Sunday, February 26, 2023

విధి చేష్టలు బలీయాలని, ధైర్యమే పరమౌషధం అని, కాలమే కర్తని ప్రవచించిన భీష్ముడు ..... ఆస్వాదన-109 : వనం జ్వాలా నరసింహారావు

 విధి చేష్టలు బలీయాలని, ధైర్యమే పరమౌషధం అని,

కాలమే కర్తని ప్రవచించిన భీష్ముడు

ఆస్వాదన-109

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-02-2023)

ఇంద్ర-ప్రహ్లాద సంభాషణ సారాంశాన్ని భీష్ముడి ద్వారా ఆలకించిన ధర్మరాజు తన తరువాత ప్రశ్నగా ‘రాజు సిరిని ఏ కారణాన కోల్పోతాడు అని అడిగాడు. పూర్వం దేవేంద్రుడికి, బలిచక్రవర్తికి సంవాదం జరిగిందని, ఆ వృత్తాంతంలో ధర్మరాజు ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని, ఆ వివరాలను చెప్పాడు భీష్ముడు.

‘లోకంలో క్రమంగా ప్రాణికోటికి మేలు-కీళ్లు, చావు-బతుకులు, సుఖానుభావాలు, దుఃఖపీడనలు వచ్చి పడుతూ వుంటాయి. అయితే ఎప్పుడు మేలు జరిగినా, ఎప్పుడు కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, దుఃఖం ముంచుకొచ్చినా, మనిషి సమభావంతో నిలిచి వుండాలి. అప్పుడే ఆ మేలు-కీడుల ప్రభావం అలాంటి వారిమీద ప్రసరించదు. లోకంలో వున్న నరులలో శరీర బలం, బుద్ధి, వివేకం, పనులలో ఎంతో సామర్థ్యం కలవారున్నారు. ఇవేవీ లేనివారు కూడా పుష్కలంగానే వున్నారు. కాని కాలుడు మాత్రం కాలం సమీపించినప్పుడు ఆ ఇరుతెగలవారినీ స్వేచ్చగా, తిరుగులేకుండా హరించివేస్తూనే వున్నాడు. కాలుడి దగ్గర బలవివేక సామర్థ్యాలేవీ కొరగావడం లేదు. త్రిగుణాలు శాంతించి ఉన్నవారిలో అలుక కలగదు. విధి కోరికను బట్టి ప్రాణుల జీవితాలలో వికాసం కానీ, వినాశం కానీ జరుగుతుంటుంది. విధి చేష్టలు బలీయాలు. ఇతరుల దైన్యాన్ని చూసి ఎకసెక్కాలాడడం నీచ స్వభావం. సత్యం, ధర్మం, దమం, దానం అనే గుణాలు లక్ష్మీ నిలయాలు. అవి ఎక్కడ వుంటే అక్కడే లక్ష్మి వుంటుంది. ఈ గుణాలకు అదనంగా వేదశాస్త్ర విహితాలైన ధర్మాలను ఆచరించే సల్లక్షణం ఉన్నవారి దగ్గర కూడా లక్ష్మి నిలుస్తుంది’.

 ఈ విధంగా దేవేంద్రుడికి, బలిచక్రవర్తికి జరిగిన సంవాద సారాంశాన్ని వినిపించిన భీష్ముడు ‘దేవేంద్ర -నముచి సంవాదం లోని అంశాలను కూడా ప్రస్తావించాడు. సృష్టిలో ఎల్ల ప్రాణులకు ఏలిక ఒకడున్నాడని, అతడి ఏర్పాటు ప్రకారం ఏ ప్రాణికి ఏది ఎప్పుడు లభించాలో, ఆ ప్రాణికి, అది అప్పుడు సులభంగా వచ్చి చేరుతుందని, ఫలానాది జరగాల్సి వుండే జరిగిందన్న గట్టి నిశ్చయంగల యోగ్యుడికి ఆనందం, దుఃఖం, సంపత్తి, విపత్తి లాంటి ద్వంద్వాలు వుండవని, ఏదైనా కార్యం అలభ్యమని దైవం నిర్ణయించి వుంటే దానిని నరుడు ఎలాంటి పరిస్థితుల్లోను పొందనేలేడని, జీవితంలో మేలు, కీడు అనేవి కాలవశాన తప్పకుండా నరుడిని చేరేవే తప్ప కోరితే వచ్చేవి కావని, వద్దంటే పోయేవి కావని, కాబట్టి అలాంటి మేలు, కీడుల విషయంలో చింతించడం పనికి రాదని భీష్ముడు, నముచి అనే రాక్షస రాజు దేవేంద్రుడికి చెప్పిన మాటలుగా ధర్మరాజుకు తెలియచేశాడు.

ఏదైనా చెడ్డ అవస్థ నరుడికి కలిగినప్పుడు అతడు ఏవిధంగా ప్రవర్తించి ఆ దుర్దశను దాటగలగాలని ప్రశ్నించాడు ధర్మరాజు భీష్ముడిని. దురవస్థలు ఏ విధమైనవైనా వాటన్నిటికీ ధైర్యమే ఔషధం అని, ధైర్యంతో గట్టి నిర్ణయం తీసుకొన్న మనస్సు ఎలాంటి నిండు శోకాలలోనైనా, దుఃఖాలలోనైనా చలించకుండా నిలుస్తుందని, కష్టనష్టాలను అతిక్రమిస్తుందని, ధైర్యం ఆరోగ్యాన్ని ఇస్తుందని, ధీరగుణం ప్రకాశించే సిరులు కురిపిస్తుందని, ధీరస్వభావం యశస్సును ఉన్నతంగా పెంచుతుందని అంటూ భీష్ముడు ధైర్యం కలగాలంటే నరుడికి కాలపు నడకను గూర్చిన జ్ఞానం వుండాలని చెప్పాడు. ఇదే విషయానికి చెందిన ఇంద్ర-బలి సంవాదం అనే వృత్తాంతం సారాంశాన్ని, బలి దేవేంద్రుడికి చెప్పిన హితవచనాలను కూడా వివరించాడు భీష్ముడు.

‘విధి చేష్టలవల్ల ఏపాటివారికైనా అప్పుడప్పుడు హైన్యదైన్యాలు తప్పవు. విధి చేష్టలకు తిరుగు లేదనే జ్ఞానంతో నరుడు ధైర్యం కలిగి వుండాలి. జీవితాన సుఖదుఃఖాలు క్రమంగా ఒకదాని తరువాత మరొకటిగా నరులకు కలుగుతుంటాయి. ఆ క్రమం తప్పించరానిది. కాబట్టి నరుడు ధైర్యంతో మెలగుతూ, సుఖం కలిగినప్పుడు గర్వాన్నీ, దుఃఖం కలిగినప్పుడు విషాదాన్నీ, ప్రకటించకుండా అణచుకోవాలి. నరుడి మహర్దశకు కాని, దుర్దశకు కాని, దైవమొకటే కారణం కాని ఇతరులెవరూ కాజాలరు. స్నేహితులు, చుట్టపక్కాలు, సహాయకులు, సంపదలు, సమృద్ధులు, ఎన్ని వున్నా నరుడికి చెడుకాలం దాపురించినప్పుడు. దుర్దశ ఆవహించబోతున్నప్పుడు తొలగించజాలవు. ఇది గ్రహించి నరుడు జీవించాలి. జీవితం ఎప్పుడూ ఏకరీతిలో కొనసాగదని గ్రహించి జీవించాలి’.

‘నరుడికి వాటిల్లే శుభాశుభాలు రెండింటికీ కాలం ఒక్కటే కర్త తప్ప నరుడు కాబోడు. కాల ప్రవర్తన ఊహకు అందనిది. కాలం దేనినీ సరకుగొనదు. అన్నీ కాలానికి లొంగిపోవాల్సిందే కాని అది దేనికీ లొంగదు. కాలం వల్లే నరులకు అన్ని తీరులు, ఎల్ల అవస్థలు, సకల దశలు కలుగుతాయి. కాలం ప్రమాదం ఎరగకుండా జాగరూకతతో ప్రవర్తిస్తూ వుంటుంది. దాని గమనంలో పరాకుకు స్థానం లేదు. కాలం తననుతాను రూపంలో సమకూర్చుకుంటూ, పెరిగి-పెరిగి చివరకు జగత్తునే కబలిస్తుంది. విశ్వంభరగా లోకమంతా తానే అయి కాలం సర్వస్వాన్నీ స్వాధీనం చేసుకొంటుంది. నరులంతా చివరకు కాలాధీనులై పోతారు. కాలం ఒక నది. నిరంతర ప్రవాహశీలి. తన గమనంతో నరుడిని లోగొని అణచివేస్తుంది. నరుడు ఈ వాస్తవం గ్రహించలేడు. నరుడు కాలమహిమను గ్రహించలేక, జరిగే హటాత్సంఘటనలను చూసి ఆశ్చర్యపోతాడు. నరుడు అంతర్ముఖుడై జిజ్ఞాసతో, నిరంతర తపనతో కాలతత్త్వాన్ని అన్వేషించాలి. అపుడు నరుడు విద్వాంసుడు అవుతాడు. కాల ప్రవృత్తి స్పష్టంగా గోచరిస్తుంది’.

ఈ విధంగా భీష్ముడు, దేవేంద్రుడికి బలిచక్రవర్తి చెప్పిన విధంగా కాల మహిమను, ధర్మరాజుకు వివరించాడు. జీవుడు దేనివల్ల వృద్ధి పొందుతాడని, దేనివల్ల నశిస్తాడని ప్రశ్నించాడు భీష్ముడిని ధర్మరాజు. ఈ విషయాన్ని వివరించడానికి ‘శ్రీ శక్ర సంవాదం వున్నదని, దాని సారాంశాన్ని చెప్పాడు భీష్ముడు.

‘గురువుల పట్ల భక్తి చూపేవారి దగ్గర; దేవతలను, పితృదేవతలను పూజించేవారి దగ్గర; సత్యం పలికేవారి దగ్గర; దానం చేసేవారి దగ్గర; ఇతరులకు చెందిన ధనం, స్త్రీలపట్ల విముఖత చూపేవారి దగ్గర; విప్రుల మీద ప్రీతి కలిగినవారి దగ్గర; పగటిపూట నిద్రించని వారి దగ్గర; వృద్ధుల, బలహీనుల, దీనుల, స్త్రీల మీద దయచూపేవారి దగ్గర; బాహ్యంగాను, అంతరంగికంగాను శౌచం పాటించేవారి దగ్గర; అతిథుల్లాగా వచ్చినవారు భుజించగా మిగిలిన దానిని మాత్రమే భుజించేవారి దగ్గర తానుంటానని, అలాంటివారిని మెచ్చుకుంటానని లక్ష్మీదేవి అంటుంది. ధర్మహీనులై, కామక్రోధాలు ఎక్కువగా కలిగి, గర్వంతో కూడినవారై, పూజార్హమైన కానుకగాని, బిక్షగాని పెట్టకుండా కఠినమైన మాటలు మాట్లాడుతూ, క్రూరమైన ప్రవర్తన కలిగేవారిని లక్ష్మీదేవి మెచ్చదు’. అలా లక్ష్మి చెప్పినట్లు చేస్తే ఆమె స్థిరంగా నిలిచి పోతుందని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు.

తన తరువాత ప్రశ్నగా ధర్మరాజు, ‘ప్రజలకు ఏ రకమైన ఆచారం వల్ల, ఏ విధమైన శీలం వల్ల, ఏ చదువు వల్ల ముక్తి దొరుకుతుంది అని భీష్ముడిని అడిగాడు. సమాధానంగా ‘దేవల-జైగీషవ్య సంవాదం’ అనే పూర్వ గాథను వినిపించాడాయన.

