కూలీలంతా ఒక్కటిగా .....!
గండ్లూరి
నాయకత్వంలోని వ్యవసాయ కూలీ పోరాటాలు
(గుర్తుకొస్తున్నాయి)
వనం జ్వాలా నరసింహారావు
1966 లో డిగ్రీ పరీక్షలు రాసిన తరువాత, నా మకాం, హైదరాబాద్ నుంచి మా గ్రామం వనం వారి కృష్ణా
పురానికి మార్చాను. అలా, 1966-1969 మధ్య
కాలంలో మా గ్రామంలో వున్న రోజుల్లో, ఆ తరువాత 1969-1971
మధ్య కాలంలో నాగపూర్లో ఎం.ఏ చదువుతూ అడపదడప
లేదా శెలవుల్లో మా గ్రామానికి వచ్చిన సందర్భంలో, అదే విధంగా 1971-1973
మద్య కాలంలో ఖమ్మంలో ఉద్యోగ రీత్యా వుంటున్న సమయంలో, మా పరిసర గ్రామ రాజకీయాలతో ఒక కమ్యూనిస్ట్ అభిమానిగా సంబంధాలు పెట్టుకున్నాను.
కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కార్యకలాపాల్లో చురుగ్గా
పాల్గొనేవాడిని కూడా. సభలు సమావేశాలకు హాజరయ్యేవాడిని.
అప్పట్లో
ఖమ్మం సమితిలో, పాలేరు నియోజక వర్గంలో, ఇప్పటి
ముదిగొండ మండలంలో భాగంగా వున్న కమలాపురం, బాణాపురం, పెద మండవ, వల్లభి, నాచేపల్లి,
గంధసిరి, పమ్మి, చిరు
మర్రి, అనా సాగరం గ్రామాలతో పాటు మా గ్రామంలో జరిగిన వ్యవసాయ
కూలీ పోరాటాలను స్వయంగా చూసే అవకాశం కలిగింది. ఆ పోరాటాలలో,
అంతో-ఇంతో, మా వూళ్లో
నాకు కూడా కొంత మేరకు పాత్ర వుంది. అదే విధంగా అలనాటి
కాంగ్రెస్ రాజకీయాలు, నాటి సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్య
రాష్ట్ర హోం మంత్రి జలగం వెంగళరావు అండతో నెరపిన హత్యా రాజకీయాలను కూడా కళ్లారా
చూశాను. బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా పరిసర
గ్రామాలలో ఆ పోరాటాలు ఇతర ప్రాంతాల వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన తరహాలో జరిగాయంటే
అతిశయోక్తి కాదేమో!
పరిసర గ్రామాలలో వ్యవసాయ కూలీ పోరాటాల కార్యాచరణ
పథకం రూపకల్పనకు, అమలుకు కేంద్రం బాణాపురం గ్రామం. అప్పటి సర్పంచ్,
మాజీ సమీ తాత్కాలిక అధ్యక్షుడు, గండ్లూరి కిషన్ రావు
నాయకత్వంలో, అదే గ్రామానికి చెందిన హరిజన నాయకుడు బాజి
హనుమంతు (ఆ తరువాత పాలేరు ఎమ్మెల్యే), కమలాపురం గ్రామ సర్పంచ్
వనం నర్సింగ రావు, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా
రెడ్డి, పెద మండవ సర్పంచ్ తాళ్లూరి వైకుంఠం, పమ్మి గ్రామ సర్పంచ్ బుగ్గ వీటి రంగయ్య ప్రభృతులు చుట్టు పక్కలున్న
పది-పదిహేను గ్రామాల వ్యవసాయ కార్మిక, కర్షక వర్గాన్ని సమీకరించి వారి హక్కుల
సాధనకై పోరాటం మొదలెట్టారు. వ్యవసాయ కూలీలకు కనీస కూలి రేట్లు అందేటట్టు చేయడమే
వారి లక్ష్యం. కిషన్ రావు నాయకత్వంలో వారంతా పోరాట పద్ధతులను ఒక పక్కా ప్రణాళికా
బద్ధంగా రూపొందించుకున్నారు.
చుట్టుపక్కల గ్రామాలలో వేరు
శనగ ముఖ్యమైన పంట. వేరు శనగ కాపుకొచ్చాక కూలీలతో
పీకించి కొట్టిస్తారు. తయారైన కాయను ‘డబ్బాల’ తో కొలిచి కూలీ
నిర్ణయించేవారు. ‘డబ్బా’ కు 16 ‘మానికలు. మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ
కొట్టినవారికి మూడు ‘సోల’ ల నుండి ఒక ‘మానిక’ వరకు జొన్నలు కొలిచి కూలీగా
ఇచ్చేవారు. సోల అంటే అర్థ శేరు. అయితే వేరు శనగ కొలిచే డబ్బాలు, జొన్నలు కొలిచి కూలి ఇచ్చే మానికలు అన్నీ తప్పుడివే. 16 ‘మానికలు’ వుండాల్సిన డబ్బాలు వాస్తవానికి 20, 22
మానికలు పట్టేవరకుండేవి. మానికకు నాలుగు సోలలుండాలి కాని మూడున్నర వుండేవి. అలా
రెండు వైపులా తప్పుడు కొలతలతో కూలీలకు ముట్టచెప్పేవారు భూస్వాములు. ఒకవైపు కూలీ
తక్కువ, మరో వైపు తప్పుడు కొలతలు. ఇలా రెండు విధాలుగా మోసం జరిగేది. అదో రకం
దోపిడీ అనాలి. సరిగ్గా ఆ పిచ్చి కొలతలకు, తక్కువ కూలీకి
వ్యతిరేకంగా మహత్తరమైన ఉద్యమం ప్రారంభమైంది. ‘వ్యవసాయంలో కష్టం చేసేది కూలోడు, కష్టానికి
తగ్గ ప్రతిఫలం కోరే హక్కు అతడికి వుంది, న్యాయమైన కూలీ కోసం, ఖచ్చితమైన కొలతల కోసం మీరంతా పోరాడండి’ అని పిలుపిచ్చారు కిషన్ రావు
నాయకత్వంలో మిగిలిన గ్రామ సర్పంచులు. తొలుత పోరాటం బాణా పురం గ్రామంలో మొదలైంది.
కిషన్ రావు ఇచ్చిన పిలుపుకు, ఆ నినాదానికి కూలీలలో మంచి స్పందన వచ్చింది. అంతా
కలిసి కట్టుగా, ఐక్యంగా నిలబడ్డారు. తప్పుడు
కొలతల డబ్బాలు, మానికలు కనుమరుగయ్యే సమయం ఆసన్నమైంది.
కూలీలు, వారి ముఠాలు, డబ్బులు
పోగు చేసుకుని ఖచ్చితమైన కొలత డబ్బాలు, మానికలు
కొనుక్కున్నారు. వాటి ప్రకారం ఇస్తేనే పుచ్చుకుంటామన్నారు.
సమ్మె చేశారు. కూలీల ఐక్యత ముందు భూస్వాములు
తలవంచక తప్పలేదు. బాణాపురం కూలీలు విజయం సాధించారు. తరతరాలుగా శ్రమ జీవుల కష్టాన్ని దోచుకు తింటున్న భూస్వాముల తప్పుడు
కొలతలకు స్వస్తివాచకం పలికారు బాణాపురం గ్రామంలో. ఈ ఉద్యమం
పరిసర గ్రామాలకు కూడా పాకింది. ఆయా గ్రామాల కమ్యూనిస్ట్ నాయకులు బాణాపురం తరహాలోనే
పోరాటానికి కూలీలను సిద్ధం చేశారు. గ్రామ, గ్రామాన సభలు సమావేశాలు జరిగాయి. వందల, వేల
సంఖ్యలో, చిరకాలం నుండి భూస్వాముల ఎత్తుగడల కింద చీల్చ బడి,
ఛిన్నా భిన్నమైన కులాలన్నీ ఒక్క చోట చేరాయి. తప్పుడు కొలతలు,
తక్కువ కూలీకి వ్యతిరేకంగా మహోద్యమం సాగింది. పిచ్చి మానికలు,
డబ్బాల స్థానంలో కొత్తవి వచ్చాయి. నేటికీ మా పరిసర గ్రామాలలో అవే
కొలతలుగా పనిచేస్తున్నాయి.
మా పరిసర గ్రామాల భూస్వాములు మరొక రకమైన వింత
దోపిడీ చేసేవారు. కూలీలు పోగు చేసుకునే ‘పెంట కుప్పలను’ వారు కారు చౌకగా కాజేయడం
చేసేవారు. అదంతా ఒక ప్రణాళికా బద్ధంగా చేసేవారు దోపిడీ దారులు. కరవు కాలంలో
కూలీలకు ఐదు, పది మానికలు ధాన్యం అప్పుగా ఇచ్చేవారు. అప్పిచ్చేటప్పుడు ఒక షరతు
విధించేవారు. అప్పు పుచ్చుకున్న కూలీలు తమ పెంట కుప్పలను అప్పిచ్చినవారికే
అమ్మాలని షరతు. పెంట కుప్పలను వారికిష్టమైన రేటుకే కొనేవాడు భూస్వామి. అప్పిచ్చిన
ధాన్యానికి ‘నాగులు’, ‘పెచ్చులు’ (వడ్డీ లాంటిది) కట్టేవాడు.
నిలువు దోపిడీకి కూలీని గురిచేసేవాడు. ఇక పెంట కుప్పలను తోలే ‘బండి జల్ల’ కు ఒక
నికరమైన కొలతలుండక పోయేది. బలిష్టమైన ఎద్దుల బండిని కట్టి, పెద్ద
జల్ల నిండా పెంట పోయించి, జీత గాళ్లతో కరువు తీరా తొక్కించి,
పెంటను కుక్కించేవాడు.
పది
బండ్లు అవుతుందనుకున్న పెంట నాలుగు బండ్లే అయ్యేది. అప్పు అలానే మిగిలేది. పెంట
ఖాళీ అయ్యేది. దానికి వ్యతిరేకంగా కూలీలను సమీకరించారు కమ్యూనిస్ట్ నాయకులు.
అప్పిచ్చిన ధాన్యానికి అడ్డగోలు నాగులు, పెచ్చులు
కట్టడానికి వీల్లేదన్నారు కూలీలు. పెంట జల్లలు కొలత ప్రకారం వుండాలన్నారు. అడుగుకు ఫలానా రేటు వుండాలన్నారు. పెంట పోశాక తొక్కడానికి కుదరదన్నారు.
భూస్వాములు కూడా బిగదీసుకున్నారు. అప్పులు ఇవ్వమన్నారు. జల్లలు మార్చమన్నారు.
జల్లలు అల్లే ఎరుకలను, ఎరువులు నింపే పాలేర్లను తమకండగా
కూలీలు సమ్మె చేయించారు. పెద్ద జల్లలు అల్లమని ఎరుకలు, పెంట
బండ్లలో తొక్కమని పాలేర్లు భూస్వాములను బెదిరించారు. కూలీలంతా ఐక్యమయ్యారు.
భూస్వాములు దిగి రాక తప్పలేదు. నాటి నుంచి నేటి వరకు మా పరిసర గ్రామాలలో కొల
జల్లలు, కొల పెంటలు అమల్లో వున్నాయి.
భూస్వాముల
మరో రకమైన దోపిడీ భూమి విస్తీర్ణాన్ని తక్కువ చేసి చెప్పడం. తద్వారా తక్కువ కూలీ చెల్లించడం. వేరు శనగ కూలీ,
పెంట కుప్పల దోపిడీ విషయంలో విజయం సాధించిన వ్యవసాయ కూలీలు వరి
నాట్లు, కోతలు, కలుపు తీయడం వంటి
రోజువారీ పనులకు, కూలి రేట్లను పెంచాలని, పాలేర్ల జీతాలు పెంచాలని పోరాటాలు ప్రారంభించారు. ఆ
పోరాటానికి కూడా గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో తొలుత బాణా పురం గ్రామం ముందంజ
వేసింది. మా పరిసర చుట్టుపక్కల అన్ని గ్రామాలలోను నాట్లకు,
కోతలకు, కలుపు తీయడానికి ఎకరానికి ఇంత అని
కూలి ఇచ్చేవారు భూస్వాములు. సాధారణంగా అవంతా ముఠా కూలీలే
కలిమిడిగా చేసేవారు. విడి కూలి వుండదు. ఇందులో కూడా భూస్వామి భూమి విస్తీర్ణానికి సంబంధించి దొంగ లెక్క చెప్పి
కూలీలను మోసం చేసే వారు. ఇలాంటి దొంగ లెక్కలకు వ్యతిరేకంగా
వ్యవసాయ కూలీలు పోరాటం చేసి విజయం సాధించారు. బాణా పురంలో
కూలీలు సాధించిన విజయాన్ని ఆసరా చేసుకుని, పరిసర గ్రామాలలోని
ఇతర కూలీలు ఆ గ్రామం నడిచిన దారిలోనే తమ గ్రామాలలో కూడా విజయం సాధించారు.
ఇదిలా
వుండగా చుట్టుపక్కల గ్రామాలలోని కూలీలు, బాణా పురం నుండి
కూలి సంఘం తయారు చేసిన సరైన కొలత మానికలను తెచ్చుకున్నారు. ఆ మానికలతోనే తమ
గ్రామాలలో కూడా కూలి ఇవ్వాలని భూస్వాములను నిలదీశారు. భూస్వాములలో గందరగోళం
బయల్దేరింది. ఇలా మా ప్రాంతమంతా అన్ని గ్రామాలలోను కూలీలంతా ఒక్కటై నిల్చి కూలి
పెంపుదల సాధించడమే కాకుండా వివిధ రకాల దోపిళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. భూస్వాములు
ఆక్రమించిన ప్రభుత్వ బంచరాయి భూములను కూడా కూలీలు స్వాధీన పరచుకున్న ఘటనలు అనేకం
వున్నాయి. ఆ మొత్తం పోరాటానికి గండ్లూరి కిషన్ రావు ముందుంటే, వనం నర్సింగరావు లాంటి సహచర కమ్యూనిస్ట్ నాయకులు ఆయనకు అందగా
నిలిచారు.
No comments:
Post a Comment