Saturday, June 11, 2022

అభిమన్యుడి మరణానికి దుఃఖించిన ధర్మరాజుకు మృత్యువు తత్త్వాన్ని, మహాత్మ్యాన్ని, షోడశ రాజచరిత్రను చెప్పిన వేదవ్యాసుడు.....ఆస్వాదన-75 : వనం జ్వాలా నరసింహారావు

అభిమన్యుడి మరణానికి దుఃఖించిన ధర్మరాజుకు

మృత్యువు తత్త్వాన్ని, మహాత్మ్యాన్ని, షోడశ రాజచరిత్రను చెప్పిన వేదవ్యాసుడు

ఆస్వాదన-75

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (12-06-2022)

ద్రోణాచార్యుడు నిర్మించిన భేదించనలవికాని పద్మవ్యూహంలో ధైర్యంతో, శౌర్యంతో చొచ్చుకుపోయి, ఎందరో కౌరవ వీరులను సంహరించి, వీరమరణం పొందిన అభిమన్యుడి గురించి ధర్మరాజు అమితంగా దుఃఖించాడు. బాలుడైనప్పటికీ సైన్యంలో చొచ్చుకొని పోవడానికి సమర్థుడని యుద్ధానికి పంపానని, అర్జునుడు వచ్చి తన కొడుకు ఏడీ అని అడుగుతే ఏం సమాధానం చెప్పాలని బాధపడ్డాడు. యుద్ధానికి పొమ్మని తాను పాపం చేశానని, అభిమన్యుడి వెంబడి తాను యుద్ధంలోకి చొచ్చుకు పోలేకపోయానని చింతించాడు. ఇలా పలుపలు విధాలుగా దుఃఖిస్తున్న ధర్మరాజు దగ్గరకు వ్యాసమహర్షి వచ్చాడు. తాను పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన విషయం, అతడి వెనుకే తాము పోవడానికి ప్రయత్నించగా సైంధవుడు అడ్డు తగిలిన విషయం, ఆ విధంగా అభిమన్యుడికి సహకరించే అవకాశం తప్పిపోయిన విషయం, అప్పుడు పలువురు కౌరవ వీరులు అతడిని చుట్టుముట్టి అన్యాయంగా హతమార్చిన విషయం వేదవ్యాసుడికి చెప్పాడు ధర్మరాజు. తనలాంటి కఠినాత్ముడు లేడన్నాడు.

మిక్కిలి బలవంతుడైన అభిమన్యుడు చిన్నబాలుడు కాడని, ఎంతోమంది రాజులను అంతం చేసిన గొప్ప వీరుడని, ఎక్కడైనా, ఎప్పుడైనా విధిని తప్పించుకోవడం సాధ్యమేనా అని, ధర్మరాజు వ్యధ చెందడం తగదని చెప్పాడు వ్యాసుడు. ఆ మాటలకు ధర్మరాజు, ‘బాగా ఆలోచిస్తే మృత్యువును అవశ్యం అనుభవించి తీరవలసిందే అని వ్యాఖ్యానించాడు. అప్పుడు వ్యాసుడు, అకంపనుడు అనేరాజు పూర్వం ఏవిధంగా నారదుడు తెలిపిన మృత్యుప్రకార విధానాన్ని విని చిత్తశాంతి పొందాడో వివరించాడు.

పూర్వం అకంపునుడు అనే రాజు మీదికి శత్రువులు దండెత్తి వచ్చి, అతడిని బంధించినప్పుడు, అతడి కొడుకు హరి అనేవాడు శత్రువుల మీద విజృంభించి, తండ్రిని తన పరాక్రమంతో విడిపించి, ఆ తరువాత అదే శత్రువుల చేతుల్లో చంపబడ్డాడు. అప్పుడు అకంపనుడు కోపించి, శత్రువులనందరినీ నాశనం చేసి, నగర ప్రవేశం చేసి, కుమారుడిని తలచుకొని బాధపడ్డాడు. ఆపుడు ఆ మహారాజు దగ్గరకు నారద మహర్షి వచ్చాడు. తన కొడుకు సంగతి చెప్పాడు నారదుడికి అకంపనుడు. నారదుడప్పుడు మృత్యుదేవతా ప్రభావాన్ని అకంపనుడికి తెలియచేశాడు. ఆ వివరాలు:

బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించిన తరువాత, దానికి సంహారం లేకపోవడంతో అది భూమికి భారమైంది. భూభారాన్ని నివారించడానికి తన ఇంద్రియాల నుండి మంట పుట్టించాడు బ్రహ్మ. అది అన్ని వైపులా వ్యాపించి, జీవ, నిర్జీవ ప్రపంచాన్నంతా దహించడానికి పూనుకున్నది. అప్పుడు లోకాల మేరుకోరి శివుడు బ్రహ్మను శరణు కోరాడు. ఆయన కోరికేమిటని అడిగిన బ్రహ్మను, ఎందుకు సమస్త సృష్టిని నశింప చేస్తున్నావని అడిగాడు శివుడు. సృష్టించిన వాడే సంహారం కావించడం సమంజసంగా లేదన్నాడు. లోకాలను దయతో అనుగ్రహించమని, ఒక్కుమ్మడిగా చరాచర జగత్తును బూడిద చేయడం తగదని, భూభారం తొలగడానికి తగిన సంహార కార్యం ఆలోచించమని, కోపాన్ని వదిలిపెట్టమని బ్రహ్మకు చెప్పాడు. శివుడి మాటలకు బ్రహ్మ తన కోపాన్ని అణచుకోవడంతో అగ్ని ఆరిపోయింది. లోకాలు సంతోషించాయి.

అప్పుడు బ్రహ్మదేవుడి ఇంద్రియాల నుండి పుట్టిన ఒక స్త్రీని ఆయనే ఓదార్చుతూ, ఆమెను మృత్యుదేవతా అని సంబోధిస్తూ, తారతమ్యం లేకుండా అన్ని ప్రాణులను సంహరించమని అన్నాడు బ్రహ్మదేవుడు. తన ఆజ్ఞానుసారం ఆమె చేసే ఆ పనివల్ల ఆమెకు గౌరవం కలుగుతుందని కూడా చెప్పాడు. ఆ మాటలకు మృత్యుదేవత శోకించి, తానా దయమాలిన పనులకు ఎట్లా ఓర్చుకోవాలని, ధర్మంకాని ఆ పనికి తాను జంకుతానని, తనను దయచేసి ఆ పనికి పంపకుండా తపస్సు చేయడానికి పంపమని ప్రార్థించింది. ఆమెను జన వినాశనానికే తాను కల్పించానని చెప్పిన బ్రహ్మ, తన ఆజ్ఞ ఆమె తప్పకుండా నిర్వర్తించాలి అనగానే ఆమె ఆ సమయానికి తప్పదనుకుని ఒప్పుకున్నది.

ఆ తరువాత మృత్యుదేవత దైవాన్ని ఉద్దేశించి కఠినమైన తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమె ఎందుకు తపస్సు చేస్తున్నదని ప్రశ్నించాడు. తాను ప్రజలను చంపే పని చేయలేనన్నది. తనను కరుణించమన్నది. ఆమె చేయబోయే పని అధర్మం కాదని, తన ఆజ్ఞ నిర్వర్తించడం వల్ల ఆమె ధర్మమే పొందుతుందని, దాని వల్ల ఆమెకు నిర్మలమైన యశస్సు కలిగేట్లు తాను, శివుడు వరాలు ఇస్తున్నామని చెప్పాడు బ్రహ్మ. తాము నియమించిన పనికి ఆమెకు భయం అక్కరలేదని అన్నాడు. ప్రాణిసంహారం ఆమె పరమ ధర్మమని, ఆమె శుభాన్ని తాను ఆకాంక్షిస్తున్నానని, ధర్మం స్వరూపమే ఆమె అని, విశ్వానికి ఆమె యజమానురాలని, కామక్రోధాలు విడిచి ప్రాణులను ఆకర్షించమని, ఇది ధర్మతత్త్వం అని, కపట ప్రవర్తన కలవారిని  అధర్మమే నిర్మూలిస్తుందని చెప్పాడు. బ్రహ్మ అభయ వాక్యంతో మృత్యువు అతడి ఆదేశాన్ని అంగీకరించింది. ఆ విధంగా మృత్యుదేవత ప్రాణాలను అపహరించడంతో ప్రాణాలు శరీరాలను విడిచి, దేవత్వాన్ని పొందుతూ, మళ్లీ మానవత్వాన్ని చేరుకుంటున్నాయి.

ఆ విధంగా మృత్యువు తత్త్వాన్ని, దాని మహాత్మ్యాన్ని వివరించిన నారదుడు, అకంపనుడితో, కుమారుడి మరణానికి దిగులు పడవద్దని, అతడికి శాశ్వతమైన వీరస్వర్గం లభించి వుంటుందని అన్నాడు. ఈ విషయాన్ని వివరించిన వ్యాసుడు, ధర్మరాజుతో, అభిమన్యుడు పుణ్యపురుషుడని, అతడు స్వర్గసౌఖ్యాన్ని అందుకున్నాడని, దేవత్వ-మానవత్వాల పర్యాయక్రమాన్ని తెలియచేశాడు. 

మృత్యువు తత్త్వాన్ని, దాని మహాత్మ్యాన్ని వివరించే అకంపనోపాఖ్యానం చెప్పిన వేదవ్యాసుడిని, ధర్మరాజు, పూర్వకాలంలో రాజశ్రేష్టులు చేసిన యజ్ఞాల గురించి, వారు నెరవేర్చిన ఉత్తమ కర్మల గురించి తెలియచేయమని కోరాడు. ఎన్నెన్నో మహత్కార్యాలు చేసిన మహానుభావులు సైతం గతించారు కాని, భూమ్మీద శాశ్వతంగా నిలిచి వుండలేదని అంటూ వ్యాసుడు మొదట సువర్ణష్ఠీవి చరిత్ర చెప్పాడు.

పూర్వకాలంలో సృంజయుడనే రాజు తన స్నేహితుడైన నారద మహర్షిని, తనకు సద్గుణ సంపన్నుడు, రూపవంతుడు అయిన కుమారుడు కావాలని, అతడి మలం, మూత్రం, కన్నీరు, చెమట అన్నీ బంగారంగానే కావాలని కోరగా ఆయన అలాగే వరం ఇచ్చాడు. సువర్ణష్ఠీవి అనే ఆ కొడుకు వల్ల సృంజయుడు ప్రతిరోజూ బంగారాన్ని పొందుతూ సాటిలేని మహిమతో వర్దిల్లాడు. అప్పుడు కొందరు క్రూరులు ఆ పిల్లవాడిని బంగారం కోసం దొంగిలించి, అది కనబడక పోవడంతో వాడిని చంపి అడవిలో పారేశారు. సృంజయుడు తన కొడుకు మరణానికి దుఃఖిస్తుంటే నారదుడు వచ్చి దుఃఖపడవద్దని, ప్రాణం శరీరాన్ని విడిచి పోకుండా వుంటుందా అని, చనిపోయినవారు మళ్లీ తిరిగిరారని అంటూ షోడశ రాజ చరిత్రను చెప్పాడు.

దాని సారాంశం: మరుత్తుడు అనే చక్రవర్తి సంవర్తడు ఉపద్రష్టగా అనేక యజ్ఞయాగాదులు నిర్వహించినప్పటికీ శాశ్వతమైన పదవిలో వుండలేదు. సుహోత్రుడనే మహారాజు ఎంత సక్రమ మార్గంలో జీవించినప్పటికీ, ఆశ్వమేధాది యజ్ఞాలు నిర్వర్తించినప్పటికీ చివరకు మరణించాడు. ఎన్నో యజ్ఞాలు చేసిన అంగుడు అనే రాజు దివంగతుడయ్యాడు. ఎన్నో అశ్వమేధ యాగాలను చేసి, అమితమైన గోదానాలను చేసిన శిబి చక్రవర్తి శాశ్వతంగా ఈ లోకంలో ఉండలేకపోయాడు. రావణాసురుడిని బందు సమేతంగా సంహరించిన సామర్థ్యం, ఆశ్చర్యకరమైన మహాత్మ్యం కలిగిన దశరథ రాముడు కాలధర్మం చెందాడు. ఆకాశగంగను భూలోకంలో ప్రవహింప చేసి, సగరులకు ఉత్తమ గతులు కలిగించి, అనేకానేక అశ్వమేధ యజ్ఞాలు చేసిన భగీరథుడు శాశ్వతంగా జీవించలేదు. ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్రుడిని మెప్పించిన దిలీపుడు సహితం మరణించాడు. భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా అనుభవించి, బ్రాహ్మణులను అన్న సంతర్పణం చేసి, అశ్వమేధ యాగాలు చేసిన మాంధాతృ చక్రవర్తి ఈ లోకంలో శాశ్వతంగా నిలవలేదు.

దేవాసుర యుద్ధంలో పాల్గొని రాక్షసులను వధించి, వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి, భూమిని సింగారించి, ఎన్నో యజ్ఞయాగాదులను చేసిన యయాతి ఈ లోకంలో శాశ్వతంగా వుండలేకపోయాడు. అమితమైన రాజ్యాన్ని సంపాదించి, లెక్కలేనన్ని యాగాలు చేసి, మణులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన అంబరీషుడు బతికిలేడు. ప్రసిద్ధ యాగాలు నిర్వర్తించిన శశిబిందుడు శాశ్వత శరీరాన్ని పొందలేదు. అగ్నిని ఆరాధించి తీవ్రమైన తపస్సు చేసి, దార్మికుడుగా కీర్తికెక్కిన గయుడు కూడా చనిపోయాడు. రంతిదేవుడు లాంటి పుణ్యాత్ముడు పరలోకానికి పోక తప్పలేదు. సర్వదమనుడని కణ్వుడు పేరుపెట్టిన భరతుడు ఇహలోకాన్ని విడిచి వెళ్లినవాడే. గోరూపంలో వున్న భూమిని ఓషధులు పితక వలసిందిగా ఆజ్ఞాపించి, సమస్త భూమినీ బ్రాహ్మణులకు దానమిచ్చిన పృథుచక్రవర్తి యశస్సు నిలిచింది కాని శరీరం సుస్థిరంగా వుండలేదు. సమస్త భూమిని కశ్యపుడికి ధారాదత్తం చేసిన పరశురాముడు సహితం శాశ్వతంగా జీవించలేకపోయాడు.

నారదుడు చెప్పిన షోడశ రాజచారిత్రను సృంజయుడు విని ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తరువాత సృంజయుడి కోరిక ప్రకారం చనిపోయిన అతడి కుమారుడు సువర్ణష్ఠీవిని బతికించి తెచ్చాడు నారదుడు. ఆ తరువాత సువర్ణష్ఠీవి పెరిగి పెద్దవాడయ్యాడు. బాణవిద్య నేర్చుకుని, వివాహమాడి సంతానవంతుడయ్యాడు.

ఇదంతా తిరిగి ధర్మరాజుకు చెప్పిన వేదవ్యాసుడు అభిమన్యుడి గురించి దుఃఖించడం వివేకం కాదని, ఈ లోకం అంతా దుఃఖమయమని, తపోదానాదులతో మానవులు దేవలోకం చేరాలనుకోవడం ప్రసిద్ధం అని అన్నాడు. అభిమన్యుడు పుణ్యాత్ములు పొందే అరుదైన లోకాన్ని పొంది వున్నాడని తెలియచేయదానికే తాను షోడశ రాజచక్రవర్తుల చరిత్ర చెప్పానని, దానివల్ల కలిగే పరిజ్ఞానంతో మనస్సు కుదుట పడేట్లు చేసుకొమ్మని అన్నాడు. అలా చెప్పి వ్యాసుడు అంతర్థానమయ్యాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 


No comments:

Post a Comment