దాని సారాంశం: ‘పరులు పొగడినా, తెగడినా ప్రీతికాని, అప్రీతికాని లేకుండా వుండడం, అలాగే పరులు కొట్టినా-తిట్టినా కోపం లేకుండా వుండడం జ్ఞానులైనవారి గుణాలు. సంతోషం, అభిమానం, అసహనం, అపరాధం, మదించడం, తన గొప్పతనాన్ని గురించి కాని, తక్కువతనాన్ని గురించి కాని చింతిస్తూ వుండడం అనేవి నిరసించబడిన గుణాలు. అంతరిందరియ నిగ్రహం కలవాడు తనకు అవమానం జరిగితే అమృతం తాగినట్లుగా తృప్తి పొందుతాడు. సమ్మానం జరిగితే విషం తాగిన భావన కలుగుతుంది. సమ్మానం కావాలని కోరడు. అవమానం జరిగితే కలత చెందడు. ఆత్మతత్త్వం తెలిసినవాడికి ఏ విధమైన జనులను చూసినా భేదభావం కలగదు. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను జయించినవాడు హృదయంలో శాంతి పొందుతాడు. శాంతివల్ల వాడికి శాశ్వత సుఖం కలుగుతుంది. అప్పుడు అతడిలో ఏ విధమైన వికారాలు కలగవు’.

‘సమస్త జనులకు, సకల ప్రాణులకు ప్రియమైనవాడు ఎవరు అని పితామహుడిని ప్రశ్నించాడు ధర్మరాజు. పూర్వం ఉగ్రసేనుడికి, శ్రీకృష్ణుడికి, నారదుడి విషయంలో ఒక సంవాదం జరిగిందని, ఆ సంవాదంలో ధర్మరాజు ప్రశ్నకు జవాబున్నదని, దానిని వివరించాడు. శాస్త్రజ్ఞానం, సదాచారం కలిగి వుండడం; ఇసుమంతైనా అహంకారం లేకపోవడం; చక్కటి శీలం; వికారం లేని వేషం; మాత్సర్యం, గర్వం, మదం అనే దుర్గుణాలు లేకపోవడం; ప్రసిద్ధి పొందిన పుట్టుక, తపస్సు, తేజస్సు, బుద్ధి, వినయం, నీతి; ధీరత్వం, మధురమైన మాటలు కలిగి వుండడం; శఠత్వం, దీనత్వం, కోపం, లోభం అనే దుర్గుణాలను ఈసడించుకోవడం; ఈర్ష్య, గర్వం, అసూయ, తిరస్కారభావం తెలియకపోవడం లాంటివి కలిగిన నారదుడి కున్న గుణగణాలు అందరికీ ప్రియమైనవని, సమస్త ప్రాణులకు ఇష్టమైనవని భీష్ముడు అన్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థ-పంచమాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Saturday, February 25, 2023

HOW FAIR AND UNBIASED ARE THE CONSTITUTIONAL BODIES? : Vanam Jwala Narasimha Rao

 HOW FAIR AND UNBIASED ARE 

THE CONSTITUTIONAL BODIES?

Vanam Jwala Narasimha Rao

The Hans India (26-02-2023)

(There are about 20 constitutional bodies or institutions in India. They are all supposed to be impartial in their decisions for sustenance of healthy democracy. The members of Constituent Assembly recognized the need for independent institutions which can regulate sectors of national importance without any executive interference. As such, they introduced constitutional provisions, paving the way for creation of Constitutional Bodies. But over a period, thanks to successive governments’ activism, the neutral nature of these bodies has become a bit controversial threatening the foundations of democracy-Editor, The Hans India Synopsis)   

Uddhav Balasaheb Thackeray, former Chief Minister of Maharashtra and leader of Shiv Sena was up in arms on the decision taken by Election Commission of India (ECI), which allotted the Shiv Sena symbol of ‘bow and arrow’ to the rival Eknath Shinde faction and recognizing it as the real Shiv Sena. Uddhav even demanded that the Constitutional Body should be dissolved immediately and reconstituted through ‘proper process’. Uddhav even gone to the extent of predicting that the 2024 Lok Sabha elections may turn out to be the last elections in the country, as after that dictatorship will start. Thackeray further expressed the apprehension that what has happened to Shiv Sena may happen to other parties in future. Meanwhile, the Apex Court refused to stay the ECI order, though agreed to hear the plea of the Thackeray camp. Nationalist Congress Leader Sharad Pawar commenting on ECI decision said that, ‘certain organizations have a responsibility to deal fairly with everyone’. He also said that he had never ever seen the ECI taking away the total control of one political party and giving it to another.  

Election Commission:

The ECI, a constitutionally guaranteed independent body constituted in accordance with Article 324, was established to conduct and regulate elections in the country, from the ‘day one’ when the constitution was adopted on November 26, 1949. The body administers elections to the Lok Sabha, Rajya Sabha, State Legislative Assemblies, State Legislative Councils and the offices of the President and Vice President of the country. ECI also monitors the political parties on certain aspects like registration, recognition, name change etc. Chief Election Commissioner or an Election Commissioner shall hold office for a term of six years, or up to the age of 65 years, whichever is earlier. Every state and union territory has a Chief Electoral Officer (CEO) as the representative of the ECI. In addition, State Election Commission formed after Constitution 73rd and 74th amendments, also an autonomous and Constitutional body is constituted in States and Union Territories for ensuring conduct of elections in free, fair and unbiased way and are responsible for elections for Urban Local Bodies. It is headed by Chief Elector Officer.

The global community witnessed the first general elections with great interest. World had taken notice of subsequent elections in India and journalists, politicians and observers from numerous countries descended upon India to see its novel experiment of adult suffrage. Will this highly reputed constitutional body keep up its tradition and past unbiased reputation in future also is a major concern, when we witness the way ECI has been functioning in the recent past, as rightly expressed by Uddhav Thackeray, may be in a different context!!! For instance, election expenditure and malpractices, normally and predominantly in by-elections continue unabated. Despite ECI having an elaborate system of surveillance and tracking at all levels, except symbolic confiscations of the ruling party that spends huge amounts, no stern initiative was taken. It seldom demonstrated its powers, and remained a silent spectator when parties and candidates did not observe its directives. There were of course significant exceptions at times, like that of Great Sheshan’s tenure. These give an impression that the ECI is not neutral and not fair.

There are about 20 constitutional bodies or institutions in India. They are all supposed to be impartial in their decisions for sustenance of healthy democracy. The members of Constituent Assembly recognized the need for independent institutions which can regulate sectors of national importance without any executive interference. As such, they introduced constitutional provisions, paving the way for creation of Constitutional Bodies. But over a period, thanks to successive governments’ activism, the neutral nature of these bodies has become a bit controversial threatening the foundations of democracy.  

Attorney General:

The institution of Attorney General, Government of India’s Chief Legal Advisor, normally an eminent jurist, is appointed by President, at the instance of the Union Cabinet under Article 76(1) of the Constitution. And hence he or she is not a neutral person. Nevertheless, it is a constitutional authority. The Attorney General who has no executive authority is assisted by a Solicitor General and Additional Solicitor Generals. On several occasions however, the opinions pursued by the Attorney General appear to have been extremely politicized. Niren De during Indira Gandhi regime replied to a question by Hans Raj Khanna (who attempted to uphold civil liberties during the time of Emergency in India in a lone dissenting judgement in 1976) stating that even the right to life can be suspended during emergency.

The CAG:

Another important Constitutional Body, the institution of Comptroller and Auditor General, is the supreme audit institution of India, established under Article 148 of the Constitution. They are empowered to audit all receipts and expenditure of the Union and State Governments, including those of autonomous bodies and corporations substantially financed by the Government as well as Government owned corporations.

Comptroller and Auditor-General of India is appointed by the President of India. To substantiate that there is scope for favoritism, notwithstanding the fact that, the person chosen could be highly qualified, is the example of Girish Chandra Murmu, who served as Principal Secretary to Narendra Modi when he was CM of Gujarat and later appointed as the present Comptroller and Auditor General of India.

Finance Commission:

Yet another Constitutional Body is the Finance Commission (FC). FCs periodically constituted once in five years, as an autonomous body, by the President of India under Article 280 to define the financial relations between the Union Government and individual state Governments. So far Fifteen Finance Commissions have been constituted. As a federal nation, India suffers from both vertical and horizontal fiscal imbalances. FC was first established on 22nd November 1951 to address these imbalances. Excepting few occasions, mostly, politicians from ruling party were appointed as Chairmen of the commission so far. FC seldom thought of leveraging the Economy or changed its role in such a way that its functioning is not a mere routine affair. Even after passage of 70 plus years since its establishment, there has not been a qualitative change in the FC approach. The broad fiscal policy decisions remain with the Government of India. Devolution has been centralized. The growth of the state was not considered as the growth of country. The unhealthy practice of disincentivizing growing states is followed. Visiting states with pre-occupied notions and designs is continued.

BRS President and CM Telangana KCR in the proposed National Agenda and Constitutional Reforms rightly suggested for a permanent FC for assessing and leveraging the Finances of Centre and States.

Union Public Service Commission:

Union Public Service Commission (UPSC), one more Constitutional Body, is India's premier central recruitment agency for recruitment of all the Group 'A' officers under Government of India, which includes all of the Central Public Sector Undertakings and all of the Central Autonomous Bodies. The commission is mandated by the Constitution for appointments to the services of the Union and All India Services. It is also required to be consulted by the Government in matters relating to the appointment, transfer, promotion, and disciplinary matters. UPSC reports directly to the President. As per Art 316, the Chairman, and other members of UPSC shall be appointed by the President. Similarly, Constitution of India provides for the establishment of PSCs for Union Territories and for each State.

Interstate Council:

The Constitution of India in Article 263, provided for an Inter-State Council (ISC) and gave an option to establish it to the President. This option was exercised only in 1990 and ISC was established as a Permanent Constitutional Body by a Presidential Order on the recommendation of Sarkaria Commission. The objective of the ISC is to discuss or investigate policies, subjects of common interest, and disputes among states. Prime Minister (Now Narendra Modi) is the Chairman and Chief Ministers are members of this body. The interstate council is intended to meet thrice a year but it seldom adheres to this. There is not any uniformity in the time interval between the two meetings. It goes without saying to what extent, since its establishment, the ISC served the purpose for which it came in to existence. Umpteen disputes between states remain unresolved.  

In addition, there are other Constitutional Bodies like National Commission for Scheduled Castes established with a view to provide safeguards against the exploitation of Scheduled Castes; National Commission for Backward Classes established in 1993; National Scheduled Tribes Commission to oversee the implementation of various safeguards provided to Scheduled Tribes under the Constitution; State Finance Commission; Metropolitan Planning Committee to prepare a draft development plan for the Metropolitan area as a whole; District Planning Committee (DPC) to consolidate the plans prepared by the Panchayats and the municipalities in the district and prepare a draft development plan for the district; Advocate General of State etc. While some of them function considerably well the others require qualitative change.

(The Writer is Chief Public Relations Officer to Chief Minister of Telangana).

Sunday, February 19, 2023

మోక్ష కారణమైన జ్ఞానాన్ని, సద్గుణ లక్షణాలను, విధి చేష్టితాన్ని వినిపించిన భీష్ముడు .... ఆస్వాదన-108 : వనం జ్వాలా నరసింహారావు

మోక్ష కారణమైన జ్ఞానాన్ని, సద్గుణ లక్షణాలను,

విధి చేష్టితాన్ని వినిపించిన భీష్ముడు

ఆస్వాదన-108 

వనం జ్వాలా నరసింహారావు

 సూర్యదినపత్రిక (20-02-2023)

మిథిలానగరాధీశ్వరుడు జనక మహారాజు ఏ కర్మ వల్ల ముక్తిని పొందగలిగాడని తాత భీష్ముడిని ప్రశ్నించాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు చెప్పాడిలా. ‘జనక మహారాజుకు వందమంది ఆచార్యులున్నారు. వారు సత్యనిరూపక పరమాత్మ స్వరూపమైన శాస్త్రాన్ని ఆయనకు వినిపిస్తూ, శాస్త్రార్థాలను మాత్రం వేర్వేరు విధాలుగా తెలియచేసేవారు. వారు ఏవిధంగా వినిపిస్తే రాజు ఆవిధంగానే వారివద్ద నేర్చుకునేవాడు. అలా ఆయన వింటున్న రోజుల్లో ఒకనాడు సత్యజ్ఞానంతో గొప్పవాడైన (కాపిలేయుడుగా పిలవబడే) పంచశిఖుడనే బ్రాహ్మణుడు ఆయన ఆస్థానానికి వచ్చాడు. జనకుడి నూర్గురు ఆచార్యులను ఆయన తన హేతుపూర్వక వాదనతో జయించి వారిని నిరుత్తరులను చేశాడు. అతడి విశేష పరిజ్ఞానానికి ఆశ్చర్యపడిన జనకుడు, తన గురుశతకాన్ని విడిచి అతడిని ఆశ్రయించి, తనకు తత్త్వోపదేశం చేయమని అర్థించాడు. పంచశిఖుడు ఆ రాజుకు మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన ఉపదేశ సారాంశం ఆయన మాటల్లోనే చెప్తాను.

‘మాయ కోరికకు కారణం. కోరిక కర్మకు కారణం. కర్మ పాప పుణ్యాలకు మూలం. ఆ పాపపుణ్యాల అనుభవం కొరకు ప్రాణికి పునర్జన్మ అవసరం అవుతుంది. మాయ పేరాశ. మాయకు లోభ, మొహాలు దోహదపడగా అదే బహుకర్మలకు ఆధారంగా మారి, నరుడిని జనన మరణ చక్రాన పడేసి తిప్పుతుంది. గుణత్రయాన్ని ఆత్మతత్త్వంలో లీనం చేయాలి. అప్పుడవి తమ ఉనికిని కోల్పోతాయి. నరుడు తన మనస్సును లౌకికాలైన సుఖదుఃఖాల వెంటబడిపోకుండా అంతర్ముఖంగా తిప్పేసి ఆత్మలో చేర్చగలగాలి. ఆ విధంగా ఆత్మలో చేర్చబడ్డ మనస్సు తన ఆకారాన్ని కోల్పోతుంది’.

  పంచశిఖుడు చెప్పిన వాక్యాలకు జనకుడు ప్రభావితుడయ్యాడని, ఆ మాటలు అతడిని విరక్తుడిని చేసిందని, దాంతో జనకుడు తన మిథిలానగరం కాలిపోతున్నా ఏమీ పట్టనట్లు వూరుకున్నాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. పితామహుడి పలుకులు విన్న ధర్మరాజు మరొక ప్రశ్న అడిగాడు. ‘ఎలాంటి వాడు సుఖంతోను, శుభంతోను కూడి నిర్భయుడై జీవించగలడు’ అని ప్రశ్నించాడు. దమం సద్గుణాల రాశి అని, శౌచాదులు సద్గుణాలని, దమము అనే ఒక్క లక్షణంలో ఎన్నో సద్గుణాలు ఇమిడిపోతాయని, అలాంటి సద్గుణ లక్షణాలుగల ధన్యజీవికి ఇహలోక విషయాల వల్ల కాని, పరలోక విషయాల వల్ల కాని, ఎలాంటి భయం ఏర్పడదని, అతడు శాంతికి, సుఖానికి నిలయమైనవాడని, జ్ఞానం వల్ల సౌమ్యమైన ఆకారంతో వెలుగొందేవాడని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు.

వ్రత నిర్వహణలో వున్న కొందరు భోజనాలు చేస్తే వారికి వ్రత భంగం కలగడా అని ప్రశ్నించాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు, ఉపవాస వ్రతంలో వున్నవారు వేదోక్తాలైన భోజనాలను బ్రాహ్మణుల నిర్దేశానుసారం చేయడంలో తప్పులేదని, అయితే, మోక్షార్థి అయిన సాధకుడు సదా ఉపవాసిగా, బ్రహ్మచారిగా వుండాలని అన్నాడు. రోజుకు రెండు పూటలా భోజనం చేస్తూ మధ్యమధ్య ఏమీ తిననివాడు సదోపవాసని; ఋతుకాలంలో మాత్రం ధర్మపత్నితో సంగమించే సచ్చీలుడు సదా బ్రహ్మచారని; దేవతల, పితరుల, అతిథులకొరకు వండి వడ్డించి ఆ తరువాత మాత్రం భుజించేవారు అమాంసభోజులని; తనతో తన పంక్తిలో భుజించే వారితో పాటు సమానంగా మాత్రమే భుజించే వాడు (భుక్తశేషభోజి) విఘసాశనుడని; సేవకులంతా భుజించిన తరువాత మాత్రమే తాను భుజించే పుణ్యాత్ముడు అమృతాశి అని; పగటి పూట నిద్రపోని వాడు అస్వప్నుడని భీష్ముడు చెప్పాడు.

కర్మలు, సంస్కార వశాన నరుడికి మంచి చెడులు కలిగిస్తూ వుంటాయని, ఆ కర్మలకు కర్త నరుడౌనో, కాడో, నిర్ణయించడంలో తనకు స్పష్టత కావాలని ధర్మరాజు అడిగాడు. దానికి బదులుగా భీష్ముడు ధర్మరాజుకు ఇంద్ర-ప్రహ్లాద సంభాషణ అనే వృత్తాంతాన్ని ఉదహరిస్తూ చెప్పాడు. దాని సారాంశాన్ని ఇలా క్లుప్తీకరించాడు భీష్ముడు.

‘సంపదలు యత్నించి ఆర్జించక పోయినా తమంతట తామే వచ్చి పడతాయి. ప్రయత్నించి సమార్జించి తెచ్చి వుంచితే వూరికే నశించిపోతాయి. కాబట్టి పరిశీలించి చూస్తే అవి విధికి లొంగి వుండేవేకాని నరుడి ప్రయత్నానికి లొంగినవి మాత్రం కావు. జీవితంలో నరుడికి అనేక కష్ట-నష్టాలు వస్తుంటాయి. ఇదంతా విధాత ఆడించే ఆట తప్ప అన్యం కాదు. తాను కర్తను అని నరుడు అనుకోవడం అజ్ఞానం. నిజంగా తాను కర్త అయితే ఏ లాభం ఏర్పడకుండానే అన్ని పనులను చేస్తున్నవాడు కాబట్టి చేసేది అంతా విదాతే అవుతాడు. అంతేకాని నరుడు కానేరడు. నరుడు అహంకారిగా జీవించేటప్పుడు విధి చేష్టితాన్ని కూడా తన పనిగానే భావించి, ఆ కర్మ ఫలితంలో తగుల్కొంటాడు. దానికి అతడి అహంకారమే మూలకారణం. అయితే, అహంకారానికి లొంగని నరుడు మాత్రం విధిచేతను తనదిగా భావించడు కాబట్టి, అతడికి ఆ కర్మఫలితాన్ని తోసివేసే శక్తి వుంటుంది. ఆ శక్తి అతడి అనహంకార శీలం వల్ల లభించింది.

‘కర్త విధి కాబట్టి, ఆ విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో వూరకనే చూస్తూ వుండాలి. ఆ కర్మలు సిద్ధించినప్పుడు సుఖాన్నీ, సిద్ధించనప్పుడు దుఃఖాన్నీ పొందకుండా వుండడంకొరకు నరుడు తన మనస్సును విషయాల నుండి తొలగించే ఉపాయం కనుగొనాలి. ఆ విధమైన ఉపాయం గొప్పది. నరుడు దాంతి, శాంతి, ప్రజ్ఞ కలిగినవాడైనప్పుడు అతడి చిత్తం ఏవిధంగానూ ఆయాసంతో అలసిపోదు. నిష్కపటమైన ప్రవృత్తి, దయాగుణం, తాను శరీరం కాదు-ఆత్మ అనే భావన, పరాకులేకుండా జాగ్రత్తగా వ్యవహరించడం, పెద్దల పరిచర్యాలలో నిజమైన ఆసక్తి మొదలైన సద్గుణాలు నరుడికి శుభాన్ని కలిగిస్తాయి. జ్ఞానం, శాంతి అనేవి కాలక్రమేణా తమంతట తామే నరుడిలో చోటు చేసుకుంటాయి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

ప్రక్షిప్తాలు లేని వాల్మీకి రామాయణమే ప్రామాణికం : వనం జ్వాలా నరసింహారావు

 ప్రక్షిప్తాలు లేని వాల్మీకి రామాయణమే ప్రామాణికం

(పరిశోధనాత్మక వ్యాసం)

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (19-02-2023) 

ఉత్తర కాండలో చెప్పబడింది అంటూ, ప్రక్షిప్తమో, నిక్షిప్తమో, మరేదో తెలియని ఒక అప్రాధాన్యమైన ‘శంబుక వధ’ స్వకపోల కల్పిత కథ గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలూ, నాటికలూ, వ్యాఖ్యానాలూ గతంలోనూ, ఇటీవలి కాలంలోనూ ప్రచారంలోకి తేవడం వేదకాలం నుంచి భారతీయులు ఆచరిస్తూ వస్తున్న అపారమైన సంస్కృతీ, సంప్రదాయాలకు విఘాతం కలిగించడమే. శ్రీరాముడు ధర్మంగా పాలన చేస్తున్న సమయంలో, ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి, చనిపోయిన తన కుమారుడిని చూపించి, అతడి అకాల మృత్యువుకు కారణం ఏమిటని రాముడిని ప్రశ్నించి, దీనికి కారణం ఆయన చేసిన పాపం అని నింద వేస్తాడట. కొడుకుని బ్రతికించకపోతే తాను, తన భార్య ప్రాణాలు విడుస్తామని, దానివల్ల శ్రీరాముడికి బ్రహ్మహత్యా దోషం కలగుతుందని హెచ్చరిస్తాడట!!!

అక్కడే వున్న నారదుడు, యుగధర్మం గురించి రాముడికి వివరించి, త్రేతాయుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, మాత్రమే తపస్సు చేయడానికి అర్హులని, దీనికి విరుద్ధంగా ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడని, అందుకే బ్రాహ్మణుడి కుమారుడు మరణించాడని, దీనికి తగిన ప్రతిక్రియ చేయమని సలహా ఇస్తాడట. రాముడు పుష్పక విమానాన్ని స్మరించడం, అది రావడం, దానిలో ఎక్కి తిరుగుతూ, ఒక పర్వత సమీపంలో తలకిందుగా తపస్సు ఇస్తున్న ఒకడిని చూసి (అతడే నారదుడు చెప్పిన శూద్రుడని ఎలా తెలిసిందో?) అతడి దగ్గరికి పోయి, తపస్సు చేయడానికి కారణం అడిగి, అతడు శూద్రజాతివాడని, పేరు శంబుకుడు అని, దేహంతో స్వర్గానికి పోవడానికి తపస్సు చేస్తున్నానని అతడి ద్వారా తెలుసుకుని, వెనకా ముందూ చూడకుండా, కనీసం అతడి వాదన వినకుండా, కత్తితో శంబుకుడి తల నరికాడని అల్లిన అభూత కల్పన. రాముడి చేతిలో చనిపోయిన శంబుకుడికి మోక్షప్రాప్తి, చనిపోయిన బ్రాహ్మణుడి కుమారుడు బ్రతకడం, దానికి పొడిగింపు కథ. ఇందులోని వాస్తవాలు నమ్మదగ్గవో, కాదో, చదివినవారికే అర్థం కావాలి!!!

ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి చరితాన్ని ఆదికావ్యంగా, శ్రీరామాయణ కావ్యంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. వాల్మీకి రామాయణాన్ని యధావాల్మీకంగా 24 వేల శ్లోకాలను 24వేల పద్యాలతో 7 కాండలుగా ‘శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం’ గా తెలుగు భాషలోనికి అనువదించిన మహామహానుభావులు, ఆంధ్ర వాల్మీకిగా, వాసు దాసుగా ప్రసిద్ధికెక్కిన వావిలికొలను సుబ్బారావు గారు. వారి ప్రతిపదార్థ తాత్పర్య సహిత వేలాది పేజీల ‘మందరాల’ ను ఆసాంతం రెండు-మూడు పర్యాయాలు చదివి, శిష్ట వ్యావహారిక భాషలో అనువక్తగా రాసిన వ్యక్తిగా, బహుళ ప్రచారంలో అనేక విషయాలు వాల్మీకి రామాయణంలో లేవనే సంగతి అర్థం చేసుకున్న వ్యక్తిగా, కొన్ని విషయాలు తెలియచేసే ప్రయత్నం ఇది. శ్రీసీతారాముల చరితానికి సంబంధించినంతవరకు వాల్మీకి రామాయణం మాత్రమే ఏకైక ప్రామాణిక గ్రంధం.

ఉదాహరణకు సీతా స్వయంవరం సమయంలో రావణుడు అక్కడే వుండి శివుడి విల్లు ఎక్కుపెట్టడానికి విఫల యత్నం చేశాడని, సీతను వదిలి రాముడికి సహాయంగా పోయేటప్పుడు లక్ష్మణరేఖ గీశారని, భూమిని పెకలించి రావణుడు సీతను తాకకుండా ఎత్తుకుపోయాడని, అహల్య శిలగా మారి రాముడి పాద స్పర్శకు నిజరూపం వచ్చిందని, చార్వాకుడు (జాబాలి) నాస్తికుడని, రావణుడి పొట్టలో అమృత కలశం వుందని, దానిని నాశనం చేస్తే వాడు చస్తాడని విభీషణుడు రాముడికి చెప్పాడనేవి వాల్మీకి రామాయణంలో లేని విషయాలు. బ్రహ్మాస్త్రం వేసి  రాముడు రావణుడిని చంపాడని  వాల్మీకి రామాయణం చెబుతోంది. సీతను అగ్నిప్రవేశం చేయమని శ్రీరాముడు ఆదేశించడం వాల్మీకి రామాయణంలో లేదు. శబరి ఏరి కోరి తెచ్చి రాముడితో ఎంగిలి పండ్లు తినిపించినట్లు ఎక్కడా లేదు. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు ప్రయోగించిన ‘శక్తి’ వలన లక్ష్మణుడు  మూర్ఛపోతే (చనిపోతే కాదు), హనుమంతుడు సంజీవిని  పర్వతాన్ని తెస్తాడు కాని ఇంద్రజిత్తు బాణానికి చనిపోయినప్పుడు కాదు. సాధారణంగా పారాయణ గ్రంథాలకు చివరన వుండే ఫలశ్రుతి లాగానే, శ్రీరామాయణ పారాయణ ఫలశ్రుతి కూడా యుద్ధకాండ చివరన వున్నది కాని ఉత్తరకాండ చివరన లేదు. అంటే రామాయణ కథలో అది భాగం కాకపోవచ్చు.    

వాల్మీకి బోయవాడికి ఇచ్చిన శాపమే రామాయణ ఉత్పత్తికి కారణం. ఇక వాల్మీకి ఏ కులం వాడో తెలియచేసే విషయం కూడా బాలకాండలో వాల్మీకి మాటల్లోనే వున్నది. కిరాతకుడిగా జీవనం సాగిస్తున్న పూర్వాశ్రమంలోని వాల్మీకి, అడవిలో పోతున్న మునులను అడ్డుకున్నప్పుడు అతడిని ‘బ్రాహ్మణాధముడి’ గా గుర్తించి, మోక్ష మార్గం ఉపదేశిద్దామని తలచి, ’రామ’ నామాన్ని తలకిందులు చేసి, వాళ్లు మరల వచ్చే వరకు, ’మరా, మరా’ అని ఎల్లవేళలా జపించమని ఆదేశించి పోయారని వాల్మీకి ఉవాచ. దీర్ఘకాలం తరువాత మునులు తిరిగి రావడం, పుట్ట నుండి బయటకొచ్చిన ఆయన్ను ’మునీశ్వర వాల్మీకీ’ అని సంభోదించడం, స్వయంగా రాసుకున్నాడు వాల్మీకి. వాల్మీకి రామాయణంలో ఆయన బోయవాడని ఎక్కడా చెప్పబడలేదు. బ్రహ్మ కూడా వాల్మీకిని ఓ సందర్భంలో ‘బ్రాహ్మణుడా’ అని సంబోధిస్తాడు.

ఆసక్తిగా శోధించిన వారికి, పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి, ఇతర రామాయణాలకు గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది. వాల్మీకి రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి యదార్థ జ్ఞానం కలగదు. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. శ్రీరాముడు అనుసరించిన సామాన్య ధర్మాన్ని, అలాగే విశేష ధర్మాన్ని కూడా తెలుసుకోవచ్చు.

       రామాయణ రచనకు పూనుకున్న వాల్మీకి మహర్షి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడిని పదహారు ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు జవాబుగా శ్రీరాముడి గుణగణాలను వర్ణిస్తాడు నారదుడు. వాల్మీకి ప్రశ్నించింది అవతార మూర్తి గురించే, నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని గురించే. ఆ జవాబులో నారదుడు శ్రీరాముడి గుణగణాలను వర్ణిస్తాడు. వానరులతో, గుహుడితో, శబరితో, సుగ్రీవుడితో, ఇతరులతో చేసిన స్నేహాన్ని ఆయన సౌశీల్యానికి గుర్తుగా చెప్తాడు. ‘స్మరణ మాత్ర సంతుష్టాయ’ అంటే స్మరించినంత మాత్రాన సంతోషించే వాడు రాముడు. ‘ప్రణతి ప్రసన్న జానకి’ అంటే ఒక్క నమస్కారంతో సంతోషించేది సీత. భక్తులకు సీత-రాములిరువురూ సేవ్యులే అనేది శ్రీరామాయణం చదువుకుంటూ పొతే అర్థమవుతుంది.  

స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా విశ్వామిత్రుడి ఆదేశం మేరకు తాటకిని చంపాడు. అహల్య శిలగా మారిందనడం వాస్తవం కాదని వాల్మీకి రామాయణం స్పష్టం చేసింది. గౌతముడు అహల్య స్వరూప నాశనం చేయకుండా, గాలిని ఆహారంగా తీసుకుంటూ, కఠిన వ్రతం ఆచరించమని మాత్రమే అంటాడు. గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకి రామాయణంలో, వశిష్ట విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు. ఆత్మ విద్యకు, అనాత్మవిద్యకు మధ్య జరిగిన యుద్ధంగా వర్ణిస్తాడు. రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి అడవులకు పోవడానికి కారణం తమ్ముడికి చెప్తూ, ఇవన్నీ కేవలం దైవ కృత్యాలేనని, విధి చేష్టలనీ అంటాడు.

తాను నాస్తికుడిని కాదని, నాస్తికోక్తులను చెప్పనని, నాస్తి అనేది లోకంలో లేదని, సర్వం అస్తియే అని, తనని క్షమించమని స్వయంగా జాబాలి రాముడికి చెప్పడం, వసిష్ఠుడు సహితం జాబాలి వాస్తవానికి నాస్తికుడు కాదని చెప్పడం వాల్మీకి రామయణంలో వున్నది. అడవిలో అన్నకు సాయంగా వెళ్తూ-వెళ్తూ సీతను జాగ్రత్తగా వుండమని మాత్రమే అన్నాడు లక్ష్మణుడు కాని ఎలాంటి రేఖా (లక్ష్మణ రేఖ) గీయలేదు. బ్రాహ్మణ సన్న్యాసి వేషంలో వచ్చిన రావణాసురుడు ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడిచేత్తో తొడలను, బెదిరించి, బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, తన మాయా రథంలో వేశాడు. అంటే, వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది.

రామరావణ యుద్ధంలో, ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను ఆ బాణాలతో కట్టిపడేసినప్పుడు రామలక్ష్మణులు మూర్ఛ పోయారు కాని చావలేదు. గరుత్మంతుడు రాగానే పాములన్నీ చెల్లాచెదరై రామలక్ష్మణులు మూర్ఛ నుండి తెప్పరిల్లారు. మరోమారు యుద్ధానికి వచ్చిన ఇంద్రజిత్తు, రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, బ్రహ్మ వాక్కుకు కట్టుబడి వారు మూర్ఛపోయారు. అప్పుడు హనుమంతుడు హిమవత్పర్వతం పోయి, సంజీవని పర్వతం తేవడంతో, మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. ఇంద్రజిత్తు లక్ష్మణుడిని చంపాడని ప్రచారంలో వున్న కథ వాస్తవం కాదు. సంజీవని తేవడం వాస్తవం అయినప్పటికీ, లక్ష్మణుడిని బతికించడానికి కాదు.

ఇంద్రజిత్తు మరణించిన తరువాత యుద్ధానికి వచ్చిన రావణుడు, శక్తి’ అనే బాణాన్ని లక్ష్మణుడి మీద ప్రయోగించగా లక్ష్మణుడు మూర్ఛపోయి నేలకూలాడు. మరణించలేదు. హనుమంతుడు తెచ్చిన సంజీవని కొండనుంచి బయటికి తీసి ఔషధులను లక్ష్మణుడికి వాసన చూపించాడు. వెంటనే అతడు సంతోషంగా మూర్ఛనుండి తేరుకున్నాడు. ఈ సారి కూడా లక్ష్మణుడు మరణించలేదనేది ప్రధానం. రామరావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీరాముడు ఇంద్రుడి సారధి మాతలి రథాన్ని ఎక్కి బాణాన్ని సంధించి రావణుడి శిరస్సు నరికాడు. రావణుడి తల కిందపడ్డది కాని వెంటనే మరొక తల మొలిచింది. వాడు చనిపోయే విధం రాముడికి కనబడలేదు. అప్పుడు మాతలి సలహా ఇవ్వగా బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రమూర్తి రావణుడిమీద వేయడంతో వాడు మరణించాడు. అసలు విషయం ఇది కాగా, ‘ఇంటి గుట్టు లంకకు చేటు’ అనీ, విభీషణుడు రావణుడి మరణ రహస్యం చెప్పాడని ఇతర రామాయణాలలో ప్రచారంలో వున్న విషయం వాస్తవం కానే కాదు.

విభీషణుడిని లంకకు అభిషిక్తుడిని చేసిన తరువాత రామాజ్ఞ ప్రకారం విభీషణుడు సీతను ఆయన దగ్గరికి తెచ్చాడు. సీతాదేవి రాగానే, లోకులు సందేహించడానికి అవకాశం ఇచ్చే చరిత్ర కలదానివయ్యావని, ఆమె తన ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చని అంటాడు. సీతాదేవి తన శీలంలో ఏ దోషం లేదని, తన  పాతివ్రత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నానని అంటుంది. మరది లక్ష్మణుడిని చూసి తనకు అగ్నిప్రవేశం తప్ప మరొక మార్గం లేదని, చితి పేర్చమని, అగ్నిప్రవేశం చేస్తానని అంటుంది. లక్ష్మణుడు చితిని పేర్చగా, అగ్నిలో సీతాదేవి ప్రవేశించింది. అగ్నిహోత్రుడు సీతాదేవిని ఒడిలో వుంచుకుని బయటకు వచ్చి, ఆమెను రాముడికి అప్పగిస్తూ, సీతలో ఏపాపం ఏమాత్రం లేదని, ఆమెను స్వీకరించమని అన్నాడు. సీతాదేవి తనకు తానే అగ్నిపరీక్షకు సిద్ధమైంది కాని రాముడి ఆదేశంతో కాదు. రాముడు సీతను స్వీకరించాడు. అయోధ్యకు మరలి వచ్చిన శ్రీరాముడికి వసిష్టుడు పట్టాభిషేకం జరిపించాడు. పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా ప్రపంచాన్ని పాలించాడు. ప్రపంచం అంతా రామమయం అయింది.

రామాయణమే ఆదికావ్యం. శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. ఇది వేదం స్వరూపం అని బ్రహ్మ కూడా చెప్పాడు. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం చదివినా, విన్నా, పాడినా వీనులకింపై, మనస్సుకు సంతోషకరమై, శుభకరమై వుంటుంది. శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, శాంతి, అద్భుత, భయానక, బీభత్స అనే నవరసాలతో నిండినదైనప్పటికీ, శృంగార రసమే ప్రధానంగా వున్న మనోజ్ఞమైన కావ్యం శ్రీరామాయణం.

అందుకే, ఇందుకే వాల్మీకి రామాయణం చదవాలి. చదివినకొద్దీ, ఆస్వాదించినకొద్దీ, అనేక ప్రశ్నలు, సరైన సమాధానాలు పుట్టుకొస్తాయి. వాల్మీకి మహర్షి దీన్ని అశ్వమేధయాగం చేయడానికి పూర్వం రచించి బహిర్గతం చేశాడు. శ్రీమద్రామాయణం బ్రహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. ఈ కావ్యంలో అనృతం కొంచెమైనా వుండదని బ్రహ్మ వరం. కాబట్టి ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర గ్రంథాలలో లేవు. రామాయణ పఠనం వల్ల, రామ కథా శ్రవణం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. చివరగా ఒక్క మాట. ప్రక్షిప్తాలు లేని వాల్మీకి రామాయణమే ప్రామాణికం.