Saturday, May 28, 2022

పన్నెండవ రోజు యుద్ధం, ధర్మరాజుకు దూరంగా సంశప్తకులతో తలపడిన అర్జునుడు : ఆస్వాదన-73 : వనం జ్వాలా నరసింహారావు

 పన్నెండవ రోజు యుద్ధం, ధర్మరాజుకు దూరంగా సంశప్తకులతో తలపడిన అర్జునుడు

ఆస్వాదన-73

          వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (29-05-2022)    

మహాభారత యుద్ధం పన్నెండవ రోజున, అంటే, ద్రోణాచార్యుడి రెండవనాటి యుద్ధం పూర్వరంగంలో ధర్మరాజును బంధించే విషయాన్ని దుర్యోధనుడు మరోమారు ప్రస్తావించినప్పుడు, అర్జునుడు లేని చోట తనను చూసి ధర్మజుడు పారిపోకుండా వుంటే, అతడిని తప్పక పట్టుకుంటానని ద్రోణుడు హామీ ఇచ్చాడు. ఒకవేళ అతడు పారిపోతే మరీమంచిదన్నాడు. ఇది విన్న సుశర్మ, అతడి తమ్ములు సత్యవ్రతుడు, సత్యకర్ముడు, సత్యవర్ముడు మొదలుగాగల త్రిగర్తాధిపతులంతా ఆర్జునుడిని యుద్ధం నుండి తొలగించుకొని దూరంగా తీసుకు పోవడానికి సిద్ధమయ్యారు. వారికి కేరళ, మాళవ, శిలీంద్ర, మగధ, మచ్చిల్లికాది దేశాదిపతులు తోడ్పడుతామన్నారు. తామంతా ఆర్జునుడిని హతమారుస్తామని శపథం చేశారు. ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి సంశప్తకులు యుద్ధానికి బయల్దేరి వెళ్లిపోయారు.

ఇక ద్రోణాచార్యుడు ఇక్కడ యుద్ధరంగంలో ఆనాడు గరుడవ్యూహం ఏర్పాటుచేశాడు. అందులో ముక్కుగా తాను; దుర్యోధనుడు, అతడి తమ్ములు తలగా; కృప, కృతవర్మలు కన్నులుగా; సింహళులు, ఆభీర, సుదక్షిణ, విందానువిందులు ఎడమ రెక్కగా; శకుని, పౌండ్ర, కళింగ, అంబష్ట, మాగధులు వెన్నుగా; కర్ణుడు తోకగా; సైంధవుడు ఇతరులు అక్కడక్కడా నిలబడ్డారు. ఆ వ్యూహంలో నడిమి భాగాన భగదత్తుడు ఏనుగునెక్కి నిలిచాడు. మరోవైపు త్రిగర్తాధిపతి సుశర్మ మొదలైన సంశప్తకులు తమతో యుద్ధానికి రమ్మని అర్జునుడిని ఆహ్వానించారు. అర్జునుడు అన్నగారైన ధర్మరాజు అనుమతి, సలహా అడిగాడు. ఇద్దరి పరస్పర అంగీకారంతో సత్యజిత్తును ధర్మరాజుకు రక్షణగా, ద్రోణుడిని అడ్డుకోవడానికి నియమించి అర్జునుడు ధర్మరాజుకు దూరంగా వెళ్లాడు. సత్యజిత్తు మరణిస్తే, ధర్మరాజు యుద్ధరంగం నుండి తొలగిపోవాలని నిర్ణయం జరిగింది.  

కౌరవుల గరుడ వ్యూహానికి దీటుగా ధృష్టద్యుమ్నుడిని అర్ధమండలాకార వ్యూహం నిర్మించమని ధర్మరాజు చెప్పగా అతడు అలాగే చేశాడు. ఆ విధంగా ఉభయుల వ్యూహాలూ సమర్థవంతంగా యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ధర్మరాజు ఆదేశం మేరకు ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని ఎదుర్కున్నాడు. ఇక దూరంగా అర్జునుడు సంశప్తకులమీదికి యుద్ధానికి దిగాడు. అందరినీ అమితంగా బాధించాడు. దూరం నుండే పదిహేను వేలమంది రథికులను కూల్చివేశాడు. సుబాహుడు, సుశర్మ, సురథుడు, సుధన్వుడు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు సుబాహుడి తల నరికాడు. మరో రెండు వేల రథాలను అర్జునుడు నశింపచేయగానే శత్రుసేన భయపడి, తొలగిపోయి దుర్యోధనుడి సేనలో చేరింది. బెదిరిన సైనికులకు సుశర్మ ధైర్యాన్ని నూరిపోయగా అర్జునుడితో యుద్ధం చేయడానికి వెనక్కు మళ్లారు.

సంశప్తకులకు తోడుగా నారాయణ గోపాల సైనికులు కలిసి యుద్ధానికి పూనుకున్నారు. వారంతా కృష్ణార్జునుల మీద బహువిధాలైన అస్త్రాలను ప్రయోగించారు. అర్జునుడు విశ్వకర్మ ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని మహిమకు సైనికులు ఒకరినొకరు సంహరించుకున్నారు. చనిపోగా మిగిలినవారు పారిపోకుండా ఎదురు తిరగ్గా అర్జునుడు అందరినీ చీల్చి చెండాడాడు. సంశప్తకులందరూ ఒక్క పెట్టున అర్జునుడి రథం మీద పడ్డారు. సింహనాదాలు చేశారు. అప్పుడు అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించగా సంశప్తకులు తూలిపడ్డారు. ఇలా కృష్ణార్జునులు దూరంగా యుద్ధం చేస్తుండగా మరో దిక్కున ధర్మరాజు ప్రోత్సాహంతో పాండవ సేనలు కౌరవ సైన్యాన్ని తరిమాయి.

ద్రోణాచార్యుడు విజృంభించడంతో కౌరవ పాండవ సైనికులు పరస్పరం భీకరమైన  పోరుసల్పారు. ఇరువైపులా వినాశనానికి గురయ్యారు సైనికులు. అప్పుడు ద్రోణాచార్యుడు సింహనాదం చేసి ధర్మరాజు వున్న దిక్కుగా వెళ్లాడు. ధర్మరాజు ద్రోణాచార్యుడిమీద బాణాలను ప్రయోగించాడు. వాళ్లిద్దరూ యుద్ధం చేయడం చూసిన సత్యజిత్తు, ద్రోణాచార్యుడిని తీవ్రంగా ఎదిరించి బాణాలు వేశాడు. వృకుడనే పాంచాల రాకుమారుడు సత్యజిత్తుకు సాయంగా వచ్చాడు. అయినా విజృంభించిన ద్రోణుడు వారిద్దరినీ ఎదిరించి, చివరకు సత్యజిత్తును సంహరించాడు. ద్రోణాచార్యుడి బాహుబలానికి ఉలిక్కిపడ్డ ధర్మరాజు గుర్రాలను తోలుకొని పారిపోయాడు అక్కడి నుండి.

ధర్మారాజు వెంటబడ్డ ద్రోణాచార్యుడిని విరాటరాజు తమ్ముడైన సూర్యదత్తుడు అడ్డగించాడు. కాని ద్రోణుడి బాణాలకు సూర్యదత్తుడు నేలకూలి చనిపోయాడు. ద్రోణాచార్యుడు విజృంభించాడు. ధర్మరాజును పట్టుకోవడానికి ఉత్సాహంతో తరుముతున్న ద్రోణాచార్యుడిని ఎదుర్కొని యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, శిఖండి, సాత్యకి, క్షత్రధర్ముడు యుద్ధం చేస్తుంటే ధర్మరాజు కూడా వెనక్కు మళ్లి ధృష్టద్యుమ్నుడిని, చేకితానుడిని ముందుంచుకుని బాణాలు వేశాడు. అయినప్పటికీ వెనక్కు తగ్గని ద్రోణుడు వసుదానుడిని నేలమీద కూల్చి, క్షేముడిని చంపి, మిగిలినవారిని బాణాలతో బాధించి ముందుకు రావడం చూసిన ధర్మరాజు ఉపాయంగా యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. ద్రోణాచార్యుడిని దృఢసేనుడు తాకగా అతడిని చంపాడు ద్రోణుడు. ఆ తరువాత సుమిత్రుడిని కూడా చంపాడు. అలా అలా విజృంభిస్తున్న ద్రోణాచార్యుడిని ఎదుర్కోవడానికి పాండవ సేనలో ఆ సమయంలో ఎవరూ ముందుకు రాలేకపోయారు.

అప్పుడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైన వీర సమూహాలు ద్రోణుడి మీద దూకారు. వెంటనే దుర్యోధనుడు భీముడిని ఎదుర్కోగా ఇతర కౌరవ వీరులు ఒక్కొక్క పాండవ వీరుడిని ఎదుర్కొన్నారు. అలా అలా భయంకరమైన యుద్ధం జరుగుతుండగా మధ్యాహ్నం అయింది. భీముడి మీదికి దుర్యోధనుడు ఏనుగుల గుంపును తోలాడు. వంగదేశపు రాజు పంపిన ఏనుగును, అతడిని చంపాడు భీముడు. భగదత్తుడు సుప్రతీకం అనే ఏనుగును భీముడి మీదికి తోలాడు. ఆ ఏనుగు పాండవ సైన్యాన్ని చిందరవందర చేసింది. భీముడు దాన్ని భయంకరంగా ఎదుర్కొన్నాడు. అయినా దాని విజృంభణకు భీమసేనాదుల సైన్యం బాధపడి పారిపోవడం జరిగింది. భగదత్తుడు ఆ సమయంలో పాండవ సైన్యాన్ని తరమసాగాడు.

ఇది గమనించి భగదత్తుడి వైపుగా రథాన్ని మళ్లించమని అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు. ఆయనలా చేయగానే సంశప్తకులు అడ్డు తగిలి యుద్ధానికి కవ్వించారు. వెంటనే విజృంభించి వారిమీదికి యుద్ధానికి పోయిన అర్జునుడు గాండీవాన్ని ధరించి, దివ్యాస్త్రాలను ప్రయోగించి, ఆ వీరరథికులను చాలామందిని చంపాడు. ఆ తరువాత వెంటనే రథాన్ని పాండవులు యుద్ధం చేసే దిక్కుగా మళ్లించాడు కృష్ణుడు. సంశప్తకుల మీద భీభత్సాన్ని సృష్టించి వెళ్తున్న ఆర్జునుడిని సుశర్మ, అతడి సోదర వర్గం మళ్లీ యుద్ధానికి పిలిచింది. వెంటనే రథాన్ని మరల్చి అర్జునుడు యుద్ధానికి దిగాడు. సుశర్మ వింటి దబ్బను, పతాకాలను విరిచి, అతడిని మూర్ఛపోగొట్టి, అతడి సోదరులను చంపి, భగదత్తుడి సుప్రతీక గజం విజృంభిస్తున్న వైపు వెళ్లి, ఆ ఏనుగుకు అడ్డం తిరిగాడు అర్జునుడు.

భగదత్తుడికి, అర్జునుడికి భీకరమైన పోరు జరిగింది. ఒక పక్క సుప్రతీక గజం పాండవ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఒకటి, రెండు పర్యాయాలు భగదత్తుడి బాణాల నుండి అర్జునుడిని కాపాడాడు శ్రీకృష్ణుడు. భగదత్తుడు అభిమంత్రించి ప్రయోగించిన  అంకుశాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి దాన్ని ధరించాడు తన వక్షస్థలం మీద. ఎందుకలా చేశావని అర్జునుడు అడుగగా, తండ్రి నరకాసురుడి దగ్గర నుండి పొందిన భగదత్తుడి వైష్ణవాస్త్రం తనకు తప్ప ఇతరులకు సహించరానిదని, అందుకే దాన్ని అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రోద్బలంతో అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టి తన శక్తి కొలది వేయడంతో, సుప్రతీక గజం నేలకు ఒరిగిపోవడం, భగదత్తుడి కంఠం తెగిపోవడం ఏక కాలంలో జరిగిపోయాయి.  

ఆ తరువాత ఎదురు తిరిగిన శకుని సోదరులిద్దరినీ ఒకే బాణంతో చంపాడు. అప్పుడు శకుని మాయా యుద్ధం చేశాడు కాసేపు. కాని అర్జునుడి ధాటికి ఆగలేక పారిపోయాడు. పాండవులు అప్పుడు ద్రోణుడిని చుట్టుముట్టమని అంటూ విజృంభించారు.

అప్పుడు మళ్లీ సంశప్తకులు, నారాయణ గోపాల సేనలతో సహా కలిసి వచ్చి ఆర్జునుడిని యుద్ధానికి రమ్మన్నారు. ఆయన పోగానే, ఆ అవకాశం చూసుకొని కౌరవ సేనలు, పాండవ సేనలను తరమసాగాయి. భీముడు పాండవ సేనలను గద్దించాడు ధైర్యంగా వుండమని. భీముడి మీద దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ ఒకేసారి బాణ వర్షాన్ని కురిపించారు. ఇంతలో ధర్మరాజు ప్రోత్సహించగా నకుల సహదేవులు, సాత్యకి, అభిమన్యుడు భీముడికి సాయంగా వచ్చారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని ఎదుర్కోవడంతో ఆయన దివ్యబాణాలను ప్రయోగించాడు. కాసేపట్లో భీముడి దగ్గరికి అర్జునుడు తోడుగా వచ్చాడు. పాండవులు తరుముతుంటే కౌరవ యోధులు నిశ్చేష్టులయ్యారు.

ఇంతలో కర్ణుడు ఆర్జునుడిని ఎదిరించాడు. కర్ణార్జునుల యుద్ధం సాగింది. అర్జునుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా, అతడు వాయువ్యాస్త్రం వేసి దాన్ని శాంతింప చేశాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు అర్జునుడితో కలిశారు. అర్జునుడు కర్ణుడి తమ్ముల శిరస్సులను మూడింటిని ఖండించాడు. భీముడు రథం దిగి వచ్చి కర్ణుడి బంధువులను బాధించాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు ముగ్గురూ కలిసి కర్ణుడి సారథిని కూల్చి, అతడి ధనుస్సును ఖండించారు. దుర్యోధనాదులు కర్ణుడిని ఆదుకున్నారు. ద్రోణుడు, అర్జునుడు కూడా విజృంభించి యుద్ధం చేయడం వల్ల, యుద్ధరంగం రౌద్ర, బీభత్స నాట్యరంగం లాగా ఘోరంగా కనిపించింది.

ఇంతలో సూర్తుడు అస్తమించాడు. ద్రోణుడు సేనలను మరల్చడానికి ఆజ్ఞాపించాడు. పాండవ సైన్యాలు కూడా వెనక్కు మరలాయి. ఇలా ఉభయ సేనలు తమ తమ శిబిరాలకు చేరే సమయంలో కౌరవ వర్గంవారు, ద్రోణుడి ప్రతిజ్ఞ తీరకపోవడం గురించి, అర్జునుడి శౌర్యం ప్రకాశించడం గురించి చర్చించుకున్నారు.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment