Thursday, December 28, 2023

ఆదర్శ పాఠాలతో ముందుకు! (అభివృద్ది, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమ జీవనం) : వనం జ్వాలా నరసింహారావు

 ఆదర్శ పాఠాలతో ముందుకు!

(అభివృద్ది, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమ జీవనం)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (29-12-2023)

ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఎంత ఉదాత్తమైనవైనా, వాటి రూపకల్పనలో, అమలులోవేసే ప్రతీ అడుగు, చిత్తశుద్దితో కూడినవి మాత్రమే కాకుండా, సార్వజనీన, విస్తృత ప్రజా భాగస్వామ్యం కలవైనప్పుడే అసలు, సిసలైన అంతిమ ఫలితం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో ఒక మార్పు మొదలయిందనడానికి సంకేతంగా, ఆయన స్వయంగా నామకరణం చేసిన ‘మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజాభవన్’ లో ‘ప్రజావాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజల సమస్యలను ఒక ముఖ్యమంత్రి నేరుగా, వ్యక్తిగతంగా విని పరిష్కరించే ఆదర్శ కార్యక్రమమిది. ప్రజలను కలవని, వారి సమస్యలు వినని కొందరు పాలకుల వైఖరిన తప్పని ఆచరణాత్మకంగా ఎంచి చూపడానికి, అలాంటివారికి భిన్నంగా తమ పాలన ఉంటుందని తెలియచేయడానికి, ‘ప్రజావాణి’ లాంటి కార్యక్రమం ప్రతీకాత్మకమైనదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక మార్గదర్శిగా, ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఆశించినంత, ప్రచారం జరిగినంత మేరకు కార్యశుద్ధితో ‘ప్రజావాణి’ వేదిక కొనసాగి, అమలయితే, ఇది ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సులువైన మార్గంగా దోహదపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వివిధ కారణాలవల్ల, ప్రభుత్వాలన్నా, ప్రభుత్వ పరిపాలనన్నా సమాజంలో, ప్రజల్లో ఒక అవ్యక్త వ్యతిరేకతా భావన ఏర్పడి, పెరిగిపోతున్నది. ప్రభుత్వ సేవల్లో ఉదాసీనత, నిర్లక్ష్యం, జాప్యం, నిజాయితీలేమి, పారదర్శకతలేమి, పక్షపాతం ప్రబలిపోతున్నవనే అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. పౌరుడంటే కేవలం ప్రభుత్వ పథకాల లబ్దిదారుడే అనే భావన పోయి, పౌరుడే కేంద్రంగా పాలన జరగాల్సిన పరిస్థితులు ఏర్పడాలి. అసలు ప్రభుత్వ పాలనంటే ఏమిటి? సేవల్లో ఏమి ఉండాలి? అనే విషయంలో ప్రభుత్వాలకు మరింత స్పష్టత రావాల్సిన అవసరమున్నది. ‘ప్రభుత్వ పాలన అంటే కేవలం అభివృద్ధి, సంక్షేమం మాత్రమే’ అనే భావన సర్వత్రా నెలకొని ఉంది. అదే నిజమైతే, అభివృద్ధి, సంక్షేమం గణనీయంగా, పౌరులకు మిక్కిలి సంతృప్తికర స్థాయిలో అమలు చేసిన ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజల తిరస్కరణకు ఎందుకు గురికావాలి? అంటే, ప్రభుత్వ పాలనలో ప్రజలు ‘అభివృద్ధి, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమ జీవనం’ ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి.

పాలకులు తమకు తోచింది, తమ మనసుకు తట్టింది చేసుకుపోవడం కాకుండా, ప్రజలు ఆశిస్తున్నదేమిటో గ్రహించి, అదే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వమంటే ‘రాజ్యాన్ని పాలించడం, పౌరుల్ని నియంత్రించడం’ అనే మాంధాతల కాలంనాటి విధానం ఇప్పుడు కుదరదు. ప్రస్తుతం, ప్రభుత్వమంటే కేవలం ‘ఒక వ్యవస్థాగత నిర్మాణం’ కాగా, ‘ప్రభుత్వపాలనంటే పౌరులను సంపూర్ణంగా పరిగణలోకి తీసుకుని చేపట్టే సమిష్ట చర్యల సమహారం.’ పిల్లల జీవితాల్లోకి హద్దుమీరి చొరబడే తల్లిదండ్రుల మాదిరిగా ప్రభుత్వం, ప్రభుత్వ పాలన ఉండకూడదు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో లాగా తమ జీవనగమనంలో విపరీతజోక్యం, మితిమీరిన శ్రద్ధ ప్రదర్శిస్తే, పిల్లలకు తల్లిదండ్రుల మీద వెగటు పుట్టే అవకాశాలే ఎక్కువ వున్నట్లే, పౌరులకు కూడా!!!

