ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయాల భారతజాతి
ఋగ్యజుస్సామాథర్వ
వేదాల సారం-4
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(25-12-2023)
‘భారత జాతికి ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయం, కాలానికి అందని చరిత్ర, అపార సాహిత్యం, అనంత కళలు వున్నాయి. అందువల్ల భారత
జాతి హిమదున్నతమై గర్వించాలి. భారత దేశాన్ని పాలించిన ఆంగ్లేయ ప్రభువులు (ఆంగ్లేయ
ప్రజలు కాదు) భారత సంప్రదాయ సంస్కృతులకు ఎనలేని ద్రోహం చేసినారు. ఉదాహరణకు అనంత
చరిత్రగల మన భారతజాతిని చరిత్రహీనులైన ఆంగ్లేయులు మనకు నీటిని గురించి, నీటి
వాడకము గురించి తెలియదని హాస్యాస్పదంగా అన్నారు. దానికి స్పందనగా, అవును మహాప్రభూ, తెలియదు. మీరు ఆదేశించండి మేము ఆచరిస్తామని
అన్నామే కాని, కాలం యొక్క సుదీర్ఘ హస్తాలకు వేదాలందే నీటిని గురించి వివరించబడి వున్నదని
మనం అనలేదు. జీవనానికి నీరే ఆధారం అన్న ఋగ్వేదం “ఆపత్సు సర్వేభేషజేః”
అన్నది. నీటిలోనే సర్వ వైద్యాలున్నవి అని దీనర్థం. మన ఆరోగ్యం నీటివాడకం మీద
ఆధారపడి ఉన్నదన్న పాశ్చాత్య వైద్య విధానం దీనిని కొత్తగా కనుగొన్నదా? అంటే, మన మాటలే మనకు చెప్పి మనల్ని వంచించడం కాదా! మనం
వంచకులకు స్వచ్చందంగా బానిసలం అయినామనడం నిత్యసత్యంకాదా!’
‘వేదం మానవ జీవితామృతం. వేదమే నరపశువును మానవుడిగా
మార్చినది. అతనికి బందాలు, అను బందాలు, సంబందాలు నేర్పినది. వేదంలో “దంతావ్
ధావయేత్ ప్రాతః పలాశవట పిప్పలైః” అని ఉంది. దీనర్థం: ఉదయమే దంత ధావము
చేయవలెనని. దానికొరకు మోదుగు, మర్రి,
రావిని వాడవలెనని అని దాని అర్థం. వేదమే మానవుడికి సకలం నేర్పినదని దీని భావం. ఇది
వాస్తవం. వేదాన్ని సంహితం చేసే సమయంలో స్థిరపడిన ఆచార సంబంధ మంత్రాలను తొలగించి
ఉండవచ్చు. మానవ జీవితానికి సంఘం తప్పనిసరి’.
‘మానవ సంబంధాలు అన్నిటికీ ప్రధానమైనవి. మానవ సంబంధాలలో
లైంగిక సంబంధం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ సంబంధం వల్లే సంతానం, కుటుంబం, రక్తసంబందాలు ఏర్పడుతున్నాయి. సమాజపు సౌదానికి కుటుంబం పునాది లాంటిది.
కుటుంబం ఎంత పటిష్టమైతే సమాజం అంతే బలవత్తరమవుతుంది. కుటుంబానికి మూలం స్త్రీ,
పురుషుల లైంగిక సంబంధం. ఇదే ప్రేమలకు, అభిమానాలకు, అనుబంధాలకు కారణమైతున్నది. మానవ జీవితం ఈ అనుబంధాలతోనే మధురమై వుంటుంది.’
‘నేటి మన మానవ సంబందాలు అనాదిగా జరుగుతున్ననిరంతర సాంఘిక,
అధ్యయన, ఆచరణ ఫలితాలు. ఇంతటి మహాత్తరమైన మానవ చరిత్రలో మానవ
లైంగిక సంబంధాలు నియంత్రించడంలో మేధావులు చాలా వరకు కృతకృత్యులైనారని అనాలి. ఎంతటి
రాక్షసుడైనా తల్లిని, చెల్లెను, అక్కను
ఆశించడు. ఇది రాజకీయ బలప్రయోగం అవసరంలేని స్వచ్చంద చెలియలికట్ట! మానవ పరిశ్రమ ఈ
చెలియలికట్టను, ఆర్ధిక, రాజకీయ రంగాలలో
నిర్మించలేకపోయింది! అదే సాధ్యమైతే మానవజాతి ఒక నిర్మల మానవతా సామ్రాజ్యాన్ని
నిర్మించుకోవచ్చు. ఇప్పటికి అది మృగ తృష్ణయే అనాలి!’.
