మానవ సమాజానికి ఆదర్శ ప్రాయం ఋగ్వేద సమాజం
ఋగ్యజుస్సామాథర్వ
వేదాల సారం-2
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(11-12-2023)
‘ఋగ్వేదం ఒక పరిపూర్ణ, శాంతియుత, స్వయం సమృద్ధ సమాజాన్ని
సృష్టించింది. అయోమయంలో వుండి, అడుగంటనున్న నేటి ప్రపంచ మానవ సమాజానికి
ఆదర్శప్రాయం ఋగ్వేద సమాజం. ఈ సమాజంలో ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థ వుంది. మానవ
సంబంధాలు స్థిరపడ్డాయి. ఉమ్మడి కుటుంబాలు, ప్రేమాభిమానాలు, అనుబంధాలు అమృతప్రాయములైనాయి. గ్రామాల్లో శాంతి, సహకారం, సద్భావం అవతరించాయి. స్త్రీలకు ఆస్తి హక్కు, కుటుంబ యాజమాన్యం కలిగించారు.
ఋగ్వేద జీవన విధానమే ప్రపంచమంతటా కొనసాగింది. ఇన్ని వేల సంవత్సరాలు నిరంతరాయంగా
కొనసాగిన జీవన విధానాన్ని మానవజాతికి అందించిన ఋగ్వేదాన్ని నమోవేదమాత అనడం కన్నా
మనం ఏం చేయగలం?’.
‘ఋగ్వేదం ప్రధానంగా
పరమాత్మ,
ఆత్మ, ప్రకృతి యొక్కగుణాలు, లక్షణాలను వివరిస్తుంది. అదీకాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన
జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస్తుంది. రసాయన,
భౌతిక, గణిత, ఖగోళ, విశ్వోద్భవ
శాస్త్రాల యొక్క ప్రాధమిక అంశాలను వివరిస్తుంది. మానవుడి పూర్తి జీవితంలో అనుసరించవలసిన
ధర్మాల గురించి, అనుసరించవలసిన ఆదర్శాల గురించి చెప్తుంది.
ఆధ్యాత్మిక విషయాల యొక్క లక్షణాలు, ప్రకృతి, పనితీరు వివరిస్తుంది.’ మరిన్ని వివరాల్లోకి పోతే.....
‘వేదం అపౌరుషేయం, దైవదత్తం, దైవప్రసాదం, అమృతమయం. ‘వేదం
అపౌరుషేయమంటే అది మానవ నిర్మితమైనది కాదని అర్థం. అలాగే వేదం దైవదత్తం, దైవప్రసాదం. ఆ మాటకొస్తే, సమస్త ప్రకృతి దైవదత్తమే, దైవ ప్రసాదమే! మానవుడు సృష్టించగల సామర్థ్యం వున్నవాడు కాదు. ప్రకృతిని
దర్శించి వినియోగించగలవాడు మాత్రమే. ప్రకృతి సహాయం లేకుండా లోకాలు నిలువజాలవు.
దైవప్రసాదమైన ప్రకృతి శక్తులను శాస్త్రజ్ఞులు, ఆవిష్కర్తలు,
మేధావులు, ఋషులు మాత్రమే దర్శిస్తారు. దర్శించడం అంటే కంటికి
కనిపించేది చూడడమని కానేకాదు. కంటికి కానరానిదానిని కనుగొనడం. ఋషి అతీంద్రియ
దర్శి. వేదం శ్రుతి. విన్నది మాత్రమే. వేదంలోని మంత్రాలను, సూక్తాలను
ఋషులు కనుగొన్నారు. మనం వేదంలో చూసే ఋషులు వేదకర్తలుకారు. ద్రష్టలు మాత్రమే.
స్మర్తలు గుర్తుంచుకున్నవారు అవుతారు’.
