ప్రజల వద్దకు చేరిన పాలన
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (13-12-2020)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, దానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరుగులేని నాయకత్వం, గత
ఆరున్నర సంవత్సరాల్లో, ముఖ్యంగా గత రెండేళ్లలో ఎన్నో రంగాలలో సంస్కరణల పరంపరలు
చోటుచేసుకున్నాయి. పరిపాలన సంస్కరణలు వాటిలో తొలి మెట్టు. 33 కొత్త జిల్లాలు,
74 కొత్త రెవెన్యూ డివిజన్లు, 590 కొత్త మండలాల ఏర్పాటుతో పరిపాలన అట్టడుగువర్గాల ప్రజల ముందుకు తీసుకు
వచ్చింది ప్రభుత్వం. పేదరికం నిర్మూలన కార్యక్రమాల అమలు పౌరుల అభిమానాన్ని
చూరగొన్నాయి. అధికారులు,
ప్రజాప్రతినిధులు ఇప్పుడు స్థానిక అవసరాలు, సమస్యలు,
అంశాలు, క్షేత్రస్థాయిలో సామాజిక
పరిస్థితులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారు. క్షేత్రస్థాయిలో
ప్రణాళికలు రూపొందించడం సులభతరమైంది.
జిల్లా సగటు జనాభా రెండు నుంచి మూడు
లక్షలు మాత్రమే ఉండడంతో డెలివరీ యంత్రాంగం ఇప్పుడు సులభతరం, ఎలాంటి ఇబ్బందులు లేనివిధంగా తయారైంది. పలువురు యువ ఐఎఎస్ అధికారులు జాయింట్
కలెక్టర్లుగా పని చేసే అవకాశం లభించడమే కాక వారు తమ
సామర్థ్యాన్నినిరూపించుకున్నారు. నాన్ కేడర్ సీనియర్ అధికారులు సైతం కలెక్టర్లుగా
పని చేసే అవకాశం లభించడంతో కేడర్, నాన్ కేడర్ మధ్య సమతుల్యత
సాధ్యమైంది. అభివృద్ధి నాణ్యమైనదే కాకుండా వేగంగా, చక్కగా జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ
శరవేగంగా జరుగుతోంది. నగరాల చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలు నగరాల అంతర్భాగాలుగా
మారుతున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల
అభివృద్ధికి రూపొందించిన కొత్త మునిసిపల్ చట్టం మరో సంస్కరణ చర్య. 1965 నాటి తెలంగాణ మునిపాలిటీల చట్టం, 1994 నాటి మునిసిపల్
కార్పొరేషన్ చట్టం స్థానంలో తీసుకు వచ్చిన తెలంగాణ మునిసిపాలిటీల చట్టం-2019 ఒక చరిత్రాత్మక సంస్కరణ చట్టం. కొత్త మునిసిపాలిటీల చట్టానికి అనుగుణంగా
రూపొందించిన అర్బన్ పాలసీతో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడమే కాకుండా పౌర సేవలను
మెరుగ్గా అందించడానికి వీలవుతోంది. భారీ జనాభా కలిగిన గ్రామాలను మునిసిపాలిటీలుగా
మార్పుచేశారు. 322 గ్రామాలను పక్కన ఉన్న మునిసిపాలిటీల్లో విలీనం చేశారు. 7 మునిసిపాలిటీలను కార్పొరేషన్లగా అప్ గ్రేడ్ చేశారు. ఇప్పుడు మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్య 128,
13కు పెరిగింది. దీనితో మొత్తంపట్టణ స్థానిక సంస్థల సంఖ్య 141కి పెరిగింది. ప్రజల కోసం తీసుకువచ్చిన ఈ సంస్కరణ ప్రజల సమస్యలను సత్వరం
పరిష్కరించడానికి తోడ్పడింది.
ప్రజల భాగస్వామ్యంతో అమలవుతున్న పట్టణ
ప్రగతి కార్యక్రమం పట్టణ ప్రాంతాల రూపురేఖలను శరవేగంగా మార్చివేసింది. పట్టణ
స్థానిక సంస్థల్లో ప్రతి వార్డుకు ఏర్పాటైన నాలుగు కమిటీలు అభివృద్ధిలో కీలకపాత్ర
పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 3405 వార్డు కమిటీలు ఉన్నాయి. కమిటీ సభ్యులుగా సీనియర్ సిటిజన్లు, మహిళలు,
యువకులు ప్రముఖ వ్యక్తులు అభివృద్ధిలో చురుకుగా
పాలుపంచుకుంటున్నారు.
తమ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన
కోసం బంజారాలు,
ఆదివాసీలు చిరకాలంగా చేస్తున్న డిమాండను నెరవేర్చడం కోసం
కెసిఆర్ ప్రభుత్వం పరిపాలనలో గిరిజనులు, బంజారాల భాగస్వామ్యాన్ని
పెంచింది. ప్రభుత్వం మారుమూల గ్రామాలను ఆవాస ప్రాంతాలను ప్రత్యేక గ్రామ
పంచాయతీలుగా నోటి ఫై చేసింది. దీనితో గ్రామ పంచాయతీల సంఖ్య 8690 నుంచి 12751కి పెరిగాయి. వీటిలో కొత్త పంచాయతీలుగా ఏర్పడిన 1177 తండాలు,
గూడెంలున్నాయి. షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్న 1281 ఆవాస ప్రాంతాలను ఎస్టీలకు రిజర్వు చేశారు. ఫలితంగా 3146 మంది ఎస్టీలు సర్పంచులు అయ్యారు. మరో సంస్కరణ చర్య నూతన పంచాయతీరాజ్ చట్టం.
కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వ దృఢసంకల్పం
ప్రతిబింబిస్తుంది. కొత్త చట్టంతో రాష్ట్రంలోని గ్రామాలు ప్రజల చురుకైన
భాగస్వామ్యంతో ప్రగతి వైపు పరుగులెడుతున్నాయి.
ఇప్పుడు గ్రామాలు స్వచ్ఛంగా, పచ్చగా కనిపిస్తున్నాయి. ప్రజలు, వారి ప్రతినిధులు
గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంతో ఎంతో ఉత్సాహంగా, చురుకుగా పని చేస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొత్తం 12751 గ్రామాల్లో వర్క్స్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ కమిటీ,
గ్రీన్ కవర్ కమిటీ ఏర్పాటయ్యాయి. ఈ మొత్తం కమిటీలలో 8 లక్షల 20 వేల 727మంది సభ్యులున్నారు. వీరిలో 4,03,758 మంది మహిళలున్నాయి.
ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించింది. సిబ్బంది సంఖ్య
ముఖ్యంగా జిల్లా పరిషత్ లో సిఇఒలు, జిల్లా పంచాయత్ అధికారులు, డిఎల్ ఒలు,
ఎంపిఒల సంఖ్యను అవసరాలకు తగినట్టుగా పెంచడం జరిగింది. ఇంతకు
ముందు 3396 మంది గ్రామ సెక్రటరీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 12751కి పెరిగింది.
పోలీసుకమిషనరేట్ల సంఖ్య 9కి పెంచడం జరిగింది. అలాగే సబ్ డివిజన్ల సంఖ్యను కూడా 85 నుంచి 110కి పెంచారు. సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయాలను 128 నుంచి 159కి పెంచారు. అలాగే పోలీసు స్టేషన్ల సంఖ్యను కూడా 736 నుంచి 840కి పెంచారు. ఈ పోలీసు సంస్కరణలు ఫలితంగా శాంతి భద్రతల పరిస్థితి మరింత ప్రొఫెషనల్
గా, ఉన్నత ప్రమాణాలు కలిగినదిగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా
పోలీసు శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ విభాగంలో కొత్త ఆధునిక టెక్నాలజీని
అంతర్భాగం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అద్భుతమైన, దేశంలోనే మొట్టమొదటి వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారింది. ప్రభుత్వ రైతు సంక్షేమ
చర్యలు సాగునీటి సదుపాయం పెంపు, ఇతర వ్యవసాయ సానుకూల
విధానాల కారణంగా ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇలాంటి
ఎన్నో సంస్కరణలు ఈ రంగంలో ఇంకా అవసరముంది. రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతులు సంతోషంగా ఉండేలా చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక ఎఇఒను నియమించింది. మొత్తం
రాష్ట్రంలో వీటి సంఖ్య 2604 కు పెరిగింది. విత్తనాలు వేయడం మొదలుకొని ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వరకు
రైతులకు సహకరించడం కోసం రైతుబంధు సమితులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో
15 మంది సభ్యులు,
జిల్లా స్థాయిలో 24 మంది సభ్యులు, రాష్ట్ర స్థాయిలో 42 మంది సభ్యులతో రైతుబంధు సమితులను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో
రైతుబంధు సమితులలో 1.61 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ప్రతి క్లస్టర్ లోనూ 2604 రైతు వేదికలను నిర్మిస్తున్నారు.
అన్ని రంగాలకు 24 గంటలు నిరంతరాయంగా,
నాణ్యమైన విద్యుత్తు కొనసాగించడం కోసం విద్యుత్ రంగానికి
చెందిన ఉత్పత్తి,
పంపిణీ, ట్రాన్స్ మిషన్ విభాగాలను
బలోపేతం చేయడం జరిగింది. కొత్త విద్యుదుత్పాదక ప్లాంట్లను నిర్మించారు. డిస్కాంల
పరిధిలో పరిపాలనా విభాగాల సంఖ్యను పెంచారు. జోన్ల సంఖ్యను 2 నుంచి 1కు, సర్కిళ్లను 14 నుంచి 36కు, డివిజన్లను 60 నుంచి 88కి, సబ్ డివిజన్లను 186 నుంచి 220కి, సెక్షన్లను 693 నుంచి 854 కు పెంచారు.
పచ్చదనాన్ని పెంచడానికి అడవుల
అభివృద్ధి,
పరిరక్షణ, పెంపకం, సామాజిక అడవుల పెంపకం ఉద్యమ స్థాయిలో చేపట్టిన ఒక గొప్ప సంస్కరణ. హరిత హారం
కార్యక్రమం కింద రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం కోసం పెద్ద ఎత్తున చర్యలు
చేపట్టారు. అటవీ విభాగాన్ని విస్తరించడం జరిగింది. అలాగే పరిపాలనను
వికేంద్రీకరించారు. సర్కిళ్లు, ఫారెస్టు డివిజన్లు, ఫారెస్టు రేంజ్లు,
ఫారెస్టు సెక్షన్లు, ఫారెస్టు బీట్ల సంఖ్యను
పెంచారు. హరిత హారానికి అనుబంధంగా రాజ్యసభ సభ్యుడు జోగిన పల్లి సంతోష్ కుమార్
చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,
ఎంపిలు, ఎంఎల్‌ఎలు, సినీ,
స్పోర్ట్స్ ఇతర రంగాల ప్రముఖులతో పాటు సామాన్య ప్రజల
భాగస్వామ్యంతో అనూహ్య స్పందనను కలిగించింది.
విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలను
నెలకొల్పడానికి,
సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు
మెరుగైన విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో పెద్ద ఎత్తున
సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించడం కోసం
రెసిడెన్సియల్ విద్యా సంస్థల సంఖ్యను గణనీయంగా పెంచడం జరిగింది. ఇంతకు ముందు కేవలం
298 రెసిడెన్సియల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 1.45 లక్షలు మాత్రమే ఉండగా అప్పుడా సంఖ్య 53 డిగ్రీ కళాశాలలతో
కలుపుకొని 970 రెసిడెన్సీ విద్యాసంస్థలను 4.30 లక్షలకు పెరిగింది.
అన్ని కేటగిరీలలో ఎస్సీలు,
ఎస్టీలు, బిసిలు, మైనారిటీ విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది.
పైన పేర్కొన్న వాటితోపాటుగా
రాష్ట్రంలో భారీ ఎత్తున సాగు నీటి ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో కోటి ఎకరాలకు
పైగా పెద్ద ఎత్తున సాగు నీటి సదుపాయం కలిగించడానికి వీలు కలగడంతో వ్యవసాయ రంగంలో
కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. కొత్త ప్రాజెక్టులను నిర్మించడంతో
పాటుగా ప్రాజెక్టులను శాశ్వత ప్రాతిపదికన నిర్వహించడానికి ప్రభుత్వం
నిర్ణయించింది. ఇరిగేషన్ విభాగాన్ని మేజర్, మీడియం, చిన్న తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులుగా విభజించడంతో పాటుగా ఐడిసి తదితర విభాగాలను
ఒకే గొడుగు కిందికి ఇప్పుడు తీసుకు వచ్చారు. దానికి అనుగుణంగా సర్కిళ్లు, డివిజన్లు,
సబ్ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది.
సమీకృత భూమి రికార్డుల నిర్వహణ
వ్యవస్థ అయిన తెలంగాణ రాష్ట్ర ధరణీ పోర్టల్ ప్రారంభంతో భూమికి సంబంధించిన
రికార్డులు,
రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లలో చరిత్ర
సృష్టించబడింది. దేశంలో మొట్ట మొదటి సారిగా ముఖ్యమంత్రి కెసిఆర్ భూమికి సంబంధించిన
వివాదాలు,
సమస్యలు, విసుగు పుట్టించే విధాన
పరమైనలోపాలకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది తెలంగాణ
రాష్ట్రాన్ని భూములు,
ఆస్తుల వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేయడమే గాక సమీప
భవిష్యత్తులో శాశ్వత హక్కుల రాష్ట్రం దిశగా తీసుకెళుతుంది. ఇది నిజంగా గొప్ప భూ
సంస్కరణ.
రాష్ట్రంలో రైతు వేదిక ప్రారంభం
స్వతంత్ర భారత దేశంలో వ్యవసాయ చరిత్రలోనే ఒక కనీవినీ ఎరుగని చరిత్రాత్మకమైన చర్య.
ఈ విధానపరమైన సంస్కరణలు వాస్తవంగా తెలంగాణ అత్యుత్తమ ఆదర్శవంతమైన పరిపాలన పరమైన
మోడల్ గా రూపొందడానికి వీలు కలిగించింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండళ్ల ఏర్పాటు, కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం పరిపాలన సంస్కరణలు చరిత్ర
సృష్టించింది. ఇది ముఖ్యమంతి కెసిఆర్ దూరదృష్టి, నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచింది.
No comments:
Post a Comment