వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ వుందా?
వనం
జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్రం ఆదివారం (13-12-2020) ప్రసారం
మారీచ మాయా జింకను శ్రీరాముడు
సంహరించగానే, వాడు చనిపోతూ, రాముడి
గొంతుతో అరవడంతో భ్రమించిన సీతాదేవి అన్నకు సహాయంగా మరది లక్ష్మణుడిని పొమ్మని
బలవంతం చేస్తుంది. పోకపోతే నిష్టూరాలు ఆడింది. నిందించింది. ఆమె మాట కాదనలేక, అయిష్టంగానే
లక్ష్మణుడు అన్నకు సాయంగా వెళ్తాడు. వెళ్తూ-వెళ్తూ కేవలం ఆమెను జాగ్రత్తగా వుండమని
మాత్రమే అన్నాడు కాని ఇతర రామాయణాల్లో చెప్పినట్లు ఎలాంటి రేఖా (లక్ష్మణ రేఖ)
గీయలేదు. ఆమెను ఫలానా హద్దులోనే వుండమని, గీత దాటవద్దనీ
నిర్దేశించనూ లేదు.
లక్ష్మణుడు అలా పోగానే, బిక్షాపాత్ర, కమండలాలు
ధరించి, బ్రాహ్మణ
సన్న్యాసి వేషంలో వచ్చిన (రావణాసురుడు) రాక్షసుడిని, తనకు
కీడుచేసే ఆలోచనలో వున్నవాడిని, రాక్షసుడని తెలిసీ,
బ్రాహ్మణుడిని పూజించిన విధంగానే పూజించింది సీతాదేవి. “ఇదిగో దర్భాసనం..ఇక్కడ
కూర్చో. ఇదిగో అర్ఘ్యం...ఇదిగో బాద్యం...సర్వం సిద్ధం. ఇదిగో నీ ఆహరం కొరకు
అడవిలోని పండ్లు....తృప్తిగా భుజించు” అని శాస్త్ర ప్రకారం చెప్తున్న సీతను, రాముడి
భార్యను, తన చావుకోరకు
రావణుడు బలాత్కారంగా అపహరించాలనుకున్నాడు. మాయా మృగాన్ని వేటాడడానికి పోయిన
రామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి వస్తాడేమోనని భయంగా అడవి నాలుగు దిక్కులా చూశాడు.
తనను బలాత్కారంగా తీసుకుపోదలచి రావణుడు
అలా ప్రశ్నించాడని సీత భావించింది. అతిథులను, అభ్యాగతులను
ఆదరించాల్సిన విధానం చక్కగా తెలిసిన సీత, రావణుడి మాటలు, వాడి ఆర్భాటం
విని,
చూసి, వీడు నిజమైన
సన్న్యాసి కాదనుకుంటుంది. సన్న్యాసి వేషం ధరించిన బ్రాహ్మణుడు అనుకుని, అతిథితో
అబద్ధం ఆడకూడదని, బ్రాహ్మణుడితో అసత్యం ఆడరాదని, అనుకుంటుంది.
వీడు దొంగ సన్న్యాసి కాబట్టి వంచకులకు వంచనతో సమాధానం చెప్పాలి అనీ, అలా చెప్పడం
దోషం కాదనీ, అల్ప కాలం
ఆలోచన చేసి వాడికిలా చెప్పడం ప్రారంభించింది.
“మిథిలా రాజు, జనకరాజు
కూతుర్ని. నా పేరు సీత అంటారు. నీకు మేలు కలగాలి. నేను శ్రీరాముడి భార్యను సుమా!
మా మామగారు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని ఆలోచన చేశాడు. దానికి కావాల్సిన
ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడాయన భార్య కైక, నా భర్త
దేశాన్ని వదిలి పోవాలని, తన కొడుకు రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలని, రెండు వరాలు
తన భర్తను కోరింది. తన మాట అంగీకరించకపోతే ప్రాణాలు విడుస్తానని బెదిరించింది. నా
మామగారు ఆమెను ఎంత ప్రార్థించినా ఆయన విన్నపం చెవిన పెట్టలేదు. ఆ పట్టాభిషేక
విఘ్నకాలానికి నా భర్తకు ఇరవై అయిదు సంవత్సరాల వయసు. నాకు పద్దెనిమిదేళ్ల వయసు.
ఇంత లేత వయసువారు అడవుల్లో ఎలా తిరగ గలరో కూడా మా అత్త కైకేయి ఆలోచించలేదు.
తండ్రిని సత్యవచనుడిని చేయడానికి, దేనికీ భయపడని రాముడు, అరణ్యాలకు
వచ్చాడు.”
రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో
అరణ్యానికి పోయేటప్పుడు ఆయన వయసు పన్నెండేళ్ళు. ఆ సంవత్సరమే సీతా వివాహం. తరువాత
పన్నెండేళ్ళు అయోధ్యలో సుఖంగా వున్నాడు. ఆ తరువాత సంవత్సరం పట్టాభిషేక ప్రయత్నం
కాబట్టి అప్పటికి రాముడికి పాతిక సంవత్సరాలు. అరణ్యావాసం ఆరంభమైన తరువాత
ఋశ్యాశ్రమాలలో పదేళ్లు గడిపాడు. పంచవటిలో మూడేళ్లు వున్నాడు. వనవాసారంభం మొదలు
పెట్టి ఇప్పటికి పద్నాలుగవ సంవత్సరం కాబట్టి, సీతాపహరణ
సమయానికి శ్రీరాముడికి ముప్పై ఎనిమిదవ ఏడు. సీత జనకుడికి దొరికింది మొదలు ఆరు
సంవత్సరాలు మిథిలలో వుంది. వివాహం తరువాత అయోధ్యలో పన్నెండేళ్ళు వుంది. పదమూడో
సంవత్సరం అరణ్యాలకు ప్రయాణం కాగా, వనవాసానికి బయల్దేరి అప్పటికి సీతాదేవికి
పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి. కాబట్టి, ఇప్పటికి
సీతకు, ముప్పై ఒక్క
ఏళ్లు గడిచాయి. ఇది ముప్పై రెండో ఏడు”.
సీత రావణుడికి ఇంకా ఇలా చెప్పింది. “నా భర్త సవతి తమ్ముడు, శూరుడు, లక్ష్మణుడు
అన్నకు సహాయంగా విల్లు-బాణాలు ధరించి మాతో అడవులకు వచ్చాడు. కైక కారణాన రాజ్యాన్ని
పోగొట్టుకుని మేం ముగ్గురం అడవుల్లో తిరుగుతున్నాం. కొంచెం సేపు నువ్వు ఇక్కడ
వుంటే నా భర్త వస్తాడు. నీకు వనఫలాలు ఇస్తాడు. బ్రాహ్మణుడా! నీ పేరేంటి? నీ గోత్రం
ఏమిటి? నువ్వే కులం
వాడివి? ఏ జాతివాడివి? వివరంగా
చెప్పు. ఎక్కడైనా ఆశ్రమంలో వుండకుండా ఈ అరణ్యాలలో ఎందుకు తిరుగుతున్నావు?”
సీతాదేవి ప్రశ్నలకు ఆ రాక్షసుడు తన
చరిత్ర చెప్తా వినమని అంటూ, పరుషంగా మాట్లాడాడు. తన పేరు వింటే దేవతలు, దైత్య్లు కూడ
గడ-గడలాడుతారని తన ప్రతిష్టను చెప్పుకున్నాడు రావణుడు సీతతో ఇలా. “ఎవని పేరు
చెప్తే మనుష్యులు మాత్రమే కాకుండా దేవతలు, దైత్యులు
కూడా గడ,
గడలాడుతారో, అలాంటివాడిని, రాక్షసుల
నాయకుడిని, నా పేరు
రావణాసురుడు. నీకు మేలు కలుగుగాక. నిన్ను చూసింది మొదలు నా భార్యలమీద ప్రేమ కలగడం
లేదు. ఉత్తమ స్త్రీలనెందరినో బలాత్కారంగా తెచ్చాను. అట్లా అయితే నువ్వెందుకు అని
అడుగుతావేమో? వారందరికీ
నువ్వు ప్రభ్వివై వుండు. నా గృహం లవణ సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద వుంది. దాన్ని
లంక అంటారు. అక్కడికి వచ్చి నాతో కలిసి వుండు. నువ్వు నా భార్యవైతివా
సమస్తాభరణాలతో అలంకరించబడిన ఐదువేలమంది ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీలు
శ్రద్ధాభక్తులతో నిన్ను సేవిస్తారు.”
రావణుడిలా చెప్పగా, అంతవరకూ
వాడికి చేస్తున్న ఉపచారాలను వదిలి, సీతాదేవి అమితమైన కోపంతో, రాక్షసులకు
ప్రభువైనా రావణుడిని లెక్కచేయకుండా, గట్టి మనస్సుతో జవాబిస్తూ తన భర్త శ్రీరాముడు
ఎలాంటి వాడో, అతడి జోలికి
వస్తే ఏ గతి పట్తుందో వివరిం చింది. గట్టి మనస్సుతో కఠినమైన మాటలు అన్నప్పటికీ
భయంతో, భీకరమైన
గాలికి వణికే అరటి చెట్టులాగా గడ-గడ వణికింది. అది చూసి సీతను మరింతగా భయపెట్టుతూ, రావణాసురుడు
తన కులం, బలం
వర్ణించాడు.
రావణుడు అనే
సార్థక నామధేయం కలవాడినని, గంధర్వులు, పన్నగులు, గరుడులు
తన్ను చూసి భయపడతారని, మృత్యువును చూసినట్లు ఎవరిని చూస్తే
పరుగెత్తుతారో, యుద్ధంలో
ఎవరిని చూసి కుబేరుడు పరుగెత్తాడో, ఎవరికి భయపడి తన పట్టణమైన లంకను విడిచి
కుబేరుడు కైలాసం చేరాడో, ఎవరు పుష్పక విమానాన్ని లాక్కొని తన వాహనంగా
చేసుకున్నాడో, అలాంటి తన
ముఖాన్ని చూసి ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా పరుగెత్తుతారని, తనున్న చోట
గాలి కదలదని,
సూర్యుడు
చంద్రుడిలాగా చల్లగా అయిపోతాదని, ఎక్కడెక్కడ తాను నిలుస్తాడో అక్కడ చెట్లమీద
ఒక్క ఆకైనా భయంతో కదలదనీ సీతాదేవిని తన మాటలతో భయపెట్టాడు. ఆమె భర్త రాముడిని
దూషించాడు.
పది తలల వాడినైన తనను, కైలాస
పర్వతాన్ని ఎత్తిన తనను, కుబేరుడిని ఓడించి పుష్పక విమానాన్ని పొందిన
తనను, ఇంద్రుడిని
బందీచేసిన తనను, బ్రహ్మ-శివుడి
వరాలు పొందిన తనను, ముల్లోకాలు జయించిన వాడినైన తనను చేరడానికి సీతకు
సందేహమెందుకానీ అడిగాడు. ఇవన్నీ విన్న సీత రావణుడికి మునుపటి కంటే కఠినంగా జవాబిచ్చింది.
సీతాదేవి కఠినంగా రావణుడిని నిందించగానే రావణుడు కోపంతో శరీరం
తెలియకుండా, భుజాలు ఎగురవేస్తూ, సీతను భయపెట్టడానికి తన నిజ స్వరూపాన్ని చూపించాడు. దొంగ సన్న్యాసి
వేషాన్ని వదిలి ఆ దుష్టుడు పదితలల, ప్రళయకాలంలో సూర్యాగ్నిలాగా
మితిమించిన తేజం కల, బంగారు కుండలాల, కోపంతో కూడిన, నల్లటి మేఘంతో సమానమైన, విల్లు-బాణాలు కల కాలుడితో సమానమైన తన శరీరాన్ని చూపించాడు. ఎర్రటి
వస్త్రాలు ధరించి, ఎర్రటి కళ్ళతో, ఎండాకాలంలోని సూర్య తేజస్సు వేడిమితో, విజృంభించి, కఠినమైన
మాటలతో రావణుడు సీతాదేవితో ఇలా అన్నాడు.
“వినవే సీతా నా మాట! కళ్యాణీ నన్ను చూడు.
నేను అలాంటి పొగడ్త కలవాడిని. నీమీద ప్రేమ వున్నవాడిని. నీకిష్టం కాని పని ఎన్నడూ
చేయను. నామాట విని ఆ మనుష్యుడిని మరిచిపోయి దనుజుడనైన నన్ను కూడి నాకు శుభం
కలిగించు. ఓసీ! బుద్ధిలేనిదానా! నువ్వు తెలివికలదానివనుకుంటున్నావు కాని నీకు
తెలివేలేదు. నీకు తెలివే వుంటే, ఒక
ఆడదాని మాట ప్రకారం, రాజ్యాన్ని,
స్నేహితులను, బంధువులను, అందరినీ
వదిలి, క్రూర సర్పాలు, ఏనుగులు,
మృగాలు, రాక్షసులు సంచరించే అడవిలో తిరుగుతూ,
శత్రువులను ఎదిరించి రాజ్యాన్ని సంపాదించుకునే ధైర్యంలేని దరిద్రుడిని ఎలా మొహిస్తావు?
ఏం గుణాలు చూసి మెచ్చావే?”.
ఇలా అని అంటూ రావణాసురుడు,
అయ్యో! వీడు చెడిపోతున్నాడే? అని
స్నేహభావంతో మంచిమాటలు చెప్తున్న సీతను కామంతో పరవశుడై,
పట్టుకున్నాడు.
రావణుడు,
ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను,
కుడిచేత్తో తొడలను, శీఘ్రంగా పట్టుకుని,
తన మాయారథం అక్కడికి రాగానే, ఆ
క్రూరుడు భయంకరమైన బెదిరించే మాటలతో బెదిరించి,
బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని,
రథంలో వేశాడు. ఆ సమయంలో యముడితో సమానమై,
తీక్షణంగా ప్రకాశించే కోరలతో, పర్వతమంత
శరీరంగల ఆ రాక్షసుడిని చూసి వనదేవతలు భయంతో
అడవుల్లోకి పరుగెత్తారు. ఈ విధంగా ఆకాశంలో శీఘ్రంగా పోయే రథం మీద కడుబాధతో
సీతాదేవి పిచ్చిపట్టినట్లు భ్రమచెందిన దానిలాగా ఏడ్చింది.
