మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం
ఋగ్యజుస్సామాథర్వ
వేదాల సారం-3
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(18-12-2023)
‘ఆలోచనకు అవధులు లేవు. ఆకాశాన్ని,
సముద్రాన్ని వర్ణించడానికి ఉపమానాలు లేవు. అందువల్ల ఆకాశం ఆకాశంలాగా, సముద్రం సముద్రంలాగా వున్నాయని అన్నారు. అలాగే ఆలోచననకు ఆద్యంతాలు,
ఎల్లలు, పరిథులు, అస్తి-నాస్తి లేవు. ఆలోచన ఉన్నదానిని గురించి మాత్రమే కాకుండా
లేనిదానిని గురించి కూడా రావచ్చు. భూతం, అభూతం ఆలోచన సంతానాలే!
ఆలోచనే మానవుడిని నాగరికుడిని, సభ్యతకలవాడిని, విజ్ఞానవంతుడిని, ఉన్నతుడిని
చేసింది. “అహం బ్రహ్మాస్మి” అంటే, నేనే బ్రహ్మను అనుకునేట్లు చేసింది. ఆలోచనే మానవుడిని దానవుడిని, క్రూరుడిని, నరహంతకుడిని,
మానవనాశకుడిని చేసింది. కాబట్టి సదాలోచన మాత్రమే మానవుడిని దైవాంశకు చేర్చగలదు’.
‘నిర్వచనం లేనిదే సదాలోచన? చాలావాటికి
నిర్వచనాలు లేవు. ఎందుకంటే, జీవితం ప్రవాహం లాంటిది కాని స్థిరమైంది కాదు కాబట్టే.
నిలకడలేనిదానికి నిర్వచనం అసాధ్యం. “ఏకం సద్విప్రాబహుధావదన్తి”
అనేది వేదవాక్కు. ఒకే సత్యాన్ని మేధావులు బహువిధాలుగా చెప్పుతారు అని దీనర్థం. అసత్యం
ఏది? మానవజాతి పుట్టినప్పతి నుండీ సత్యాన్వేషణే
జరుగుతున్నది. సత్యం ఏదో తెలిసినప్పుడే కదా బహుధా చెప్పేనది?
నిర్దిష్టత ప్రకృతికి లేదు. కాబట్టి ప్రాకృతములైన ఏ పదార్థానికీ లేదు. భగవానుడికి
తన సృష్టిలో పరిపూర్ణత దేనికిని లేవు. సర్వం సాపేక్షమే!’.
‘లోచనానికి అందనిది ఆలోచన.
మానవుడి సర్వావయాలను శాసించేది మనసు. మనసు ఆదేశించనిది ఏ అవయవం పనిచేయదు. కన్ను చూసినట్లున్నా,
మనసు లేకపోతే చూడలేం. మనిషి అక్కడే వుంటాడు. మనసులేకున్న గ్రహించలేడు. అలాగని ప్రాణం
లేదనలేం. చలనం ఉన్నది. ప్రాణం జీవించడానికి మాత్రమే పనికివస్తుంది. జీవితానికి
మనసు అవశ్యం. యాత్ర ప్రాణులకు లేనిది, మనిషికి ఉన్నది, విశిష్టమైనది మనసు మాత్రమే! మనువు సంతతి అయినందువల్ల కాకుండా, మనసు
ఉన్నందు వల్ల మానవుడు అయినాడు. అయినా మనసు చెప్పినదంతా సత్యం కాదు. మానవుడు ఇంకా
సత్యాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది’.
‘ప్రకృతికి జలం, జలానికి
వర్షం ఆధారం. ఇది వేదం వెల్లడించిన పరమ సత్యం. పరమ సత్యమే శాశ్వత సత్యం అవుతుంది.
“ఏకం సద్విప్రా బహుధా వదంతి” అన్నట్లు వర్షం రావడానికి, వచ్చేట్లు చేయడానికి కారణాల విషయంలో అనేక వాదనలు, మతాలు వున్నాయి. అందువల్ల
వర్షాన్ని గురించి వేదంలోని వాదనలను, మతాలను, రీతులను ఆధునిక విజ్ఞానవేత్తలు నిశితంగా
పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, ఆధునికమనబడే రాక్షస ఉత్పత్తి విధానం భూగోళాన్ని
జలరహితం చేయడానికి ఉరుకులు పెట్తున్నది! మానవ ప్రగతిలో ఆహారపు అలవాట్లు ప్రదాన
భూమిక నిర్వహిస్తాయి. మాంసాహారం పాశవికమని, శాకాహారం
సాత్వికమని, మానవీయమని శాస్త్రాలు నిశ్చయించినప్పటికీ,
వేదకాలంలో మాసం నిషేధం కాదు. మాంస భక్షణ ఒకనాటి ఆచారమనే సత్యాన్ని కాదనలేం’.
‘అగస్త్యుడు రతిని దేవతను చేసి మానవ జీవితానికి
రతి ఆవశ్యకతను గురించి చెప్పినాడు. రతికి చాటు అవసరమైనా రతి రహస్యంకాదు. రతి
భార్యా భర్తల మధ్యనే జరగాలనేది ఒక విధి. ఆరోగ్యవంతమైన సమాజానికి రతి విషయంలో కట్టుబాట్లు
తప్పనిసరి. ఎవరైనా జీవించినంతకాలం మంచిగా జీవించాలి. మానవుడి సృష్టి ఆదిగా
ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం, ఆలోచన. బాహ్యాలోచనకు అందనిది ఆలోచన. ఆలోచన భగవత్
సృష్టివలె ఆద్యంతరహితం, అనంతం, సర్వవ్యాపకం. ఆలోచనకు అందనిది సత్యం,
భగవత్ స్వరూపం. దీనిని తెలుసుకోవడానికే మానవుడు నిరంతరం అన్వేషిస్తున్నాడు.
సత్యస్వరూపం, భగవత్ స్వరూపం తెలిసినప్పుడే పండితులు దానిని
అనేక రీతులు చెప్పగలరు. ఈ అన్వేషణలో మానవుడికి అర్థమైంది చాలా తక్కువ. సత్యస్వరూపం
తెలుసుకోవడం, తెలియపరచడం, వేదం పరమావధి. ఈ ప్రయత్నంలోనే
ఇంద్రాగ్నులు, మరుత్తులు, అశ్వినులు,
ఆదిత్యులు, సకల దేవతలు దర్శనం ఇస్తున్నారు’.
‘స్త్రీకి ఏకాలంలోనూ పురుషుడితో అన్ని విషయాలలో
సమాన ప్రతిపత్తి కలిగించలేదు. కొందరు మహిళలు తమ ప్రతిభాపాటవములతో పురుషులను మించిన
ఉదాహరణలు వున్నాయి. అవి వ్యక్తిగతమైనవి. సమాజంలో స్త్రీకి గౌరవం, ఆదరణ
ఉన్న కాలాలు, లేని కాలాలు వున్నాయి. కాలం పాదరసం లాంటిది. ఒకచోట నిలువదు. అది
పరిణామ శీలం. అలాగే స్త్రీల విషయంలో హెచ్చుతగ్గులు కావడం సాధారణం. వేద కాలం మొత్తంలో
స్త్రీకి ఏ స్థాయి ఉన్నది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యపడదు. కాని స్త్రీకి పురుషుడి
నుండి ఆదరాభిమానాలు లభించినవని మాత్రం చెప్పవచ్చును. స్త్రీకి నీచ దశ లేకుండెను’.
‘ధనం, కీర్తికన్న అన్నానికి, ఆహారానికి
ప్రాధాన్యత ఇస్తున్నాడు మానవుడు. ఆహారం లేని ప్రాణం నిలువదు. ప్రాణమున్నకదా ధనం, యశం! అందుకే “అన్నం బ్రహ్మేతి వ్యజనాత్” అని వేదం ఘోశించింది.
అన్నమే బ్రహ్మమని తెలిసికొమ్మని వేదం చెప్పింది. అన్నం, ఆహార
పదార్థాలు, ధనాన్ని సృష్టిస్తాయి. కేవలం ధనమే దేనిని
సృష్టించలేదు. కనీసం తనను సృష్టించుకేలేదు. డబ్బు మాత్రం ధనం ఎన్నటికి కాజాలదు.
అన్నపానాదులు, యశస్సు ధన ఉత్పత్తికి కారణాలవుతాయి. కావున
ప్రాణికి అన్నమే ప్రదానమవుతుంది’.
‘అవ్యయములైన ధనాలను పర్వతాలు పోషించాలని
అని వేదం చెప్తున్నది. సమస్త జలాలు ఆ ధనాన్ని పోషించాలి. దాన పరాయణులైన దేవపత్నులు
దానిని పోషించాలి. ఓషధులు ద్యులోకం సహితం పాలన పోషణ చేయాలి. వనస్పతులు సహితమై అంతరిక్షాన్ని
సహితం పాలించాలి. అవ్యయ ధనాలు ప్రకృతి సంపదలు. వాటికి స్వయంగా పునరుత్పత్తి
ఉన్నందున అవ్యయములైనాయి. ఆధునిక రాక్షస నాగరికతలో పునరుత్పత్తిగల ప్రకృతి సంపదల
ఉత్పత్తిని నాశనము చేయు ప్రయత్నం నిరంతరం జరుగుతున్నది. భరించ కలిగినంత ధనంమాత్రమే
వుండాలి. అది ప్రకృతి శక్తుల అనుమతి గలది కావాలి. ఈ యంత్ర నాగరికతకు పట్టిన రోగం
ప్రకృతి అనుమతిలేని భరించలేని ధనం! ఆశ్చర్యమేమిటి అంటే ఆనాటి ఋషులు నేటి మానవుడిని
ఇలా హెచ్చరించినారు’.
‘శాంతి అనేది మానవాళికి ఈ నాటికి
అందలేదు. ముందు అందగలదని నమ్మకం లేదు. ఎందుకంటే మనిషి, మనసు, ప్రకృతి అలజడిగలవి. వాటికి నిలకడలేదు. అందుకే శాంతికి నిలకడలేదు. శాంతి
అందదు. అందుకని అందమైనది కాదు. అందని ప్రతిది అందం కాదు. శాంతికొరకని సాగిన యుద్దాలెన్ని?
శాంతి కొరకని చెలరేగిన అశాంతి ఎంత? ఒకనికి
అశాంతి, మరొకరికి శాంతి. మానవ జీవితం మరీచిక. దానికి అన్నీ
కనిపిస్తాయి. వాటివెంట పరుగే జీవితం. మనిషికి నిశ్చయంగా అందేది మృత్యువు మాత్రమే. జీవితం
అనిశ్చితం. మృత్యువు నిశ్చితం. మానవుడి జీవితం వాస్తవం, సత్యం, ఋతం మీద ఆధారపడినది కాదు. అది ఆదర్శం, లక్ష్యం, గమ్యం మీద ఆధారపడినది. మానవుడు ఏనాటికయినా ఆదర్శాన్ని అందుకొనగలడా?
అదొక ప్రశ్న. మానవ జీవితం ప్రశ్నల తోరణం. అన్నింటికి సమాధానం
ఉండదు’.
‘పాపం మానవ దోషం కాదని వేదం చెప్తున్నది.
అది అతని అధీనంలో లేదు. ఉదాహరణగా స్వప్నం తీసుకోవాలి. స్వప్నం మానవుడి అధీనంలో
లేదు కదా! అది పాపమెందుకు కావాలి? సుర, భ్రమ, క్రోధం, జాదం, అజ్ఞానం, పాపానికి కారణాలు. ఇది నిత్య సత్యం. నిశ్చితం. ఈ దుర్గుణం, దైవకృతాలా? మనిషికి స్వాధీనంలో లేనిదానిని దైవ కృతం
అంటాం. కామక్రోధాది అరిషడ్వర్గాలను మానవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలని అంటారు. అది ఆదర్శం.
అసాధ్యంకాడు. కాని దుస్సాధ్యం. అందరికీ సాధ్యమయ్యేదికాదు. కాబట్టి తాము చేసిన
పనికి దైవాన్ని బాధ్యుడిని చేయడం సమంజసమా? కాకపోవచ్చును.
కాని ఒక్కొక్కసారి తన పరిధిని దాటిపోయినపుడు దైవ కృతాలు కావచ్చును’.
‘ఈ నేలమీద మానవుడు పుట్టి లక్షల సంవత్సరాలు
దాటాయి. అయినా మనిషి స్వభావం, మనిషి గుణం, ఏ మాత్రం మారినట్లు కనిపించదు.
మానవునిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు, సుఖ దుఃఖాలు,
రాగ ద్వేషాలు మొదలైన లక్షనాలు మనిషిని అన్నికాలాలలో పట్టుకుని వున్నాయి.
రాగాద్వేషాదులు మృత్యువుకన్న బలవత్తమైనవి. అవి మహాత్ములను తప్ప మానవులను విడవవు.
అవి ప్రాణముతో వచ్చును కాని, ప్రాణంతో పోవు. మనకు పూర్వ, పర జన్మలమీద విశ్వాసం ఉన్నది. విశ్వాసం మాత్రమేకాదు. అది సత్యం. వాస్తవం.
తధ్యం. ఎందుకనగా ప్రకృతిలో పదార్ధాలన్నిటికి పరిణామం, మార్పు మాత్రమున్నది. నాశనం
లేదు. ప్రకృతి వలయం లాంటిది. పదార్ధాలన్నీ ఒక బిందువు వద్ద ఆరోహణ క్రమంలో
పెరుగును. మరొక బిందువు వద్ద అవరోహణ క్రమంలో దిగును. దీనికి అంతం మనకు తెలియదు.
నిరంతర పరిణామమే ప్రకృతి ధర్మం’.
‘జీవితం అన్వేషణ మాత్రమే! వ్యక్తి జీవితం, వ్యష్టి
జీవితం, సమిష్టి జీ జీవితం, సమాజ
జీవితం, రాష్ట్ర జీవితం, లోక జీవితం సమస్తం
అన్వేషణమే! అన్వేషణమే జీవితం. అందు లభించేది కొంత, అందనిది
మరింత, మరింత, మరింత. ఎంతో తెలియదు.
అందువల్ల మరింత. పార్థివ ప్రయాణానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం
ఉండవచ్చును. పార్థివ ప్రయాణమంటే నేల మీది నడక కావచ్చును. గమ్యం పార్థివమైనప్పుడు
చేరుకొనె అవకాశమున్నది. తప్పక చేరగలమని మాత్రం చెప్పలేము. జీవితం పార్థివం,
పదార్ధం, అర్థం. ఆర్థికం మాత్రం కాదు. ఆర్ధిక లక్ష్యాలను సహితం సాధించిన నిదర్శనాలు
మానవజాతి చరిత్రలో అరుదాతి అరుదు. లేవని చెప్పినా అతిశయోక్తి మాత్రం కాదు. మానవుడు, సకల ప్రాణిజాలం పంచభూతాత్మకమైన ప్రకృతి, వట్టి ప్రాణంతోనూ, పిడికెడు అన్నంతో మాత్రం జీవించడం లేదనడానికి ఉదాహరణలు, ఉపమానాలు చెప్పపనిలేదు’.
‘మనసుకు అవయవ నిర్మాణంలో చోటులేదు. అది కనిపించనిది.
కనిపించక పోవడం వాస్తవం కావచ్చును. కాని మనసే జీవితాన్ని నడిపిస్తున్నది అనడం
అనుభవైక సత్యం! మనసు నడపకపోతే వాల్మీకి ముందు నిషాదుడి బాణపు దెబ్బకు కూలిన మగ
క్రౌంచాన్ని చూసి ఆడక్రౌంచం ఏడ్వవలసిన పనిలేదు. దీరోదాత్తుడగు రాముడు సీతనుబాసి
చెట్టుకు, పుట్టకు చెప్పుకొని ఏడ్వవలసిన పనిలేదు. ఏడ్చినంత మాత్రాన సీత రాదనే విషయం ధర్మానికి
విగ్రహరూపుడైన రాముడికి తెలియదని అనుకోవడం తప్పు. ఏడ్చినది రాముడు కాడు!
ఏడ్పించినది మనసు!! మనసు రాముడి కన్న మిన్నా? కావచ్చును! కాకున్నా అదెట్లు
ఏడిపిస్తుంది?’
‘పార్థివమునకన్నా, అర్థానికన్నా,
వినిపించి, కనిపించే ప్రకృతి కన్నా, కనిపించని
మనసే మనను నడిపిస్తున్నదనడం కొంతవరకు మాత్రమే వాస్తవం. సత్యం మాత్రం కాదు. అట్లయితే
ఈ మనిషిని, సమస్త సృష్టిని నడిపిస్తున్నది ఏది? ఎవడు? తెలియని నిరంత అన్వేషణము మాత్రమే! ఈ
అన్వేషణలోని భాగం, లేక, ఈ అన్వేషణకు
ఆది, లేక ఈ అన్వేషణకు మార్గదర్శి మహత్తరమైన వేదమే. ఈ జీవితం సాగడానికి
కేవలం మానవ ప్రయత్నం మాత్రమే చాలదనే మూల సత్యాన్ని వేదం ఎలుగెత్తి చాటింది. అయితే
మానవ ప్రయత్నానికి అతీతమైన శక్తి ఏది మనిషిని నడిపిస్తున్నది? ఇది ఒక మహాప్రశ్న! దీనికి సత్యమైన సమాధానం మానవుడికి లభించడం అసాధ్యం, అసంభవం. అలాగని అన్వేషణ ఆగదు. అది ఎందుకు? ఎందుకంటే
జీవితమే అన్వేషణ! అన్వేషణ ఆగితే జీవితం నిలుస్తుంది, జీవితం
నిలువదు. అన్వేషణ ఆగదు. అన్వేషణకు అంతం లేదు!!’.
‘వేదం
సకల ప్రాణులను సమానంగా పరిగణించింది. మానవులు, పశువులు,
పక్షులు, వృక్షాలు, పర్వతాలు సమానమని
దర్శించినది. వీటిలోలో కొన్నిటిని దేవతలలో చేర్చినది. దేవతలలో చేర్చుడం అంటే, అవి
మానవజాతి జీవనానికి అత్యవసరమని గుర్తించడమే. అంతేకాదు, వాటికి
హాని కలిగించరాదని పూజించాలని నిర్ణయించడమే. మానవుడు పంచభూతాలను, తన పిశాచ దాహానికి, విషపూరితం చేస్తున్న అత్యంత ఆధునికమని భావిస్తున్న ఈ రాక్షస యుగానికి, వేదం
ఇచ్చిన సందేశం అమృతప్రాయం. కాని ఆశ రక్కసి. అది అమృతాన్ని హరిస్తుంది. మనిషిని యంత్రంగా
మార్చినది, మనిషికి విషమిచ్చి ఆత్మహత్యకు పురికొల్పేది
పురోగతి అనిపించుకోదు!! కృతజ్ఞత, దయ,
కరుణ, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం
మానవత లక్షణాలు. ఇవి మచ్చుకైనా కనిపించని యంత్ర నాగరికతను పురోగతి అనడం రాక్షస లక్షణం!’.
(డాక్టర్
దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)
No comments:
Post a Comment