పరిమిత అజమాయిషీయే అత్యుత్తమ పాలన’ అని అమెరికన్ తత్వవేత్త డేవిడ్ థరూ అన్న మాటలు అక్షరసత్యమని రాజనీతి, ప్రభుత్వ పాలన అభ్యసించిన విద్యార్థిగా ఏకీభవిస్తాను. ప్రఖ్యాత తత్వవేత్తలైన థామస్ జఫర్సన్, జాన్ లాక్ కూడా దీన్ని అంగీకరించారు. లైబ్రేరియన్ గా వృత్తిగత జీవితం ప్రారంభించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 53 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రికి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి స్థాయి వరకు వెళ్లగలిగాను. 15 ఏళ్ల పాటు మాజీ గవర్నర్ కుముద్ బెన్ జోషితోనూ, అసామాన్యమైన వ్యక్తులు, అసాధారణ మేధావులు, ప్రభావశీలురైన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల దగ్గర పనిచేసే వీలు కలిగింది. ఉన్నతహోదా సివిల్ సర్వీస్ అధికారులతో సన్నిహితంగా మెలగడం వల్ల విధాన నిర్ణయ ప్రక్రియను స్వయంగా చూసేందుకు, పరోక్షంగా పాల్గునేందుకు కూడా అవకాశం లభించింది.

ఎంసిఆర్ హెచ్ఆర్డి సంస్థలో తొమ్మిదేళ్ళు శిక్షణ కార్యక్రమాలు పర్యవేక్షించే రోజుల్లో శిక్షణలో ఉన్న ఐఎఎస్ అధికారులతోనూ, ఒకసారైతే ఏకంగా ఎపి కేబినెట్ మొత్తంతోనూ కలిసి ప్రభుత్వ పాలన గురించిన లోతుపాతులను సంయుక్తంగా అభ్యసించే వీలు కలిగింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సూచనల మేరకు, సీనియర్ సహోద్యుగులు ఆర్ సీతారాంరావు, ఎంపి సేథీలతో కలిసి సీనియర్ ఐఎఎస్ అధికారులు, శాఖాధిపతులతో నిర్వహించిన ‘గవర్నింగ్ ఫర్ రిజల్ట్స్’, ‘ఓరియంటేషన్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్’ శిక్షణా కార్యక్రమాలతో పాటు; సిటిజన్స్ చార్టర్, పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్, పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్స్, సమాచారహక్కు, రిఫార్మ్స్ ఇన్షియేటివ్స్ లాంటి కార్యక్రమాలు, ప్రభుత్వం, పాలన, అభివృద్ధి, సంక్షేమంపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 108 అత్యవసర వైద్య సహాయ సేవలు విస్తృత పరిచి అమలు చేసే విషయమై పదికి పైగా రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య-వైద్య శాఖ మంత్రులు, అధికారులు, కొందరు ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపే సందర్భంలో, ప్రభుత్వ పాలన గురించి, భిన్నమైన పాలనా పద్ధతుల గురించి మరింత అవగాహన కలిగింది.

ప్రభుత్వపరంగా లభించాల్సిన సేవల్లో మితిమీరిన జాప్యం కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు మితిమీరిన శ్రద్ధకు పోయి, అహరహం పథకాల మీద పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. అసలు ఆ పథకాలు పౌరులకు ఏమేరకు అవసరం? తమకు కావాలా? వద్దా? అనే ప్రజాభిప్రాయాన్ని ససేమిరా పట్టించుకోకుండా అమలుకు పూనుకుంటున్నాయి. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి, తసలరి ఆదాయం, తలసరి వినిమయ శక్తి లాంటి ఆర్థికపర అంశాల్లో సాధించిన గణనీయమైన వృద్ధి వల్ల పేదరికం తగ్గిందనే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను (DBT) అమలు చేస్తున్నారు. పురోగతిని, సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. కానీ, అవాంఛనీయ పరిణామాల మీద దృష్టి పెట్టకుండా జరుగుతున్న అనియత అభివృద్ధి నమూనా గురించి నిర్భయంగా చర్చ జరగాల్సిందే. ఉదాహరణకు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం అవసరమే అయినప్పటికీ, వాటిద్వారా బహుళ పంటల సాగుకు స్వస్తి పలికి, కేవలం పెద్దమొత్తంలో వరి సాగుకే పరిమితం కావడం వాంఛనీయమేనా ఆలోచించాలి.

ఒకప్పుడు రాజ్యాలు, సామ్రజ్యాలుండేవి. రాచరికాలు, నియంతృత్వాలు చలామణిలో ఉండేవి. భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలుండేవి. క్రమేపీ, విశ్వవ్యాప్తంగా ప్రజాస్వామ్య, సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడసాగాయి. భారతదేశంలాగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యమనే అబ్రహంలింకన్ సిద్ధాంతం సర్వత్రా అంగీకారమైనప్పటికీ, అది కాగితాలకే పరిమితమైంది. పాలన సుపరిపాలనగా, గొప్ప పాలనగా, వైవిధ్యమైన పాలనగా పరిణితి చెంది భిన్నకోణాల్లో జరగాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జనాకర్షకంగా కాకుండా, ప్రజోపయోగంగా ఉండేలా ప్రాధాన్యతా క్రమం నిర్ణయించబడాలి.

నిత్యం మార్పు చెందే ఆర్థిక స్థితిగతులు, సామాజిక, రాజకీయ అవగాహన, అవకాశాల విస్తృతి, స్వయం సమృద్ది పట్ల శ్రద్ధ తదితర అంశాల్లో పరిస్థితిని, ప్రజల దృష్టికోణాన్ని పట్టించుకోకుండానే విధాన నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఏకపక్ష, నిర్హేతుక నిర్ణయాలకు బదులుగా ప్రజలకు ‘ఎక్కవ, తక్కువ కాకుండా ఖచ్చితమైన అవసరాలను’ తీర్చే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలి. నిరంతరం మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లకు అనుగుణంగా ప్రభుత్వాల ఆలోచనా సరళిలో మౌలికమైన మార్పులు వచ్చి తీరాలి. విధాన నిర్ణయ ప్రక్రియలో విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించి, ప్రభుత్వ పాలన పట్ల ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనాలి. దురదృష్టవశాత్తు, అలాంటి వాస్తవిక దృక్పథం ఏ కోశానా కనిపించడం లేదు. విధానాలు రూపొందించడం, అమలు చేయడం, ఉదారంగా, అత్యంత లాభసాటిగా కనిపించినప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేకపోతే అవి చివరికి అసంబద్ధంగానో, తాత్కాలిక విజయానికి ప్రయోజనకారిగానో మాత్రమే మిగులుతాయి. తమ ప్రభుత్వ యంత్రాంగం యొక్క జవాబుదారీతనం, సమర్థత, నైతిక నిబద్ధత మీద ప్రజలకు అనుమానాలు పెరగకుండా నిత్యం జాగరూకత పడాల్సిన అవసరం ఉంది.

అధికారంలోకి ఎలాగైనాసరే రావాలి, వచ్చిన అధికారంలో ఏవిధంగానైనా కొనసాగాలి అనే నిర్హేతుకమైన రాజకీయ తహతహ విలువలతో కూడిన పాలన సాగించడానికి ప్రతిబంధకమయ్యే ప్రమాదం వుంది. పాలకులతో పాటు అధికారుల నుంచి కూడా నిబద్ధతతను ఆశించడం కష్టమవుతుంది. కాబట్టి సాధారణ పాలన నుంచి సులభమైన, సౌకర్యవంతమైన పాలన అందించే దిశగా సమూల మార్పు అవసరం. ప్రభుత్వ పాలన ప్రజలను నియంత్రించేదిగా కాకుండా ప్రజల అవసరాలు తీర్చే సాధనంగా ఉండాలి. ప్రజలతో మమేకం కావాలనే సంకల్పం, సేవా తత్పరత, ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనం పెరిగితేనే ఇధి సాధ్యం. ఇలాంటి మార్పు కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ర్టాల్లో ముఖ్యమంత్రుల నుంచే ఆరంభం కావాలి.

‘చేసింది ఇక చాలులే అని మందగించే పాలన నుంచి, చురుగ్గా అప్రమత్తంగా ఉండే పాలన’ దిశగా; ‘ఉగ్యోగస్వామ్యం నుంచి నిజాయితీ’ వైపు; ‘కదలిక లేని సంస్కృతి నుంచి చొరవ చూపే శక్తి’ దిశగా; ‘ప్రజలను ఈసడించుకునే వైఖరి నుంచి వారిని ఆదరించే వైఖరి’ దాకా; ‘అన్నీ మాకే బాగా తెలుసు అనే అహంకారం నుంచి అందరితో కలిసి తెలుసుకుందాం’ అనే అణుకువ దాకా; ‘ప్రభుత్వం అంటే భయం, అపనమ్మకం పొగొట్టి నాయకత్వం పట్ల విశ్వాసం, నమ్మకం కలిగించే’ దాకా; ‘ప్రభుత్వంలోని పెద్దలే అంతా నియంత్రించే పద్ధతి నుంచి సమిష్టి కృషితో విధానాలు’ తీసుకునే దాకా; ‘అధికార కేంద్రీకరణ నుంచి సమన్వయంతో సమిష్టిగా పనిచేసే సంస్కృతి’ వరకు; ‘పౌరులను అక్కున చేర్చుకోలేని దుర్దశ నుంచి ప్రజలతో స్నేహంగా మెలిగే వాతావరణం’ వచ్చే వరకు; ‘కేవలం స్థానిక ప్రమాణాలే పాటించే స్థితి నుంచి స్థానిక, అంతర్జాతీయ ప్రమాణాలను’ పాటించే దాకా; ‘సంప్రదాయ, జడ పదార్ధంగా కాకుండా సృజనాత్మక, వినూత్న పంథాలు’ అవలంభిచేదిగా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పు రావల్సిన తక్షణ అవసరం అవశ్యం.

సమర్థత, విశాల దృక్పథం, స్పందించే గుణం, జవాబుదారీతనం, స్వచ్ఛమైన ఆలోచనా విధానం, చైతన్యం, సర్దుబాటుతనం కలిగిన ప్రభుత్వాలనే ఇప్పుడు పౌరులు కోరుకుంటున్నారు. 25 ఏళ్ల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రస్తుతం రద్దు కావడమో లేదా నామమాత్రంగా అమల్లో వుండడమోగా మిగిలిన సిటిజన్ చార్టర్లను (పౌర సేవాపత్రాలు) విజయవంతంగా అమలుచేసిన నేపథ్యముంది. వీటినిప్పుడు తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలనలో సేవాతత్పరత పెరిగేలా ప్రమాణాలు నిర్ధేశించబడినప్పుడే ఆ ప్రభుత్వం తమకోసమే పనిచేస్తుందని ప్రజలు నమ్ముతారు. ఏమీ చేయకుండా ప్రభుత్వ ఉచిత సహాయం పొందే లబ్దిదారుడనే భావన ప్రజల్లో తొలగిపోతుంది. అభివృద్ధి, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమమైన జీవనాన్ని కోరుకునే పౌరులు ఆశించేది: మాకు కాస్త కనీస మర్యాద, గౌరవం ఇవ్వండి. సేవలందుకునే వెసులుబాటును సులభతరం చేయండి. అవసరమైన సహాయాన్ని సకాలంలో అందచేయండి. ఏదైనా చెప్పుకునే అవకాశం ఇవ్వండి. ఏంకావాలో నిర్ణయించుకునే అవకాశం ఇవ్వండి’ అనే. ఉత్తమమైన జీవితం అంటే స్వీయ సంతృప్తి, స్వీయ వివేకం, స్వయం సమృద్ధి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈ దిశగా ఒక మంచి అడుగు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలనుద్దేశించి డిసెంబర్ 15న ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్చ, స్వాతంత్ర్యం, సమానత్వం, సమాన అవకాశాలు కల్పిస్తుందని, అందుకోసం వేసిన మొదటి అడుగు ప్రజావాణి అని చక్కగా అభివర్ణించారు. భవిష్యత్తులో, దీన్ని ప్రతిరోజూ నిర్వహించి, ఒక్క రోజు ముఖ్యమంత్రితో సహా, ఒక్కో రోజు ఒకటి-రెండు శాఖల అంశాలను చేపట్టి, సంబంధిత మంత్రులు పిర్యాదులు స్వీకరిస్తే మంచిదేమో! అలాగే, సిఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఎంసిఆర్ హెచ్ఆర్డి సంస్థను సందర్శించి, ప్రజా సేవకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజాసేవలో ఉండే అధికారులకు, అనధికారులకు శిక్షణావకాశాలు కలిగిస్తే,  ‘ప్రజలతో మమేకం కావాలనే సంకల్పం, సేవా తత్పరత, ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనానికి సంబంధించి ‘విషయ పరిజ్ఞానం, పనితనం, వైఖరిలో మార్పుకు’ దోహదపడే వీలు కలుగుతుంది. గత ప్రభుత్వ జయాపజయాల ఆదర్శ పాఠాలే వర్తమాన ప్రభుత్వ కార్యాచరణకు మార్గదర్శి కావాలి. (నా ఆంగ్ల వ్యాసానికి తెలుగు అనువాదంలో తోడ్పడ్డ నా పూర్వ సహోద్యోగి గటిక విజయ్ కుమార్ కు ధన్యవాదాలతో)

No comments:

Post a Comment