కావాల్సింది ప్రత్యామ్నాయ జాతీయ ప్రణాళికే!
వనం
జ్వాలా నరసింహారావు
సాక్షి
దినపత్రిక (30-05-2022)
పటిష్ఠ సహకార సమాఖ్య దిశగా దేశాభివృద్ధికి అసలు సిసలైన జాతీయ
ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించేటందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు ప్రాంతీయ రాజకీయ పార్టీల ఏకీకరణకు మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్రాల
అధికారాలను పునర్నిర్వచించాలనీ, అన్ని రంగాల్లో సంస్కరణలు అమలు చేయాలనీ
కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫెడరల్ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వాల వ్యూహాత్మక
దాడిని పలు సందర్భాలలో ఆయన దుయ్యబట్టారు.
స్పష్టమైన జాతీయ ప్రత్యామ్నాయ అజెండాను రూపొందించడంలో ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖరరావు నిమగ్నమైనట్లు ఆయన పర్యటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలి కేసీఆర్
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల పర్యటనలోను, ఢిల్లీలో వున్న
సందర్భంలో ఆయన కలిసిన కొందరు ప్రముఖులతో జరిపిన చర్చల్లోనూ, ఇది సూచనప్రాయంగా వెల్లడైంది.
తనలాగే ఆలోచించే రాజకీయ నేతలను కలవడంలో, సహకార సమాఖ్యను
బలపర్చాల్సిన ఆవశ్యకత దీని వెనుక కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో నాయకులను కలుస్తున్న
సందర్భంలో, జాతీయ రాజకీయాల్లో త్వరలోనే సంచలనం చోటుచేసుకోనున్నదని కేసీఆర్
స్పష్టంగా చెబుతున్నారు. కొత్త విధానాలను అమలు చేసేటప్పుడు రాష్ట్రాలను కేంద్రం
సంప్రదించాల్సిన అవసరాన్ని కేసీఆర్ నొక్కి చెప్పారు. సహకార సమాఖ్య స్ఫూర్తి
పెంపొందాల్సిన ఆవశ్యకత ఉందని కేసీఆర్ సూచిస్తున్నారు. పరిస్థితులకు
అనుగుణంగా వ్యవహరించే వెసులుబాటును రాజ్యాంగం కేద్ర ప్రభుత్వానికి కల్పించింది.
అంతమాత్రాన ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పబడలేదు. కారణాలు
ఏమైనప్పటికీ మన దేశం ఉదాత్తమైన సహకార సమాఖ్య వైపు కాకుండా ఏకపక్ష విధానాల
వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
ఫెడరల్ వ్యవస్థపై ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా తనదైన శైలిలో ఒక పథకం ప్రకారం దాడికి
పూనుకున్నారు. భారతదేశానికి కావలసింది నిర్బంధ సమాఖ్య కాదు సహకార సమాఖ్య అనేది
అప్పట్లో ఆయన తన నినాదంగా మలుచుకున్నారు. ఆయన ప్రధాన మంత్రి అయిన తరవాత తన
వైఖరిని మార్చుకున్నారు. అంటే, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా
ఉండగా ఫెడరల్ వ్యవస్థపై అనుసరించిన విధానం ఇప్పుడు ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న
విధానం భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత వైఖరి ఆందోళనకరమైన పరిణామం. ఇది మారాలి.
తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక సందర్భాలలో అనే వేదికలపై సహకార
సమాఖ్య ఈ దేశానికి అవసరమని ఎలుగెత్తి చాటారు. కో ఆపరేటివ్ ఫెడరలిజమ్ ప్రణాలికాబద్దంగా
పరిణామం చెందాల్సిన అవసరాన్ని ప్రస్తుత దేశ పరిస్థితులు చాటిచెబుతున్నాయి.
వివిధ సందర్భాలలో సహకార సమాఖ్యకు విరుద్ధంగా రుజువైన నిష్క్రియాశీలమైన ఒరవడిని
రూపుమాపాల్సి ఉంది.
సహకార సమాఖ్య నినాదం ఈనాటిది కాదు. భారతదేశంలో దీనికి చారిత్రాత్మకమైన
పునాదులున్నాయి. రాజ్యాలు మనుగడలో ఉన్న కాలంలో దేశం సమాఖ్య విధానాలను కచ్చితంగా
అనుసరించింది. ఆ సమయంలో స్థానిక పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకునే పద్ధతిలో రాజ్యాధికారం
చలాయించేవారు కాదు. బ్రిటీష్ ప్రభుత్వం సైతం ఈస్ట్ ఇండియా వ్యవహారాలను నియంత్రించేదే
తప్ప, దాని అధికారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. భారత ప్రభుత్వ చట్టం 1919 కూడా ద్వంద్వ ప్రభుత్వానికే మొగ్గుచూపింది. జవహర్‌లాల్ నెహ్రూ సైతం
రాష్ట్రాలతో సంప్రదింపులు, సహకారం అనే నీతిని పాటించారు.
సహకార సమాఖ్య అనే లక్ష్యంతోనే స్వాతంత్ర్యానంతరం అప్పటి ప్రభుత్వం భారత
యూనియన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడేం జరుగుతోంది?
రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన వ్యవహారాలలో కేంద్ర
ప్రభుత్వం విపరీతంగా జోక్యం చేసుకుంటూనే ఉంది. కేంద్రం కేవలం విదేశీ వ్యవహారాలు, రక్షణ,
జాతీయ రహదారుల నిర్వహణ వంటి అంశాలకే పరిమితం కావాలి. అలాగే దేశ
భద్రతపైనే కేంద్రం దృష్టి కేంద్రీకరించాలి. విద్య, వైద్యం,
గ్రామీణ అభివృద్ధి, స్థానిక సంస్థలు, తదితర అంశాల బాధ్యతలను రాష్ట్రాలకే విడిచిపెట్టాలి. మరి అలా జరగడం
లేదే?
రాజీవ్ గాంధీ హయాం నుంచి ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ
వరకూ స్థానిక సంస్థలకు నిధులను నేరుగా బదిలీ చేస్తూ, రాష్ట్రాలను
నమ్మకుండా వ్యవహరిస్తూ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు. ఇది సహకార సమాఖ్య
స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అంటూ ఇటీవల నిర్వహించిన ఓ సమీక్ష సమావేశంలో సీఎం
కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఇది రాష్ట్రాలను అవమానించడమేనన్నారు. జవహర్
రోజ్‌గార్ యోజన, పీఎమ్ గ్రామ్ సడక్ యోజన, ఎన్ఆర్ఇజిఎ (ఉపాధి హామీ) వంటి పథకాలకు ఢిల్లీ నుంచి నేరుగా స్థానిక
సంస్థలకు నిధులను బదలాయించడం రాష్ట్ర ప్రభుత్వాలకు పక్కన పెట్టడమే అని
అన్నారు. వాస్తవానికి కేంద్రం కంటే రాష్ట్రాలకే స్థానిక సమస్యలపై అవగాహన
అధికంగా ఉంటుంది. దేశంలో పలు రాష్ట్రాలలో గ్రామీణ, పట్టణ
సంస్థలు ఇప్పటికీ కరెంటు సరఫరా వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రజలు
ఇంకా అంధకారంలోనే ఉండాల్సి వస్తోంది. మంచి నీటి సరఫరా కోసం, సాగునీటి అవసరాల కోసం ప్రజలు ఇంకా రోడ్లు ఎక్కాల్సి వస్తోంది. విద్య,
ఉద్యోగ రంగాల్లో అంచనాకు అనుగుణంగా ఇప్పటివరకూ అభివృద్ధిని
సాధించలేకపోయాం. కేంద్రం ఇలాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టకుండా
రాష్ట్రాల వ్యవహారాల్లో తల దూరుస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఒక ప్రత్యామ్నాయ
జాతీయ ప్రణాళికతో ప్రజల ముందుకొస్తానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా
భావసారూప్యం కలిగిన రాజకీయ శక్తులను ఏకం చేయడానికీ, దేశాన్ని
అభివృద్ధి బాట పట్టించడానికీ వీలుగా ఈ అజెండా ఉంటుందనేది ఆయన ప్రకటన
సారాంశం. రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం అజెండాను రూపకల్పన చేసే అవకాశముంది.