‘స్త్రీ పురుష లైంగిక సంబంధాలు సంతానానికి కారణమవుతున్నాయి.
సంతానమే సమాజపు కొనసాగింపు. శారీరక, మానసిక,
ఆరోగ్య సంతానమే సమాజానికి ఆధారం. అందువల్లనే స్త్రీ, పురుష సంబంధాలను
కఠినంగా నియంత్రించాల్సి ఉన్నది. ఒకే రక్తానికి కలిగిన సంతానానికి బుద్ధికుశలత
లోపించుననే విషయం నిర్దిష్టమైనప్పుడు ఏక గర్భజాతుల లైంగిక సంబంధం నిషేధించ
బడినది’.
‘ఆత్మజ్ఞానాన్ని కేవలం భారతీయులు మాత్రమే సాధించినారు.
పాశ్చాత్యులు దీనిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, పూర్తిగా అవగాహన చేసుకోవడానికి యుగాలు పడుతుంది. ఎందుకంటే, వారికి ఈ విషయంలో
ఇంకా కనీసం అక్షరాభ్యాసం కూడా కాలేదు. ఆత్మకు దేహం వస్త్రం లాంటిది. మనిషి
పాతబట్టలను వదిలేస్తాడు. కొత్తవాటిని ధరిస్తాడు. ఆత్మకూడా అంతే. పాత శరీరాన్ని
విడిచేస్తుంది. కొత్తదానిని ధరిస్తుంది. ఇది ఉహాజనితం కాదు. జీవితాన్ని కాచి
వడబోసి కనుగొన్న నిత్య సత్యాలు! ప్రకృతికి పరిణామమే కాని నాశనం లేనే లేదు. గింజ
చెట్టుగా మారుతుంది. చెట్టు కర్రగా మారుతుంది. కర్రకు నిప్పంటుకుని బూడిద
అవుతుంది. బూడిద మట్టిగా పరిణమిస్తుంది. ప్రకృతి సాంతం ఇంతే! ఇది ప్రకృతి ధర్మం! ఈ
ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ఆత్మ పరిణామం. అది నశించదు’.
‘జీవితానికి మృత్యువు కేవలం మార్పు మాత్రమే. అంతం కాదు.
భౌతికంగా ఆలోచించినా మనిషి చనిపోయిన విధంగా అతడి ఆస్తిపాస్తులు చావడంలేదు.
మరణించినవారి మరణశాసనాన్ని అమలుపరచాల్సిన అవసరం ఉన్నది. వారి సంతానం,
వారసులు వారి అభీష్టాలను తీర్చవలసి ఉన్నది! శాసనపరంగా మరణించిన వారికే హక్కులు
ఎక్కువ!! కొడుకు తండ్రి రూపంలో పుట్టుతున్నాడు. తలితండ్రులనుంచి వారి సంతానం వట్టి
జీవితాన్నే అందుకొనదు. వారి కోపం, గుణగణాలు, బుద్ధి, ఆరోగ్యం, అనారోగ్యం
అన్నింటిని అందుకుంటున్నారు. ఇవన్నీ ఏడు తరాలలనుండి సంక్రమిస్తాయని శాస్త్రం
చెప్తున్నది. అన్నింటివలెనె ఆస్తి కూడా సంతానానికి చెందుతున్నది. తలిదండ్రులు విగత
జీవులైనప్పుడు సంతానంవారి విషయంలో కృతజ్ఞత, ప్రేమాభిమానాలు
ప్రదర్శించాల్సి ఉన్నది. అందుకు సంబంధించినవే శ్రాద్ధాది కర్మలు’.
‘మనిషి ఎంతో విచిత్రమైనవాడు. తన అంతరంగాన్ని మార్చలేడు.
బహిరంగాన్ని బ్రహ్మాండంగా మార్చగలడు!! మనిషి గ్రహాంతరాల మీద అడుగులు వేస్తున్నాడు!
సంతోషమేకాని తన ఈర్ష్యాద్వేషాలను, అభిమాన దురభిమానాలను సంస్కరించుకొనలేక
పోతున్నాడు. వదలుకోవడం అసాధ్యం. అసంభవం. సంస్కారమే జరుగలేదా అని దిగమ్రింగుతున్నాడు.
బయట పడలేక పోతున్నాడు. ఇది వదలడం కాదు. మరింత వేగంచేయడం! వేదం మనిషిని అధ్యయనం చేసింది.
మనిషి స్వభావాన్ని చదివింది. మనిషి మనసును చూసింది. మానవ స్వభావపు నిత్యసత్యాలను
చాటింది! నాటి నుంచి నేటివరకు ఏనాటికైనా మారేది మనిషి స్వభావం కాదు, వేషం మాత్రమే! పయనానికి నాడు రథం వాడితే, నేడు విమానాన్ని
ఉపయోగిస్తున్నాం. చక్ర భ్రమణం మూలసూత్రంలో మార్పు లేదు. మార్పు ఆకారంలో మాత్రమే! ఈ
సూత్రం అన్వయించుకుంటే అన్నిటికి చెల్లుతుంది.
‘వ్యసనాన్ని మనిషి ఏర్పరుచుకున్నాడు.
భగవద్దత్తం కాదు. భగవంతుడు ప్రసాదించినవన్నీ మానవుడి శ్రేయస్సునకే అవుతాయి.
మానవుడు ఒక విచిత్రప్రాణి. తనను తాను ధ్వంసం చేసుకోవడంలో నిపుణుడు! ఈ నైపుణ్యం ఇతర
ప్రాణులకు లేదు!! మనిషి ఇతరులను సహితం ధ్వంసం చేయగల దిట్ట!!! జూదాన్ని ఒక వ్యసనంగా
మనిషి ఏర్పరుచుకున్నాడు. ఎంతో నాగరికులమని చెప్పుకునే జాతులు సహితం నేటికీ ఈ వ్యసనం
నుండి బయట పడలేకున్నాయి! సత్యమేమిటంటే ఈ నాగరికత మనిషికి మత్తునిచ్చి జూదపు సంకెళ్ళలో
బంధించింది! నేటి నాగరికత ప్రధాన లక్షణమేమిటంటే ఇది బంధాలను తెలియనీయదు!! కట్లలో
కృంగేవాడు సహితం తానూ స్వతంత్రుడిని అని అనుకొనునుకుంటాడు!!!’.
‘వేదసూక్తం జూదాన్ని గురించి సుందరంగా
వివరించింది. బహుశా ఇంత కొద్దిలో వేదాన్ని గురించిన ఇంత వివరణ సాహిత్యంలో కనిపించలేదు.
ఇంత వివరించినప్పటికీ ధర్మరాజు, నలుడు జూదమాడేకదా నలిగినారు! మనిషి వేదం చెప్పింది
వినకపోతే చెడిపోతున్నాడు!! అందుకు వీరి వృత్తాంతమే సరైన నిదర్శనం. ఒక వ్యసనాన్ని
కలిగించుట, నేర్చుకునుట సులభం. మాన్పించుట, మానడం దాదాపు అసాధ్యం. వ్యసనం వ్యక్తి
అధిగమించాల్సి ఉన్నది! అందుకే వేదం వ్యసనపరులనే సంబోధించింది. “అక్షౌర్మాదీవ్యః
కృషిమిత్కృష”, అంటే, జూదమాడవద్దు,
కృషి చేయాలి, కృషి చేయాలి అని! కుటుంబాన్ని గురించి
వేదానికి ఎంత ఆవేదన! కుటుంబమే కదా లోకానికి మూలం!’.
‘ప్రకృతి విచిత్రాతి విచిత్రం,
నిగూఢాతి నిగూఢం. విశాలాతి
విశాలం. ఇంకేమని అనగలం? ఇంతే. అయితే, ప్రకృతి ఇంతేనా?
కాదు. భాష ఇంతే! భాష పరిమితం. ప్రకృతి అపరిమితం. అపరిమితమైనదాన్ని పరిమితమైనదానితో
చెప్పకూడదు. అందుకే ఆకాశం ఆకాశం లాంటిదని, సముద్రానికి
సముద్రమే ఉపమానమని అన్నారు వాల్మీకి మహర్షి. సృష్టి మొదలై ఇప్పటికి 195,58,85,170 పైగా సంవత్సరాలు.
పాశ్చాత్యులు పేర్కొంటున్న చరిత్ర అనే పదానికి కనీసం వెయ్యేళ్లు కూడా లేవు. ఈ
పరిజ్ఞానంతో అనంతమైన కాలాన్ని కొలవడానికి ప్రయత్నించడం కాళిదాసు అన్నట్లు “గమిష్యామ్యపహాస్యతామ్”
మాత్రమే. నాగరికతలు ఎన్ని వచ్చినాయో, ఎన్ని భూస్థాపితాలైనావో
రాతియుగం లాంటి కాలమానానికి అందనటువంటిది. ఇందులోని తాత్వికత ఏమిటంటే, ఏదీ ఎప్పటికీ ఎదుతూనే వుం డదు. పెరుగుట, తరుగుట ప్రకృతి నియమం. ఈ చిన్న విషయం తెలియని వాళ్లు
చెప్పే చరిత్ర అనే దానిని అనంత చరిత్రగల భారతీయులం మనసా,
వాచా, కర్మణా నమ్ముతున్నాం! ఇది పతనానినికి పరాకాష్ట కాదా!’.
‘ఈ అనంతమైన కాలక్రమంలో భూమిమీదనుండి
అగ్ని అదృశ్యమైన కాలం ఉండవచ్చును. అగ్ని ఆకాశాన, భూమిమీద, జలాలో వున్నాడు. భూమిమీది అగ్ని అదృశ్యమైనప్పుడు జలాలోని అగ్నిని
ఆవిష్కరించడానికి జరిగిన బృహత్ ప్రయత్నపు సంకేతమే వేదం. అది అలా సూక్త సంకేతంగా కనిపిస్తున్నది.
అదృశ్యమైన అగ్నిని పునః ప్రతిష్టించడం సామాన్య విషయం కాదు. ఇది వేదకాలంలోనే జరిగి
వుండాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఎన్నడో జరిగినదానిని వేదం ఉల్లేఖించి
ఉండవచ్చును. రెండు వేల ఏండ్ల క్రితంనాటి బైబిలులో సృష్టి ఆదిని గురించి చెప్పబడింది!
‘ప్రాణి దేనివలన జీవిస్తున్నది? ఏది పోవడంతోనే
జీవితం చాలిస్తున్నది? ఆ ఉన్నదేది? ఈ
పోయిందేది? ఇది ప్రశ్నే! దీనికి జవాబు లభించడం లేదు, దొరకడం లేదు! దొరకదు, లభించదు కూడా!! ఎందుకంటే ఇది సత్యం.
ఇది ఋతం. దీనిని ఎవరూ చూడలేరు! ప్రాప్రాణం, ఆత్మ, ఉన్నంత కాలం జీవితం వుంటుంది. ఇవి లేనప్పుడు కళేబరమే మిగులుతుంది. ప్రాణం, ఆత్మ, నామ వాచకాలు మాత్రమే! వాటి స్వరూప స్వభావాలు
తెలియవు! వేద సూక్తంలో మనసు ప్రాణమైంది. మనసే ప్రాణమని అప్పటి అవగాహన. మనసుకు, ప్రాణానికి రూపం లేదు. కాబట్టి పర్యాయమైన తప్పు కాదు. మనసే మనిషిని కదిలిస్తున్నది.
మనసులేకుంటే ఏ అవయవం కూడా తన విధి నిర్వర్తించలేదు. మనసులేనప్పుడు కళ్లుచూసినా కంచలేడు.
ఈ న్యాయం అవయవాలన్నిటికీ వర్తిస్తుంది. అందువల్లనే మనసున్న ప్రాణం అని అన్నారు
పెద్దలు. ఈ మనసు మనిషిని వదిలి ఎక్కడికి వెళ్తుంది? అదే
ప్రశ్న వేదం, సూక్తంలో ఉన్నది. అన్వేషణ ఎంతో అందంగా చెప్పడం జరిగింది. ఇదొక అంతంలేని
అన్వేషణ!’.
‘అన్వేషణే జీవితం. చివరకు మనం ఆలోచించినవి, అనుకున్నవి
లభించడం అరుదు. అలాంటప్పుడు సృష్టి మూలాన్ని గురించి చేసే ఆలోచనకు అంతమెక్కడిది?
విశ్వాన్ని నిర్మించినవాడు, నిర్మించేవాడు విశ్వకర్మ. కర్మను బట్టే నామం. ఆ
పదార్థమెలాంటిది? ఆ అన్వేషణలోనే పేర్లు. ఇవి మనం పెట్టినవే. అసలు ఆ పదార్థమెలాంటిది? ఇది ప్రశ్నే! వేదం, సూక్తములలో సృష్టిని గురించి తెలిసికొనే జిజ్ఞాస
ఉన్నది. ఒక మహత్తరమైన ప్రశ్న ఉన్నది. లోకాలను సృష్టించిన వాడు దేనిమీద నిలిచినాడు? విద్వాంసులైనవారు ఈ విషయాన్ని అడగాల్సింది మనసునే. విశ్వాన్ని సృష్టించిన
వాడు సృష్టికి పూర్వం ఎక్కడ నుండి సృష్టించాడన్నది మేధావులు ప్రశ్నించుకోవాలి! ఇది
ఇంతవరకు ప్రశ్నగానే మిగిలి పోయింది! అసలు ఈ భూమి దేనిమీద నిలిచి ఉన్నది? ఇది కూడా ఈనాటివరకూ మనిషి మేధస్సుకందని, అంతుచిక్కని
కోట్ల కోట్లాది రూకల ప్రశ్న. జవాబిచ్చే సామర్థ్యం ఎవరికైనా వున్నదా?’.
(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)
No comments:
Post a Comment