Monday, February 13, 2023

శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని, దైవధ్యాన పద్ధతిని, మోక్షమార్గాన్ని వివరించిన భీష్ముడు .... ఆస్వాదన-107 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని, దైవధ్యాన పద్ధతిని, మోక్షమార్గాన్ని వివరించిన భీష్ముడు

ఆస్వాదన-107

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-02-2023)

జ్ఞానయోగాన్ని భీష్ముడు, బృహస్పతి మాటలుగా ధర్మరాజుకు చెప్పిన తరువాత, మహనీయుడైన శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని తనకు వినిపించమని వేడుకున్నాడు ధర్మరాజు. జవాబుగా భీష్ముడు, తాను గతంలో నారద, జామదగ్న్య, మార్కండేయ, వ్యాస, వాల్మీకి మొదలైన మహర్షుల ద్వారా విన్న విశేషాలను ధర్మరాజుకు చెప్తానంటూ ఇలా అన్నాడు.

‘శ్రీకృష్ణుడు ప్రభావశీలైన విష్ణువే. అతడే తన దివ్య శక్తితో, తానూ కర్మనిర్వహణ నైపుణ్యంతో వినోదించాలానే సంకల్పంతో, ఈ సృష్టికి మూల పదార్థాలైన పంచభూతాలను కల్పించాడు. పంచభూత సృష్టి చేసిన తరువాత నీటిపైన భద్రమైన శయ్యమీద లేదా శేషతల్పంమీద పరుండి వుండగా ఆయన నాభి నుండి ఒక పద్మం పుట్టింది. దాని నుండి బ్రహ్మ పుట్టాడు. అతడికి ఏడుగురు (బ్రహ్మ) మానస పుత్రులు కలిగారు. వారే వరుసగా మరీచి, అత్రి, అంగిరసుడు, పుల్సత్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు అనేవారు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఆ కశ్యపుడి వల్ల దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జన్మించాయి. ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించగా, అత్రికి చంద్రుడు కలిగాడు. సూర్యచంద్రులు ఇద్దరూ క్షత్రియ వంశాలకు మూల పురుషులయ్యారు. ఆ వంశాలకు చెందిన రాజులు పెక్కు దేశాలను పాలించారు’.

‘అలా ఏర్పడ్డ క్షత్రియ వంశాలు భిన్న-భిన్న కాలాలలో, భిన్న-భిన్న దేశాలలో అనేక శాఖోపశాఖలుగా వర్ధిల్లాయి. శ్రీకృష్ణ పరమాత్మ తనకు అవసరమైనప్పుడు, కావాలనుకున్న సమయంలో, వారిలో వారికి సంభవించే యుద్ధాలను నిమిత్త మాత్రంగా గ్రహించి, వివిధ క్షత్రియ వంశాలను నశింపచేస్తూ వుంటాడు. ఆ దేవుడే శ్రీకృష్ణ రూపంతో పాటుగా బలరామ, మన్మథ, అనిరుద్ధ రూపాలను కూడా ధరించి ఈ జగత్తును భరిస్తూ వినోదం కొరకు జన్మలెత్తి ఆటలాడుకొంటాడు. శ్రీకృష్ణుడి లాంటి జగత్పతిని సామాన్య మానవుడుగా చూడడం అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్తపరాధీనుడు కాబట్టి ఉత్తములకు ఆరాధనాభాజనమయ్యాడు. నరులకు కావాల్సిన భోగభాగ్యాలను కానీ, ముక్తిని కానీ, కేవలం తన కరుణా కటాక్ష మాత్రాన ఇవ్వగల సమర్థుడు.

ఆ తరువాత ధర్మరాజు ఎవరిని స్మరిస్తే మానవుడు పరమాత్మను పొందుతాడని, ఏమార్గాన దైవధ్యానం కలుగుతుందని ప్రశ్నించాడు భీష్ముడిని. నారద మహర్షి ద్వారా తానిదివరకే ఇదే అంశం మీద విన్న విశేషాలను తెలియపరుస్తానంటూ భీష్ముడు ఆ వివరాలను ధర్మరాజుకు చెప్పాడు. విష్ణువును ధ్యానించేవారు ముందుగా గొప్ప భక్తిని, నిష్కల్మషమైన శ్రద్ధను, ఆపైన ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచుకోవాలని, ఈ మూడు లక్షణాలు విష్ణు ధ్యానానికి సమకారాలని, పాప రహితుడికి ఈ మూడు గుణాలు అలవడుతాయని, పాపనాశనానికి విష్ణువు మెచ్చిన పధ్ధతి నియమపూర్వకంగా నిరంతర విష్ణుస్మరణం అనే అనుస్మృతి అని అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు.

‘ఓం నమో వాసుదేవాయ లాంటి మంత్రాలను నిశ్చల మనస్సుతో జపించాలి. ఆ తరువాత అనుస్మృతిని (విష్ణునామ సహస్రం) పఠించాలి. దానివల్ల ధర్మార్థ కామమోక్షాలను సాధించే సామర్థ్యం కలుగుతుంది. విష్ణుదేవుడు అనుస్మృతిని నారదుడికి బోధించాడు. (విష్ణు సహస్ర నామమని ప్రసిద్ధి చెందిన అనుస్మృతిని భీష్ముడు ధర్మరాజుకు వినిపించాడు). అనుస్మృతిని చదివినవారికి, విన్నవారికి, నమస్కరించినవారికి పుణ్యగతి, ముక్తి కలుగుతుంది. వేలకొద్ది అశ్వమేధయాగాలు చేసికూడా పొందలేని పరమపదాన్ని అనుస్మృతిని భక్తితో సేవించడం వల్ల సులభంగా పొందవచ్చు. అనుస్మృతి గొప్ప స్తోత్రమంత్రం. వరాలను ఇవ్వగల సామర్థ్యం కలది. ఆరాధనకు అర్హమైన రీతిలో జపించడానికి వీలైన ఆకారంతో వున్నది. దీనిని జపిస్తే నరుడి బుద్ధి పెరుగుతుంది. దుఃఖాలు తొలగిపోతాయి. సంసారబందాలు తెగిపోతాయి. నిరంతరం శుభం కలుగుతుంది.

ఇది విన్న ధర్మరాజు మోక్షమార్గాన్ని ఉపదేశించమని పితామహుడిని కోరాడు. వార్ష్ణేయాధ్యాత్మం అనే ఇదిహాసం ఆధారంగా వార్ష్ణేయుడు తన శిష్యుడికి ఉపదేశించిన మోక్షమార్గాన్ని వివరించాడు భీష్ముడు. దాని సారాంశం ఇలా సాగుతుంది.

‘కాలచక్రం అవధి లేకుండా తిరుగుతూ వుంటుంది. దాని భ్రమణంలో సృష్టులు, ప్రళయాలు ఏర్పడుతుంటాయి. ప్రళయాంతంలో పరమాత్మ మాత్రం నిత్యుడై నిలిచి మళ్లీ లోకాలను, భూతాలను సృష్టిస్తాడు. ఆ సృష్టిలో పునరుద్భవించిన ఋషులు, మునులు వేదాలను, శాస్త్రాలను తిరిగి పొందుతారు. వారే మేథావులై లోకాలు ఆచరించాల్సిన నియమ నిబంధనలను రూపొందించారు. మహర్షులు నిర్మించిన న్యాయాది శాస్త్ర సముదాయాన్ని వింటే, ఆచరిస్తే లేదా తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ శాస్త్ర జ్ఞానమంతా ఒక్క విష్ణువులో నిలిచి వుంటుంది. మునీంద్రులు ఆ జ్ఞానాన్ని వారి శిష్యపరంపరకు బోధించి లోకంలో వ్యాప్తి చేశారు’.

‘పురుషుడితో కూడి వుండడం వల్ల ప్రకృతి చైతన్య శక్తిని వహిస్తుంది. చైతన్యం నుండి బుద్ధి, దాని నుండి అహంకారం పుట్తాయి. అహంకారం ఆత్మను చేరుతుంది. అహంకారం వల్ల ఆకారం, ఆకారం వల్ల వాయువు, వాయువు వల్ల తేజస్సు, తేజస్సు వల్ల నీరు, నీటివల్ల భూమి పుట్టి పంచభూతాలు ఏర్పడ్డాయి. అహంకారమే భూతపంచకానికి మూలం. బుద్ధిని మహత్తు అని కూడా అంటారు. శరీరం తొమ్మిది ద్వారాలున్న పుణ్యపురం. ఆ పురంలో పరమాత్మ ఊహాతీతమైన వ్యాప్తశక్తితో నిండి, అన్ని భావాలను, స్వభావాలను, గుణాలను పొంది శయనించి వున్నాడు. అందువల్లే ఆ పరమాత్మను పురుషుడు అని అంటారు. ఆ పురుషుడు అమరుడు, అవ్యయుడు, అజరుడు, అమేయుడు, అమలస్వభావుడు. దేహంలో పురుషుడు వుంటాడు. యోగ విద్యాభ్యాసం వల్ల పురుషుడు తేజోరూపుడుగా బోధపడుతాడు. ఆ తేజస్సు జ్ఞానంతో నిండి వుంటుంది. ఆ జ్ఞానమయ తేజస్సు సర్వభూతాలను ఆశ్రయించి వుంటుంది. కాబట్టి శ్రవణ, దర్శన, భాషణాదులను అది నిర్వహిస్తుంది. ఆ తేజోరూప పరమాత్మనుండే సృష్టి, స్థితి, లయాలు జరుగుతుంటాయి. దేహస్థుడైన పురుషుడు అన్నిటికీ సాక్షీభూతుడుగా వుంటాడు’.

‘కాలచక్రానికి బుద్ధి మొదలైన వికృతులు ఏడు అంచులు. అవ్యక్తం దాని కేంద్రస్థానం. జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మొత్తం ఇంద్రియాలు పది. జ్ఞానేంద్రియాలకు, గోచరించే పదార్థాలు ఐదు. ఈ పదిహేనుకు తోడుగా మనస్సును కలిపి లెక్కిస్తే మొత్తం ఈ పదహారూ వికారాలు అనబడుతాయి. జ్ఞాన కర్మేంద్రియాలు, పదహారు వికారాలు వలయాలు. ఆత్మ దానిని అధిష్టించి వుంటాడు. అది నిరంతర భ్రమణం కలిగింది. దానిని తత్త్వశోధన దృష్టితో దర్శించాలి. సంసారం ఒక అరణ్యంలాంటిది. సంసారంలో పడి జీవించడం అంటే, అడవిబాటలో నడవడమే. సంసార పరిభ్రమణంలో సుఖశాంతులు వుండవు. లౌకికమైన తెలివితేటలు విజ్ఞానమని, ఆధ్యాత్మికమైన తెలివితేటలు జ్ఞానమని విజ్ఞులంటారు. అహంకారం జీవుల సకల కార్యాలకు మూలం. ఆయా కార్యాలవల్ల పాపపుణ్యాలు కలుగుతాయి. వాటి అనుభవం కొరకు ప్రాణి దేహం ధరించి, జనన మరణ చక్రాన పడి కిందికి-మీదకు తిరుగుతుంటాడు. ఈ జనన మరణ చక్రానికి మూలం ఆశాలత. దానికి ప్రాకుడు కొయ్యస్త్రీ. ఈ సత్యం తెలుసుకొని ఆశను తుంచివేయాలి’.

‘సృష్టిలోని ప్రాణికోటిలో మానవులు శ్రేష్ఠులు. వారిలో బ్రాహ్మణులు, వారిలో మంత్రవేత్తలు, వారికంటే జ్ఞానులు ఉత్తములు. మానవుడికి నిజమైన నేత్రం జ్ఞానం. అజ్ఞాని గుడ్డివాడితో సమానుడు. జ్ఞానార్జనకు ముందు నరుడు ధర్మాన్ని ఆచరించాలి. సంకల్ప, వికల్పాలకు మనసులో తావీయకుండా సాధన చేయాలి. ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహానికి ప్రాతిపదిక. అలాంటి ఇంద్రియ నిగ్రహం జ్ఞానార్జనకు, తద్ద్వారా మోక్షప్రాప్తికి హేతువవుతుంది. నరుడు మాటలో, మనసులో, పనిలో శౌచాన్ని పాటిస్తూ, అహంకారాన్ని విడనాడి, శాంతస్వభావుడిగా వున్నప్పుడు అతడిలో కోరికలు సన్నగిల్లి అంతరించి పోతాయి. ఆ స్థితిలో లోకంలోని ప్రాణి సమూహాన్నంతటినీ అతడు కరుణతో ఆదరించగలుగుతాడు. పవిత్ర జీవనం, అహంకారరహిత శీలం, కోరికలకు దూరమైన మనస్సు, అదనంగా భూతదయ కలిగి వున్నవాడికి జ్ఞానం కలిగి తీరుతుంది’.

‘మానవుడు తనలోని జ్ఞానాన్ని వంట చెరుకులాగా ఉపయోగించుకుంటూ, విజ్ఞానాన్ని రగుల్కొనేట్లు చేసి ప్రజ్వలింపచేయ హలిగితే అతడికి జరామరణాలకు, ఇతర లౌకిక దుఃఖపరంపరలకు దూరమైనా అమృతత్వస్థితి కలుగుతుంది. అతడు ధ్రువమైన మోక్షస్థితిని చేరుకుంటాడు’.

‘లోకంలో వ్యక్తం, అవ్యక్తం అనే రెండు విధాలున్నాయి. వ్యక్తమంటే మృత్యువని, అవ్యక్తమంటే అమృతం అని విష్ణువు చెప్పాడు. అది తెలిస్తేనే ముక్తికి దారి కనబడేది. అవ్యక్త మనబడే మూలప్రకృతి ముల్లోకాలకు ఆలంబమైనది. దానిలోనే లోకాలు జన్మించి, పెరిగి, లయమౌతాయి. ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం కలది. నివృత్తి మార్గం సాటిలేని మేటి ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి’.

‘నివృత్తి అంటే సంసారంనుండి మరలడం. దీనికి విరుద్ధమైనది ప్రవృత్తి-అంటే సంసారంలో పాల్గొనడం. దేహస్తుడైన ఆత్మ ప్రాకృతికాలైన త్రిగుణాలతో చుట్టబడి వుంటాడు. ఇవి నిండుగా కమ్ముకుంటాయి. త్రిగుణాలు చుట్టుకొని వుండడంవల్ల ఆత్మ నిజస్వరూపం కానరాకుండా వుంటుంది. త్రిగుణాతీతమైన మరొక గుణమే పరబ్రహ్మతత్త్వం’.

‘బ్రహ్మచర్యం, అహింస అనేవి రెండు గొప్ప ధర్మాలు. వాటిని ఆచరించడమే ఉత్తమ ధర్మం. తపస్సు చేసేవారికి నిర్మల జ్ఞానం  కలుగుతుంది. ఆ జ్ఞాన నేత్రంలో అతడు ఈ లోకపు అంతర్బహిస్వరూపాలను సరిగ్గా, చక్కగా చూడగలడు. తపస్సు సంసారం నుండి మనస్సును మరల్చడానికి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. తృష్ణాలతను తెంచడానికి పనిచేస్తుంది’.

ఇలా చెప్పిన భీష్ముడు ధర్మరాజును వార్ష్ణేయుడి శిష్యుడిలాగానే జ్ఞానివై ఆయన జన్మను చరితార్థం చేసుకొమ్మని సలహా ఇచ్చాడు.                 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

          

   

No comments:

Post a Comment