సీతాదేవిని రావణుడు ప్రత్యక్షంగా
తాకాడా? లేదా? అనే విషయం చర్చనీయాంశం. వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి
తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. రామచంద్రమూర్తి మాయామృగం వెంట
పోయినప్పుడు అసలు సీతను దాచి మాయా సీతను ఆశ్రమంలో వుంచాడనీ, రావణుడు తాకింది ఆమెనేననీ కొందరి వాదన. సీతాదేవి చుట్టూ గిరిగీసి, దానిని సీత దాటిపోవలదని లక్ష్మణుడు, రాముడికొరకై పోయేటప్పుడు చెప్పినట్లు మరికొందరి వాదన. రావణుడు
పెళ్లను తీసుకుపోయాడే కాని సీతను తాకలేదని వారంటారు. రావణుడు అపహరించినది మాయా సీత
అనడానికి వాల్మీకి రామాయణంలో ప్రమాణం లేదు.
రావణుడు
ఎత్తుకుపోతున్న సీత రామలక్ష్మణులను తలచుకుంటూ ఏడ్చింది. “అయ్యో! ఆశ్రిత
రక్షణార్థివైన రామచంద్రా! నీ ఆశ్రితురాలైన నన్ను వీడు ధర్మం తప్పి తీసుకుపోవడం
చూడలేదా? రామా! న్యాయాన్ని ధిక్కరించి
తిరిగే దుష్టులను శిక్షించే నువ్వు నన్ను దొంగిలించిన ఈ దుష్టుడిని ఎందుకు
వదుల్తున్నావు? పాపాత్ముడా! రావణా! నీ పాపఫలం
వెంటనే అనుభవానికి రావు. కొంతకాలానికి అవి పక్వాలై ఫలితమిస్తాయి. నువ్వు చేసే
పాపాని ఫలితం త్వరలోనే అనుభవిస్తావు. నీకు చెడిపోయే కాలం దాపరించినందున రావణా!
ఇలాంటి పాపకార్యం చేయడానికి వచ్చావు. కాబట్టి శత్రువులకు మృత్యువైన శ్రీరాముడి
చేతిలో నీ ప్రాణాలు పోతాయి”.
“అడవిలోని
పూలతో, పండ్లతో నిండివున్న వృక్ష
సమూహాల్లారా! తీగలారా! ఆకాశాన సంచరించే వాళ్లూ, మీరు రాముడిని చూసినప్పుడు సీతను రావణుడు అపహరించాడని దయతో
చెప్పండి. మాల్యవంత పర్వతమా! దేవా విరోధి అయిన రావణుడు నీ భార్యను అపహరించి
తీసుకుని పోతున్నాడని రాముడికి చెప్పు. గోదావరీ నదీ! నీకు దండం..దండం. కోదండ
ధరుడైన రాముడితో నీ భార్యను రావణుడు అపహరించాడని చెప్పు. నామీద దయవుంచి ఈ మాత్రం
మాట సహాయం చేస్తే, ఆ తరువాత నేను స్వర్గంలో వున్నా, యమలోకంలో వున్నా, రామచంద్రమూర్తి నన్ను
విడిపిస్తాడు” అని ఏడుస్తుంది సీత తనను రావణాసురుడు ఎత్తుకుని పోతుంటే.
“రామా!
రామా! లక్ష్మణా!” అని ఏడుస్తున్న సీతాదేవి ఆకాశమార్గాన తీసుకుని అతి వేగంగా
పరుగెత్తాడు రావణుడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ,
ఏడుస్తున్న సీత స్మృతితప్పి పడుతూ ఉన్నప్పటికీ,
రావణుడు ఆమెను తీసుకు పోవడం ఆపలేదు. రావణుడు సీతను చంకలో ఇరికించుకుని పోయాడు. ఆమె
కుదురుగా వుండలేదు. ముందు-వెనుకలకు వాలుతూ వుంది. ఎవరెప్పుడు అడ్డం తగులుతారో అన్న
భయంతో త్వరగా లంకకు చేరాలన్న తపన
రావణుడిది. రామలక్ష్మణులు రాకపోతారా అని సీత ఆశ. ఇలా చంకలో పొర్లడం వల్ల
వెనుకపక్కగా వాలి సీత సొమ్ములను ఉత్తరీయంలో ముడికట్టి కిష్కింధ ప్రాంతంలో కిందకు
పడేసింది. రావణుడు సీతతో లంక చేరాడు. (వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment