భారతీయ సాంప్రదాయం, ఇతిహాసమే సాంస్కృతిక ఇతిహాసం
ఋగ్యజుస్సామాథర్వ
వేదాల సారం-5
వనం
జ్వాలా నరసింహారావు
సూత్యదినపత్రిక
(01-01-2024)
‘సకల సృష్టిస్థితిలయాలకు కారకుడైన ఆ ఒక్కడెవరు? ఏక, ఏవ
లేదా ఒక్కడే అనే పదాన్ని స్పష్టంగా చెప్పబడినది. ఏకవబ్రహ్మా, ద్వితీయం బ్రహ్మం అంటే ఒక్కడేనని, రెండవవాడు లేడని అర్థం. “అజస్య” అనే ఒక
పదాన్ని వేదంలో వాడినారు. అతడు జన్మరహితుడు. ఇది మరొక విశేణం. “అజస్యనాభావధ్యేకమర్పితం
తస్మిన్విశ్వాని భువనాని తస్థుః” అంటే అజుని నాభిలోని బ్రహ్మాండంలో సకల
భువలాలు ఉన్నవని. అజ్ఞానం మంచు లాంటిది. “నీహారేణ” అన్నారు. ఒక పదార్థాన్ని చూడడానికి
మధ్యనున్న మంచు కరగాల్సిన అవసరం వున్నది. పదార్ధం వున్నా,
దానిని చూసేవాడు వున్నా, మధ్యలో అజ్ఞానం అనే మాయ తొలగినప్పుడే పదార్ధం దర్శనము ఇస్తుంది.
చీకటిలో తాడును చూసి పాము అని భ్రమపడే వాడికి పోవలసినది చీకటి. అప్పుడే వాస్తవం
కనిపిస్తుంది.’
‘మానవుడు ఏకాకిగా, వంటరిగా, వేరుగా
జీవించలేడు. పశుపక్ష్యాదులు సహితం వంటరి జీవితాన్ని గడుప లేవు. తోడూ, నీడా లేనిది జీవితం
సాగదు. ఒంటరి బ్రతుకు ఒక బ్రతుకే కాదు. జీవితంలో ఎక్కువకాలం కలిసి వుండడానికి మగకు
ఆడ, ఆడకు మగ తోడు అవసరం. ఈ జంట తోడుకు మాత్రమేకాకుండా గురుతరమైన కుటుంబ
బాధ్యతలు నిర్వహించాల్సి వున్నది. సమాజపు స్వరూప, స్వభావాలు
ఎటువంటివి అయినా, అది దంపతులు, కుటుంబం మీదనే ఆధారపడతారు.
మంచి కుటుంబమే మంచి సమాజమవుతుంది. ఏ ఇద్దరి స్వభావాలు,
అభిరుచులు, అభిప్రాయాలు ఒకే తీరుగా వుండవు. ఇది ప్రకృతి
రీతి. అలాగైతే ఒక ఆడ, మగ జంటను కూర్చడం అవసరం. కొన్ని
పక్షిజాతులలో దాంపత్యం అపూర్వం. మనిషి పశుపక్ష్యాదుల నుండి నేర్చినాడో, లేక, అవసరమే అలా చేసినదో? ప్రశ్నార్థకం! ఆడ, మగను కలపడానికి పవిత్రమైన వివాహ బంధాన్ని ఏర్పరిచినారు. ఈ వివాహ బంధాన్ని
నిలపడానికే సాహిత్యంలో అనేక విషయాలు కనిపిస్తాయి’.
‘వేద సూక్తంలో అందంగా, రమ్యంగా, మనోహరంగా వివాహం గురించి చెప్పబడినది. వివాహం అనేది ఏనాటిదో తెలియని కాలంలో
ఎంతో చక్కగా చెప్పబడినది. ఇందులో వధువుకు ప్రాధాన్యత ఇవ్వబడినది. “గృహిణీగృహముచ్యతే”
అనే నానుడి ప్రకారం, ఇటుకలు ఇల్లు కాదు!! ఇల్లాలే
ఇల్లగును!!! ఇల్లాలికి ఇంటి మీద, భృత్యులమీద, పశువులమీద, అత్తమామలు, మరుదుల
మీద అధికారమిచ్చినారు. “సామ్రాజ్ఞీ” అన్నారు. ఆమె తోడుగా తనను వృద్ధావస్థవరకు
నడుపుమని వరుడు ప్రార్థించడం ఆమె అధికారానికి సంకేతం. మరో వేద మంత్రంలో దాంపత్యాన్ని
గురించిన ఆశయాన్ని చక్కగా వివరించడం జరిగింది. పిల్లలు,
పిల్లల పిల్లలతో ఆడుకుంటూ గడిపే వార్థక్యం! ఇంతకు మించి ఆశించగలమా? మరో మంత్రంలో సతిని సహితం పదిమంది పుత్రులలో చేర్చి పదకొండవ దానిగా
చేసినారు. పదిమందిని కన్న తల్లి, భర్తకు తల్లిలాగా ప్రేమించడమే కోరుకొనేది. శారీరకమైన
కామ సంబంధాన్ని వివరించడంతో పాటు మనసుల కలయికను గురించి చెప్పారు వేదంలో.’
‘సమాజం
అధికభాగం సంతానం మీద ఆధారపడి ఉంది. సంతానమే సమాజపు నిరంతర జీవనం. సంతానం తల్లి మీద,
స్త్రీమీద ఆధారపడి ఉంది. కాబట్టి స్త్రీయే సమాజం. స్త్రీ ఎంత సౌశీల్యవతి అవుతే
సమాజం అంత సుశీలం అవుతుంది. ఇంటికి వచ్చిన కోడలే కుటుంబానికి మహారాణి. స్త్రీకైనా, పురుషునికైనా అనుకూల దాంపత్యం ఒక వరం. కలిసి ఉన్న దంపతులు కష్టాలను
లెక్కచేయరు. ఆనందం సంపదలో లేదు! అనన్యత్వంలో ఉంది!! సుఖ దుఃఖాలు సాపేక్షాలు. కలసి
నవ్వడంలో ఎంత ఆనందం ఉందో, కలసి ఏడవడంలోనూ అంత ఆనందం ఉంది!. అన్ని
దశల్లోనూ కలసిసాగడం వల్ల హృదయానికి విశ్రాంతి, మనశ్శాంతి.
వార్ధక్యం వచ్చినా అదే వలపు, అదే ప్రేమ. కాలం నడుస్తుంటే
ప్రేమ పండుతుంది. స్నేహం స్థిరంగా ఉంటుంది. అలాంటి దాంపత్యం ఆశించని వాడు ఎవడు? హిందూ వివాహం పవిత్ర బంధం. దాన్ని మృత్యువు సహితం విడదీయలేదు. అది ఏడేడు
జన్మల బంధం. నూరేళ్ల పంట! ఎంతటి సమాజంలోనైనా కుటుంబానిదే అగ్ర స్థానం. కుటుంబమే
సమాజానికి మూల కారణం. వేదం సుఖమయ, శాంతిమయ కుటుంబానికి బాటలు
పరచింది. ఒక్క స్త్రీ మాత్రమే కాదు సంసార రథానికి స్త్రీ పురుషులు రెండు చక్రాలు.
అనుకూల దాంపత్యం సమాజానికి మూల స్థంబం’.
‘శరీర నిర్మాణం,
అవయవాల కూర్పును గురించి వేదంలో వివరించిన తీరు వైద్య శాస్త్రంలో నాటి
ప్రావీణ్యతను తెలియపరుస్తుంది. వేదం శాస్త్రానికి మూలం. ఆయుర్వేదం వైద్యశాస్త్రం.
ఆయుర్వేదం కనుగొన్న వేప, తులసి లాంటి వనస్పతులకే మళ్లీ
ప్రాధాన్యత కలుగుతున్నది! శతాబ్దాలలోనే అల్లోపతి వైద్యం మీద వ్యామోహం
తగ్గుతున్నది. వేల సంవత్సరాల ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరుగుతున్నది! ఇంగ్లీషు
వైద్యానిది నివారణ మాత్రమే! రోగి జీవితాతంతం రోగియే! చికిత్స జీవితాంతం
కావాల్సిందే. వ్యాధి నిర్మూలన ఇంగ్లీషు వైద్యపు పరిభాషలో లేదు. అది వైద్యం కాదు.
వ్యాపారం. వర్తకం. ఆయుర్వేదపు వ్యాధి నిర్మూలన అంటే శరీరంలోని సమస్త అవయవాల నుండి
వ్యాధి తొలగిపోవడం అని వేదంలో వివరించారు.’
‘వేదంలో రాజకీయాన్ని గురించి స్పష్టంగా
ఉన్నది. మేధావిని, సామాజిక నేతను, ధర్మాన్నే రాజును చేస్తుంది అంటుంది
వేదం. భారత తాత్త్వికతలో ధర్మం రాజకీయాన్ని శాసించింది. సమాజం రాజకీయాన్ని
శాసించింది. ఇలా అనడం మరింత సమంజసం. ప్రస్తుతం రాజకీయం కండకావరం, ధన మదంతో సమాజాన్ని శాసిస్తున్నది. ఇది భారత,
పాశ్చాత్య తాత్త్వికతల మౌలిక భేదం. రాజు, రాచరికిం, చంచలం కారాదు. స్థిరం కావాలి. ప్రజలు అభిలషించేట్లుగా రాజు రాజ్యం
చేయాలి. రాజ్యానికి హాని కలుగకుండ సమాజం, రాజకీయం చూడాలి.’
‘గోవుకు వేదం
ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. గోవును పవిత్రంగా భావించింది. గోవును దేవత అన్నది. గోవులు,
విప్రులు, వేదాలు, పతివ్రతలు, సత్యవచనులు, లుబ్దులు కానివారు, దానశీలురు, ఈ ఏడుగురి వల్లనే భూమి నిలిచి ఉంది. ‘ఆవుపాలను
గురించి వేదం బహుదా ప్రశంసించింది. ఏనాడైనా పాడి ఆహారానికి తప్పనిసరి. ఎంతో
ఆధునికం అనుకుంటున్న ఈ కాలంలోనూ పాడి తప్పని సరి. పాడికి గోవు అవసరం. పాడి
జీవనాధారం. భారత వ్యవసాయానికి ఈ నాటికీ పశువే పట్టుగొమ్మ. యజ్ఞానికి నేయి అవసరం.
ఆహారానికి సహితం ఘృతం తప్పని సరి. “ఘృతంవినా భోజనమప్రశస్తం”.
ఇన్నింటి వల్ల గోవు సామాజిక జీవితానికి అవసరం అని అర్థం అయింది.’
‘భూమి వ్రేలాడు తున్నదని యజుర్వేదం ప్రవచించింది. భూమి
నిరాధారంగా నిలిచి, గాలిలో తేలియాడుతూ, రాలకుండా, నిలిచి ఎట్లా ఉన్నది! “శ్రీమహావిష్ణోరాజ్ఞయా
ప్రవర్తమానస్య” అంటే, శ్రీమహావిష్ణువు ఆజ్ఞాపించడం
వల్ల, భూగోళం ఆకాశంలో, గాలిలో, ఏ ఆధారం
లేకుండా నిలిచి ఉంది! ఇది భౌతికం. ఈ భూమండలం మీదనే సకల ప్రాణిజాలం నివసిస్తున్నది.
అగ్ని, వరుణ, వాయు దేవుల సహితంగా నరుడు
మహీతలం మీదనే నివసిస్తున్నాడు. వేదం వారికోసం ఒక సమాజం, ఒక
జీవన విధానం ఏర్పరిచింది. ఇవి నిరంతరం సాగాలంటే “ధర్మం” అవసరం. ధర్మం కొనసాగాలంటే
కావాల్సిన అవసరాన్ని శ్లోకం వివరించింది.’
‘మానవుడు సుఖజీవనం సాగించడానికి నిరంతర పరిశోధన జరిగింది.
తెలుపురంగు మేధావులు యజ్ఞంలో పశుబలి “ఆర్యుల ఆటవిక జీవనం” అంటున్నారు. వేదం 5000
సంవత్సరాలదని పాశ్చాత్య విద్వాంసులు అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు పశుబలి
తీసుకుందాం. 5000 సంవత్సరాల క్రితపు పశుబలి ఆటవికం అయితే, పొట్ట
నింపుకోవడానికి రోజూ లక్షల పశువులను హతమారుస్తున్న జాతి ఆటవికం కంటే అధ్వాన్నం
కదా! వేయేళ్ల చరిత్ర గల ఆధునిక యూరోపు, 400 ఏళ్ల చరిత్ర గల
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు వేలాది
సంవత్సరాల నాగరికతను ఏర్పరిచిన వేదాన్ని ఆటవిక జీవనం అనడం అంటే, గ్రుడ్లు వచ్చి తల్లిని వెక్కిరించడమే!! ఇది అధికారమదం. సూర్యుడు
అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అస్తమించింది! మిగతావీ అస్తమించాలి!! ఇది ప్రకృతి
శాసనం. తప్పదు.’
‘విప్రులు
అంటే మేధావులు. ఇతరులు కూడా మేధావులు కావచ్చు. అది వేరే సంగతి. రాజ్యం చేతులు
మారినప్పుడల్లా వ్రేటు పడేది మాత్రం మేధావుల మీదనే! అది ఈనాటికీ సత్యమే! వంది, మాగధ
మేధావుల సంగతి వేరే విషయం. వారు ఎవరినైనా స్తుతిస్తారు. నిత్యం స్తుతించే వారు
కొల్లలు. సత్యం చెప్పేవారు అరుదు!! ఏ ప్రభుత్వమూ సత్యం సహించదు. దానికి పొగడ్తలు
కావాలి. విప్రులు బ్రాహ్మణులు. అనంతర కాలంలో కులం అయింది. కులం కావడం తప్పనిసరి.
వృత్తులు వంశపరంపరగా వచ్చాయి. అందువల్ల కొందరు మేధావులు కాని వారూ విప్రులు
అవుతారు. కాలక్రమాన ప్రతి సంస్థ స్వప్రయోజనపరుల చేతుల్లో పడుతుంది. అప్పుడవి
ఆత్మను కోల్పోయిన నిర్జీవ ప్రతిమలు అవుతాయి! విచిత్రం ఏమంటే సమాజం ఈ నిర్జీవ
ప్రతిమలనే గుర్తిస్తుంది! ఇవ్వాల్టి కులాలు అన్నీ అర్థం కోల్పోయిన ఆర్భాటాలే!
పూర్వం కులాలున్నాయి కాని నేటి కుల రాజకీయాల్లేవు. ఓట్ల చదరంగంలో కులం పావు
అవుతున్నది.’
‘విప్రులు సమాజానికి వెన్నెముక లాంటివారు. వారి
నిత్య పరిశ్రమ వల్లనే సామాజిక ప్రగతి సాధ్యం. మేధావి నిర్భయంగా తన అభిప్రాయం
వెల్లడించగల వాతావరణం వుండాలని వేదం ఆ నాడు గుర్తించింది. సత్యానికి జరామరణాలు
ఉండవు. ఏ సమాజానికైనా మేధావుల స్వేచ్చ అవసరం. “గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు
నిత్యం, బ్రాహ్మణాస్పంతు నిర్భయాః” అనేవి వేదం చేసిన
నినాదాలు. భారత చరిత్ర వ్రాసిన కొందరు బ్రాహ్మణులను మతపు గుత్తాధికారులుగా, అత్యాచారాలు
చేసినవారిగా వర్ణించి, వాస్తవ విరుద్ధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.’
‘భారత ఇతిహాసం
సాంస్కృతిక ఇతిహాసం. దాన్ని రాజకీయం చేయడమే ద్రోహం. కులమతాల పేర భారత సమాజాన్ని
ఛిన్నాభిన్నం చేయాలనే కుట్రతో ఆంగ్లపాలకులు భారత చరిత్రను వంచించారు. మేధావులతో
వప్పించారు. సనాతన కాలం నుండీ భారత సమాజంలో ధర్మం వేరుగానూ,
రాజకీయం వేరుగానూ వర్ధిల్లాయి. ధర్మం సమాజాన్ని నిర్మించింది. భారత రాజులు కేవలం
పాలించారు. భారత ప్రభువులు ఏనాడూ శాసించలేదు! ధర్మానికీ,
రాజకీయానికీ స్పర్థ వచ్చినప్పుడు ధర్మానిదే పైచేయి అయింది. రాజకీయం ధర్మం ముందు
లొంగింది. బ్రాహ్మణం ధర్మం అనుకుంటే రాజకీయం క్షాత్రం అయింది. క్షాత్రం, బ్రాహ్మణం పోటీలు పడలేదు. ఒకదాని సరసన ఒకటి వర్ధిల్లాయి. ఒకరి హద్దులను
ఒకరు అతిక్రమించలేదు. చాణక్యుడు, విద్యారణ్యుడు ఉదాహరణలు.
ఇది భారతీయ సంప్రదాయం. సమాజానికి మెదడు మేధావి. అతని ఆవశ్యకత తెలియపరచింది వేదం.’
‘సమాజానికి
సర్వస్వం వేదం. జరిగిందీ, జరుగనున్నదీ వేదమే. వర్తమానం వుండదు. అది క్షణకాలంలో భూతకాలం అవుతుంది.
మరుక్షణంలో భవిష్యత్ అవుతుంది! ప్రత్యక్షం, అనుమానంతో ఉపాయం
దొరకదు. అప్పుడు వేదం ఉపాయం చూపుతుంది. అదే వేదపు వేదత్వం. ప్రత్యక్షం, అనుమానం రెండు ప్రమాణాలు, కొలతలు. ప్రత్యక్షం అంటే
కంటికి కనిపించేది. అగ్ని మన ముందు మండుతున్నది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అగ్ని
కంటికి కనిపించడం లేదు. దూరంగా పొగ వస్తున్నది. కాబట్టి అక్కడ అగ్ని ఉన్నదని
అనుమానం. ఇది అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాల
వలన అవగతం కాలేదు. అప్పుడు వేదం అవగతం చేయిస్తుంది. అర్థం చేయించడమే వేదపు
వేదత్వం. వేదం సనాతనం, సాధ్వి. కొలమానాల్లో ఉత్తమం.
ఇంద్రియాలకు అందని విజ్ఞానానికి వేదమే కొలమానం. వేదానికి మాత్రమే గోచరమయ్యే
సూక్ష్మార్థం ఉంటుంది. దానికి తర్కం ఎలా ఉపయోగిస్తుంది?
తర్కం ఇతర ప్రమాణాల మీద ఆధారపడింది. తర్కం స్వయంగా ప్రమాణం కాదుకదా! వేదం శాస్త్రం
మాత్రం కాదు. సకల శాస్త్రాలకూ జన్మనిచ్చింది. అన్నీ వేదం నుంచే ఆవిర్భవించాయి.
వేదం వల్లనే జీవితం నిలిచి ఉంది.’
(డాక్టర్
దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)