‘వేదం కర్మ ప్రతిపాదకం. కర్మ అంటే కార్యం. కృషి. ఇంద్రాది
దేవతలు కర్మలవల్ల గొప్పవారయినారు. జన్మమాత్రాన కాదు. ఉదాహరణకు నూరు సత్కార్యాలైన యజ్ఞాలు
చేసినవాడు ఇంద్రుడు అవుతాడు. వేదం అపారం. వేదార్థము బహువిధము. ఇందు అనేక శాస్త్రాలు,
శాస్త్రార్థాలు, విజ్ఞానాలు, వికాసాలు,
నానాశాఖలు వున్నాయి. ఏ ఒకరో, ఇద్దరో దీనిని అర్థం చేసుకోవడం
అసాధ్యం, అసంభవం. సత్యాన్ని దర్శించడానికి ఒకే ఈశ్వరుని
ప్రతిపాదించడానికి వేదంలో నిరంతర ప్రయత్నం సాగుతున్నది. లోకం గతానుగతం. నలిగిన మార్గంలో
నడిచేది. కొత్తదాన్ని ఆమోదింపచేయడం ఎంత కష్టమైనను పాతది నిలబడడం లేదు. అయినా సామాజిక
శాస్త్రంలో, తాత్విక శాస్తంలో విజయవంతమైన ప్రయోగాలు అరుదు’.
‘మానవ చరిత్రకు ఆద్యంతాలు లేవు. ఇది కాలం సహితంగా నిరంతరం సాగుతూనే
వుంటుంది. ఆ చరిత్ర గమనంలో మానవుడు ఒకప్పుడు పురోగతుడవుతాడు. మరొకప్పుడు తిరోగతుడవుతాడు.
మానవ గమనానికి నిర్దిష్ట బిందువులేదు. కాబట్టి, పురోగమన తిరోగమనాలను స్పష్టంగా
చెప్పలేం. అప్పుడు గమనం సాపేక్షమవుతుంది. అప్పటి స్థితిని బట్టి వెనుకకా? ముందుకా? అనేకాని అదికూడ నిర్దిష్టం కాదు. మానవ జీవితం
ఏకముఖం కాదు. ఇది బహుముఖీనము. ఆర్థికం, సామాజికం, పారమార్థికం, ఇలా లెక్కలేనన్ని? వాటిలో ఎక్కడా సాపేక్షముగా ముందడుగు, లేదా,
వెనుకడుగు నిర్ణయించడం మానవుడికి అసాధ్యం. మానవుడికి విశ్వాసం కలిగించడం అతి కష్ట కార్యం.
మానవుడు ఆత్మవిశ్వాసంలో దేవతకావచ్చునని వేదం వచిస్తున్నది’.
‘అర్థం అంటే ధనం. మానవుడిలో అర్థం అంటే సగం అని మాత్రమే! అర్థం,
బాహిరము. భౌతికము. శ్వాసలేక మనిషి జీవించలేనట్లే అర్థం లేక మనిషి జీవించలేడు. అర్థం
జీవికకు తప్పనిసరి. జీవితం శ్వాసమాత్రము కాదు. మానవుడికి మనసున్నది. మనసు అర్థపరము
కాదు. ధర్మపరము. కేవలం అర్థపరులు కానివారు మహాత్ములవుతున్నారు. అయినప్పటికీ మానవ జీవితంలో
ధర్మాన్ని సాధించడానికి తొలుత కావలసింది శరీరమేకదా? మానవజీవితపు మొట్టమొదటి
దుర్దశ భయం. భయంలేనిదైన జ్యోతిని దర్శించడం ఎంతో మహోన్నతం,
మానవీయం, దైవికం, మహోత్తమైన, ఆలోచన!’
‘ధనమున్నవానికి శాంతి, శాంతి ఉన్నవానికి ధనం వుండవు.
పరిపూర్ణత ప్రకృతికి లేదు కాబట్టి జీవితానికీ లేదు. సృష్టిలోనైనా, అతీతంగానైనా
పరమేశ్వరుడు ఒక్కడే పరిపూర్ణుడు. అయినా మానవుడి గమనం నిలువదు. దానికి నిర్దిష్ట లక్ష్యాలు
ఉండవు. అది ఉన్నది అనుకోవడం భ్రమ! జీవితమే ఒక భ్రమ కదా! పూజ్యం, అనింద్యం, అద్వేష్యం అయిన ధనమే శాంతిని, సుఖాన్ని కలిగిస్తుంది. అలా కానిది అశాంతి కారకం అవుతుంది. ఉన్నవారి ధనాన్ని
లేనివారికి ఇవ్వమన్నది వేదం’.
‘మానవుడికి ప్రధానమైంది కర్మ, పని. పనిలేనిది మానవుడు
మనజాలడు. పని తరువాత అవసరమయినది యజ్ఞము, ప్రయత్నం. కర్మకాండ అని పేరొందిన ఒక విధి
విధాన యజ్ఞం మానవులకు సౌఖ్యాలను సమకూర్చడానికి ఏర్పడినది. ఇది భగావధారాధనము. యజ్ఞానికి
సాధనసంపద సమకూర్చువాడొకడు. అతడు యజమాని. యజ్ఞం జరిపించువాడొకడు. అతడు ఋత్విక్కు.
యజమానికి కర్మకాండతోగాని, ఋత్విక్కునకు సాధన సామాగ్రితోకాని సంబంధములేదు. తపస్సు అటువంటిదికాడు.
సంపూర్ణ స్వప్రయత్నం. దీనికి చేయువాడు, చేయించువాడు ఉండరు.
స్వసంకల్పము స్వ ప్యత్నం. ఇచట దేహమే యజ్ఞభూమి. సంకల్పమే ఋత్విక్కు. ఇది జ్ఞానానికి
మార్గము’.
‘మానవుని జీవితయాత్ర అనంతం, అద్భుతం,
ఆశ్చర్యకరమైనది. భగవంతుని సృష్టి సమస్తంలో మానవుడికి మాత్రమే ఆలోచన ప్రసాదించినాడు
భగవంతుడు. ఆలోచన మానవుని ప్రగతికి, వినాశనానికి కారణభూతం
అవుతున్నది. సత్యం అంటే నిజం చెప్పడం మాత్రమే కాదు. “సత్” అంటే ఉన్నది, “అసత్” అంటే లేనిది. ఉన్నది, లేనిది వీటిని
గురించిన జ్ఞానం. సకల చరాచర ప్రపంచం “అసత్”. ఉండునదికాదు. వచ్చిపోవునది. దీనికి
స్థిరత్వము, శాశ్వతము లేదు. “సత్” ఉన్నది, శాస్వతమయినది. పరమాత్మ స్వరూపం. అర్థం జీవితాన్ని తెలుసుకోవడం. పరమార్థం
పరాత్పరుడిని తెలుసుకోవడం. పరాత్పరుడు ఎవడు? అదియే మానవుడికి
ఎన్నటికీ తెలియనిది. ప్రస్తుతం మనం విశ్వసించినవాడే ఈశ్వరుడు. ఇది విశ్వాసం
మాత్రమే! మానవుడి ఆలోచనకు గోచరించని ఒక మహా పదార్ధం పరమాత్మ. పరమేశ్వరుడు.
పరంథాముడు. అతడే “ఋత్”. కావున ఋతమే సర్వానికి కారణం. ఋతము భౌతికము కాదు. పరమాత్మ
నుండే సమస్త దేవతలు పుట్టినారు’.
‘నిరంతర అన్వేషణయే జీవితం. వ్యక్తి, కుటుంబ, సమాజ, దేశ, లోక జీవితములందు అన్వేషణమే గోచరించుచున్నది. అన్వేషణము లేనిదాని
కొరకు కాదు, ఉన్నదానికొరకే. ప్రకృతి తనలో అనంతములైన రహస్యాలను దాచుకున్నది.
వాటికొరకు అన్వేషణ సాగినది, సాగుతున్నది, సాగనున్నది. అన్వేషణమే వేదం. ఈ సమస్త చరాచర ప్రకృతికి మూలం ఏమిటి? ఏది దీనిని కాపాడుతున్నది? ఏది దీనిని
అంతమొందిస్తున్నది? వీటిని కనుగొనే అన్వేషణమే వేదం. సత్యాన్ని
కనుగొనేవరకు అన్వేషణ ఆగదు. సత్యం దృగ్గోచరమవడం మానవుడికి సాధ్యం కాదు. అయినా
అన్వేషణ ఆగదు. అన్వేషణ అనంతం, నిరంతరం. నవీనాలను
తెలుసుకోవడమే అన్వేషణం’.
‘సమస్త సృష్టి,
స్థితి, లయాలకు పంచభూతాలు (భూమి, నీరు, వెలుగు, వాయువు, ఆకాశం) ఆధారాలు.
ప్రస్తుత కాలంలో మానవుడు పంచ భూతాలకు దుఃఖం కలిగిస్తున్నాడు. దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
నరుడిగల మానవతా లక్షణాలలో కృతజ్ఞత ప్రధానమైంది. మనకు ఉపకారము చేసినవారిని తలచుకోవడం, ప్రత్యుపకారం చేయడం కృతజ్ఞత అవుతుంది. ఉపకారిని తలచకుండడం, ప్రత్యుపకారం చేయకుండడం కృతఘ్నత. దీనికి నిష్కృతి లేదు. పంచ భూతాలు మనకు
అనంతములైన ఉపకారం చేస్తున్నాయి. పంచ భూతాలకు కృతజ్ఞత తెలియచేయడం మానవుడి కనీస కర్తవ్యం’.
‘పురోహితుడు అనగా పూర్వము ఉండినవాడు.
సృష్టికి పూర్వము ఉన్నవాడు. పరాత్పరుడు, ఈశ్వరుడు. పురోహితుడు యజ్ఞానికి
అవసరమైన పదార్ధాలను సేకరించేవాడు. పురోహితుడు సామాజిక శాస్త్రజ్ఞుడు. ఒక వ్యక్తి,
ఒక సంఘపు సుఖ, దుఃఖాలను వినేవాడు. సుఖ జీవనానికి అవసరమైన
సలహాలు ఇచ్చేవాడు. అతడు ఆచార్యుడిలాగా, వైద్యుడిలాగా, మిత్రుడిలాగా ఉపకరించేవాడు’.
‘వేదంలో వైద్యాన్ని,
విద్యను స్తుతించడం జరిగింది. ఇది క్రమ పరిణామం. సక్రమ ప్రగతి. అభ్యుదయం.
అశ్వినులు కవలలు, సూర్యుడి పుత్రులు,
ఆరోగ్యదేవతలు, వైద్యులు, వీరు జంట దేవతలు. ఒంటరిగా వుండరు. వైద్యం
శారీరకం, మానసికం కలిసి జరుగవలసి ఉన్నది. ఈ సత్యాన్ని వేదం వెల్లడించింది. ఆధునిక వైద్యం
ఇంకా ఎదగాల్సి ఉన్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలను
మన వైద్యం గుర్తించాల్సి ఉన్నది. అస్తి పంజరం కాదు, మనసున్న
మనిషిని అధ్యయనం చేయాల్సి ఉన్నది. గుండె జబ్బులకు, కామెర్లకు, పండు రోగానికి వేదంలో సూర్యరశ్మిచికిత్స చెప్పడం జరిగింది. విద్య నదిలాగా
వుండాలని వేదం వచిస్తున్నది. అది ఎంతో సత్యం! విద్య ఒకచోట ఉండరాదు. ప్రవహించాలి. విద్య
నదిలాగా సమస్త జనులకు ఉపయోగపడాలి. నది సాగరంలో కలుస్తుందనే జ్ఞానం ప్రసాదించేదే విద్య
అవుతుంది. లోకంలో వున్న సమస్త ప్రజ్ఞలను ప్రకాశింప చేసేది విద్య. సరస్వతి’.
‘ఇంద్రుడు మేఘాలను కొట్టినవాడిగా, జలాలను
చీల్చినవాడిగా, కొండల నుండి నదులను బహిర్గతం చేసినవాడిగా
చెప్పడం జరిగింది. ఇంద్రుడు కొట్టిన మబ్బులు కురిశాయి. నదులయ్యావి. నదులు సముద్రాలకు
సాగాయి. అది అద్భుతం. ఆశ్చర్యకరమైన జలముక్తి మహాత్కార్యాన్ని వివరించేది. కొండలందు
దాగిన నదుల అడ్డంకులను తొలగించి ప్రవహింపచేయు మహాత్కార్యాన్ని వర్ణిస్తున్నది. ఇది
ఆధునిక యుగంలో నదులకు ఆనకట్టలు కట్టే యంత్రాల అట్టహాస కార్యాన్ని తలపిస్తున్నది. ఆధునిక
కాలంలో కట్టడం అయితే, ఆ నాటి కాలంలో అది విప్పడమనే గొప్ప
ఇంజనీరింగ్ ప్రక్రియ. ఇంజనీర్లే దీనిని వివరించగలరు’.
‘స్వరాజ్యాన్నిగురించిన ఆలోచన ఆనాడే
వచ్చింది. వేదాలది అంతటి ప్రగతిశీల ఆలోచనా విధానం. ఇంద్రుడు స్వరాజ్యంలో ప్రభుత్వం
ఎలా వుండాలో వివరించినాడు. ప్రభుత్వం తనను, దేశాన్ని రక్షించే సామర్థ్యం
కలిగి వుండాలి. ప్రజలకు శాంతి సౌభాగ్యం కలిగించే ఉపాయాలు కలిగి, వాటిని అమలు పరచాలి.
ప్రజలకు సంతృప్తికరమైన జీవితాన్ని సాధ్యమయ్యే ప్రయత్నాలు చేయాలి. ఈ లక్షణాలు కలదే స్వరాజ్యమవుతుంది.
భూమి, నీరు, వాయువు, శిలలు అన్నింటిలోను ఔషధాలు వున్నాయని వేదం చెప్తున్నది. మనువు ఔషధాలు
నరులకు ఇచ్చినాడు. రుద్రుడు నీతిబోధచేయు వరకు అవి ఫలించలేదు. భూమియే స్వర్గం. భూమియే అంతరిక్షం. భూమియే
తల్లి. భూమియే తండ్రి. భూమియే పుత్రుడు. భూమియే సర్వ దేవతలు. భూమియే అయిదు విధాల
జనులు. భూమియే పుట్టుక. భూమియే పుట్టిన వస్తువు. భూమియే సర్వం. భూమిని మించినది
లేదు’.
‘ఒక పని నిర్విఘ్నంగా జరగడానికి అనేకుల
అండదండలు, ఆశీస్సులు అవసరమవుతాయి. ప్రకృతి శక్తులు, దేవతలు,
మానవులు, పరిసరాలు ఇన్ని సహకరించాల్సి ఉన్నది. అందరిని
ప్రార్థించవలసి ఉన్నది. మానవుని మనుగడకు సమాజపు నిలకడకు సదాశయాలే ఆధారాలు. వేదంలో
ఉన్నతమైన సదాశయాలున్నాయి. ‘దేవతలది ప్రత్యేక వర్గము, వర్ణము, జన్మము కావు. అగ్ని, వాయువు,
ఇంద్రుడు, లాంటివారు మానవజాతికి చేసిన ఉపకారము వల్లే వారు దేవతలయ్యారు.
ఋషులు జన్మవలనే కాకుండా సాధన ద్వారా ఋషులు అయినారు. ద్రష్టలు అయినారు. స్మర్తలు
అయినారు. పటు పరిశ్రమ, మేధాసంపత్తి,
నిరంతర పరిశ్రమతో దేవతలలో చేరవచ్చునని ఋషులు నిరూపించినారు. పాండిత్యానికి, శాస్త్ర పరిజ్ఞానానికి, జన్మతో నిమిత్తం లేదని
నిరూపించినారు. ప్రతిభకు ఏనాడు కూడా ఆటంకం కలగలేదు. కలగదు కూడా’.
(డాక్టర్
దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)
No comments:
Post a Comment