ఇందులో ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు, ఇలా అన్ని రంగాల వారి సహకారమూ
తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ మార్పు ప్రారంభమవుతుందనడంలో ఎటువంటి
సందేహమూలేదు. వాస్తవమైన సహకార సమాఖ్య విధానం గురించి కేసీఆర్ ఎప్పటినుండో
ప్రయత్నాలను ప్రారంభించారు. స్థానిక అవసరాలు, ఆకాంక్షలు,
రిజర్వేషన్లు వంటి రంగాలలో విధానపరమైన నిర్ణయాలు రాష్ట్రాల పరిధిలోనే
ఉండేలా అజెండా ఉంటుందనేది నిస్సందేహం.
తెలంగాణ బాటలోనే దేశం, ఇతర రాష్ట్రాలు కూడా కొత్త
విధానాలను అనుసరించాల్సిందనేది కేసీఆర్ అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న
ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసి, భారత పరిస్థితులకు
అనుగుణంగా వాటిని మలుచుకోవాలని కేసీఆర్ సూచిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను
అంచనా వేసి, ఒక విధానపరమైన వ్యవస్థను రూపకల్పన
చేయడానికి వీలుగా భారత్ ఎక్కడ వెనుకబడి వుందో తెలుసుకోవడం తక్షణ కర్తవ్యమని
కేసీఆర్ అంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే దేశానికి ప్రత్యామ్నాయ
అభివృద్ధి వ్యవస్థ లేదా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉందని
కేసీఆర్ దృఢంగా అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంలోనే వివిధ రాష్ట్రాల అవసరాలు,
సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను పరిగణనలోనికి తీసుకోవాలని
అంటున్నారు.
రాజ్యాంగాన్ని వ్యవస్థకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం
కూడా ఉంది. రిజర్వేషన్లు వంటి అంశాలపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలి.
రాష్ట్ర ప్రజల అవసరాలు స్థానిక ప్రభుత్వాలకే బాగా తెలుస్తాయి కనక ఈ
అధికారం వాటికే ఉండాలనేది కేసీఆర్ ఆకాంక్ష. రాష్ట్రం అంటే ఏమిటి, సహకార సమాఖ్య
ప్రభుత్వం అంటే ఏమిటి అనే అంశాన్ని పునర్నిర్వచించాల్సిన సమయం కూడా ఇదేనని
అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. రాష్ట్రాలను బలోపేతం చేయడం, ఎక్కువ అధికారాలను
ఇవ్వడం తప్పనిసరి అంటున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ అధికారాలు రాష్ట్రాలకు బదిలీ
కావాలనేది ఆయన నిశ్చిత అభిప్రాయం. సహకార సమాఖ్య అంటే అసలైన ఉద్దేశం లేదా లక్ష్యం
ఇదే. ఈ మేరకు రాజ్యాంగంలో మార్పులు చేయాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో అనేక సంస్కరణలు
చేయాలని నిపుణులు ప్రతిపాదించినప్పటికీ, వాటిని కేంద్ర ప్రభుత్వాలు
ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, ఫెడరల్ స్ఫూర్తికి
విఘాతం కలిగించాయి.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో అనేక లక్ష్యాలను చేరింది.
సంక్షేమ,
మౌలిక వసతులు, వంటి రంగాలలో ఇది స్పష్టంగా
కనిపిస్తోంది. వినూత్నమైన తెలంగాణ రాష్ట్ర పథకాలు, సృజనాత్మక
కార్యక్రమాలు కేంద్రానికీ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
నిలిచాయి. ఇవే అన్నిచోట్లా వివిధ రూపాలలో ప్రతిబింబిస్తున్నాయి. తెలంగాణలో అమలవుతున్న
రైతులకు ఎకరానికి పదివేల రూపాయల సాగు పెట్టుబడి పథకం, రైతు బంధును జాతీయ
స్థాయిలో చేపట్టి 40కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చవచ్చు.
రైతు బీమా, దళిత బంధును కూడా దేశవ్యాప్తంగా అమలుచేయవచ్చు.
రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పథకాలను
రూపొందించాల్సిన అవసరం ఉంది. సామాజిక, న్యాయ, రాజ్యాంగ,
పరిపాలన రంగాలలో నిర్మాణాత్మకమైన మార్పులను తేవాల్సిన ఆవశ్యకత
ఉంది. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టవచ్చు.
మూలుగుతున్న నల్ల ధనాన్ని వెలికితేవడానికి మార్గాలను అన్వేషించాలి. పన్నుల విధానంలో
మరిన్ని ప్రోత్సాహకాలుండాలి. ప్రకటిత ఆదాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లేదా
మౌలిక వసతుల రంగాలలో పెట్టుబడి పెట్టేలా ఒక సులభసాధ్యమైన వ్యవస్థ ఉండాలి.
దీనివల్ల ప్రభుత్వ రంగాలకు పెట్టుబడులు వెల్లువలా వచ్చే అవకాశముంటుంది. ఈ
రకమైన చర్య జిడిపి స్థాయిని పెంచి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి
తోడ్పడుతుంది.
పార్లమెంటు, రాష్ట్ర
అసెంబ్లీల ప్రాధాన్యత ఇందులో నిస్సందేహంగా కీలకపాత్ర వహిస్తాయి. ఈ దారిలో ఎదురయ్యే
ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొనాలి. న్యాయ, తదితర రంగాలలో
సంస్కరణలకు నాంది పలకాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం అనుసరిస్తున్న ‘అంతా
బాగుంది’ అనే విధానమే దేశాన్ని సమస్యల కూపంలోకి నెట్టేస్తోందనే వాస్తవాన్ని
గుర్తించాలి. ఎన్నికైన ప్రభుత్వమే దేశానికి కీలకం. దాన్ని ఎన్నుకునే వ్యక్తులకూ,
దేశాన్ని ఏలే వారికి మధ్య వ్యత్యాసం వుండకూడదు. కేంద్ర ప్రభుత్వాలు
తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు సబబు అనేది చర్చనీయాంశం.
అనేక సందర్భాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన
సమర్థతను, నాయకత్వ పటిమను, ఉద్యమ శైలిని అనేకవిధాలుగా రుజువు
చేసుకున్నారు. రాజకీయంలో తేడాను చూపించారు. అతీతంగా ఆలోచించి, లక్ష్యాలను సాధించి, ఏ నాయకుడు సాధించనన్ని విజయాలను
తన సొంతం చేసుకున్నారు. ప్రజా నాయకుడిగా కేసీఆర్ తన తెగువను ప్రదర్శించారు.
సమర్థుడైన పరిపాలకునిగా ప్రతిభను కనబరిచారు. జాతీయ స్థాయిలో తన ఆలోచనలను
ఇటీవలి కాలంలో కేసీఆర్ వెల్లడిస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తి, సహకార సమాఖ్య వంటి అంశాలలోనూ, కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆయన ప్రస్తుతం
చేస్తున్న ప్రత్యామ్నాయ ప్రణాళిక దేశంలో సహకార సమాఖ్యను కచ్చితంగా బలోపేతం
చేస్తుందనడంలో సందేహం లేదు. అదే ప్రస్తుత తరుణంలో కీలకం. భావసారూప్యం కలిగిన
రాజకీయ పార్టీలు కేసీఆర్ ఆలోచనలను సమర్థించాల్సిన సమయమిదే. భవిష్యత్తుకు
బాటలు వేసేది ప్రత్యామ్నాయ జాతీయ ప్రణాళిక అనేది నిస్సందేహం.
ఈ నేపధ్యంలో బహుశా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి
కారణంగా దేశంలో సహకార సమాఖ్యను బలోపేతం చేసేందుకు అంతర్ రాష్ట్ర మండలిని
పునర్వ్యవస్తీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ప్రధాని
చైర్మన్ గా వ్యవహరించే ఈ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు
ఆరుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగాను, మరో పదిమంది శాశ్వత
ఆహ్వానితులుగాను కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఇదెలా పనిచేస్తుందో కాలమే
నిర్ణయిస్తుంది.
No comments:
Post a Comment