Saturday, May 7, 2022

తొమ్మిదవ రోజున అర్జునుడి నిరుత్సాహం, భీష్ముడి విజృంభణ, శ్రీకృష్ణుడి రౌద్రావేశం ..... ఆస్వాదన-70 : వనం జ్వాలా నరసింహారావు

తొమ్మిదవ రోజున అర్జునుడి నిరుత్సాహం, భీష్ముడి విజృంభణ, శ్రీకృష్ణుడి రౌద్రావేశం

ఆస్వాదన-70

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (08-05-2022)

తొమ్మిదవ నాటి యుద్ధం ప్రారంభం కావడానికి పూర్వరంగంలో, అంతం క్రితం రాత్రి భీష్ముడు చెప్పిన ధైర్య వచనాల వల్ల సంతోషించిన దుర్యోధనుడు, పొద్దున్నే యుద్ధానికి సిద్ధపడి, కవచం తొడుక్కుని, సేనతో బయల్దేరి వెళ్లి, భీష్ముడి సమీపంలో వున్న రాజులతో క్రితం రాత్రి ఆయనన్న మాటలను చెప్పాడు. భీష్ముడు ద్రుపద, విరాట, యాదవుల సైన్యాన్ని చంపుతానన్నాడని, కాబట్టి తామందరం తమతమ సామర్థ్యం, బలం చూపించి భీష్ముడికి అండగా పాండవులను గెలవాలని అన్నాడు. దుర్యోధనుడి మాటలను విన్న భీష్ముడికి అతడి పట్ల ఏవగింపు, లజ్జ, మనోదుఃఖం కలిగాయి. అయినా తనను తానే ఓదార్చుకున్నాడు. అంతా భీష్ముడి సమీపంలోనే వుందామని, ఆయనకు సహాయంగా అనేకమంది రథికులను ఆయన దగ్గర ఉంచుదామని, ఆయన దరిదాపుల్లోకి శిఖండిని రాకుండా చూద్దామని దుర్యోధనుడు దుశ్శాసనుడితో, కృపాశ్వత్థామలతో అన్నాడు. వారంతా ఆయన మాటలకు సమ్మతించారు.

భీష్ముడు సర్వతోభద్రవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వ్యూహంలో కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కౌరవులు, భీష్ముడు ముందు భాగంలో నిలిచారు. భీష్ముడి ఆజ్ఞానుసారం ద్రోణుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు కుడి భాగంలోను; సోమదత్తుడు, అశ్వత్థామ, విందుడు, అనువిందుడు ఎడమవైపున నిలుచున్నారు. హలాయుధుడు, అలంబసుడు, శ్రుతాయువు వెనుకవైపున వున్నారు. దుర్యోధనుడు త్రిగర్త సైన్యంతో సహా మధ్యభాగంలో నిలిచాడు.

పాండవులు సేనలతో కూడి వచ్చారు. అర్జునుడు భీష్ముడి వ్యూహాన్ని చూసి, శిఖండిని భీష్ముడికి ఎదురుగా నిలబెట్టమని, అతడి చుట్టూ అంతా గుంపుగా నిలబడుదామని ధృష్టద్యుమ్నుడికి చెప్పాడు. దానికి తగిన వ్యూహాన్ని ఏర్పాటు చేయమనగా కౌరవుల వ్యూహానికి ప్రతిగా ఒక అసాధ్యమైన వ్యూహాన్ని ఏర్పరచాడు ధృష్టద్యుమ్నుడు. దానిలో కుడివైపున సాత్యకి, విరాటుడు; ఎడమవైపున అభిమన్యుడు, ద్రుపదుడు, కేకయులు, నకులుడు, సహదేవుడు, ఉపపాండవులు; వారి వెనుక ధర్మరాజు; ధర్మరాజుకు వెనుకగా చేకితానుడు, కుంతిభోజుడు; ముందు భాగంలో శిఖండి; అతడికి ఒక పక్కన భీముడు, ఘటోత్కచుడు; మరొక పక్కన అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు; మిగిలిన యోధులు వేరేవేరే చోట్లలో వుండే విధంగా వ్యూహరచన జరిగింది. అంతా శంఖాలు ఊది సింహనాదాలు చేశారు.

యుద్ధం మొదలవ్వగానే అభిమన్యుడు వీర విహారం చేస్తూ కౌరవ సైన్యాన్ని తరమడం చూసిన దుర్యోధనుడు అతడిమీదికి అలంబసుడిని పురికొల్పాడు. అతడప్పుడు పాండవ సేనను తరుముతుంటే ద్రౌపది కొడుకులు ఎదుర్కున్నారు. అయితే ఎప్పుడైతే అలంబసుడిది పైచేయి అవుతున్నదని అభిమన్యుడు గమనించాడో, అప్పుడే అభిమన్యుడు ఆ రాక్షసుడి మీదికి దూకాడు. వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. అలంబసుడి రాక్షసమాయకు యుద్ధభూమిలో చీకట్లు కమ్ముకోగా, అభిమన్యుడు సూర్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ చీకటిని పటాపంచలు చేశాడు. అలంబసుడి రాక్షస మాయలన్నీ వీగిపోవడంతో వాడు రథం దిగి పారిపోయాడు. కౌరవ సైన్యం కూడా పరుగెత్తి వెళ్లారు.

అభిమన్యుడు భీష్ముడి ధాటికి ఏమాత్రం చలించకుండా చాకచక్యంగా యుద్ధం చేస్తుంటే, అర్జునుడు అటువైపుగా భీష్ముడిని ఎదిరించడానికి వచ్చాడు. అదే సమయంలో సాత్యకి ప్రయోగించిన ఒక బాణానికి అశ్వత్థామ మూర్ఛపోయాడు. కాసేపైన తరువాత తేరుకుని సాత్యకిని నొప్పించసాగాడు. అయితే వెంటనే తన బాణాలతో అశ్వత్థామను కప్పివేయడంతో, అతడి తండ్రి ద్రోణాచార్యుడు కొడుకు ప్రాణాలను కాపాడడానికి సాత్యకి మీదికి దూకాడు. అప్పుడు అర్జునుడు మధ్యలో చొరబడ్డాడు. ద్రోణుడు, అర్జునుడు యుద్ధానికి పూనుకున్నారు. ఒకరిమీద ఇంకొకరు బాణవర్షం కురిపించారు. ద్రోణుడికి సాయంగా దుర్యోధనాది రథికులు ఆర్జునుడిని తాకారు. అంతా అర్జునుడితో యుద్ధంలో తలమునకలై పోయారు.

ఇంతలో భీష్ముడు విజృంభించి ధర్మరాజు వున్న దిక్కుగా పోయి యుద్ధం చేస్తుంటే, ఆ ధాటికి ధర్మరాజు తట్టుకోలేక పోయాడు. అప్పుడు భగదత్తుడి మీద యుద్ధం చేస్తున్న భీముడు ధర్మరాజు దగ్గరికి వచ్చి చేరాడు. అయితే అంతకు ముందే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు ధర్మరాజుకు అడ్డంగా నిలిచి భీష్ముడి మీద బాణాలు వేశారు. భీష్ముడు ఒక్క శిఖండి మీద తప్ప మిగిలిన వారిమీద బాణాలు వేశాడు. కాసేపైన తరువాత పాండవ సేనలో, కౌరవ సేనలో వున్న సమర్థులు ఇరుపక్కలా చేరి భీకరంగా పోరాడసాగారు.

భీముడు గదతో స్వైర విహారం చేస్తూ, ఆ తరువాత రథం మీదినుండి బాణాలు వేస్తూ, బాహ్లికుడి రథాన్ని కూల్చాడు. మరో పక్కన చిత్రసేనుడికి, అభిమన్యుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ద్రుపదుడు ద్రోణుడి మీదికి విజృంభించి అతడిని బాణాలతో వేధించగా ద్రోణుడు అతడిని తిప్పికొట్టగా సిగ్గుతో తొలగిపోయాడు. ఇంతలో సుశర్మ ఆర్జునుడిని ఎదిరించాడు కాని ఓటమి చెందాడు. అప్పుడు భీష్ముడు అర్జునుడి మీదికి విజృంభించగా సాత్యకి మధ్యలో అడ్డు తగిలాడు. అప్పుడు భీష్ముడిని ఆడుకోవడానికి దుర్యోధనుడు ఆదేశానుసారం శకుని, దుశ్శాసనులు ఆయన దగ్గరికి వచ్చారు. దీన్ని చూసి అక్కడికి ధర్మరాజు, నకుల సహదేవులు వచ్చారు. పాండవులదే పైచేయి అయింది. అప్పటి కౌరవుల దీనావస్థ చూసి దుర్యోధనుడు తమను ఆదుకొమ్మని శల్యుడిని కోరాడు.

శల్యుడు ధర్మజ, నకుల సహదేవుల మీదికి దూకి తన బాహుబలం చూపాడు. అప్పుడు అర్జునుడు, భీముడు ఒకేసారి శల్యుడి మీదికి ఎగబడి చాలా బాధ కలిగించారు. వెంటనే భీష్మ, ద్రోణులు జోక్యం చేసుకోవడంతో రెండు సేనలూ విజృంభించి పోరాడాయి. భీష్ముడు కూడా విజృంభించాడు. అప్పుడు మాత్స్య, పాండ్య, సోమక, మగధ, కాశ, కరూశ దేశాల సేనలు ఒక్కసారిగా భీష్ముడి మీదికి ఉరకగా ద్రోణుడు అడ్డుకున్నాడు. చాలా భయంకరంగా యుద్ధం చేశాడు. భీష్మ, ద్రోణులు ఇద్దరూ భీకరంగా తమ శౌర్యాతిసహాయాన్ని చూపారు. భీష్ముడు మహా బలపరాక్రమాలతో మరీ-మరీ రెచ్చిపోయాడు. పాండవ సేన హీనమైన స్థితిని పొందింది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. ఆయన శౌర్యాన్ని చూపమన్నాడు.

అర్జునుడు జవాబు లేనివాడిగా, ఉత్సాహం లేనివాడైపోయి, తనకు యుద్ధం చేయడానికి మనసు పుట్టడం లేదన్నాడు. అయినాసరే, భీష్ముడిని పడగూలుస్తానని అంటూ రథాన్ని అటు పోనీయమన్నాడు. పోగానే, అర్జునుడు భీష్ముడి మీదికి విజృంభించాడు. అయితే భీష్ముడి బాణాల దెబ్బలకు అర్జునుడి అవయవాలు గాయపడ్డాయి. కృష్ణుడి శరీరమంతా బాణమయమైంది. అర్జునుడు అప్పుడు ఒక బల్లెంతో భీష్ముడి విల్లులను రెండు సార్లు తుంచాడు. మరొక విల్లు పట్టుకుని భీష్ముడు బాణాలను ప్రయోగించగా అర్జునుడు తట్టుకోలేక పోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన శ్రీకృష్ణుడికి భయంకరమైన కోపం వచ్చింది. ఓర్పు కోల్పోయాడు. గుర్రాలను వదిలి నేలమీదికి దూకాడు. అప్పటి శ్రీకృష్ణుడి ఆకారాన్ని వర్ణిస్తూ తిక్కన ఇలా రాశారు:

మ:      ధరణీచక్రము గ్రక్కునం గదల దిగ్డంతావళశ్రేణి కం

           ధరముల్ మ్రొగ్గబడన్ దిశావలయ ముత్కంపంబుగా నీబలం

           బురులం బారగ భీష్ముపై గవిసి రౌద్రేద్రేకముం జూచి ఖే

           చరలోకంబును సంచలింప హరి చంచాద్బాహు ఘోరాకృతిన్

భూమండలం కదలుతూ వుండగా, దిక్కులందు వుండే ఏనుగుల మెడలు వంగిపోగా, దిక్కులు వణకిపోగా, కౌరవ సైన్యం బెదురుతూ చెదిరి పోతుండగా, తన రౌద్రావేశాన్ని చూసి దేవతలు సహితం గడగడలాడగా కృష్ణుడు, అదురుతున్న బాహువులతో, భయంకరమైన ఆకారంతో భీష్ముడి మీదికి లంఘించాడు. కృష్ణుడు తనపైకి దూకడాన్ని చూసిన భీష్ముడికి మనసులో ఉల్లాసం కలిగింది. ఒకనవ్వు నవ్వి, వేగంగా రమ్మని, తనను కడతేర్చమని, అదే తనకు ఇష్టమని, భూలోకంలో తనకు కీర్తి,  పరలోకంలో ఉత్తమ గతి, మోక్షం, తనకు కలగచేయమని అన్నాడు. దీన్ని తిక్కన పద్యంలో ఇలా రాశారు:

చ:       కనుగొని భీష్ము డుల్లము వికాసము నొందగ నల్ల నవ్వి యి

           ట్లను జనుదెమ్ము వేగమ మహాత్మా! వికస్వరపుండరీకలో

           చన! యిది లెస్స నా కిచట శాశ్వత మైన యశంబు నచ్చట

           న్విసుతికి నెక్కు సద్గతియు నీ దయ జేకురజేయు మిష్టమున్

ఇదంతా చూస్తున్న అర్జునుడు రథం దిగి శ్రీకృష్ణుడిని పట్టుకున్నాడు వెనకనుండి. యుద్ధం చేయనన్న శ్రీకృష్ణుడు తన ప్రతిజ్ఞ పాటించకపోతే జనం దూషిస్తుందని, రథం మీదికి రమ్మని, భీష్ముడికి ఏ గతి పట్టిస్తానో చూడమని అంటాడు. కృష్ణుడు సంతసించి, ఏమీ మాట్లాడకుండా వెనక్కు తిరిగి వచ్చాడు. రథం ఎక్కిన కృష్ణార్జునులను  ఇంతకు ముందులాగానే భీష్ముడు తల్లడిల్ల చేశాడు. పరుగులెత్తించాడు. అలసిపోయిన కృష్ణార్జునులు, భయపడ్డ భీమాదులు ఏమీ చేయలేక పోయారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. సైన్యాన్ని వెనుదిరగమని ధర్మరాజు ఆజ్ఞాపించాడు. ముఖం చిన్నబుచ్చుకుని ధర్మరాజు తన నివాసానికి చేరుకున్నాడు. కౌరవ సేన సంతోషంతో తమ శిబిరాలకు పోయారు.

దుఃఖపడ్డ ధర్మరాజు తమ్ముళ్లను తీసుకుని శ్రీకృష్ణుడి భవనానికి వెళ్లాడు. ఆనాటి యుద్ధంలో భీష్ముడి విజృంభణను పేర్కొంటూ, యుద్ధంలో ఆయన చేతిలో అంతా చచ్చిపోయిన తరువాత జనం లేని ఆ సామ్రాజ్యం తనకెందుకని, తాను నిశ్చింతగా అడవులకు పోతానని, తపస్సు చేసుకుంటానని అన్నాడు. యుద్ధం కాకుండా మరేదైనా ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు కృష్ణుడిని. అర్జునుడు భీష్ముడిని చంపలేకపోతే తానే ఆ పని చేస్తానన్నాడు. తనకు అర్జునుడి మీద వున్న ప్రేమాభిమానాలను వివరించి, అతడి కోసం తానేపనైనా చేస్తానని అన్నాడు కృష్ణుడు. తనకు భీష్ముడి దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన వున్నట్లు చెప్పాడు ధర్మరాజు. అలా వెళ్లడం ఆ తరుణంలో చాలా మంచిదని శ్రీకృష్ణుడు తన సమ్మతి తెలిపాడు. భీష్ముడిని అతడిని చంపే ఉపాయం అడగమని సలహా ఇచ్చాడు. వెంటనే ధర్మారాజు, ఆయన తమ్ములు, కృష్ణుడు ఆర్భాటం లేకుండా రహస్యంగా భీష్ముడి భవనానికి వెళ్లారు.

వాళ్లను ఆప్యాయంగా పలకరించి, వారేది అడిగినా ఇస్తానన్నాడు. తమకు ఏ విధంగా సామ్రాజ్యం వస్తుందో, ఏమాదిరిగా ఎక్కువ సేన నాశనం కాకుండా వుంటుందో ఉపాయం చెప్పమని అడిగాడు ధర్మరాజు. తనను యుద్ధంలో జయిస్తేనే అది సాధ్యమని అన్నాడు భీష్ముడు. ఆయన్ను ఏవిధంగా గెల్వవచ్చునో చెప్పమని కోరాడు ధర్మరాజు. తన చేతిలో ధనుస్సు వున్నంతవరకు తనను దేవతలు కూడా జయించలేరని, తన వధోపాయం చెప్తాను వినమని అన్నాడు. తాను ఆయుధం పట్టకుండా వుండే సమయంలో తనను జయించవచ్చని, తాను కవచం లేనివాడిని, ఆయుధం లేనివాడిని, ధ్వజాన్ని కిందికి దించినవాడిని, ఆడదాన్ని, పూర్వం ఆడది అయినదాన్ని, తలపాగా ఊడిపోయినవాడిని, అన్నదమ్ములు, బిడ్డలు లేని వాడిని బాణాలతో కొట్టనన్నాడు. అలాంటివారితో యుద్ధం చేయనన్నాడు. పుట్టినప్పుడు మగతనం లేకుండా మధ్యలో మగతనం పొందిన వారితో కూడా యుద్ధం చేయనని, ఉదాహరణగా శిఖండి పేరు చెప్పాడు. కాబట్టి శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చేయమన్నాడు.

ఇది విని భీష్ముడిని ఎలా చంపాలా అని సంశయిస్తున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని అర్జునుడు భీష్ముడిని చంపాల్సిందే అని, అది రాజ ధర్మమని, విధి ఆర్జునుడిని భీష్ముడిని చంపడానికే పంపిందని అన్నాడు. అలాగే కానిమ్మని అంటూ అర్జునుడు, భీష్ముడిని చంపడానికి అంగీకరించాడు. అలా ఆ రాత్రి అంతా బాగా నిద్రపోయారు. మర్నాడు పదవ రోజు యుద్ధం జరగబోతున్నది.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)


No comments:

Post a Comment