇక్కడే పడి వుంది. పొది కూడా ఇక్కడే పడిపోయి వుంది. నా రెక్కల దెబ్బకు
చచ్చిన సారథి ఇక్కడే పడిపోయి వున్నాడు. నేను ముసలివాడినై అలసిపోయాను. అప్పుడు వాడు
తన కత్తితో నా రెక్కలను తెగనరికి నేలమీద పడేసి,
సీతను పట్టుకుని ఆకాశమార్గాన పరుగెత్తాడు. నీ భార్య కోసం ముందే రావణుడు నన్ను
చంపాడు. నా స్నేహితుడైన దశరథుడి పుత్రా! చావడానికి సిద్ధంగా వున్న నన్ను నువ్వు
కూడా చంపాలా?”
జటాయువు మాటలు విన్న రాముడు తన విల్లు
దూరంగా పడవేసి, అతడిని కౌగలించుకుని,
తమ్ముడితో కలిసి ఏడ్చాడు. రెక్కలు నరకబడి నెత్తురుకారుతున్న జటాయువును తన చేత్తో
తుడిచి, సీత వృత్తాంతం చెప్పమని అడిగాడు. జటాయువు మెల్లగా రెప్పలు తెరిచి,
సన్నటి గొంతుతో జవాబిచ్చాడిలా. “రామా! వాడు మాయగాడు. రహస్యంగా సీతాదేవిని
బలాత్కారంగా పట్టుకుని ఆకాశమార్గాన పోయాడు. కత్తితో నా రెక్కలు నరికి అమితమైన
వేగంగా దక్షిణ ముఖంగా పరుగెత్తాడు. రాక్షసుడు సీతాదేవిని అపహరించిన ముహూర్తం
“వింద”. ఆ ముహూర్తంలో అపహరించబడిన సొమ్ము మళ్లీ స్వంతదారుడికి చేరుతుంది. తప్పదు.
ఆ రాక్షసుడు తొందరలో ఇది గమనించలేదు. కాబట్టి నీ భార్యను అపహరించినవాడు కాలం
మింగిన చేపలాగా అయిపోతాడు. రామా! సీతకొరకు నువ్వు ఆందోళనపడవద్దు. నువ్వు ఆ
రాక్షసుడిని యుద్ధంలో చంపి మళ్లీ సీతను గ్రహించి గొప్ప కీర్తిని సంపాదించి
సంతోషంగా అయోధ్యకు పోతావు”. ఇంతదాకా స్మృతి తప్పకుండా తెలివిగా చెప్పి,
జటాయువు ఆయన చూస్తుండగానే దేహం విడిచి స్వర్గానికి పోయాడు.
అలా నేలమీద పడ్డ జటాయువును చూసి
రామచంద్రమూర్తి బాగా దుఃఖపడి, తమ్ముడు
లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “తమ్ముడా! మన తండ్రి నాకెలా పూజ్యుడో,
ఇతడు కూడా అలా పూజ్యుడే. కాబట్టి తండ్రిలాగా నా చేత సంస్కారం చేయించుకోవడానికి
అర్హుడు. జటాయువుకు
అగ్నిసంస్కారాలు చేద్దామని నిశ్చయించుకున్న రాముడు తమ్ముడితో,
“లక్ష్మణా! నా పనికోసమై ప్రాణాలు విడిచిన ఈ పక్షిరాజును శాస్త్రప్రకారం నా
తండ్రిలాగే దహన సంస్కారం చేస్తాను. కాబట్టి చితి పేర్చు” అని జటాయువున్న దిక్కుగా
చూశాడు. చూసి, ఆయన్ను వైకుంఠ౦ పొందమంటాడు. పక్షి కాబట్టి కర్మాదికారం లేనందున,
అగ్నిసంస్కారానికి యోగ్యత లేనందువల్ల,
ఉత్తమలోకాలు లేకపోయినా తన ఆజ్ఞ వల్ల ముక్తిని పొందమని అంటాడు జటాయువును.
రామచంద్రమూర్తి బ్రహ్మవిధి ప్రకారం సంస్కరించి,
యోగులు పొందే సనాతమైన తన లోకాన్ని ఇచ్చాడు. రామానుగ్రహం వల్ల ఆ గద్ద పరమపదానికి
పోయి విష్ణుసారూప్యాన్ని పొందింది.
జటాయువు ఋషులలాగా మోక్షం కొరకు
పరమాత్మోపాసన చేయలేదు. అలాంటివాడికి రాముడెలా మోక్షం ఇచ్చాడు?
అలాగైతే అందరికీ ఇవ్వ వచ్చుకదా? అని
ఆక్షేపించవచ్చు. దీనికి సమాధానం: మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గం కాదు. చాలా
మార్గాలున్నాయి. భగవద్గీతలో కర్మ, జ్ఞాన,
రాజయోగాలు, భక్తీ, ప్రపత్తి,
క్షేత్రక్షేత్రజ్ఞజ్ఞానం, అవతార
జ్ఞానం లాంటివి చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రాలలో 32 విద్యలు చెప్పడం జరిగింది.
ఇవేవీ లేకున్నా ప్రేమ ఒక్కటే మోక్షసాధనమని శాస్త్రాలు చెప్తున్నాయి. అనన్యమనస్కుడై,
భగవంతుడి కోసం రాజ్యాన్ని,
ప్రాణాన్ని విడిచి ఆయన సమక్షంలో ఆయనమీదే దృష్టి నిలిపి ప్రాణం వదిలి,
ఆయన చేతులమీదుగా సంస్కారం పొందిన జతాయువుకే మోక్షం లేకపోతే ఇంకెవరికి వుంటుంది?
ఇలాంటివారికెవరికైనా మోక్షం ఇస్తాడు రాముడు కాని,
ప్రకృతిబద్ధులై, కామదాసులై, భక్తీ
శూన్యులైన వారందరికీ మోక్షం ఎలా ఇస్తాడు? జటాయువు
కంటే ఎక్కువ త్యాగం చేసినవారెవరు? కాబట్టి
జటాయువుకు మోక్షమివ్వడం న్యాయమే.
జటాయువును సొదమీద పెట్టి,
అగ్ని రగిలించి, తన తండ్రిలాగే ఆయనకూ నిప్పు పెట్టి జింక మాంసంతో పిండాలు చేశాడు. ఆ
పిండాలను లేతపచ్చిక మీద వుంచి,
బ్రాహ్మణులు స్వర్గప్రాప్తి కోసం మనుష్య ప్రేతాలను ఉద్దేశించి ఏ మంత్రాలను
చదువుతారో అవే చదివాడు. ఆ తరువాత గోదావరీ నదిలో తమ్ముడితో సహా స్నానం చేసి,
జటాయువుకు నీళ్లు వదిలారు. మరణించిన గద్ద రాజు మహర్షి సమానుడైన రామచంద్రుడి చేత
సంస్కారం పొంది పుణ్యలోకాలకు పోయాడు. ఇలా రామలక్ష్మణులు కర్మలు చేసి,
జటాయువు మీదనే మనసుంచి, సీతాదేవి
తనకు లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి,
సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకుని పోయారు. (వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment