Saturday, May 14, 2022

పదవ రోజు యుద్ధంలో తూర్పు తలగా ఒరిగి శరతల్పగతుడైన భీష్ముడు ...... ఆస్వాదన-71 : వనం జ్వాలా నరసింహారావు

 పదవ రోజు యుద్ధంలో తూర్పు తలగా ఒరిగి శరతల్పగతుడైన భీష్ముడు

ఆస్వాదన-71

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (15-05-2022)

పదవ రోజున సూర్యోదయం కావడంతోనే పాండవులు తమ సేనలతో సహా యుద్ధరంగానికి వెళ్లి మొహరించేటప్పుడు శిఖండిని ముందు నిలిపారు. అతడికి ఇరుపక్కలా భీమార్జునులు; వెనుకపక్క అభిమన్యుడు, ద్రౌపది కుమారులు; వారికి రెండు పక్కలా చేకితానుడు, సాత్యకి; వారికి వెనుకవైపున ధృష్టద్యుమ్నాదియోధులుగా గల పాంచాల వీరులను ముందు వుంచుకొని ధర్మరాజు నకుల సహదేవులను ఇరుపక్కల పెట్టుకున్నాడు. వెనక పక్క భాగాలలో కమ్ముకొని విరాటరాజు, ద్రుపదుడు మొదలైన రాజులు, కేకయ పంచకం, ధృష్టకేతువు నిలిచారు. ఇలా గట్టి వ్యూహాన్ని ఏర్పాటు చేసుకొని పాండవులు యుద్ధానికి 22)సన్నద్ధులయ్యారు. అంతకు ముందే కౌరవుల సేనలో భీష్ముడు అగ్రభాగంలో వుండగా కౌరవులు అతడి చుట్టూ చేరారు. ద్రోణుడు, అశ్వత్థామ కుడి-ఎడమ భాగాలలోనూ; కృపుడు, కృతవర్మ ముందు నిలబడగా దుర్యోధనుడు మధ్యలో నిలబడ్డాడు. బృహద్బలుడు, కాంభోజుడు మొదలైనవారు దుర్యోధనుడి చుట్టూ నిలిచారు. త్రిగర్తులు వెనుకవైపు నిలిచారు. ఈ విధంగా కౌరవ పాండవులు ఒకరినొకరు ఢీకొన్నారు.

నకులసహదేవులు, భీమార్జునులు ఒకేసారి కౌరవ సేనమీదికి ఎగబడ్డారు. ఇంతలో పరిస్థితిని గమనించిన భీష్ముడు విజృంభించాడు పాండవుల మీదికి. శిఖండి భీష్ముడిని వెంటనే ఎదిరించి బాణాలతో కొట్టాడు. భీష్ముడు చిరునవ్వుతో, ద్రుపదుడికి కూతురుగా పుట్టి, కొడుకుగా మారిన శిఖండి మీద తాను బాణాలు ప్రయోగించననీ, అతడెన్ని బాణాలు వేసినా తాను వూరకే చూస్తూ వుంటాననీ అన్నాడు. భీష్ముడిలో ఏమాత్రం నేర్పున్నా తనమీద బాణాలు ప్రయోగించాలని, చేతకాకపోతే అవతలకు పోమ్మనీ, తాను మాత్రం బాణాలు వేయడం ఆపననీ అన్నాడు శిఖండి. అలా తూలనాడుతూనే బాణాలు వేయసాగాడు. అతడి తీరు చూసిన అర్జునుడు, బహుశా, భీష్ముడు చావడానికి సమయం ఆసన్నమైందికాబట్టే దైవ ప్రేరణ వల్ల శిఖండి విజృంభించి బాణాలు వేస్తున్నాడని భావించాడు. ఇంకా, ఇంకా విజృంభించి భీష్ముడి మీద తలపడమని శిఖండిని ప్రోత్సాహించాడు అర్జునుడు. అర్జునుడు అలా చెప్తున్న సమయంలో భీష్ముడు తొలగిపోయి పాంచాల రాజుల సేనల మీద పడ్డాడు. పాండవులు కొరవ సేనను తరిమికొట్టారు.

మరో మారు భీష్ముడిని తప్పుబట్టాడు దుర్యోధనుడు. ఆయన వుండగానే కౌరవ సేనలకు దుఃస్థితి పట్టిందన్నాడు. తాను పదివేల మంది యోధులను చంపుతానని చేసిన ప్రతిజ్ఞ పూర్తయిందని, దుర్యోధనుడు తనను ఇన్ని రోజులు పోషించినందుకు ఆయన ఋణం తీర్చుకున్నానని, ఇక తన బలం తగ్గిపోతున్నదని, ఆరోజు పరిస్థితి చూస్తుంటే తనను పాండవులు కాని, లేదా, పాండవులు తనను కాని చంపడం తప్పక జరుగుతుందని అన్నాడు భీష్ముడు. దేవతల బలం లాంటి బలం కల పాండవులు తన చేత చస్తారా? అని కూడా ప్రశ్నించాడు. అయినప్పటికీ తాను బాహుబలం చూపిస్తానని అంటూ విజృంభించాడు. అప్పుడు ఆయన్ను పాండవులు తేరిపార చూడలేక పోయారు.

కాసేపటికి పాండవ వీరులంతా ఒక్కుమ్మడిగా కౌరవ సేన మీద దాడి చేయగా యుద్ధం చాలా భయంకరంగా సాగింది. భీష్ముడి వెంట పడమని శిఖండిని ప్రేరేపించాడు అర్జునుడు. అతడలా చేస్తే తాను ఆ రోజున భీష్ముడిని చంపుతానని అన్నాడు. ఆ ఆమాటలకు ధృష్టద్యుమ్నుడు, ధర్మరాజాదులు ఒకే వూపుతో విజృంభించారు. కౌరవసేనలోని అశ్వత్థామ మొదలైనవారు కూడా గట్టిగా ఎదిరించారు. ఆ ప్రయత్నంలో శిఖండిని ముందుంచుకుని వేగంగా దూసుకుపోతున్న ఆర్జునుడికి దుశ్శాసనుడు అడ్డుతగిలాడు. అర్జునుడు ఒక బాణాన్ని ప్రయోగించగా దుశ్శాసనుడు మూర్ఛపోయాడు. కాసేపటికి తేరుకుని మళ్లీ యుద్ధం చేశాడు. అయితో మళ్లీ ఓటమి చెంది పారిపోయాడు. అప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్న ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామతో, తనకెందుకో ఆరోజున భీష్ముడిని అర్జునుడు చంపుతాడన్న అనుమానం కలుగుతున్నదని అన్నాడు. భీష్ముడికి సహాయంగా వెళ్లి అక్కడే వుండమని కొడుక్కు చెప్పాడు ద్రోణుడు.

అర్జునుడు విజృంభించి, శిఖండిని ముందుంచుకుని భీష్ముడిని చంపడానికి త్వరపడసాగాడు. అదే సమయంలో భీముడు భీష్ముడి ముందున్న సైన్యాన్ని చంపడం ఆరంభించాడు. భగదత్తుడు మొదలైన పది మంది కౌరవ యోధులు ఒక్కసారిగా భీముడిని చుట్టుముట్టారు. అయితే వారితో సహా ఆ తరువాత వారికి సాయంగా వచ్చిన సుశర్మ కూడా భీమార్జున దెబ్బలకు తూలిపోయారు. అప్పుడు భీష్ముడు ఆశ్చర్యకరంగా యుద్ధం చేశాడు. ఇంతలో అపరాహ్ణ కాలం సమీపించింది. ఆ రోజుకు పది దినాలుగా యుద్ధం చేస్తున్నానని, చాలా భయంకరంగా ఎందరినో చంపానని, ఇక తనకు విసుగు పుట్తున్నదని, తన శరీరాన్ని వదిలిపెట్టడం తగినపనని, భీష్ముడు మనసులో భావించాడు. ధర్మరాజు దగ్గరికి వెళ్లాడు. ఎవ్వరికీ వినపడకుండా సన్నగా, శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చేసి, ఒక్కుమ్మడిగా తనమీద దాడి చేసి, బాణాలతో కొట్టమని, ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, అలా తనకు మేలు చేయమని చెప్పాడు.

ఆ తరువాత భీష్ముడు యధాప్రకారం పాంచాలరాజు సేనల మీద విజృంభించాడు. భీష్ముడు అన్న మాటలు విన్న ధృష్టద్యుమ్నుడిని అతడి మీదికి విజృంభించమని చెప్పాడు. వెంటనే భీమార్జునులు ముందుందగా పాండవ వీరులంతా భీష్ముడి మీదికి విరుచుకు పడ్డారు. పాండవ పక్షంలోని వారు భీష్ముడిని కూలదోయడానికి, కౌరవ పక్షంలోని వారు భీష్ముడిని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అర్జునుడు త్వరత్వరగా భీష్ముడి మీదికి విజృంభించాడు. ఎదురొచ్చిన దుశ్శాసనుడిని భీష్ముడి వెనుక నక్కేట్లు చేశాడు అర్జునుడు తన పదునైన బాణాలతో.

అప్పుడు అర్జునుడు శిఖండిని ప్రోత్సహించి, అవకాశాన్ని చూపించి, భీష్ముడిని బాణాలతో కొట్టమని చెప్పాడు. శిఖండి భీష్ముడి మీదికి పదునైన బాణాలను ప్రయోగించాడు. భీష్ముడు తనమీద శిఖండి ప్రయోగిస్తున్న బాణాలను లెక్కచేయలేదు, కాని, ఆయన ఎదురు బాణాలు వేయలేదు. అప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలను భీష్ముడి మీద బలంగా నాటాడు. ఎదురొచ్చిన కౌరవ వీరులను వెనక్కు తరిమాడు. ఆ సమయంలో భీష్ముడు ఒక మహాస్త్రాన్ని అర్జునుడి మీద వేయడానికి సంధించగా ఎదురుగా శిఖండి కనిపించాడు. వెంటనే బాణ ప్రయోగం చేయకుండా వెనక్కు తగ్గాడు. ఇంతలో తనను ఎదుర్కున్న విరాటరాజు తమ్ముడు శతానీకుడిని సంహరించాడు భీష్ముడు. అప్పుడు అర్జునుడు, శిఖండి భీష్ముడిని బాణాల సమూహంతో కప్పివేశారు. భీష్ముడి విల్లు విరిగిపోయింది. అర్జునుడు ఐంద్రవారుణాగ్నేయాది దివ్యాస్త్రాలు ప్రయోగించి, శిఖండిని ముందుంచుకుని భీష్ముడిని బాణాలతో కొట్టించాడు.

‘ఇక యుద్ధంలో శ్రద్ధ చూపకుండా ప్రశాంతంగా వుంటా’ నని భీష్ముడు తనలో తానే అనుకున్న మాటలను ఒక్క దేవతలు మాత్రం విన్నారు. అదే మేలైన పనని, తమ ఇష్టం కూడా అదేనని వారన్నారు. కౌరవులకు తన వైఖరి కఠినంగా వుండకుండా, దుర్యోధనుడి తృప్తి కోసం సరదాగా తన విల్లెక్కు పెట్టాడు భీష్ముడు. శిఖండి దాన్ని లెక్క చేయకుండా బాణాలు ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అర్జునుడు బాణాలు వేశాడు. భీష్ముడి విల్లును విరగ్గొట్టి, ఒక కఠోరమైన బాణాన్ని భీష్ముడి శరీరంలోకి చొచ్చుకు పోయేట్లుగా ప్రయోగించాడు అర్జునుడు. ఆ తరువాత శిఖండి వింటికి వెనుకనే తన వింటిని ఎవ్వరికీ కనిపించకుండా ఆనించి, ఆ శిఖండే బాణాలు ప్రయోగిస్తున్నట్లు చూసేవారికి అనిపించేట్లుగా బాణాలను భీష్ముడి మీద ప్రయోగించాడు అర్జునుడు. పిడుగుల్లా వున్న ఆ బాణాలు అర్జునుడు ప్రయోగించినవే అని, శిఖండికి అలాంటివి ప్రయోగించడం రాదని తెలిసిపోయింది భీష్ముడికి.

భీష్ముడు కత్తి, డాలు పట్టుకుని రథం మీదనుండి దిగే లోపున అర్జునుడు బాణప్రయోగం చేసి అతడి కత్తిని తుంచాడు. పాండవ పక్షంలోని యోధులు భీష్ముడి దిక్కుగా వచ్చారు. యుద్ధం చాలా భయంకరంగా కనిపించింది. అర్జునుడు బాగా విజృంభించి కౌరవ సైనికులను చిందరవందర చేశాడు. పాండవ యోధులు భీష్ముడి శరీరం మీద వేలెడు చోటు కూడా ఖాళీ లేకుండా బాణాలతో, ఆయుధాలతో నింపేశారు. అప్పుడప్పుడే సూర్యాస్తమయం కాబోతున్నది. అప్పుడు అర్జునుడు భీష్ముడి సమీపానికి వచ్చి అతడిమీద కఠోరమైన బాణాలను గుప్పించి కూలదోశాడు. భీష్ముడు తూర్పు తలగా ఒరిగాడు. అతడి శరీరం భూమిని తాకకుండా, పానుపు మాదిరిగా, బాణాలు ఆధారంగా అమరాయి. ఆ మహాశయుడిని దేవత్వం ఆవహించింది. ‘అయ్యో పాపం! దక్షిణాయనంలో మరణిస్తున్నాడే భీష్ముడు’ అని దేవతలు అంటుంటే, అది విన్న భీష్ముడు, తనకు స్వచ్చంద మరణం అనే వరం తన తండ్రి ఇచ్చాడని, ఉత్తరాయణం వచ్చిందాకా మరణించనని అన్నాడు వారితో.

కౌరవులు, పాండవులు ఆయుధాలు విసర్జించి, కవచాలు తీసేసి, తమ బంధువులతో, స్నేహితులతో భీష్ముడున్న ప్రదేశానికి వెళ్లారు. ఒక్క అర్జునుడు మాత్రం ధనుస్సు చేతబట్టుకుని వెళ్లాడు. తత్కాలానికి తనకు కావాల్సిన ఉపచారాలను ఇరు పక్షాల వారితో చేయించుకున్నాడు భీష్ముడు. తన తల కింద దిండు కావాలను అడగ్గానే దుర్యోధనుడు మెత్తటి దిండ్లు తెమ్మని పరివారానికి చెప్పాడు. భీష్ముడు ఆర్జునుడిని దగ్గరికి పిలిచి, బాణాల పాన్పుకు సరిపడేవిధంగా తూపుల దిండు పెట్టమని అన్నాడు. అర్జునుడు భీష్ముడి మనసులో భావాన్ని అర్థం చేసుకుని, తన గాండీవాన్ని ధరించాడు. మూడు పదునైన బాణాలను మంత్రించి, భీష్ముడి తల వెనుక భాగాన్ని ఎత్తిపట్టుకుని, వాటిని ప్రయోగించాడు. వాటి కొనలు నేలకు గట్టిగా కుచ్చుకుని, చక్కగా నిలబడ్డాయి. భీష్ముడు సంతోషించాడు. సూర్యుడిని ఆరాధిస్తానని, ఉత్తరాయణం వచ్చే దాకా ఆ బాణాల పడకను అలాగే వుంచాలని, ఉత్సాహంగా కాలం గడిపే ఆ దినాలలో తనకు చక్కటి కాపలా ఏర్పాటు చేయమని అన్నాడు. వెంటనే కౌరవ పాండవులు, ఎత్తైన అగడ్తలున్న ప్రాకారాన్ని కట్టడానికి, సమర్థులైనవారిని నియమించారు.

ఇంతలో భీష్ముడికి దప్పికైంది. తాగడానికి నీళ్ళు కావాలన్నాడు. చాలా మంది వెంటనే చల్లటి పానీయలిచ్చారు. తానిప్పుడు బాణాల పాన్పుమీద పడుకుని వున్నానని, కాబట్టి, తేజోమయమైన బాణాన్ని ప్రయోగించి భూమి లోపలి నుండి వెలికి పుట్టుకునివచ్చే నీళ్లను మాత్రమే తాగుతానని, వారు తెచ్చిన నీరు వద్దని భీష్ముడు అన్నాడు. అలా తనకు కావాల్సిన నీరు తేవడానికి అర్జునుడు ఒక్కడే సమర్థుడు అన్నాడు. అలాగేనని భీష్ముడికి ప్రదక్షిణ చేశాడు అర్జునుడు. ఒక బాణాన్ని తీసుకున్నాడు. మంత్రించాడు. నేలలో బాగా గుచ్చుకునే విధంగా ప్రయోగించాడు. దానితో, పటిక మాదిరి తెల్లగా  వున్న నీరు పైకి ఎగజిమ్మింది. ఆ జలంతో అర్జునుడు భీష్ముడికి తృప్తి కలిగించాడు.

శ్రీకృష్ణార్జునులు ఏకమై నిలిస్తే ఎవరు కూడా వారిని జయించ లేరని, కాబట్టి యుద్ధ ప్రయత్నాన్ని మానుకుని ఇకనైనా పాండవులతో సంధి చేసుకొమ్మని దుర్యోధనుడికి చెప్పాడు భీష్ముడు. దుర్యోధనుడు ఏమీ మాట్లాడలేదు. కౌరవ పాండవులు భీష్ముడికి నమస్కారాలు చేసి వారివారి నివాసాలకు వెళ్లిపోయారు.

ఆ తరువాత కర్ణుడు భీష్ముడి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. కర్ణుడిని కౌగిట చేర్చుకుని, అతడిమీద తనకేమీ కోపం లేదన్నాడు భీష్ముడు. కర్ణుడికి మంచి నేర్పడానికే అతడిని విసిగించానని చెప్పాడు. ఆయన కుంతి కొడుకని, రాధ కొడుకు కాదని తనకు వేదవ్యాసుడు చెప్పిన సంగతి తెలియచేశాడు. అతడిమీద తనకు పుత్ర వాత్సల్యం ఉన్నదన్నాడు. పాండవులతో విరోధం మానుకుని, కలిసి మెలిసి వుండమన్నాడు. 

పాండవులను యుద్ధంలో జయించలేమన్న సంగతి తనకు తెలుసని, అయినా దుర్యోధనుడిని వదిలి పాండవుల పక్షం చేరడం న్యాయం కాదని కర్ణుడు బదులు చెప్పాడు. కర్ణుడి మాటలకు భీష్ముడు, దుర్యోధనుడికి ఏది ఇష్టమో అదే చేయమని అన్నాడు. భీష్ముడి మాటలు విని కర్ణుడు వెళ్లిపోయాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment