Saturday, June 18, 2022

సూర్యాస్తమయం లోపు సైంధవుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు .... ఆస్వాదన-76 : వనం జ్వాలా నరసింహారావు

సూర్యాస్తమయం లోపు సైంధవుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు

ఆస్వాదన-76

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (19-06-2022)

షోడశ రాజచక్రవర్తుల చరిత్ర చెప్పి వ్యాసుడు అంతర్థానమయ్యాడు. ధర్మారాజు తన కోపాన్ని తగ్గించుకున్నప్పటికీ, అర్జునుడు వస్తే ఏమని చెప్పాలనే చింతలో మునిగిపోయాడు. ఇదిలా వుండగా అర్జునుడు సంశప్తకులను సంహరించి శిబిరానికి తిరిగి వస్తుంటే ఆయనకు అపశకునాలు కనిపించాయి. మనస్సు కలత చెందింది. ధర్మరాజుకు ఏమైందో అని కంగారు పడుతుంటే ఆయన సోదరులంతా క్షేమంగా వున్నారని శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణార్జునులు శిబిరం చేరారు. అక్కడ వున్న జనాలు పాలిపోయిన ముఖాలతో కనిపించగానే అర్జునుడికి అనుమానం వేసింది. తన ముద్దుల కుమారుడు ప్రతిదినంలాగా ఆ రోజున తనకు ఎదురుగా రాలేదేమిటని సందేహం కలిగింది. మనస్సులో క్షోభ మొదలైంది. వెంటనే ధర్మరాజున్న శిబిరానికి పోయాడు. అక్కడ వున్నవారంతా దుఃఖిస్తుంటే కారణం ఏమిటని అడిగాడు. అభిమన్యుడు ఎందుకు లేడక్కడ అని అంతటా కలయచూశాడు.

ద్రోణుడు ఏర్పరిచిన పద్మవ్యూహంలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించలేరు కాబట్టి అభిమన్యుడిని పంపారా అని ధర్మరాజును ప్రశ్నించాడు. యుద్ధవీరులంతా కలిసి అతడిని చంపలేదు కదా? అని అన్నాడు. దుఃఖాన్ని భరించలేని అర్జునుడు అనేకవిధాలుగా విలపించాడు. పాండవ వీరులంతా ఏమయ్యారని, అభిమన్యుడు మరణించడానికి కారణం ఏమిటని ధర్మరాజును ప్రశ్నించాడు. జవాబుగా అభిమన్యుడు వీరమరణం చెందిన నేపధ్యమంతా వివరించాడు ధర్మరాజు. తగిన సమయంలో ధర్మరాజు కనుక తనకు తెలియచేసినట్లయితే తను వచ్చి అభిమన్యుడిని కాపాడేవాడిని కదా అన్నాడు అర్జునుడు. కొడుకును తలచుకుంటూ విలపిస్తున్న అర్జునుడిని శ్రీకృష్ణుడు ఓదార్చాడు. అలా విలపించడం తగదని, శూరులకు అందరికీ అలాంటి మరణం తప్పదని, దుఃఖించడం ఎందుకని అన్నాడు. ధర్మరాజును, ద్రుపడుడిని, ఇతర పాండవ వీరులను నమ్మి తాను చెడ్డానని, అభిమన్యుడిని రక్షించడంలో వారు నేర్పరులు కారని తెలిసి వుంటే ఏవిధంగానైనా తానే రక్షించుకొని వుండేవాడిని కదా అన్నాడు అర్జునుడు.

కోపించిన అర్జునుడికి ఊరడించే మాటలు చెప్పాడు ధర్మరాజు. సంశప్తకులతో అర్జునుడు యుద్ధానికి పోయిన తరువాత ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడని, దానిని తాము ఎదుర్కున్నామని, కాని ఆ వ్యూహంలోకి ప్రవేశించలేక పోయామని, దాన్ని భేదించడానికి అభిమన్యుడు సమర్థుడని భావించానని, అందులో ప్రవేశించి తమకు తోవ కలిపిస్తే ఆ దారిలో ప్రవేశిస్తామని చెప్పామని అన్నాడు ధర్మరాజు. పద్మవ్యూహంలో ప్రవేశించి కౌరవ సేనలను చెదిరి పోయేట్లు చేశాడు అభిమన్యుడని చెప్పాడు. ద్రోణాదులు అంతా కలిసి అభిమన్యుడిని చుట్టుముట్టి కమ్ముకోగా చూసిన తాము అతడికి సహాయపడాలని ప్రయత్నం చేయగా తమను జయద్రథుడు అడ్డుకున్నాడని అన్నాడు. సైంధవుడు రుద్రుడి వర బలం వల్ల అజేయుడు కావడంతో అతడిని దాటుకుని పోలేకపోయామని చెప్పాడు ధర్మరాజు. ఈ లోగా అభిమన్యుడు వీరవిహారం చేస్తూ పలువురు కౌరవ వీరులను చంపాడని, చివరకు అంతా కలిసి అభిమన్యుడిని చంపారని చెప్పాడు ధర్మరాజు.

