భవ్య భారతమే
కేసీఆర్ మనోరథం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (21-06-2022)
ఉజ్వల
భారత నిర్మాణం ధ్యేయంగా ప్రత్యామ్నాయ ఎజెండాను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం
సందర్భంగా ఈ నెల 2న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో గౌరవ వందనాన్ని స్వీకరించిన
అనంతరం ప్రసంగిస్తూ ఆయన ఆ విషయమై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గత ఎనిమిది
సంవత్సరాలుగా రాష్ట్రం సాధించిన ప్రగతిని గణాంకాలతో సహా వివరించి తెలంగాణ
అభివృద్ధి నమూనా దేశానికే రోల్ మోడల్ అని, దాని ఆధారంగా ప్రత్యామ్నాయ ఎజెండా
రూపకల్పన జరగాలని కేసీఆర్ సూచించారు. ప్రసంగంలో చివరగా అయినప్పటికీ, ప్రధానాంశంగా, తెలంగాణ పట్ల, ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రం
ప్రదర్శిస్తున్న వివక్షను విశదీకరిస్తూ, ఆద్యతన భవిష్యత్తులో జాతీయ
ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా ద్వారానే ఉజ్వల భారత దేశ నిర్మాణం జరుగుతుందని
స్పష్టం చేశారు. ఇది జరిగిన వారం రోజుల్లోనే భారత రాష్ట్ర సమితి స్థాపన గురించిన
వార్తలు వచ్చాయి.
తన ప్రసంగంలో తెలంగాణ ఆర్థికాభివృద్ధిని
ప్రస్తావించిన కేసీఆర్, కఠినమైన, పటిష్టమైన
ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను రాష్ట్రం సమకూర్చుకున్నదని, 2014
నుంచి 2019 వరకు 17.24 శాతం సగటు
వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని,
ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనావంటి
విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని అన్నారు.
ప్రసంగం చివరలో
కేసీఆర్ కేంద్రం తెలంగాణ పట్ల, ఇతర
రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్షపైనే వ్యూహాత్మక దాడిని చేశారు. నిరంతర పోరాటం
కొనసాగిస్తామని చెప్పారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం
అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం
వ్యవహరించడాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు
మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టడంవల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ
కోల్పోవడం జరిగిందని, అలాగే ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం
చేసిందని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్
కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి
ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని మరో ఉదాహరణ ఇచ్చారు.
వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన వాటికి రావాల్సిన
నిధులు ఇవ్వడంలో చేస్తున్న జాప్యాన్ని, పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర
ప్రోత్సాహకాలు ఇవ్వకుండా తాత్సారం చేయడాన్ని, విభజన
చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు చేయడాన్ని, బయ్యారం
స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేని విషయాన్ని. ఐ.టి.ఐ.ఆర్
ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేయడాన్ని, నియోజకవర్గాలను
డీలిమిట్ చేయకపోవడాన్ని, ఉక్రెయిన్
లో చిక్కుకుపోయిన తెలంగాణ వైద్య విద్యార్థులకు ఎదురయిన దుస్థితికి కేంద్రం నుండి ప్రతిస్పందన
రాకపోవడాన్ని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం చూపుతున్న వివక్షకు ఇవి
కొన్ని తార్కాణాలు మాత్రమె అన్నారు.
ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఫల్యం గురించిన ప్రస్తావన
తెస్తూ, తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం
దారుణంగా విఫలమైందని,
అసమర్థతతో చేతులెత్తేసిందని, తెలంగాణలో
రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని తనతో సహా
ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేసినామని,
ప్రజా ప్రతినిధులతో కలసి ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరశన దీక్షలో తాను స్వయంగా
పొల్గొన్నానని, అయినా కేంద్రం నుండి స్పందన లేదని,
పైపెచ్చు తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడినాడని, ఈ
వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయని కేసీఆర్ అన్నారు. దేశంలో
రైతులు భిక్షగాళ్ళు కాదని, దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం
ఉండాలని, కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో
చెలగాటమాడే ధోరణిని కేంద్రం మానుకోవాలని
డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఏదేమైనా, రైతాంగాన్ని
ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటం విద్యుక్త ధర్మంగా భావించి, రైతు
పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు
రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించిందని స్పష్టం చేశారు కేసీఆర్.
ప్రపంచ
దేశాలు అనేక సంఘర్షణలు, పోరాటాల
పర్యవసానంగా రాచరిక, నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయని,
అత్యధిక దేశాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, పార్లమెంటరీ
పంథాను ఎంచుకున్నాయని, పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి
చెందేకొద్దీ ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను పెంపొందించాయని, పౌర
సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయని,
కానీ భారత దేశంలో అందుకు విరుద్ధంగా జరిగిందని అన్నారు సిఎం. 75
ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ
పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయని,
సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నదని,
భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించినప్పటికీ కేంద్రంలో గద్దెనెక్కిన
ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాసి, అధికారాలను
నిస్సిగ్గుగా హరించాయన్నారు.
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కేంద్రం
పరిధిలోని అధికారాలనూ, రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ
స్పష్టంగా నిర్వచించి, కేంద్ర జాబితా, రాష్ట్ర
జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను నిర్దేశించిందని అంటూ, దేశాన్ని
పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి
లాగేసుకున్నాయని, ఫలితంగా కాలం గడుస్తున్నకొద్దీ
ఉమ్మడి జాబితా పెరుగుతూ, రాష్ట్ర
జాబితా తరుగుతున్నదని కేసీఆర్ అన్నారు. రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల
స్వయంప్రతిపత్తి పేరుకే మిగిలిందని అంటూ, గతంలో
కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పలు కమిషన్ల రాష్ట్రాల హక్కులను
పరిరక్షించేందుకు చేసిన సూచనలు బుట్ట దాఖలయ్యాయి అని పేర్కొన్నారు. ఇవన్నీ, ప్రజాస్వామ్య
వ్యవస్థకు ఏరకంగానూ మంచి చేయజాలకపోగా, దేశ
ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి
తీవ్ర అవరోధాలుగా మారాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం
‘‘బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన
సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకోవడంతో రాష్ట్రాల హక్కుల హరణం పరాకాష్టకు
చేరుకున్నదని కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను
ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నదని, కేంద్రం
విధించే పన్నుల నుంచి రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను
ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నదని
వివరిస్తూ, రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం
నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితమన్నారు. రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను
దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధించడమే కాకుండా, ఎఫ్.ఆర్.బి.ఎం.
చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర
ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నదని
విమర్శించారు.
ఎఫ్.ఆర్.బి.ఎం
పరిమితులకు లోబడి, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న
తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయిందని,
రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను
వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా
మానుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర
ప్రభుత్వం సిద్ధంగా లేదని, కేంద్రానికి
తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలను, రైతాంగానికి
నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను, తన కంఠంలో ప్రాణమున్నంతకాలం అంగీకరించేది లేదని, రాష్ట్ర
ప్రజల శ్రేయస్సే తనకు ప్రధానమని స్పష్టం చేశారు కేసీఆర్.
ఈనాడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం
లేకుండా పోయిందని, చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నదని, 75
ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా దేశాన్ని దారిద్ర్యబాధ ఎందుకు పీడిస్తున్నదని, సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే
ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరని, దేశాన్ని
నడిపించటంలో వైఫల్యం ఎవరిదని,
ప్రశ్నిస్తూ, విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదని, అధికార
పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి
ఎక్కడం కాదు కావాల్సిందని, దేశం
ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని, దేశానికి
నూతన గమ్యాన్ని నిర్వచించాలని,
ప్రజల జీవితాల్లో మౌలికమైన గుణాత్మక పరివర్తన తేవాలని అన్నారు కేసీఆర్.
భారత
దేశంతో పాటు స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాలు
సూపర్ పవర్ లుగా ఎదుగుతుంటే ఇక్కడ ఇంకా
కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నమని,
ఇప్పడు దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందని,
విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం
విలవిలలాడుతున్నదని, దేశంలో
మత పిచ్చి తప్ప వేరే చర్చలేదని,
ప్రజల అవసరాలు ప్రాతిపదిక కాకుండా పోయాయని, మత
ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమని,
విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పెట్రేగి పోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని
కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అశాంతి
ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు
వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుందని, వివిధ
దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, ఈ
విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనుకకు తీసుకపోవడం ఖాయమని, దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు
పట్టినా ఆశ్చర్యం లేదని కేసీఆర్ హెచ్చరించారు.
నిత్య
ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనమవుతుంటే బాధ్యత
కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరని, భారత దేశంలో ప్రజలకు కావల్సింది విద్యుత్, మంచినీళ్ళు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి
అవకాశాలని, దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక
విధానాలు కావాలని, అందుకు తగు వేదికలు రావాలని,
కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ
ఎజెండా కోసం దారులు వెతకాలని అన్నారు కేసీఆర్.
ఆజన్మాంతం
తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం తన విధి అని, అదే
సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష
రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా మనందరి బాధ్యత అని,
ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీపడే ధోరణేలేదని, రాజీపడి
ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్ళం కాదని, మృత్యువు
నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్ళం కాదని అంటూ, సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి
ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలని అన్నారు. ఉజ్వల భారత
దేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ
ప్రజలు అగ్రభాగాన నిలవాలని పిలుపునిస్తూ, దేశంలో
గుణాత్మక పరివర్తన జరగాలన్నఆకాంక్షను వ్యక్తపరిచారు.
ఈ నేపధ్యంలో ‘భారత రాష్ట్ర సమితి’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు మీడియాలో సంచలనం కలిగించాయి. బహుశా కేసీఆర్ మదిలో రూపుదిద్దుకుంటున్న జాతీయ ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండా, తద్వారా ఉజ్వల భారత నిర్మాణం భారత రాష్ట్ర సమితి ద్వారా సాధ్యమవుతుందని ఆశించవచ్చు. గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, లేదా దాని సారధ్యంలోని కూటమికి కానీ, బీజేపీ లేదా దాని సారధ్యంలోని కూటమికి కాని, భారత రాష్ట్ర సమితి సరైన ప్రత్యామ్నాయం అవుతుందని కూడా ఆశించవచ్చు.
No comments:
Post a Comment