Monday, May 9, 2022

దేశానికి దారి చూపేది కేసీయారే! : వనం జ్వాలా నరసింహారావు

దేశానికి దారి చూపేది కేసీయారే!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (10-05-2022)

ఏప్రియల్ 27, 2022 న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో అత్యద్భుతంగా ప్రసంగించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, భారత దేశానికి ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఒక పటిష్టమైన జాతీయ ప్రత్యామ్నాయ అజెండా వుండాలని సోదాహరణంగా చెప్పారు. కేసీఆర్ గత కొంతకాలంగా తరచూ చెప్తూ వస్తున్న జాతీయ రాజకీయాలలో గుణాత్మక మార్పులో భాగంగాను, దానికి అనుగుణంగా, ఆ దిశగా తాను జాతీయ రాజకీయాలలో క్రియాశీలక, కీలక పాత్ర పోషించనున్నట్లు సంకేతంగాను దీన్ని భావించవచ్చు.

కేసీఆర్ మాటల్లోని భావాన్ని, ఆయన చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆయన ఆలోచన ఎవర్నో (కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే యల్లయ్యనో, మల్లయ్యనో) ఒకర్ని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలని కానేకాదనేది స్పష్టంగా తెలుస్తున్నది. తాను ప్రతిపాదిస్తున్న జాతీయ ప్రత్యామ్నాయ అజెండా అమలు కావాలని, తద్వారా త్యాగాల ఫలితంగా కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్య   ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికి చేరాలని కేసీఆర్ అంటున్నారు. మరో విధంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం దేశానికి కావాల్సింది దేశాభివృద్ధికి అవసరమైన ప్రత్యామ్నాయ అజెండా మాత్రమే కాని, అందరూ భావిస్తున్నట్లు ప్రత్యామ్నాయ రాజకీయ పునరేకీకరణ మాత్రం కాదు.  

తన ప్రసంగంలో భాగంగా బ్రహ్మాడంగా విజయవంతమైన తెలంగాణ నమూనా అభివృద్ధిని, సంక్షేమాన్ని దేశవ్యాప్తంగా అమలుపరిచే విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలను, దేశానికి ప్రమాదంగా పరిణమిస్తున్న మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రచారం చేస్తున్న హిందుత్వ సిద్ధాంతాన్ని కేసీఆర్ నిశితంగా విమర్హిస్తూ వాటిని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రసంగం సాగినంత సేపు ‘దేశ్ కీ నేతా కేసీఆర్ అనే నినాదాలు ప్లీనరీలో పాల్గిన్న ప్రతినిధుల నుండి వినిపించాయి.  

కేసీఆర్ ప్రకటించిన ప్రత్యామ్నాయ అజెండా నేపధ్యంలో ఒక్కసారి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని నిశితంగా విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి. బహుశా అందుకే కావచ్చు, జాతీయ రాజకీయాలకు తన అవసరం కావాల్సి వస్తే దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అవును నిజమే.....దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అత్యంత అవసరం. దేశ ప్రజలు ప్రబలమైన మార్పు కోరుకుంటున్నారనేది వాస్తవం. ఏడున్నర దశాబ్దాల కాంగ్రెస్, బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే కాబట్టి, ఆ రెండు పార్టీలు మార్చిమార్చి దేశాన్ని పరిపాలిస్తున్నా పథకాల పేర్ల మార్పిడి తప్ప ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఒరిగిందేమీలేదనె చెప్పాలి.

ఆవిర్భవించిన అనతికాలంలోనే భారతదేశంలో కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారం అందుకున్న రాజకీయ శక్తుల చరిత్ర జగద్విదితం. జనతా పార్టీ పుట్టుక కానీ, ఎన్టీఆర్ తెలుగుదేశం పుట్టుక కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుక కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక కానీ ఇందుకు చక్కటి ఉదాహరణలు. ఆమాటకొస్తే తెలంగాణ రాష్ట్ర సమితి  పుట్టిన కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలా ప్రారంభమవుతుందో ఎవరూ ఉహించలేరు. సమయం అన్నీ నిర్ణయిస్తుంది. పనిమాత్రం ఆగదు.

75 ఏండ్ల నుంచి దేశం ఇదే మూసలో పోవాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాల్లో, విధానాలలో  అనేక విషయాల్లో ప్రబలమైన మార్పు రావాలి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. ఒక ఆరు సంవత్సరాల తక్కువ సమయాన్ని మినహాయిస్తే, మిగిలిన 69 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ లేదా బీజేపీ పాలించాయి. జాతికి వాళ్లు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

కాంగ్రెస్-బీజేపీలకు జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయ అజెండా అనే కేసీఆర్ ఆలోచన, ఏదో కొన్ని చిన్నా-చితకా రాజకీయ పార్టీలను కలిపి ఐక్య సంఘటనగా ఏర్పరిచి, తాత్కాలిక రాజకీయ పబ్బం గడుపుకోవడం కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల-అన్ని వర్గాల ప్రజలను సమైక్యం చేసి, సంఘటిత పరిచి, తద్వారా దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ అజెండా రూపంలో ఒక ఉమ్మడి కార్యాచరణ రూపకల్పన చేయడమే కేసీఆర్ లక్ష్యం అనే భావాన ఆయన మాటలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. సీఎం చెప్పినదాంట్లో రాజకీయ విశ్లేషకులకు స్పష్టమైన సందేశం వుందనేది గమనించాల్సిన విషయం. గత కొద్ది కాలంగా, గడచిన ఏడున్నర దశాబ్దాల కాలంలో భారతీయ జనతాపార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపి వాటిని నిశితంగా విమర్శించారు ముఖ్యమంత్రి. భారతదేశ పరపతినీ, భారత ఆర్థిక వ్యవస్థ పరపతినీ, గణనీయంగా పెంచే విషయంలో ప్రత్యామ్నాయ అజెండా ఆవశ్యకతను కూడా సీఎం నొక్కి చెప్పారు.

 తెలంగాణ రాష్ట్రం తన వినూత్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రత్యామ్నాయ జాతీయ అజెండా అయితే దేశాభివృద్ధి అలవోకగా సాగుతుంది. భారతదేశం గొప్పదిగా కావాలంటే, తెలంగాణా తరహాలోనే జాతి పునర్నిర్మాణం, పునర్ నిర్వచనం, పునః సృష్టి జరిగాలి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అమల్లో వున్న ఉత్తమ విధానాలను, పద్ధతులను, అలవాట్లను, నడవడులను సేకరించి, అధ్యయనం చేసి, వాటిని మన దేశ స్థితిగతులకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి. దేశ ఆర్ధిక పరపతిని గణనీయంగా పెంచి, ఏ ఏ రంగాలలో మనం వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకుని తదనుగుణంగా తప్పొప్పులు సరిచేసుకుంటూ ముందడుగు వేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. ఇవన్నీ దృష్టిలో వుంచుకుని, జాతీయ అభివృద్ధి ప్రత్యామ్నాయ అజెండా రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. దాని రూపకర్త కేసీఆర్ కావాలి.  

పలు రంగాల నిపుణులు, సీనియర్ పాలనాదికారులు, ఆర్ధిక శాస్త్రవేత్తలు, సమాజ అభ్యున్నతి కోరే ప్రతి ఒక్కరు, తమవంతు పాత్రగా, ప్రస్తుతం అమల్లో వున్న చట్టాలను, విధానాలను, శాసనాలను, పద్ధతులను, అభ్యాసాలను అధ్యయనం చేసి, సంస్కరణల కోణంలో అవసరమైన మార్పులు-చేర్పులు చేసి, మార్పు దిశగా మార్గదర్శకాలను-రోడ్ మ్యాప్ ను రూపొందించి ముందుకు సాగాలి. ఈ ప్రయత్నంలో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు చురుగ్గా భాగస్వాములు కావాలి. ఇదే క్రమేపీ జాతీయ అభివృద్ధి అజెండా రూపకల్పనకు దారితీస్తుంది.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వుండడం వల్ల దేశాభివృద్ధి కాని, దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోవడం కాని జరిగే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. ఇప్పటికే సుమారు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రజలు ఒకవిధంగా నరేంద్ర మోడీ పాలనతో విసిగి వేసారి పోయారని చెప్పక తప్పదేమో! కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాధాన్యత సంతరించుకున్న ప్రజలకు అవసరమైన కార్యక్రమం కాని, పథకం కాని మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆలోచించడం కాని, అమలు చేయడం కాని జరగలేదంటే బహుశా అతిశయోక్తి కాదేమో! దళితులకు కాని, రైతుకు కాని ఏదన్నా పథకం అమలయిందా? కాలేదన్న విషయం ప్రజలకు తెలియచేయగలిగితే, వాళ్లను చైతన్యవంతులను చేయగలిగితే, వాళ్లు ప్రశ్నించడం మొదలు పెట్టితే మార్పు రావడం కష్టం కానేకాదు.

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలయింది...ఇంకా ఇలానే వుంటే నష్టపోతాం. దేశానికి కావాలి ఉత్తేజపూరితమైన నూతన నాయకత్వం...నూతన మార్గదర్శకత్వం. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా కనీస అవసరాలకు నోచుకోలేని బీద-సాద-పేద వారు కోట్లల్లో వున్నారు. పేదరికం ఇంకా తాండవిస్తోంది. చాలామంది నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మనుగడ సాగిస్తున్నారు. మనతో పాటే స్వాతంత్ర్యం తెచ్చుకున్న అనేక దేశాలు, ఆదిలో బీదరికంలో వున్నా, రోజులు గడుస్తున్నాకొద్దీ బ్రహ్మాండమైన వృద్ధి, అభివృద్ధి సాధించి, ఆర్థికంగా పుంజుకొని, మనకంటే గణనీయంగా పురోగతి సాధించాయి. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

మన దేశానికి కావాల్సింది, మన అవసరాలకు అనుగుణమైన వాతావరణం....దాన్ని సరిగ్గా వాడుకునే నాయకత్వం. మన ఆర్ధిక వ్యవస్థ పరపతినీ, మన సంపదనూ, మన అంతర్గత శక్తి-సామర్థ్యాలనూ, మన అపార వనరుల సంపదనూ సక్రమంగా ఉపయోగించుకొలేమా? అలా జరక్కుండా ఎవరు నిరోదిస్తున్నారు? ఇదేమీ అత్యంత క్లిష్టమైన, అసాధ్యమైన కార్యం కాదు....కావాల్సిందల్లా మనసు పెట్టి మార్గం ఆలోచించడమే!!! గత 75 సంవత్సరాల మాదిరిగా, మూసపద్ధతిలో ఆలోచనలు చేయకుండా, వినూత్నంగా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం అసాధ్యం కానేకాదు.

రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇరు రాజకీయ పార్టీలు ఒకరికి మరొకరు మాత్రమే ప్రత్యామ్నాయమనే భావన పోవాలి. కొత్త నాయకత్వం రావాలి. అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లగలిగే ప్రత్యామ్నాయ జాతీయ అజెండా రూపుదిద్దుకోవాలి. రాజకీయ, ఆర్ధిక, సామాజిక, న్యాయ, ఇతర రంగాల్లో ప్రజాపరయోజనకరమైన సంస్కరణలకు నాంది పలకాలి. బహుశా తెలంగాణ ముఖమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదేపదే చెప్తూ వస్తున్న ప్రత్యామ్నాయ అజెండా వీటన్నిటికీ సమాధానం కావచ్చు.

కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారధ్యం వహించిన నాడు, ఆయనేంచేయలేడని వ్యాఖ్యానిస్తూ హేళన చేసారెందరో. చివరకు జరిగింది ఏంటి? ఆబాలగోపాలాన్ని, ఆసేతు హిమాచలంలోని రాజకీయ పార్టీలన్నిటినీ “జై తెలంగాణా” నినాదానికి అనుకూలంగా మలచుకున్నారాయన. ఇదే స్ఫూర్తి జాతీయ రాజకీయాలలో కూడా కొనసాగదా? బీజేపీలో కాని, కాంగ్రెస్ పార్టీలో కాని ప్రత్యామ్నాయ అజెండా అమలుపరచగల స్థాయి నాయకులు లేరనే చెప్పాలి. దేశంలో జాతీయ స్థాయిలో రాజకీయ దౌర్బల్యం, దుర్బలత్వం చోటుచేసుకున్నాయి. ప్రజలు సమన్వితం కావడం జరగాలి. అందరూ ఏకతాటిపై నిలబడాలి., ఇదే ప్రత్యామ్నాయ అజెండాగా జాతీయ రాజకీయాలలో క్రియాశీలకపాత్ర పోషించబోతోంది. అత్యంత అభ్యుదయకర, ప్రగతిశీల ఎజెండా దేశాభివృద్ధికి రూపుదిద్దుకోనుంది. భారతదేశం సంపన్న దేశంగా, సౌభాగ్యవంతంగా కావాలి.

అభివృద్ధి పరంగా, సంక్షేమపరంగా, మౌలిక వసతుల కల్పనాపరంగా, తెలంగాణా రాష్ట్రం ఎన్నో మైలురాళ్ళను అధిగమించింది. తెలంగాణా రాష్ట్రం తన వినూత్న పథకాల ద్వారా, కార్యక్రమాల ద్వారా దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శవంతమైన-రోల్ మోడల్ రాష్ట్రంగా తయారైంది. ఎంతో మంది వీటిని అనుకరిస్తూ తమ రాష్ట్రాలలో కూడా అమలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. తెలంగాణ పథకాలైన రైతుకు ఎకరానికి రు.10000 పెట్టుబడి మద్దతు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, సార్వజనీన ఆమోదయోగ్య వ్యవసాయ విధానం. రైతుకు కనీస మద్దతి ధర, ఆదాయపు పన్నులో సౌలభ్యం, నల్లదనాన్ని వెలికి తీయడంద్వారా నిధులను సమీకరించి దేశాభివృద్ధికి ఉపయోగించడం, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, పార్లమెంట్ ఆధిక్యత, దేశంలో లభ్యమవుతున్న 70000 టీఎంసి నీటి సద్వినియోగం, ఎన్నికల సంస్కరణలు, అధికార స్వామ్య సంస్కరణలు, లాంటివాటితో పాటు మరెన్నో ప్రజోపయోగ విధానాలు జాతీయ ప్రత్యామ్నాయ అజెండాలో భాగం కావాలి.

ఇవన్నీ జరగాలంటే అసలు సిసలైన ప్రత్యామ్నాయ జాతీయ నాయకత్వం కావాలి, రావాలి. రాబోయే ఎన్నికలనాటికి అలా జరుగుతుందని ఆశిద్దాం.

1 comment:

  1. ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు సచివాలయాన్ని ప్రక్కన పెట్టారు. ఆయన ప్రధాని ఐతే పార్లమెంటును ప్రక్కన పెడతారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనేవి నామమాత్రావశేషం చేసారు ముఖ్యమంత్రిగా. ప్రధాని ఐతే దేశంలోని ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ నామరూపాలు లేకుండా చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో gang of four పాలన నడిపిస్తున్నారు. అదే ప్రధానిగా దేశం మొత్తానికి రుద్దుతారు. ఎప్పటిలాగే తానే సర్వాధికారిగా ఉండి కాదన్నవారిని కుక్కా నక్కా అంటారు. అటువంటి మార్పు దేశానికి అవసరం అంటారా?

    ReplyDelete