కుమారుడి మరణ వార్త స్పష్టంగా విన్న అర్జునుడు సొమ్మసిల్లి పడిపోయాడు. కృష్ణుడు, ధర్మరాజు అతడిని ఎత్తిపట్టారు. తేరుకున్న అర్జునుడికి సైంధవుడి మీద పట్టరాని కోపం వచ్చింది. ఇలా అన్నాడు అర్జునుడు. తన ప్రతిజ్ఞ వినమని అంటూ, సైంధవుడు ఎవరి శరణు జొచ్చినా, కృష్ణుడి రక్షణ కోరినా, తననే ఆశ్రయించినా, మర్నాడు సాయంకాలం లోపున, సూర్యుడు అస్తమించే లోపున, తప్పకుండా అతడిని చంపి తీరుతానని అన్నాడు. తనలా చేయలేకపోతే బ్రహ్మహత్యా పాతకం చేసినవాడికి పట్టిన దుర్గతే తనకు పట్టుగాక అన్నాడు. సైంధవుడిని మర్నాడు సూర్యాస్తమయం లోపు సంహరించకపోతే గాండీవంతో సహా అగ్నిలో దూకుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా అర్జునుడు అనగానే శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూరించారు. శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శబ్దం అర్జునుడి విజయానికి ఆమోదం తెలిపే ముందు సూచన. ఆ శబ్దాలకు కౌరవ సేన ఉలిక్కిపడింది.  

వేగులవాళ్ల ద్వారా అర్జునుడి ప్రతిజ్ఞను తెలుసుకున్న సైంధవుడు భయపడ్డాడు. త్వరగా దుర్యోధనుడి దగ్గరకు పోయి అర్జునుడి ప్రతిజ్ఞకు దేవదానవులు కూడా అడ్డుపడలేరని, తనమీదనే ఆయనకెందుకు కోపమని, తానొక్కడే అతడికి కీడుచేశానా అని బాధపడ్డాడు. అర్జునుడికి కనిపించకుండా తొలగిపోవడమే శరణ్యం అనుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు సైంధవుడిని అనునయిస్తూ, ఎంతోమంది కౌరవ వీరులుండగా సైంధవుడిని అర్జునుడికి ఎలా అప్పగిస్తారని, తనని నమ్మమని, భయపడవద్దని, తానూ, తన తమ్ముళ్లు అతడికి కోటలాగా ఉంటామని, దేవేంద్రుడైనా ఆయన దరిచేరలేడని ధైర్యం చెప్పాడు. సైంధవుడు ఊరడిల్లాడు. ద్రోణుడు కూడా ధైర్యం చెప్తూ, తన బాణాల రక్షణలో వున్న సైంధవుడిని దేవతలకు కూడా తేరిపార చూడడానికి వీలుకాదని, అర్జునుడు ప్రవేశించడానికి వీలుకాని గట్టి సేనావ్యూహాన్ని పన్నుతానని, అతడు మాత్రం క్షత్రియ ధర్మం అనుసరించి యుద్ధం చెయ్యమని అన్నాడు.

ఇక ఇక్కడ పాండవుల శిబిరంలో, శ్రీకృష్ణుడు అర్జునుడితో, తనను ఆలోచించకుండా అలాంటి ప్రతిజ్ఞ ఎందుకు చేశావని అడిగాడు. మర్నాడు పొద్దు గుంకే లోపల శత్రువు తల నరికేయడం అంటే దుష్కరమే కదా అన్నాడు. కౌరవ వీరులలో ఒక్కొక్కరు గెలువరాని జగజ్జెట్టులని, వారంతా ఒక్కటిగా నిలిచి ఎదురుతిరిగితే వారిని గెలవడం అసాధ్యం కాదా? అని, కాబట్టి జాగ్రత్తగా మనపని సాధించాలని శ్రీకృష్ణుడు అన్నాడు. శ్రీకృష్ణుడి సహకారం వుంటే తన ప్రతిజ్ఞ తీరకపోయే సమస్యే లేదని చెప్పాడు అర్జునుడు.

ద్రోణాచార్యుడు, తక్కిన కౌరవ వీరులు భయకంపితులై చూస్తుండగానే తన శౌర్యం చూపించి సైంధవుడి తల నరికేస్తానన్నాడు అర్జునుడు. సమస్త చరాచర ప్రాణికోటి మొత్తం వరుసపెట్టి ఎదుర్కొన్నా తొలగించి సైంధవుడి చంపుతానన్నాడు. సాక్షాత్తూ పరమాత్మైన శ్రీకృష్ణుడు రథం తోలుతుంటే, తాను గాండీవం ధరించి యుద్ధం చేస్తుంటే ఆ రథాన్ని మళ్లించడానికి శివుడికైనా సాధ్యమా అని ప్రశ్నించాడు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు సుభద్ర దగ్గరికి వెళ్లి ఆమెను ఊరడించాడు. కాలం తీరగానే మరణించకుండా భూలోకంలో శాశ్వతంగా వుండడానికి ఎవరికీ శక్యం కాదన్నాడు. ఆమె భర్త అర్జునుడు ఆ మర్నాడు పాపాత్ముడైన సైంధవుడిని చంపి సుభద్రకు సంతోషం కలిగిస్తాడని చెప్పాడు. దుఃఖిస్తున్న సుభద్రను ద్రౌపది వచ్చి ఓదార్చింది. ఆ తరువాత ఎవరి నివాసాలకు వారు వెళ్లిపోయారు.

శ్రీకృష్ణుడు నిద్రపోకుండా తన సారథి దారుకుడితో అర్జునుడి ప్రతిజ్ఞ గురించి మాట్లాడాడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను తప్పకుండా నెరవేర్చేట్లు చూడాలని, అలా చేయకపోతే తన మీద శాశ్వతమైన నింద పడుతుందని, అర్జునుడు తనకు చాలా ఇష్టమైనవాడని, అతడి దేహం వుంటేనే తాను జీవించి వుండగలనని, అతడే దూరమైతే తనకు ఇంకెక్కడి బతుకని, అన్ని విధాల అర్జునుడిని రక్షిస్తానని, అర్జునుడు తనలో అర్థ భాగం అని, తానే తలచుకుంటే కౌరవ సైన్యం తనకొక లెక్కా అని దారుకుడితో అన్నాడు. తాను మర్నాడు యుద్ధంలో విజృంభిస్తానని, చీకటి పడక ముందే సైంధవుడిని సంహరిస్తానని, ఒక్క సైంధవుడినే కాకుండా అతడికి సహాయంగా వచ్చిన సమస్త యోధులను సంహరిస్తానని అన్నాడు.

అర్జునుడి శిబిరంలో అతడు తన ప్రతిజ్ఞను గురించి తలచుకుంటూ నిద్రపోగా కలలో శ్రీకృష్ణుడు అతడిని సమీపించాడు. దుఃఖానికి అవకాశం ఇవ్వవద్దని బోధించాడు. కృష్ణార్జునులు స్వప్నంలో కైలాసానికి పోతారు. ఈశ్వరుడికి శ్రేష్టమైన సాధనం పాశుపతం అని, దాన్ని అర్జునుడు సమగ్రజ్ఞాన స్ఫూర్తితో స్మరిస్తే సైంధవుడిని తప్పక చంపగలడని శ్రీకృష్ణుడు అన్నాడు కలలో. కాబట్టి ఆ దేవదేవుడిని మనసులో స్మరించి భక్తితో ధ్యానం చేయమన్నాడు. అర్జునుడప్పుడు శివధ్యాన తత్పరుడయ్యాడు. ఇద్దరూ శివుడిని దర్శించారు. వారిద్దరి రాకకు కారణం అడిగాడు శివుడు. ఇద్దరూ పరమేశ్వరుడిని స్థుతించారు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు పాశుపతాన్ని కోరాడు. తన విల్లూ, బాణాలు పద్మాల సరస్సులో వున్నాయి తెమ్మని చెప్పాడు శివుడు.

శ్రీకృష్ణార్జునులు అల్లాగే వాటిని తెచ్చారు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సుస్పష్టంగా పొంది పొంగిపోయాడు. తరువాత ఇద్దరూ ఈశ్వరుడికి నమస్కరించి, అయన అనుమతి తీసుకుని తమ శిబిరాలకు తిరిగొచ్చారు. అంతలో తెల్లవారింది. అర్జునుడి కల కూడా ముగిసింది. అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి తనకు రాత్రి వచ్చిన కల గురించి చెప్పాడు. కలలో ఈశ్వరానుగ్రహాన్ని పొందిన విషయం చెప్పాడు. తరువాత అంతా యుద్ధ సన్నద్ధులయ్యారు. కృష్ణార్జున సాత్యకులు కలిసి అర్జునుడి శిబిరానికి వెళ్లారు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment