Monday, December 4, 2023

వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు .... (ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-1) : వనం జ్వాలా నరసింహారావు

 వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-1

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (04-12-2023)

వేదాలను, పురాణాలను లోకానికి అందించిన పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులుండేవారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు. బ్రహ్మ హృదయాకాశంలో ఉదయించిన ఒక నాదం, ఆయన ఆత్మయోగంతో చిత్తవృత్తులను నిరోధించి వున్నప్పుడు ఆయన శ్రవణ పుటాలలో వ్యక్త రూపాన్ని పొందింది. ఆ నాదమే బృహతీ వాక్కుగా,ఓమ్’ అన్న ధ్వనిగా వినిపించి, అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మవిద్యాసర్వస్వములైన అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు, పుట్టినిల్లైన వేదమాత.

త్రిగుణాత్మకమైన ఆ ఓంకారంలో. సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు, ఋగ్యజుస్సామములనే మూడు నామాలు, భూర్భువస్సువస్సులనే మూడులోకాలు, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు వృత్తులున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శలు, అంతస్థములు, ఊష్మములు (హ్రస్వములు, దీర్ఘములు) మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించాడు. ఆ అక్షరాల సహాయంతో ఆయన తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. ఆయన మానస పుత్రులైన మరీచి మొదలైన వారు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని, తమ శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః వేదాలను అభ్యసిస్తున్నారు.

కాలమహిమ వల్ల వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర యుగారంభంలో దాశరాజు కూతురు సత్యవతీదేవి కడుపున భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు. అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు.

పైలమహర్షి అధ్యయనం చేసిన ఋక్సంహిత పరిమాణం, ఋక్కుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి దాన్ని బహ్వ్ఋచ సంహిత అన్నారు. పైలుడు దాన్ని రెండుగా విభజించి ఇంద్రప్రమితికి, భాష్కలుడికి బోధించాడు. భాష్కలుడు తన భాగాన్ని నాలుగు శాఖలుగా పునర్విభాగం చేసి, శిష్యులైన బాద్య, యాజ్ఞవల్క్య, పరాశర, అగ్నిమిత్రులకు నేర్పాడు. ఇంద్రప్రమితి తన సంహితభాగాన్ని కొడుకు మాండూకేయ ఋషికి ఉపదేశించాడు. మాండూకేయుడు తన శిష్యుడు దేవమిత్రుడికి బోధించిన విద్యను సౌభరి మొదలైన ఋషులు నేర్చుకున్నారు. సౌభరి కొడుకు శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను ఐదుగా విభజించి శిష్యులైన వాత్స్య, మౌద్గల్య, శాలీయ, గోముఖ, శిశిరులకు ఉపదేశించాడు. వారు జాతుకర్ణికి, ఆయన బలాకుడు, పైంగుడు, వైతాలుడు, విరజుడు అనే ఋషులకు నేర్పాడు. భాష్కలుడి కొడుకు భాష్కలి వాలఖిల్య సంహితను సంకలనం చేసి శిష్యులు బాలాయని, గర్గ్యుడు, కాసారుడులకు చెప్పాడు. అలా బహ్వ్ఋచ సంహితను సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా అధ్యయనం చేశారు.

వైశంపాయనుడు క్షుణ్ణంగా నేర్చుకున్న యజుర్వేదాన్ని అతడి శిష్యులు చరకుడు, అధ్వర్యువు. గురువుగారి దగ్గర అన్ని క్రతువులు సలక్షణంగా చేయించడం నేర్చుకున్నారు. ఒకసారి ఆ శిష్యులు చేపట్టిన కర్మకాండను వైశంపాయనుడి మరో శిష్యుడు యాజ్ఞవల్క్యుడు అధిక్షేపించాడు. దానికి కోపించిన వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుడిని ఆయన నేర్చుకున్న వేదాన్ని మొత్తం అక్కడ వదిలి తక్షణమే వెళ్లిపొమ్మన్నాడు. యాజ్ఞవల్క్యుడు మొత్తం కక్కేసి వెళ్లిపోయాడు. ఆ కక్కును ఆయాశాఖాధి దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో భుజించారు. అప్పటి నుండి ఆ భాగానికి తైత్తిరీయ శాఖ అన్న పేరొచ్చింది. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుని, ఇతరులకు తెలియని యజుర్వేద సూత్రాలను నేర్చుకున్నాడు. ఆ నవీన శుక్లయజుర్వేద భాగం వాజసనేయ సంహితగా ప్రసిద్ధికెక్కింది.

సామవేదాన్ని నేర్చుకున్న జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. సుమంతుడు ఆయన కొడుకైన సుకర్ముడికి నేర్పాడు. అతడు సామవేద తరువును వేయి శాఖలుగా విభజించి శిష్యులకు నేర్పాడు. అధర్వవేద పండితుడైన సుమంతుడు కబంధుడనే శిష్యుడికి, అతడు పధ్యుడికి, వేదదర్శుడికి, వారు వారి శిష్యులకు, అలా అలా శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి చెందింది.

మానవ ధర్మాలకు అపారమయిన నిధి లాంటివి వేదాలు. వాటికి విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వేదం ఈశ్వర జ్ఞానం. భారతీయులకు వేదాలు పవిత్ర గ్రంథాలు. తెలిసినా, తెలియకపోయినా వేదాలంటే భక్తీ-శ్రద్ధలు కనపరచని భారతీయులు అరుదుగా వుంటారు. ఆ మాటకొస్తే అనేకమంది విదేశీయులు వాటిల్లో ఏముంటాయో తెలుసుకోవడానికి ఆత్రుత పడ్డారు. పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. వ్యాఖ్యానించారు. అంతరార్థాలు, అర్థాలు వెతికారు. వారికి తోచింది, నిజమని నమ్మింది చెప్పారు. నమ్మిన వాళ్లు నమ్మారు. అవే నిజమని భ్రమించిన వారూ లేకపోలేదు.

   సృష్టి రహస్యం తెలుసుకోవడం అంత సులభమయిన విషయం కాదు. మహాప్రళయం సంభవించినప్పుడు మనం అనుకుంటున్న, ఊహిస్తున్న ప్రపంచం వుండదు. ప్రకృతి ఎలా వుంటుందో ఊహించడం కూడా కష్టమే! అలా జరిగినప్పుడు ప్రాణికోటి ఏమవుతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. అంతా అగమ్యగోచరం. ఈ విధంగా కొంత కాలం కొనసాగి మళ్లీ నూతన సృష్టి జరుగుతుంది. అలా సంభవించిన సృష్టి మాతా-పితరుల సంయోగం వల్ల కాని, లేకుండా కాని జరగవచ్చు. అలా జరిగిన సృష్టిలో సమస్త ప్రాణులు నాలుగు రకాలుగా పుట్టవచ్చు. మొదటిది: జరాయజములు, అంటే, మనుష్యులు, పశువులు. రెండవది: అండజములు, అంటే, గుడ్ల నుండి పుట్టే పక్షులు, చేపలు, పాములు లాంటివి. మూడోది: స్వేదజములు, అంటే, చెమటతో పుట్టే పేలు లాంటివి. నాలుగోది: ఉద్భిదములు, అంటే భూమిని చీల్చుకుని పుట్టే చెట్లు. పంచ భూతాలు ఏర్పడిన తరువాత భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి వీర్యము, వీర్యము వల్ల పురుషుడు రావడం జరిగింది.

ఇక వేదం, వేదవిషయాలకు వస్తే, వేదాలు సృష్టి నియమ శాస్త్రాలని గ్రహించాలి. వేదాలు భగవంతుడి నిశ్వాశలలాంటివనీ, వాటికి కర్త ఫలానా అని ఎవరు లేరనీ, అందుకే వాటిని అపౌరుషేయాలని పెద్దలంటారు. వేదాలు వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పినాయి. వేదాలను శ్రుతులు అంటే ధ్యానావస్థలో ఋషులకు వినబడినవనీ అంటారు. వీటిని స్మరించి చెప్పబడినవే స్మృతులు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే నాలుగు వర్ణాల వారున్నారని వారికి వేరు వేరు కర్మలు వున్నాయని చెప్పారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రం వేదాలను చదవడం, చదివించడం అర్హతగా అందులో పేర్కొనడం జరిగింది. (అది ఒకప్పటి మాట. ఇప్పుడు కాకపోవచ్చు).  

‘భగవదనుగ్రహం లేక ఏ కార్యమూ ప్రారంభమూకాదు, పూర్తికాదు. ఎందుచేతననగా సర్వకర్మలు, కార్యాలు భగవదధీనములు. ఈ సమస్త భూమండలం నిరాధారంగా నిలిచి ఉన్నదంటే అందుకు భగవదాజ్ఞయే కారణం. భూమి, సూర్యచంద్రాదులు సమస్త చరాచర ప్రకృతి భగవదాజ్ఞవల్లనే ప్రవర్తిల్లుతున్నాయి. భగవంతుడు నియమించినరీతిగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయి. వేదము హిమవదున్నతం. ఆకాశమంతటి విశాలం. సముద్రమంతటి గంభీరం. వాయువువలె సర్వవ్యాప్తం. నేనేమిటి, అంతటి వేదాన్ని గురించి ఆలోచించడం ఏమిటి? వేదం పఠించడం ఏమిటి? వేదం వ్రాయడం ఏమిటి? ఇది కేవలం భగవదనుగ్రహం కాకుంటే ఏమిటి’  అని వ్రాసుకున్నారు అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య.   భారత జాతికి అమృత ప్రాయాలైన రామాయణ, భారత, భాగవతాలను, వేదాలను రచించిన ఏకైక వ్యక్తి బహుశా దాశరథి రంగాచార్య గారేనేమో! ఆయన వ్రాసిన ఋగ్వేద సంహిత ఉపోద్ఘాతంలో చాలా ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. అందులో మచ్చుకు కొన్ని:

         ‘వేదము పవిత్రమైనది. అన్యమత గ్రంథాలలాగా పేరుకు ముందు వెనుక “పవిత్ర” పదం లేదు. మంత్రానికి మాన్యత వుంది. అయినా అది మాన్యత గలది అని వాచ్యంగా చెప్పడం జరగలేదు. వేదాలన్నీ సంకల్పము, రహస్యము, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, ఇతి హాసములు, వ్యాఖ్యానములు, పురాణములు, స్వరములు, సంస్కారములు, నిరుక్తములు, అనుశాసనములు, అనుమార్జనములు, వాక్కు యొక్క వాక్యముల సహితముగా నిర్మించబడినవి. వేదం ఏనాటిదో తెలియదు. ఎన్నడు మొదలయిందో తెలియదు. అది అనాగరిక మానవుని నుంచి నిర్మలంగా నిష్కల్మషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని దైవత్వపు అంచులకు కొనిపోయింది.’

         ‘వ్యాసభగవానుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు, నిరంతరం కృషి చేసి వేదాలను నాలుగుగా నిర్ణయించినాడో! దాన్ని గురించి కనీసం అంచనావేయగల శక్తి స్తోమతలు మనకు లేవు. మనది అల్పబుద్ది. మనం అల్పాయుష్కులం. వేదాలను వేదవ్యాసుడు సంకలనం చేశాడు. అందుకే అవి వేద సంహితలు. అవే...ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, సామవేద సంహిత, అథర్వవేదం సంహిత. ఇలా నాలుగు విధాలుగా వేదాన్ని విభజించడాన్ని “వేదచతుష్టయం” అంటారు.’

         వేదం అపౌరుషేయం. అంటే, మానవ ప్రోక్తం కాదు. ఋషులు వేదద్రష్టలు. స్మర్తలు. వారు అపౌరుషేయమైన వేదాన్ని దర్శించి మనకు అందించారు. వేదం ఒకనాడు పుట్టి ఒకనాటికి పూర్తి అయిన కావ్యం లాంటిది కాదు. ఇది ఒక స్రవంతి. ఒక నిర్ఘరి. ఒక నది. ఒక ప్రవాహం. దర్శించిన ఋషి చెపుతూ పోయాడు. దానిని అక్షరబద్ధం చేస్తూ పోయారు. ఈ ప్రవాహం వ్యాసుడు సంహితలు చేసేవరకు సాగింది. తదుపరి సకల నదులు కూడిన తటాకంలా మానవాళికి ఉపకరిస్తున్నది. వేదం శృతి. వినదగింది. వినసొంపుగా ఉండడానికి వేదానికి స్వరం ఉంది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యంగా ఉంటుంది. అది శక్తిమంతం సాధించగలదు. బ్రాహ్మణులు ఒక జాతిగా వేదాన్ని, భారత సంస్కృతిని రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేశారు.’ 

         ‘మానవులకు, మానవ సమాజానికి హితవు చేకూర్చిన వారు దేవతలు అనవచ్చు. ప్రకృతి శక్తులైన సూర్య, చంద్ర, అగ్ని, వాయువులు వలనే మానవుడు జీవిస్తున్నాడు. కావున పృధివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము స్థూలంగా దేవతలు. అవికాక వృక్ష, లతా, గుల్మాదులు, పర్వతాదులు దేవతలే. ఈ దేవతలు వేరువేరుగా కానీ, అందరు కలిసిగాని పరాత్పరుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరులు కారు. సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుడు అగమ్యగోచరుడు. అనిర్వచనీయుడు. అందడు. పరమాత్మ సాకారమా? నిరాకారమా? దీనిని గురించి చర్చలు, సిద్ధాంతాలు, తాత్విక చింతనలు జరుగుతున్నాయి. కాని నిర్ణయం జరగలేదు. అతడు మనిషికి అందని మహోన్నతుడు. మానవుని జ్ఞానం పరాత్పరుని తెలుసుకునే శక్తి లేదు. అ పరాత్పరుడే ఈ సమస్తాన్ని సృష్టించినాడు. భగవానుడు కల్పించిన ఈ ప్రకృతినే మానవుడు ఇంతవరకు తెలిసికొనలేక పోయినాడు. గెలవడం చేతకాని పని. ప్రకృతిని, తన ప్రకృతిని, ఎరుగలేని దర్బలాటి దుర్బలుడు మానవుడు. అయినా తనకు అన్నీ తెలుసునని బీరాలు పలుకుతాడు. వేదం చదివి అర్థం తెలిసికొనని వాడు బరువు మోయు స్థాణువు వంటివాడు. వేదం చదివి అర్థం తెలుసుకొన్నవాడు జ్ఞానియై, పాపరహితుడై స్వర్గానికి చేరుకుంటాడు.’

(మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీ మద్భాగవతం

డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

No comments:

Post a Comment