Saturday, June 25, 2022

పద్నాలుగవ రోజు భారత యుద్ధం, సైంధవుడిని చంపి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న అర్జునుడు .... ఆస్వాదన-77 : వనం జ్వాలా నరసింహారావు

పద్నాలుగవ రోజు భారత యుద్ధం, 

సైంధవుడిని చంపి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న అర్జునుడు

 ఆస్వాదన-77

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-06-2022)

మహాభారత యుద్ధం పద్నాలుగవ రోజున, అంటే, ద్రోణుడి నాలగువ రోజు యుద్దాన, సూర్యాస్తమయం లోపున సైంధవుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు యుద్ధసన్నద్దుడై పోయే ముందర సాత్యకితో, తాను తన శపథం నెరవేర్చుకోవడానికి పోతున్నానని, అతడు ధర్మరాజుకు రక్షణగా వుండాలని చెప్పాడు. పాండవులకు సైంధవుడిని చంపడం, ధర్మరాజును కాపాడడం రెండూ సమానమేనని, కాబట్టి ఒక పని తాను, ఇంకొక పని సాత్యకి పూనుకుని పనిచేయాలని అన్నాడు.

కౌరవ పక్షంలో, యుద్ధం ప్రారంభానికి ముందర ద్రోణాచార్యుడు శంఖాన్ని పూరించాడు. సైన్యంలో నలుమూలలా తిరిగాడు. భూరిశ్రవసుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు, సైంధవుడు కలిసి వుండాలని, వారంతా తాను రచించే యుద్ధ వ్యూహానికి మూడామడల దూరంలో వున్న ప్రదేశంలో వెనుకగా మూగి నిలబడాలని, అలా వుంటే వారిని దేవతలు కూడా సమీపించలేరని అన్నాడు ద్రోణుడు. ఆ మాటలకు సైంధవుడు ఊరడిల్లాడు. ఆ తరువాత ద్రోణాచార్యుడు 24 కోసుల పొడవు, 10 కోసుల విస్తారం వుండే శకట వ్యూహాన్ని తీర్చాడు. దానికి పడమటి భాగంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని రచించాడు. దాని మధ్యభాగం మొదలుకొని సేనా ముఖం దాకా వ్యాపించి వుండే సూచీ వ్యూహాన్ని అమర్చాడు. దాని ముఖంలో కృతవర్మను, అతడు వెనుక కాంభోజరాజును, మరికొంత వెనుక భాగంలో దుర్యోధనుడిని వుంచాడు. సూచీ వ్యూహంలోని కేంద్ర స్థానంలో మొదలే చెప్పినట్లు సైంధవుడిని నిలిపాడు. ఆ విధంగా ద్రోణాచార్యుడు సైంధవుడిని కాపాడడానికి అనేక విధాలైన వ్యూహాలను నిర్మించాడు.

ఇదిలా వుండగా దుర్మర్షణుడు అనే కౌరవ వీరుడు తానొక్కడే ఆర్జునుడిని ఆపుతానని అంటూ అతడి మీదికి యుద్ధానికి వెళ్లాడు. అదే సమయంలో చూపరులకు భయం కలిగిస్తూ కపిధ్వజంతో వున్న శ్రీకృష్ణ సారథ్యంలోని రథం మీద అర్జునుడు అక్కడికి వచ్చాడు. వస్తూనే సింహనాదాల మధ్య అర్జునుడు విజృంభించాడు. దుర్మర్షణుడు ఆర్జునుడిని ఎదుర్కొన్నాడు. కౌరవ సైన్యాన్ని అర్జునుడు చీల్చి చెండాడాడు. తీవ్రమైన యుద్ధం జరగగా వీరులు, సారథులు పడిపోగా, దుర్మర్షణుడు వెన్నిచ్చి తొలగిపోయాడు. అప్పుడు దుశ్శాసనుడు ఆర్జునుడిని మహాద్భుతంగా ఎదుర్కొన్నాడు. అయితే విజృంభించిన అర్జునుడి ధాటికి తట్టుకోలేక దుశ్శాసనుడు తన సైన్యంతో సహా పరుగెత్తుతుంటే అర్జునుడు వెంటబడి తరిమి కొట్టాడు. దుశ్శాసనుడు అర్జునుడి హేళన మాటలను లెక్కచేయకుండా ద్రోణాచార్యుడి చాటున దాక్కున్నాడు.

అర్జునుడు ఆ తరువాత సైంధవుడు వున్న దిక్కుగా పోతూ, ద్రోణాచార్యుడికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ, ఆయనకు కౌరవపాండవులు ఇద్దరూ సమానమేనని, తననూ, అశ్వత్థామను సమానమైన ప్రేమతో పెంచాడని, ద్రోహి అయిన సైంధవుడిని చంపడానికి తాను చేసిన ప్రతిజ్ఞ నేరవేరేట్లు చేయమని ప్రార్థించాడు. ఆ విధంగా అర్జునుడు సైంధవుడిని చంపడానికి ఆచార్యుడి అనుమతి కోరాడు. దానికాయన చిరునవ్వుతో, తనను గెలవకుండా సైంధవుడిని ఎలా సమీపిస్తావని ప్రశ్నిస్తూ, అర్జునుడిమీద బాణాలు వేశాడు. అర్జునుడు కూడా ద్రోణాచార్యుడి మీద బాణాలు వేశాడు. ఇరువురి మధ్యా యుద్ధం సాగింది. అప్పుడు శ్రీకృష్ణార్జునులు కలిసి ఆలోచించి, వెంటనే, శ్రీకృష్ణుడు రథాన్ని ద్రోణుడికి ప్రదక్షిణంగా శకట వ్యూహంలోకి ప్రవేశించడానికి పోనిచ్చాడు. తనను ఎదుర్కోకుండా వెళ్లవద్దని అంటున్న ద్రోణుడి మాటలను అర్జునుడు లెక్కచేయలేదు. శకట వ్యూహం ప్రవేశించిన అర్జునుడు సైన్యంలోకి చొచ్చుకుపోయాడు. అర్జునుడి వెంటే వెళ్లిన ద్రోణుడు అతడిమీద యుద్ధం కొనసాగిస్తూనే వున్నాడు.

ద్రోణుడిని మోసగించి అర్జునుడు కృతవర్మ సైన్యంలోకి చొరబడగానే ఇక తాను చేసేదేమీ లేదని నిర్ణయించుకున్న ద్రోణుడు మొగ్గరం మొనకు వెళ్లాడు. కృతవర్మ బాణాలను లెక్కచేయని అర్జునుడు అతడిని నేలమీద పడేట్లు చేశాడు. కృతవర్మ మూర్ఛపోయాడు. ముందుకు సాగుతున్న ఆర్జునుడిని మూర్ఛనుండి తేరుకున్న కృతవర్మ అడ్డుకున్నాడు. అయినా అర్జునుడి రథాన్ని ఆపలేకపోయాడు. ఆ సమయంలో ఆర్జునుడిని శ్రుతాయుధుడు ఎదుర్కొన్నాడు కాని అర్జునుడి చేతిలో చచ్చాడు. అప్పుడు ఆర్జునుడిని కాంభోజరాజు ఎదుర్కొన్నాడు. కాసేపు యుద్ధం చేసి కాంభోజరాజు సుదక్షిణుడు దొర్లుతూ కిందపడ్డాడు. ఆ వెంటనే శూరసేన, శిబి, వసాతి మొదలైనవారు ఆర్జునుడిని చుట్టుముట్టారు. శ్రుతాయువు, అయుతాయువు అర్జునుడికి రెండుపక్కలా చేరి అతడిని నొప్పించారు. అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించగా దానికి వారిద్దరూ, ఆ తరువాత పోరాడడానికి వచ్చిన వారి సుతులు సహితం చనిపోయారు.        

అర్జునుడు అలా విజృంభించి యుద్ధం చేస్తున్న సమయంలో దుర్యోధనుడు పురికొల్పగా కాళింగులు, అంగబలాలు, ఆటవికుల గుంపులు అర్జునుడిని కమ్ముకున్నారు. అర్జునుడు ఆ సైన్యాలను భంగపరచాడు. ముందుకు పోతున్న అర్జునుడిని అంబష్టదేశరాజు శ్రుతాయువు ఎదుర్కొన్నాడు కాని అర్జునుడి చేతిలో చచ్చాడు. అలా, అలా, అర్జునుడు ద్రోణుడిని దాటుకొని కృతవర్మను తీవ్రంగా బాధించాడు. శ్రుతాయువును చంపాడు. కాంభోజరాజును పడగొట్టాడు. కౌరవసేనలోకి దూరి విజృంభించి పోరాడుతుంటే అతడి పరాక్రమాన్ని చూసిన దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరకు పోయాడు. ద్రోణుడు పాండవ పక్షపాతని దూషించాడు. సైంధవుడు ద్రోణాచార్యుడిని నమ్మాడని, అతడు చావకుండా రక్షించమని, కాపాడమని అన్నాడు. అర్జునుడిని ఇంద్రుడు కూడా ఎదుర్కోలేడని, తగినవారి సహాయంతో అర్జునుడి దారికి దుర్యోధనుడిని అడ్డుపడమని అంటూ, అతడికి రక్షగా ఒక బంగారు కవచాన్ని మంత్రించి ఇచ్చాడు.

పాండవ సైన్యాలు ఒక్కుమ్మడిగా విజృంభించాయి. ఒకపక్క ధృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుడు భీకరమైన యుద్ధం చేయసాగారు. ఒక సందర్భంలో ద్రోణుడు ధృష్టద్యుమ్నుడిని హతమార్చడానికి సిద్ధంకాగా సాత్యకి తప్పించాడు. అప్పుడు ద్రోణుడు సాత్యకి మీద దూకాడు. ద్రోణ సాత్యకులు ఎదుర్కొన్నారు. సాత్యకి ఎప్పుడైతే ద్రోణుడి విల్లును రెండు సార్లు విరిచాడో అప్పుడు మనసులోనే సాత్యకిని అభినందించాదు ద్రోణుడు. ద్రోణుడు వేసిన ఆగ్నేయాస్త్రానికి విరుగుడుగా సాత్యకి వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు.

ఇదిలా వుండగా విందానువిందులు అర్జునుడి మీదికి సాహసంతో దూకారు. కాసేపు యుద్ధం చేసిన తరువాత వారిద్దరినీ సంహరించాడు అర్జునుడు. ఆ తరువాత ఒకవైపు యుద్ధం చేస్తూనే, అలసిపోయిన గుర్రాలను తోలి, వాటి మెడలమీద పట్టీలను తీసి, వాటిని తడిపి, దివ్యాస్త్రాలతో భూమిని చీల్చి, కోనేటిని ఏర్పాటు చేసి, దానికి ఇల్లు కూడా కట్టి, వాటికి తాగడానికి నీరు పెట్టాడు అర్జునుడు. వాటికి సరైన దాణా కూడా పెట్టాడు. గుర్రాల అలసటను పోగొట్టాడు. అప్పుడు కౌరవ సైన్యానికి జంకకుండా అర్జునుడు మళ్లీ విజృంభించాడు. కౌరవ సైన్యాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఇదంతా గమనిస్తున్న కౌరవ సేనలు, సైంధవుడు అర్జునుడు చేతిలో చావకుండా తప్పించుకోలేడని అనుకున్నారు. ఆ విధంగా అర్జునుడిని ప్రశంసిస్తూ సైంధవుడి మీద కౌరవ సైనికులు ఆశలు వదులుకున్నారు.

ఇంతలో ద్రోణుడిచ్చిన కవచాన్ని ధరించిన దుర్యోధనుడు ధైర్యంగా సైంధవుడు వున్న దిక్కుగా తన రథాన్ని అడ్డంగా పోనిచ్చి, అర్జునుడి మీదికి యుద్ధానికి దిగాడు. దుర్యోధనుడు యుద్ధానికి రావడం అదృష్టం అని అంటూ శ్రీకృష్ణుడు తన బలాన్ని ప్రదర్శించమని అర్జునుడిని ప్రోత్సహించాడు. ఇరువురి మధ్యా యుద్ధం మొదలైంది. కవచం వుందన్న ధీమాతో యుద్ధం చేస్తున్న దుర్యోధనుడు బాణ వర్షం కురిపించాడు కృష్ణార్జునుల మీద. అర్జునుడి బాణాలన్నీ దుర్యోధనుడి కవచాన్ని తగిలి ఎగిరి పడుతున్నాయి. అర్జునుడి బాణాలు విచ్చిన్నం అవుతుంటే శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుడి కవచ ధారణ వల్ల అలా జరుగుతున్నదని, ఆ కవచం ముల్లోకాలకూ అభేద్యమని, అయితే ఆ కవచం రహస్యాలు అతడికి తెలియవని, కవచం వున్నా అతడు తనను కాపాడుకోలేకుండా చేస్తానని అన్నాడు అర్జునుడు. అంగిరసుడు ఇంద్రుడికి, ఇంద్రుడు తనకు ఇచ్చిన మహాస్త్రంతో దుర్యోధనుడి కవచాన్ని చీలుస్తానని అన్నాడు. అయితే అర్జునుడు ప్రయోగించిన ఆ అస్త్రాన్ని అశ్వత్థామ వేసిన మరో మహాస్త్రం తుంచివేసింది. కోపంతో అర్జునుడు బాణాలు వేసి దుర్యోధనుడి గుర్రాలను, సారథిని చంపి రథాన్ని ముక్కలు చేసి అతడి అరచేతిలో బాణాలు నాటాడు.

అప్పుడు దుర్యోధనుడు వివేకం కోల్పోయి తాను ధరించిన (ద్రోణుడు మంత్రించి ఇచ్చిన) కవచం పనికిరాదనే బుద్ధితో తీసేశాడు, ఇంకో కవచాన్ని తొడుక్కున్నాడు. అర్జునుడు విజృంభించాడు మళ్లీ. శంఖారావం చేసి సైంధవుడి వైపు వెళ్తున్న అర్జునుడి మీద దుర్యోధనాదులు, కర్ణుడు మొదలైన వీరులు బాణవర్షం కురిపించారు. తనను ఎదుర్కొన్న కర్ణుడిని, శల్యుడిని, కృపాచార్యుడిని, అశ్వత్థామను, భూరిశ్రవుడిని, ఇతర కౌరవ వీరులను తీవ్రమైన బాణాలతో నొప్పించాడు అర్జునుడు. అప్పుడప్పుడు సైంధవుడి మీద బాణాలు వేశాడు.

అదే సమయంలో ద్రోణుడి సైన్యాలకు, ధర్మరాజు సైన్యాలకు జరిగిన యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయాడు. మరోపక్క అలంబసుడు ఘతోత్కచుడితో యుద్ధం చేసి చనిపోయాడు. ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తున్న సాత్యకిని అర్జునుడి సాయంగా పొమ్మని ధర్మరాజు సలాహ ఇచ్చాడు. ధర్మరాజుకు రక్షణగా తనను వుండమని అర్జునుడు చెప్పిన విషయం గుర్తు చేసినప్పటికీ ధర్మరాజు తనను పొమ్మని అనడంతో ఆయన మాట ప్రకారం సాత్యకి అర్జునుడి దగ్గరికి పోవడానికి, అతడికి సహాయం చేయడానికి సమ్మతించాడు.

ధర్మరాజు ఆజ్ఞానుసారం సాత్యకి ద్రోణుడున్న దిక్కుగా యుద్ధానికి వెళ్లాడు. ఇద్దరిమధ్యా యుద్ధం జరిగింది. అలా అడ్డుతగుల్తున్న ద్రోణుడిని తప్పించుకొని సాత్యకి రథం ముందుకు సాగింది. తనను ఎదుర్కొన్న కృతవర్మను కూడా దాటుకుని అర్జునుడున్న దిక్కుగా వెళ్లాడు సాత్యకి. మధ్యలో జలసంధుడు అనే రాజు సాత్యకిని తన బాణాల వరదతో ఆపాడు. కాని చివరకి సాత్యకి చేతుల్లో మరణించాడు. ఇంతలో ద్రోణుడు, దుర్యోధనుడు సాత్యకిని ఎదుర్కొన్నారు. సాత్యకి, ద్రోణ, కృతవర్మ, దుర్యోధనాదులైన వీరులను తరిమికొట్టి అర్జునుడి వైపుకు తన రథాన్ని తోలాడు. దారిలో ఎదుర్కున్న సుదర్శనుడు అనే రాజును సంహరించాడు. ఆ తరువాత దుశ్శాసనుడు సాత్యకితో యుద్ధం చేసి పారిపోయాడు.

ధర్మజ, భీమ, నకుల, సహదేవులు సాత్యకి సేనను సమీపించడానికి ప్రయత్నం చేస్తుంటే తీవ్రమైన యుద్ధం జరిగింది. సాత్యకి సైన్యంలోకి దూరిపోతూ వున్నాడు. పాండవుల మీదికి యుద్ధానికి వచ్చిన దుర్యోధనుడి విల్లును ధర్మరాజు నరికాడు. ద్రోణుడు వేసిన బాణాలను కేకయరాజు తిప్పికొట్టాడు. ద్రోణుడి బాణానికి ధృష్టకేతుడు చనిపోయాడు. ద్రోణుడు విజృంభించాడు. ఇంతలో ధర్మరాజు భీముడిని అర్జునుడికి సాయంగా పొమ్మన్నాడు. ధృష్టద్యుమ్నుడిని అన్నగారికి రక్షణగా వుండమని భీముడు ద్రోణాదిరథికులను అతిక్రమించి అర్జునుడి దగ్గరికి వెళ్లాడు. మధ్యలో కర్ణుడితో యుద్ధం చేసి అతడిని మొదలు ఓడించాడు. కురుకుమారులైన  దుర్జయుడిని, దుర్ముఖుడిని, దుర్మర్షణ, దుర్మద, దుస్సహ, విజయ, విచిత్రుడిని, శత్రుంజయుడు మొదలైన ఏడుగురు దుర్యోధనుడి సోదరులను హతమార్చాడు. భీముడు అ ఆతరువాత కర్ణుడి చేతిలో ఓడిపోయి అతడి హేళన మాటలు వినాల్సి వచ్చింది.  

అర్జునుడు, సాత్యకి, భీముడు కౌరవ సేనలను చీకాకు పెట్టి సైంధవుడి దగ్గరికి చేరారు. భూరిశ్రవుడు సాత్యకితో యుద్ధం చేసి పైచేయి అవుతున్నప్పుడు అర్జునుడు వేసిన బాణం అతడి చేయిని నరికింది. అప్పుడు ఆర్జునుడిని నిందించి భూరిశ్రవుడు తన ఎడమ చేతితో బాణాలను కిందపరుచుకొని సమాధిలోకి వెళ్లాడు. సాత్యకి ఉత్సాహంతో శ్రీకృష్ణార్జునులు, భీమ, కర్ణ, అశ్వత్థామలు వద్దని వారిస్తున్నా వినకుండా కత్తితో భూరిశ్రవుడి తలను నరికేశాడు.

అర్జునుడు రథాన్ని శ్రీకృష్ణుడు సైంధవుడున్న దిక్కుకు తోలాడు. సరిగ్గా అదే సమయంలో క్రితం రోజు చెప్పినట్లే, శ్రీకృష్ణుడి సారథి దారుకుడు (భూరిశ్రవుడి వల్ల కలిగే ఆపదను ముందే ఊహించి చెప్పిన) తెచ్చిన రథం మీద సాత్యకి ఎక్కాడు. అలా సాత్యకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కర్ణుడు సాత్యకితో యుద్ధం చేసి ఓడిపోయాడు. తన అన్న భీముడిని తిట్టినందుకు కోపగించుకున్న అర్జునుడు కర్ణుడిని దూషించాడు. ఆయన చూస్తుండగానే ధర్మపద్ధతిలో వృషసేనుడిని చంపుతానన్నాడు. ఇంతలో దుర్యోధన, కర్ణ, వృషసేన, శల్య, కృప, అశ్వత్థామలు సైంధవుడిని వెనక్కు నెట్టి అర్జునుడిని ఎదుర్కొని బాణాలు వేశారు. కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం జరిగింది. కర్ణుడి సారథిని చంపి, శరీరాన్ని భాధపెట్టగా, అశ్వత్థామ ఆదుకున్నాడు. శల్యుడు సహాయపడ్డాడు. కృపాచార్యుడు, వృషసేనుడు శల్యాశ్వత్థామల పక్కకు చేరి అర్జునుడి మీద బాణాలు వేశారు. వారి నలుగురి వెనుక దాగి వున్న సైంధవుడు కూడా అర్జునుడి మీద బాణాలు వేశాడు.

వీరందరినీ ఎదుర్కొంటూ అర్జునుడు సైంధవుడి మీద బాణాలు వేశాడు. అర్జునుడి విజృంభణకు కౌరవ సేనలు పారిపోయాయి. మండే బాణాలతో అర్జునుడు సైంధవుడి మీదికి దూకాడు. సైంధవుడి వరాహ కేతనాన్ని, సారథి తలను ఒకేసారి ఆశ్చర్యంగా పడగొట్టాడు. కౌరవ యోధులు సైంధవుడిని కాపాడడానికి అడ్డంగా నిలబడగా, అర్జునుడు అతడిని చంపేదారి తోచక ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మాయా చీకటిని కలిగించి సూర్యుడిని కప్పివేశాడు. అది సూర్యాస్తమయంగా భావించి కౌరవ సేనలు సింహనాదాలు చేశాయి. సైంధవుడు తల ఎత్తి పడమటి దిక్కుకు చూశాడు. అలా చూస్తున్న సైంధవుడి తల తుంచి వేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. వెంటనే అర్జునుడు ప్రయోగించిన బాణం సైంధవుడి తలను హరించింది. సైంధవుడి తల నేలమీద పడకూడదని, దాన్ని ఆకాశంలో నిలిచేట్లు చేయమని అర్జునుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఆ తలను ఆకాశంలో బంతిలాగా నిలిపాడు. ఇంతలో సూర్యుడు మళ్లీ కానవచ్చాడు. కౌరవ యోధులు అర్జునుడి చుట్టుముట్టారు.

సైంధవుడి తల భూమ్మీద పడకుండా అతడి తండ్రి వృద్ధక్షత్రుడి తొడమీద పడేట్లు చేయమని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు పాశుపతాస్త్రం సహాయంతో శమంతక పంచకంలో వున్న అతడి తొడమీద సైంధవుడి తల వేయడం, అతడు దాని కింద పడేయడం, అతడి తల నూరు ముక్కలు కావడం జరిగింది. ఆ విధంగా అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. కృష్ణార్జునులు సంతోషించారు. భీమసేనుడు సింహనాదం చేశాడు. దానిని విన్న ధర్మరాజు అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరిందని సంతోషించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, తృతీయ-చతుర్థ ఆశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

  

     

Thursday, June 23, 2022

రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్టాత్మకం? : వనం జ్వాలా నరసింహారావు

 రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్టాత్మకం?

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (23-06-2022)

          రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకూ, విపక్షాలకూ కూడా ఈ ఎన్నిక కీలకం కానుంది. 1969 లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ప్రోత్సాహంతో, ప్రేరణతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, అంతరాత్మ ప్రబోధం అన్న నినాదంతో, స్వయంగా ఆమె ప్రతిపాదించిన అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరహగిరి వెంకట గిరి నెగ్గిన ఏకైక సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్టాత్మకంగా దేశంలోని అత్యున్నత స్థానానికి ఎన్నిక జరగబోవడం మున్నెన్నడూ జరగలేదేమో బహుశా! వాస్తవానికి అప్పట్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు ఓడిన అభ్యర్థి సంజీవరెడ్డికే పడ్డాయి. కాకపోతే స్వల్ప మెజారిటీతో వీవీ గిరి గెలువడానికి కారణం కాంగ్రెస్ మైనారిటీ ఓట్లతో సహా వామపక్షాల ఓట్లు, ఒక విచిత్రమైన ప్రతిపక్ష కూటమి ఓట్లు రావడమే. నాటి మితవాద రాజకీయ పక్షాలైన జనసంఘ్ లాంటి పార్టీలకు వారి అభ్యర్థి సీడీ దేశ్ ముఖ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, రెండవ ప్రాధాన్యత ఓటును తమ అభ్యర్థికి వేయమని సంజీవరెడ్డి మద్దతుదారులు చేసిన విజ్ఞప్తి ఫలించినా ఓటమి తప్పలేదు.  

         తాను కోరుకున్న అభ్యర్థి మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నుకోబడాలని ఇందిరాగాంధీ పట్టుదలగా వుండడానికి చాలా స్పష్టమైన కారణం వుందనేది జగద్వితం. తాను ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గమైన ‘సిండికేట్ ఎంపిక చేసింది. రాజ్యాంగం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేష అధికారాలను ఉపయోగించి సమర్థుడైన సంజీవరెడ్డి సహాయంతో తనను పదవి నుండి తొలగించడానికి సిండికేట్ పన్నిన కుట్రలో భాగమే తనకు ఇష్టం లేని అభ్యర్థిని ఎంపిక చేశారని ఇందిరాగాంధీ పసిగట్టింది. ఫలితంగా తన పంతం నెగ్గించుకుని సంజీవరెడ్డిని ఓడించింది.

         కారణాలు ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఒకవైపు ఆయన పార్టీలోను, మరోవైపు పార్టీ వెలుపలా నరేంద్ర మోదీకి వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, ఆయన పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బలడుతున్న విపక్షాల ఐక్యత, బహుశా రాబోయే సార్వత్రిక ఎన్నిక తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్రపతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. అందుకేనేమో ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పక్షం రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఇందిరాగాంధీ హయాంలో లాగా బీజేపీ లోని మోదీ వ్యతిరేక వర్గం కూడా వారు కోరుకున్న అభ్యర్థి రాష్ట్రపతి అవుతే మంచిదని భావిస్తుండవచ్చు కూడా. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఉహాగానాలు ఇలా ఎన్నో!

         భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే ఏకైక అధికార పీఠం రాష్ట్రపతిదే. మిగతా వారంతా రాష్ట్రపతి ద్వారా నియమించబడడమో, లేదా నామినేట్ చేయబడడమో జరుగుతుంది. భారత రాష్ట్రపతిని ఎన్నికైన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అంతా కలిసి ఎన్నుకుంటారు కాని ప్రధానమంత్రి కేవలం లోక్ సభ సభ్యుల్లో మెజారిటీ పార్టీకి మాత్రమే నాయకుడు. పోనీ ఎక్కువలో ఎక్కువ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. దీనర్థం, ప్రాతినిధ్యపరంగా రాష్ట్రపతే ప్రధానికంటే ఎక్కువ. ప్రధాన మంత్రిని రాష్ట్రపతే నియమిస్తాడు. ఎవరిని నియమించాలి అనే విచక్షణాధికారం ఆయనదే.  

           భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో కూడా, స్పష్టంగా కానీ, పరిపూర్ణంగా కానీ, అస్పష్టంగా కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పడం జరగలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటీష్ నమూనాను, అక్కడి అనుభవాలను, సంప్రదాయాలను మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు బ్రిటీష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు. కొంతమేరకు మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంత మేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. 

         భారత రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే కాని ప్రధానిది కాదు. రాష్ట్రపతికి సహాయపడేందుకు, సలహా ఇచ్చేందుకు మంత్రిమండలి ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్ 74 వివరిస్తుంది. రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలను, సూచనలను స్వీకరిస్తారని ఆ ఆర్టికల్ లో పేర్కొనడం జరిగింది.

         రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సర్వాధినేత రాష్ట్రపతి. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు రాష్ట్రపతే అధిపతి. త్రివిధ దళాలకు ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. రాష్ట్రపతి నేరుగా కానీ, లేదా, తన అధీనంలో పనిచేస్తున్న మరే అధికారి ద్వారా కానీ, తన అధికారాలను అమలు చేయవచ్చునని రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 చెప్తున్నది. వివాదాస్పద, చర్చనీయాంశమైన ఆర్డినెన్సులను జారీ చేసే శాసనాధికారం కూడా రాష్ట్రపతిదే. ఆ విధంగా రాష్ట్రపతికి అపారమైన అధికారాలున్నాయనాలి.

         ఎన్నో ముఖ్యాతి ముఖ్యమైన నియామకాలను రాష్ట్రపతే చేస్తాడు. వారిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి కమీషన్లను కూడా ఆయనే నియమిస్తారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైంది, ఆర్టికల్ 352 నుండి 360 వరకు పేర్కొన్న రాష్ట్రపతికున్న ఎమర్జెన్సీ విశేషాధికారాలు. ఆ సమయంలో రాష్ట్రపతి, పౌరుల ప్రాధమిక హక్కులను సైతం రద్దు చేయవచ్చు. ఆయన ఆమోదం కొరకు పార్లమెంటు అంగీకరించిన అన్ని బిల్లులూ రావాల్సిందే. ఆయన వాటిని ఆమోదించనూ వచ్చు, తిరస్కరించనూ వచ్చు లేదా పునఃపరిశీలనకు పంపనూ వచ్చు. 

         రాష్ట్రపతి అనే వ్యవస్థకు అనేకానేక హక్కులు, మినహాయింపులు వున్నాయి. రాజ్యంగాధికార చక్రవర్తులతో (Constitutional Monarchs) మన రాష్ట్రపతి పాత్రను పోల్చవచ్చు. రాష్ట్రపతి అధికారాలను కార్యనిర్వాహక, శాసనపరమైన, న్యాయపరమైన, మిలిటరీపరమైన, దౌత్యపరమైన, ఆర్థికపరమైన, ఎమర్జెన్సీపరమైనవిగా విభజించవచ్చు. కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి ప్రధానమంత్రిని, ఆయన మంత్రివర్గ సహచరులను నియమించి వారికి పోర్ట్ ఫోలియోలను కేటాయించడం జరుగుతుంది. ఆయన ద్వారా నియామకమైన వీరందరినీ తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి వుంటుంది. ఆయన పార్లమెంటులో అంతర్భాగం. ఆయన పాత్ర లేకుండా పార్లమెంటు పనిచేయదు. పార్లమెంట్ అంటే, లోక సభ, రాజ్య సభ, రాష్ట్రపతి ఉమ్మడిగా. రాజ్యాంగాన్ని, చట్టాన్నీ తన శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఉద్ఘాటిస్తాడు రాష్ట్రపతి. ప్రజల బాగోగుల, మంచిచెడుల విషయంలో, వాళ్ల సేవలో తను అంకితమై పోతానని కూడా ప్రమాణం చేస్తాడు రాష్ట్రపతి.       

         రాజ్యాంగం ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధాని సలహా మేరకు మంత్రివర్గ సభ్యులను నియమిస్తాడు. ప్రధానిని రాష్ట్రపతి నియమించడానికి ఫలానా విధమైన పధ్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు పొందుపరచలేదు. సాంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్షణాధికారం. రాష్ట్రపతి దేశాధినేత అయితే, ప్రధాని కేవలం ప్రభుత్వాధినేత మాత్రమే. దేశాధినేతగా, ఎవరిని ప్రభుత్వాధినేతను ఎంపికచేయాలనే విషయంలో, రాష్ట్రపతికి సంపూర్ణ హక్కు, సంపూర్ణ విచక్షనాధికారం వున్నాయి. దీనికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్ లో అనేక ఉదాహరణలు వున్నాయి. విక్టోరియా మహారాణి 1894 లో తన విచక్షణాధికారాలు ఉపయోగించి, పదవీ విరమణ చేసిన గ్లాడ్ స్టోన్ సలహాను పక్కకు పెట్టి, దానికి విరుద్ధంగా, లార్డ్ రోస్బెరీని ప్రధానిగా నియమించింది. తిరిగి 1957 లో ఎలిజబెత్ మహారాణి తన విచక్షణాధికారాలను సంపూర్ణంగా వాడుకుని, తన ఇష్ట ప్రకారం, ప్రధాని కావాల్సిన బట్లర్ కు బదులుగా హెరాల్డ్ మాక్మిలన్ ను ఆ పదవిలో నియమించింది. మెజారిటీ స్థానాలను గెల్చుకున్న కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే లోపలే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

         సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా వున్నరోజుల్లో ఆ పదవికున్న అసలు-సిసలైన అధికారం మొట్టమొదటిసారిగా లభించింది. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం, అధికార కాంగ్రెస్ పార్టీ దాని అభిప్రాయాన్ని వెల్లడించక ముందే, రాష్ట్రపతి జీఎల్ నందాను ప్రధాన మంత్రిగా నియమించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కూడా అదే విధానాన్ని పాటించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మరో మారు కూడా గుల్జారీలాల్ నందాను ప్రధానిగా నియమించారాయన. ఆయన్ను నియమించేటప్పటికి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎన్నుకోలేదు. కాకపోతే రెండు సార్లు కూడా గుల్జారీలాల్ నందా కేవలం ఆపద్ధర్మ-తాత్కాలిక ప్రదానిగానే పదవిలో కొనసాగారు.

         ఇందిరాగాంధీ హత్యానంతరం అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీవ్ గాంధీని ఎన్నుకోక ముందే ఆయన్ను ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తపరచడంతో వీపీ సింగ్ ను ప్రధానిగా నియమించడానికి, ఆ తరువాత ఆయన రాజీనామా దరిమిలా, మొదలు రాజీవ్ గాంధీని, తరువాత చంద్రశేఖర్ ను ఆహ్వానించడానికి, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచాక్షనాధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు.

         ఇంతవరకూ చెప్పిన ఉదాహరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించినవి కాగా, 1979 లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు  ఆ పదవికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్ ను ఆహ్వానించడంలో, తరువాత, మొరార్జీకి మరో చాన్స్ ఇవ్వకుండా వుండడంలో, చరణ్ సింగ్ ను చివరకు ప్రధానిగా నియమించడంలో రాష్ట్రపతి పాత్ర ప్రాముఖ్యత సంతరించుకున్నదే కాకుండా ఆ వ్యవస్థకున్న విశేష అధికారాలను కూడా ప్రస్ఫుట పరుస్తున్నది. ఆ తరువాత చరణ్ సింగ్ ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం అదే అప్పటికి మొదటిసారి. 25 రోజుల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్ కు వెళ్ళని మొదటి-చివరి ప్రధానిగా చరిత్ర పుటల్లో మిగిలిపోయారు. లోక్ సభను రద్దు చేయమన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్ సింగ్ ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు రాష్ట్రపతి. దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కాని ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. ఎందుకంటే రాష్ట్రపతి అధికారం అంత గొప్పది కాబట్టి.

         చరణ్ సింగ్ ను ప్రధానిగా కొనసాగమని రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కోరడానికి కారణం,  రాజ్యంగపరమైన బాధ్యతే. రాష్ట్రపతికి తన కర్తవ్య నిర్వహణలో సలహాలు ఇవ్వడానికి, సహాయపడడానికి తప్పనిసరిగా మంత్రిమండలి, ప్రధాని వుండాలని రాజ్యాంగ ప్రకరణలు చెప్తున్నాయి. మొత్తం మీద సంజీవరెడ్డి కాలంలో రాష్ట్రపతి పదవికి అపారమైన అధికారాలున్నాయని వ్యక్తమైంది. ఆయన ప్రధానిగా చరణ్ సింగ్ ను నియమించడంలోనూ, లోక్ సభను రద్దు చేయడంలోనూ, ఆపద్ధర్మ ప్రధానికి పాలనా మార్గదర్శకాలు నిర్దేశించడంలోనూ సంజీవరెడ్డి తన అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకున్నారు.

         ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి వందకు వంద శాతం రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. కొనసాగి తీరాలి. ఇంతవరకూ జరగక పోయినా, ఇక ముందు జరిగే అవకాశాలు ఏ మాత్రం లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానిని, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి వుంటుంది. ఒక వేళ రాష్ట్రపతే కనుక తన విశేష-విచక్షణాధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోక పోతే, ఆయన పదవీ స్వీకారం చేసినప్పుడన్న “రాజ్యాంగాన్ని, చట్టాన్నీ తన శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ” అనే మాటలకు అర్థం లేదు. బహుశా ఇందుకేనేమో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను దృష్టిలో వుంచుకుని ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పక్షం తమ అభ్యర్థి విషయంలో జాగ్రత్త పడుతున్నారు.

         ఈ నేపధ్యంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికైతే భవిష్యత్ లో ఏం జరుగుతుందో?