Saturday, June 4, 2022

పదమూడవ రోజు యుద్ధం, ద్రోణుడి పద్మవ్యూహం, అభిమన్యుడి వీరమరణం ..... ఆస్వాదన-74 : వనం జ్వాలా నరసింహారావు

 పదమూడవ రోజు యుద్ధం, ద్రోణుడి పద్మవ్యూహం, అభిమన్యుడి వీరమరణం

ఆస్వాదన-74

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (05-06-2022)

మహాభారత యుద్ధం పదమూడవ రోజున, అంటే, ద్రోణాచార్యుడి మూడవనాటి యుద్ధం మొదలుకావడానికి ముందు, ప్రాతఃకాలంలో యుద్ధానికి వెళ్లే ముందర, దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరకు పోయాడు. ధర్మరాజును బంధించి ఇస్తానని ద్రోణుడు చెప్పాడని, అతడిని బంధించే అవకాశం దొరికినప్పటికీ ఉపేక్షించాడని, అలా చేయడం వల్ల అంతా ఆయన్ను అసమర్థుడని అంటారని, కపటపు మాటలతో తనను అవివేకిని చేస్తే అతడికేమి లాభం అనీ అన్నాడు దుర్యోధనుడు ద్రోణుడితో. శ్రీకృష్ణార్జునులు ధర్మజుడిని కాపాడుతుంటే ఆయన్ను బంధించడం కుదరదని, ఆరోజున యుద్ధానికి అర్జునుడు రాకుండా దూరంగా తీసుకొనిపోయే సమర్థుడు ఎవరైనా వుంటే పంపమని అన్నాడు ద్రోణుడు. ఆ మాటలు విన్న సంశప్తకులు ఆర్జునుడిని యుద్ధానికి పిలవగా అటువైపు వెళ్లాడు అతడు.

కౌరవ పక్షాన ద్రోణుడు వలయాకారంగా పద్మ (చక్ర) వ్యూహం పన్నాడు. అందులో రేకులు వివిధ దేశాల నుండి వచ్చిన రాజులు కాగా, కింజల్కాలు రాకుమారులు, తామర నడిమి దిమ్మె కర్ణ దుశ్శాసనాదులతో కూడిన దుర్యోధనుడు నిలుచున్నారు. ఎవ్వరికీ భేదించడానికి వీలుకాని ఆ మొగ్గరం ముఖభాగంలో ద్రోణుడు నిలిచాడు. ఎక్కడెక్కడ, ఏవిధమైన సైన్యాన్ని ఏర్పాటు చేయాల్నో నిర్ణయించిన ద్రోణుడు దానికి అనుగుణంగా సైంధవుడిని, అశ్వత్థామను, కృపుడిని, కృతవర్మను, శకునిని, భూరిశ్రవుడిని, శల్యుడిని, శలుడిని, మిగతా ధృతరాష్ట్ర కుమారులను, మనుమలను సంసిద్ధం చేశాడు.

ఇక పాండవ సైన్యంలో భీమసేనుడు ప్రముఖ పాత్ర వహించాడు. ఆయనకు సాయంగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, చేకితానుడు, క్షత్రధర్మ-క్షత్రవర్మలు, ధృష్టకేతువు, నకుల సహదేవులు, ఉత్తమౌజుడు, శిఖండి, యుధామన్యుడు, ఘటోత్కచుడు, విరాటరాజు, ద్రుపదుడు, ద్రౌపదేయులు, కేకయుడు, సృంజయుడు మొదలైనవారు ద్రోణుడిని ఎదుర్కొన్నారు. పద్మవ్యూహంలో ప్రవేశించడానికి సమర్థుడు ఒక్క అభిమన్యుడే అని నిశ్చయించుకున్న ధర్మరాజు, అతడిని తన బలాన్ని ప్రదర్శించమని ఆదేశించాడు. తనకు పద్మవ్యూహాన్ని భేదించడం మాత్రమే తెలుసని, ఆ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకుంటానని, వ్యూహాన్ని భేదించి లోనికి ప్రవేశిస్తానని, తనను చుట్టుముట్టిన సేనలను హతమారుస్తానని, కాని, తనకు పద్మవ్యూహం నుండి వెలుపలికి వచ్చే ఉపాయం తెలియదని అభిమన్యుడు అన్నాడు. అతడు లోపలి పోగానే వెనువెంటనే తామంతా వస్తామని ధర్మరాజు చెప్పాడు.

భీముడు కూడా అభిమన్యుడిని ప్రోత్సహించాడు. వెంటనే అభిమన్యుడు తన సారథిని చూసి, రథాన్ని ద్రోణసైన్యం మీదికి దూకించమన్నాడు. తాను యుద్ధంలో జయించి తీరుతాననన్న ధీమా వ్యక్తం చేశాడు అభిమన్యుడు తన సారథితో. ద్రోణాదులు ఒకరిని మించి ఒకరు అతిశయిస్తూ అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. దొమ్మి యుద్ధం జరిగింది. అభిమన్యుడి రథం మెరుపు మెరిసినట్లు ముందుకు దూకింది. తన బాణపరంపరలతో ద్రోణాచార్యుడిని కలవర పెట్టి పద్మవ్యూహంలో ప్రవేశించాడు అభిమన్యుడు. యుద్ధాన్ని ఒక క్రీడగా ఎంచి, ఎక్కడ చూసినా తానే అనే రీతిలో రణరంగ విహారాన్ని చేశాడు. మొగ్గరాన్ని మళ్లించాడు. బాణాలతో అందరినీ చీల్చి చెండాడాడు. మొగ్గరం పూర్తిగా చిక్కుబడిపోయింది. కలతతో, భయంతో విడివడి పరుగులెత్తింది. ఆ దైన్యస్థితిని చూసిన దుర్యోధనుడు అభిమన్యుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంటే ద్రోణుడి ప్రేరణతో కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, పౌరవుడు, కౌరవేశ్వరుడు, వృషసేనుడు మొదలైన ప్రముఖులు ఒక్కటిగా చేరి దుర్యోధనుడికి రక్షణగా నిలిచారు.

తనను దుర్యోధనుడి మీదికి పోకుండా అడ్డుకున్న యుద్ధవీరులను చెదరగొట్టి అభిమన్యుడు విజృంభించి గర్జించాడు. ఇక లాభంలేదనుకున్న ద్రోణుడు స్వయంగా తానే అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో మిగిలిని యోధ వీరులు కూడా వచ్చి అంతా కలిసి అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు అందరి బాణాలను తుంచివేశాడు. అభిమన్యుడి మీద బృందాలు-బృందాలుగా కూడి దుర్యోధనాదులు బాణాలను మూకుమ్మడిగా ప్రయోగించారు. అయితే అభిమన్యుడు అశ్మకుడిని నేలకూల్చి కర్ణుడి మీద దూకాడు. కర్ణుడు అభిమన్యుడి బాణాల ధాటికి సోలిపడిపోయాడు. అలాంటి బాణాలనే ప్రయోగించి కౌరవ కుమారులను కూడా వెనక్కు పరుగులు తీయించాడు. తనను ఎదుర్కొన్న శల్యుడిని బాణాలతో మూర్ఛపోగొట్టాడు. అది చూసి తన మీదికి వచ్చిన అతడి తమ్ముడిని సంహరించాడు. అభిమన్యుడు అలా విజృంభించడంతో కౌరవ సైన్యాలు చెల్లాచెదరయ్యాయి.  

అప్పుడు ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన యుద్ధవీరులంతా ఒకరినొకరు పేర్లతో పిలుచుకుంటూ సైన్యాలను పురికొల్పారు. అంతా కలిసి భయంకరంగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు అట్టహాసం చేస్తూ పోరాడాడు. ద్రోణుడు నిశ్చేష్టుడై చూస్తూ వుండిపోయాడు. చెల్లాచెదరై ఓడిన సైన్యాన్ని చూసిన అభిమన్యుడు దానిని పోనీయకుండా తన రథాన్ని దాని చుట్టూ తిప్పాడు. సైన్యాన్ని శవాల కుప్పలు చేశాడు. అదంతా చూస్తున్న ద్రోణుడు అభిమన్యుడి పరాక్రమాన్ని పొగడగా, దుర్యోధనుడు దాన్ని ఆక్షేపిస్తూ, ద్రోణాచార్యుడి ఆశ్రద్ధవల్ల అభిమన్యుడి దుడుకుతనం చెల్లిందని అన్నాడు. కౌరవ యోదులంతా ప్రయత్నించి అభిమన్యుడిని గట్టి బాణాలతో, ఆయుధాలతో, బిగువైన దెబ్బలతో భయంకరంగా చుట్టుముట్టి మట్టుబెట్టమని ఆదేశించాడు దుర్యోధనుడు. ఆయన ఆదేశాల మేరకు యుద్ధవీరులంతా కలిసికట్టుగా అభిమన్యుడి మీదికి బయల్దేరారు.


ఇదంతా చూస్తున్న దుశ్శాసనుడు తానొక్కడే అభిమన్యుడిని చంపుతానని అంటూ అతడిని ఎదుర్కొన్నాడు. కాసేపు ఇరువురి మధ్యా బాణాల యుద్ధం కొనసాగింది. అభిమన్యుడు అతిశయించి పోరాడాడు. చివరకు అభిమన్యుడు దుశ్శాసనుడి విల్లు విరిచి, బల్లెంతో శరీరాన్ని చెక్కి, సోలిపోయేట్లు చేసి, అలనాడు ధర్మరాజును సభలో నొప్పించినందుకు ఫలితాన్ని అనుభవించేట్లు చేస్తానన్నాడు. కదలకుండా కొంచే సేపు వుంటే దుశ్శాసనుడిని చంపి, తన తండ్రులకు సంతోషం కలగ చేస్తానన్నాడు. అలా అంటూనే బాణాలను ప్రయోగించగా రథం మీద చచ్చిన వాడిలాగా పడిపోయాడు. వెంటనే అతడి సారథి రథాన్ని దూరంగా తోలుకొని పోయాడు. సరిగ్గా అదే సమయంలో అంతకు ముందే అభిమన్యుడు ప్రవేశించిన మార్గంలో తమ సైన్యంతో ప్రవేశించిన పాండవులు అభిమన్యుడి పరాక్రమాన్ని దూరం నుండే చూసి ఆనందించారు. వారు అభిమన్యుడిని పొగుడుతూ వెంబడించారు.

దుశ్శాసనుడు దెబ్బతినడం గమనించిన కర్ణుడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు కాని, కాసేపట్లోనే అలసిపోయాడు. కర్ణుడి తమ్ముడు తల నరికాడు అభిమన్యుడు. అది చూసి కర్ణుడు వెంటనే వెనుదిరిగి పారిపోయాడు. ఆయనతో పాటు కౌరవ సైన్యాలు కూడా పారిపోసాగాయి. ద్రోణుడు వద్దని వారించినా ఎవ్వరూ వినలేదు. ఆ విధంగా అభిమన్యుడు ప్రయోగించే బాణాలకు కౌరవ సైన్యాలు తట్టుకోలేక పరుగెత్తాయి.

ఇదిలా వుండగా పాండవులు అభిమన్యుడికి సహాయపడడానికి ప్రయత్నించి ముందుకు తోసుకుని వస్తుంటే, సైంధవుడు వారికి అడ్డుపడ్డాడు. పరమశివుడి వర ప్రభావం వల్ల ఆర్జునుడిని తప్ప మిగతా పాండవులను ఒక్క దినం అడ్డుకునే గౌరవం కలిగింది సైంధవుడికి. దాన్ని ఆ రోజున ఉపయోగించుకున్నాడు సైంధవుడు. వర ప్రభావం వల్ల పాండవుల భుజ బలాన్ని, వారి సేనల ఆధిక్యాన్ని లెక్క చేయకుండా అడ్డుకున్నాడు సైంధవుడు. పాండవులను, వారికి సహాయంగా వచ్చిన సాత్యకి, ధృష్టద్యుమ్నుడు మొదలైన వారిని బాధించి వారిని ముందుకు పోనీయలేదు. పాండవులు ఇక చేసేదేమీ లేక తమకు తాము సమాధాన పడ్డారు.

ఇంతలో ద్రోణుడు ఎంతో ప్ర్రయత్నంతో కౌరవ సైన్యాన్ని మళ్లీ విజృంభించేట్లు చేసి, అభిమన్యుడిని చుట్టుముట్టారు. వృషసేనుడు అభిమన్యుడిని ఎదుర్కొని ఓటమి పాలయ్యాడు. ఆ తరువాత వసాతిరాజును సంహరించాడు అభిమన్యుడు. ఇది చూసిన రాజులంతా కలిసి ఒక్కపెట్టున అభిమన్యుడిని ఆక్రమించారు. అభిమన్యుడు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విజృంభించి అందరినీ నుగ్గునుగ్గు చేశాడు. అప్పుడు యుద్ధరంగంలో సైన్యమంతా భయంతో బెదరి నలుదిక్కులా పారిపోయింది. అప్పుడు తనను ఎదుర్కొన్న శల్యుడి కొడుకు రుక్మరథుడిని చంపాడు అభిమన్యుడు. అతడి స్నేహితులు అంతా కలిసి అభిమన్యుడిని కమ్ముకున్నారు. అభిమన్యుడు గాంధర్వి అనే మాయను వారిమీద ప్రయోగించాడు. దానివల్ల అతడిని ఎదుర్కొన్న రాజులకు ఎన్నో అస్త్రాలు ఒక్కసారే తమ మీద ప్రయోగించిన భావన కలిగింది. ఆ విధంగా పలువురు రాజులు చావగా, దుర్యోధనుడు మరలిపోయాడు.

కాసేపటికి దుర్యోధనుడు మళ్లీ యుద్ధ సన్నాహం చేసి, అశ్వత్థామ, కృపాచార్య, కర్ణ, కృతవర్మ, శకుని, బృహద్బలులతో కలిసి అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు పిడుగులాగా గర్జించాడు. అప్పుడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. నిమిషంలోనే తన మీదకు వచ్చిన లక్ష్మణ కుమారుడి మీద బాణాల వర్షం కురిపించి, దుర్యోధనుడు చూస్తుండగానే అతడి తలను నరికాడు. అది భరించలేని దుర్యోధనుడు, అంతా కలిసి అభిమన్యుడి మీద పడి నొప్పించమని, చంపమని అరిచాడు. కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, బృహద్బలుడు మొదలైన వారు బాణాలను గుప్పిస్తూ అతిశయంతో అందరూ ఒక్కుమ్మడిగా అభిమన్యుడిని కమ్ముకున్నారు. అభిమన్యుడు అందరి బాణాలను వ్యర్థం చేశాడు. రకరకాల బాణాలను వారిమీద ప్రయోగించి వారిని చిక్కుపెట్టాడు. బృహద్బలుడిని చంపాడు. కర్ణుడి చెవికొనను కర్ణికలు అనే బాణాలతో నొప్పించాడు. ఇంతలో మరోవైపు నుండి తనను ఎదుర్కొన్న జరాసంధుడి కుమారుడు ఆశ్మంతకుడిని నేలకూల్చాడు.

అభిమన్యుడు అలా గొప్ప గొప్ప శూరులను సంహరిస్తుంటే అవాక్కైన కర్ణుడు, వీడు చూడడానికి బాలుడు కాని, అంత తేలికగా వశం కాడని, అసాధ్యుడైన వీడిమీదకు అంతా కలిసి ఒక్కుమ్మడిగా పరాక్రమించాలని ద్రోణాచార్యుడితో అన్నాడు. తాను అర్జునుడికి నేర్పించిన కవచదారణ అనే విద్యను తండ్రి ద్వారా అభిమన్యుడు నేర్చుకున్నాడని, ఆ విద్యవల్ల అతడిని నొప్పించడం సాధ్యం కాదని అంటూ ద్రోణుడు, వంచన చేత, అల్లెతాటిని తుంచి, విల్లు విరిచి, గుర్రాలను, సూతుడిని కూల్చాలని, అవన్నీ ఒక్కుమ్మడిగా జరగాలని, కర్ణుడికి చేతనైతే ఆ పని చేయమని, చేతిలో ధనువు వుండగా అతడిని దేవతలైనా జయించలేరని చెప్పాడు. వెంటనే కర్ణుడు భయపడ్డవాడిలాగా వెనక్కు ఒదిగి, అభిమన్యుడి వెనక్కు మరలి వచ్చి, ఇతర సైనికులు వంచనతో అభిమన్యుడితో ముందునుంచి పోరాడుతుండగా,  వెనుకవైపు నుండి అభిమన్యుడి విల్లు తుంచాడు. ద్రోణుడు అదే సమయంలో గుర్రాలను, కృపాచార్యుడు రథసారథిని క్షణంలో కూల్చారు. ఆ విధంగా అభిమన్యుడు ఆయుధాలు, రథం లేనివాడయ్యాడు.

శకుని, కృతవర్మ, శలుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలైన పలువురు వీరులు అదే అదనుగా విజృంభించి రకరకాల అస్త్ర శస్త్రాల సమూహంతో అభిమన్యుడిని భాదించారు. అప్పుడు అభిమన్యుడు కత్తీ, పలకా తీసుకొని గరుత్మంతుడు లాగా ఎగిరాడు. ద్రోణుడు అభిమన్యుడి చేతి కత్తిని బల్లెంతో తునకలు చేశాడు. అదే సమయంలో కర్ణుడు పలకను ముక్కలు చేశాడు. బెదరకుండా అభిమన్యుడు రథ చక్రాన్ని తీసుకొని భయంకరంగా పోరాడసాగాడు. అడ్డం వచ్చిన సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ద్రోణుడి మీదికి వురికాడు. శకుని, కృతవర్మ, కర్ణుడు, శల్యుడు మొదలైన ప్రసిద్ధ యుద్దవీరులు అన్నివైపుల నుండి అభిమన్యుడిని ఆక్రమించి, అతడి చేతిలోని చక్రాయుధాన్ని ముక్కలు చేశారు. అప్పుడు గదాయుధాన్ని తీసుకుని అశ్వత్థామను సమీపించాడు అభిమన్యుడు. ఆయన రథ సారథిని, గుర్రాలను చంపాడు. శకుని వైపు మరలాడు. ఆయననూ, ఆయన సేననూ నొప్పించాడు.

అప్పుడు దుశ్శాసనుడి కొడుకులు అభిమన్యుడి మీదికి యుద్ధానికి వచ్చారు. ఇద్దరినీ చంపాడు అభిమన్యుడు. ఇలా అభిమన్యుడు కౌరవ సైన్యాన్ని చంపుతుంటే అనేకమంది సైనికులు అభిమన్యుడిని చుట్టుముట్టి అలసట కలిగించి చంపారు. అప్పుడు కొరవ సైనికులు సంతోషంగా అరచి బొబ్బలు పెట్టారు. పాండవులు మిక్కిలి దుఃఖంతో కన్నీరు కారుస్తూ దైన్యాన్ని పొందారు. ‘అనేకమంది గుమికూడి ఒక్కడిని చంపడం అధర్మం అని భూతకోటి ఘోషించింది.

అనేకమంది శూరులను చంపి, ద్రోణాదియోధులను ముప్పుతిప్పలు పెట్టి, స్వర్గాన్ని కొల్లగొట్టిన అభిమన్యుడిని చూసి దుఃఖపడవద్దని, శత్రువుల గర్వాన్ని అణచివేసి జయిద్దాం అని అన్నాడు ధర్మరాజు. అలా తన సేనలకు ధైర్యం కలిగించాడు. తరువాత సూర్యుడు అస్తమించాడు. ఉభయ పక్షాలవారు వారి-వారి శిబిరాలకు తరలారు. కౌరవులు ఆరోజు జరిగిన యుద్ధానికి సంతోషం పొందగా, పాండవులు దుఃఖపడ్డారు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ప్రథమ-ద్వితీయాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

          

 

       

No comments:

Post a Comment