Thursday, June 23, 2022

రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్టాత్మకం? : వనం జ్వాలా నరసింహారావు

 రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్టాత్మకం?

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (23-06-2022)

          రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకూ, విపక్షాలకూ కూడా ఈ ఎన్నిక కీలకం కానుంది. 1969 లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ప్రోత్సాహంతో, ప్రేరణతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, అంతరాత్మ ప్రబోధం అన్న నినాదంతో, స్వయంగా ఆమె ప్రతిపాదించిన అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరహగిరి వెంకట గిరి నెగ్గిన ఏకైక సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్టాత్మకంగా దేశంలోని అత్యున్నత స్థానానికి ఎన్నిక జరగబోవడం మున్నెన్నడూ జరగలేదేమో బహుశా! వాస్తవానికి అప్పట్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు ఓడిన అభ్యర్థి సంజీవరెడ్డికే పడ్డాయి. కాకపోతే స్వల్ప మెజారిటీతో వీవీ గిరి గెలువడానికి కారణం కాంగ్రెస్ మైనారిటీ ఓట్లతో సహా వామపక్షాల ఓట్లు, ఒక విచిత్రమైన ప్రతిపక్ష కూటమి ఓట్లు రావడమే. నాటి మితవాద రాజకీయ పక్షాలైన జనసంఘ్ లాంటి పార్టీలకు వారి అభ్యర్థి సీడీ దేశ్ ముఖ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, రెండవ ప్రాధాన్యత ఓటును తమ అభ్యర్థికి వేయమని సంజీవరెడ్డి మద్దతుదారులు చేసిన విజ్ఞప్తి ఫలించినా ఓటమి తప్పలేదు.  

         తాను కోరుకున్న అభ్యర్థి మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నుకోబడాలని ఇందిరాగాంధీ పట్టుదలగా వుండడానికి చాలా స్పష్టమైన కారణం వుందనేది జగద్వితం. తాను ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గమైన ‘సిండికేట్ ఎంపిక చేసింది. రాజ్యాంగం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేష అధికారాలను ఉపయోగించి సమర్థుడైన సంజీవరెడ్డి సహాయంతో తనను పదవి నుండి తొలగించడానికి సిండికేట్ పన్నిన కుట్రలో భాగమే తనకు ఇష్టం లేని అభ్యర్థిని ఎంపిక చేశారని ఇందిరాగాంధీ పసిగట్టింది. ఫలితంగా తన పంతం నెగ్గించుకుని సంజీవరెడ్డిని ఓడించింది.

         కారణాలు ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఒకవైపు ఆయన పార్టీలోను, మరోవైపు పార్టీ వెలుపలా నరేంద్ర మోదీకి వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, ఆయన పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బలడుతున్న విపక్షాల ఐక్యత, బహుశా రాబోయే సార్వత్రిక ఎన్నిక తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్రపతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. అందుకేనేమో ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పక్షం రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఇందిరాగాంధీ హయాంలో లాగా బీజేపీ లోని మోదీ వ్యతిరేక వర్గం కూడా వారు కోరుకున్న అభ్యర్థి రాష్ట్రపతి అవుతే మంచిదని భావిస్తుండవచ్చు కూడా. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఉహాగానాలు ఇలా ఎన్నో!

         భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే ఏకైక అధికార పీఠం రాష్ట్రపతిదే. మిగతా వారంతా రాష్ట్రపతి ద్వారా నియమించబడడమో, లేదా నామినేట్ చేయబడడమో జరుగుతుంది. భారత రాష్ట్రపతిని ఎన్నికైన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అంతా కలిసి ఎన్నుకుంటారు కాని ప్రధానమంత్రి కేవలం లోక్ సభ సభ్యుల్లో మెజారిటీ పార్టీకి మాత్రమే నాయకుడు. పోనీ ఎక్కువలో ఎక్కువ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. దీనర్థం, ప్రాతినిధ్యపరంగా రాష్ట్రపతే ప్రధానికంటే ఎక్కువ. ప్రధాన మంత్రిని రాష్ట్రపతే నియమిస్తాడు. ఎవరిని నియమించాలి అనే విచక్షణాధికారం ఆయనదే.  

           భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో కూడా, స్పష్టంగా కానీ, పరిపూర్ణంగా కానీ, అస్పష్టంగా కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పడం జరగలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటీష్ నమూనాను, అక్కడి అనుభవాలను, సంప్రదాయాలను మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు బ్రిటీష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు. కొంతమేరకు మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంత మేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. 

         భారత రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే కాని ప్రధానిది కాదు. రాష్ట్రపతికి సహాయపడేందుకు, సలహా ఇచ్చేందుకు మంత్రిమండలి ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్ 74 వివరిస్తుంది. రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలను, సూచనలను స్వీకరిస్తారని ఆ ఆర్టికల్ లో పేర్కొనడం జరిగింది.

         రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సర్వాధినేత రాష్ట్రపతి. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు రాష్ట్రపతే అధిపతి. త్రివిధ దళాలకు ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. రాష్ట్రపతి నేరుగా కానీ, లేదా, తన అధీనంలో పనిచేస్తున్న మరే అధికారి ద్వారా కానీ, తన అధికారాలను అమలు చేయవచ్చునని రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 చెప్తున్నది. వివాదాస్పద, చర్చనీయాంశమైన ఆర్డినెన్సులను జారీ చేసే శాసనాధికారం కూడా రాష్ట్రపతిదే. ఆ విధంగా రాష్ట్రపతికి అపారమైన అధికారాలున్నాయనాలి.

         ఎన్నో ముఖ్యాతి ముఖ్యమైన నియామకాలను రాష్ట్రపతే చేస్తాడు. వారిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి కమీషన్లను కూడా ఆయనే నియమిస్తారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైంది, ఆర్టికల్ 352 నుండి 360 వరకు పేర్కొన్న రాష్ట్రపతికున్న ఎమర్జెన్సీ విశేషాధికారాలు. ఆ సమయంలో రాష్ట్రపతి, పౌరుల ప్రాధమిక హక్కులను సైతం రద్దు చేయవచ్చు. ఆయన ఆమోదం కొరకు పార్లమెంటు అంగీకరించిన అన్ని బిల్లులూ రావాల్సిందే. ఆయన వాటిని ఆమోదించనూ వచ్చు, తిరస్కరించనూ వచ్చు లేదా పునఃపరిశీలనకు పంపనూ వచ్చు. 

         రాష్ట్రపతి అనే వ్యవస్థకు అనేకానేక హక్కులు, మినహాయింపులు వున్నాయి. రాజ్యంగాధికార చక్రవర్తులతో (Constitutional Monarchs) మన రాష్ట్రపతి పాత్రను పోల్చవచ్చు. రాష్ట్రపతి అధికారాలను కార్యనిర్వాహక, శాసనపరమైన, న్యాయపరమైన, మిలిటరీపరమైన, దౌత్యపరమైన, ఆర్థికపరమైన, ఎమర్జెన్సీపరమైనవిగా విభజించవచ్చు. కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి ప్రధానమంత్రిని, ఆయన మంత్రివర్గ సహచరులను నియమించి వారికి పోర్ట్ ఫోలియోలను కేటాయించడం జరుగుతుంది. ఆయన ద్వారా నియామకమైన వీరందరినీ తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి వుంటుంది. ఆయన పార్లమెంటులో అంతర్భాగం. ఆయన పాత్ర లేకుండా పార్లమెంటు పనిచేయదు. పార్లమెంట్ అంటే, లోక సభ, రాజ్య సభ, రాష్ట్రపతి ఉమ్మడిగా. రాజ్యాంగాన్ని, చట్టాన్నీ తన శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఉద్ఘాటిస్తాడు రాష్ట్రపతి. ప్రజల బాగోగుల, మంచిచెడుల విషయంలో, వాళ్ల సేవలో తను అంకితమై పోతానని కూడా ప్రమాణం చేస్తాడు రాష్ట్రపతి.       

         రాజ్యాంగం ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధాని సలహా మేరకు మంత్రివర్గ సభ్యులను నియమిస్తాడు. ప్రధానిని రాష్ట్రపతి నియమించడానికి ఫలానా విధమైన పధ్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు పొందుపరచలేదు. సాంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్షణాధికారం. రాష్ట్రపతి దేశాధినేత అయితే, ప్రధాని కేవలం ప్రభుత్వాధినేత మాత్రమే. దేశాధినేతగా, ఎవరిని ప్రభుత్వాధినేతను ఎంపికచేయాలనే విషయంలో, రాష్ట్రపతికి సంపూర్ణ హక్కు, సంపూర్ణ విచక్షనాధికారం వున్నాయి. దీనికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్ లో అనేక ఉదాహరణలు వున్నాయి. విక్టోరియా మహారాణి 1894 లో తన విచక్షణాధికారాలు ఉపయోగించి, పదవీ విరమణ చేసిన గ్లాడ్ స్టోన్ సలహాను పక్కకు పెట్టి, దానికి విరుద్ధంగా, లార్డ్ రోస్బెరీని ప్రధానిగా నియమించింది. తిరిగి 1957 లో ఎలిజబెత్ మహారాణి తన విచక్షణాధికారాలను సంపూర్ణంగా వాడుకుని, తన ఇష్ట ప్రకారం, ప్రధాని కావాల్సిన బట్లర్ కు బదులుగా హెరాల్డ్ మాక్మిలన్ ను ఆ పదవిలో నియమించింది. మెజారిటీ స్థానాలను గెల్చుకున్న కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే లోపలే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

         సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా వున్నరోజుల్లో ఆ పదవికున్న అసలు-సిసలైన అధికారం మొట్టమొదటిసారిగా లభించింది. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం, అధికార కాంగ్రెస్ పార్టీ దాని అభిప్రాయాన్ని వెల్లడించక ముందే, రాష్ట్రపతి జీఎల్ నందాను ప్రధాన మంత్రిగా నియమించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కూడా అదే విధానాన్ని పాటించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మరో మారు కూడా గుల్జారీలాల్ నందాను ప్రధానిగా నియమించారాయన. ఆయన్ను నియమించేటప్పటికి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎన్నుకోలేదు. కాకపోతే రెండు సార్లు కూడా గుల్జారీలాల్ నందా కేవలం ఆపద్ధర్మ-తాత్కాలిక ప్రదానిగానే పదవిలో కొనసాగారు.

         ఇందిరాగాంధీ హత్యానంతరం అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీవ్ గాంధీని ఎన్నుకోక ముందే ఆయన్ను ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తపరచడంతో వీపీ సింగ్ ను ప్రధానిగా నియమించడానికి, ఆ తరువాత ఆయన రాజీనామా దరిమిలా, మొదలు రాజీవ్ గాంధీని, తరువాత చంద్రశేఖర్ ను ఆహ్వానించడానికి, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచాక్షనాధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు.

         ఇంతవరకూ చెప్పిన ఉదాహరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించినవి కాగా, 1979 లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు  ఆ పదవికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్ ను ఆహ్వానించడంలో, తరువాత, మొరార్జీకి మరో చాన్స్ ఇవ్వకుండా వుండడంలో, చరణ్ సింగ్ ను చివరకు ప్రధానిగా నియమించడంలో రాష్ట్రపతి పాత్ర ప్రాముఖ్యత సంతరించుకున్నదే కాకుండా ఆ వ్యవస్థకున్న విశేష అధికారాలను కూడా ప్రస్ఫుట పరుస్తున్నది. ఆ తరువాత చరణ్ సింగ్ ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం అదే అప్పటికి మొదటిసారి. 25 రోజుల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్ కు వెళ్ళని మొదటి-చివరి ప్రధానిగా చరిత్ర పుటల్లో మిగిలిపోయారు. లోక్ సభను రద్దు చేయమన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్ సింగ్ ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు రాష్ట్రపతి. దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కాని ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. ఎందుకంటే రాష్ట్రపతి అధికారం అంత గొప్పది కాబట్టి.

         చరణ్ సింగ్ ను ప్రధానిగా కొనసాగమని రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కోరడానికి కారణం,  రాజ్యంగపరమైన బాధ్యతే. రాష్ట్రపతికి తన కర్తవ్య నిర్వహణలో సలహాలు ఇవ్వడానికి, సహాయపడడానికి తప్పనిసరిగా మంత్రిమండలి, ప్రధాని వుండాలని రాజ్యాంగ ప్రకరణలు చెప్తున్నాయి. మొత్తం మీద సంజీవరెడ్డి కాలంలో రాష్ట్రపతి పదవికి అపారమైన అధికారాలున్నాయని వ్యక్తమైంది. ఆయన ప్రధానిగా చరణ్ సింగ్ ను నియమించడంలోనూ, లోక్ సభను రద్దు చేయడంలోనూ, ఆపద్ధర్మ ప్రధానికి పాలనా మార్గదర్శకాలు నిర్దేశించడంలోనూ సంజీవరెడ్డి తన అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకున్నారు.

         ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి వందకు వంద శాతం రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. కొనసాగి తీరాలి. ఇంతవరకూ జరగక పోయినా, ఇక ముందు జరిగే అవకాశాలు ఏ మాత్రం లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానిని, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి వుంటుంది. ఒక వేళ రాష్ట్రపతే కనుక తన విశేష-విచక్షణాధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించుకోక పోతే, ఆయన పదవీ స్వీకారం చేసినప్పుడన్న “రాజ్యాంగాన్ని, చట్టాన్నీ తన శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ” అనే మాటలకు అర్థం లేదు. బహుశా ఇందుకేనేమో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలను దృష్టిలో వుంచుకుని ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పక్షం తమ అభ్యర్థి విషయంలో జాగ్రత్త పడుతున్నారు.

         ఈ నేపధ్యంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికైతే భవిష్యత్ లో ఏం జరుగుతుందో?

 

No comments:

Post a Comment