Monday, February 13, 2023

(ఈ) నాటి పెళ్లిళ్లు ..... పెళ్లి పెద్దలు, సంధాన కర్తలు, పెళ్ళి చూపుల సాంప్రదాయం (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 (ఈ) నాటి పెళ్లిళ్లు

పెళ్లి పెద్దలు, సంధాన కర్తలు, పెళ్ళి చూపుల సాంప్రదాయం

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (14-02-2023)

అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతున్న ఈనాటి ఆధునిక సమాజంలో వివాహాలు జరుగుతున్న తీరుతెన్నులలో కొట్టొచ్చిన మార్పు కనిస్తున్నది. వివాహం పూర్వరంగంలో వరుడు, వధువు ఒకరినొకరు వారివారి పూర్వపరిచయం వల్లనో లేదా కులాల, మతాల ప్రాతిపదికన మారేజీ బ్యూరో ద్వారా ఎంపిక చేసుకుని అంగీకారానికి రావడమో జరుగుతున్నది. లగ్న నిశ్చయం తరువాత వాట్స్ అప్ లాంటి పలు సాంకేతిక పద్దతుల సహాయంతో పెళ్లి పిలుపుల తతంగం, ఎంపిక చేసుకున్న అతి కొద్దిమందిని మాత్రమే వ్యక్తిగతంగా పిలిచే నూతన సాంప్రదాయం, పిలుపులకు వచ్చిన వధూవరుల తల్లితండ్రులు (లేదా వారి వైపు పెద్దలు) ఆహ్వానితులకు బట్టలు పెట్టే పధ్ధతి లాంటివి మార్పుకు సంకేతాలు. అలాగే ఏమాత్రం పరిచయం వున్నా, హోదారీత్యానో, మరే కారణానో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పలువురుని ఆహ్వానించడానికి పోస్టు, కొరియర్ లాంటి సేవలు ఉపయోగించుకోవడమో కూడా జరుగుతున్నది.  

ఇక చాలామంది తమ పిల్లల వివాహాలలో వారివారి ‘సంపద ను ప్రదర్శించే తీరు ఒక్కొక్కసారి హాజరైనవారికి జుగుప్సాకరంగా, ఇబ్బందికరంగా వుంటున్నది. ఇక ఆహ్వానించబడిన వీఐపీల రాకతో సామాన్య అతిథులకు ఎదురయ్యే సమస్యలు చెప్పతరం కాదు. పెళ్లిమంటపం మీదికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించాలి అంటే వీఐపీలు కానివారికి ఒక పెద్ద ప్రహసనంగా మారింది. భోజనం దగ్గర రిజర్వేషన్ల పధ్ధతి పాటించడం మరో ఇబ్బందికర సమస్య. ఇవన్నీ ఒక ఎత్తైతే వీఐపీ ఆహ్వానితులను మినహాయించి మిగతావారిని లోపటికి పోనివ్వడానికి ‘బౌన్సర్ల సమస్య చెప్పనలవికాని ఇబ్బంది. కారు పార్కింగ్, (ఇటీవల జరిగే వివాహాలు ఎక్కడో వూరుబయట భారీ కళ్యాణ మంటపాలలో జరగడం సాధారణం) ఇంకా పెద్ద సమస్య. వదూవరులకు అడ్డంగా ఎవరూ వీక్షించడానికి వీలు లేకుండా ఫోటోలు, వీడియోలు తీసేవారి ద్వారా ఎదురయ్యే సమస్య మరొకటి. ఇంతా చేస్తే పెళ్లి తతంతంగం అంతా హడావిడిగా అయిపోవడం, సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన తంతు చాలా వివాహాలలో జరగకపోవడం నేటి పరిస్థితి. తాటాకు పందిళ్లు, స్వగృహంలో పెళ్లిళ్లు, ఐదారు రోజుల బంధువుల హడావుడి, హరికథలు లేదా బుర్ర కథల నిర్వహణ, ఇప్పుడు అరుదుగా కూడా కనిపించవు. వాటి స్థానంలో సంగీత్, మెహందీ, లాస్ట్ బాచ్లర్ పార్టీ ఇంకా చెప్పాలంటే డెస్టినేషన్ మారేజీలు, విదేశాలలో హనీమూన్ల లాంటి వ్యయంతో కూడుకున్నవి వచ్చాయి.         

ఏబై-అరవై సంవత్సరాల క్రితం మాలాంటి చాలామంది పెళ్లిల్లు అయినప్పుడు పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు, భావనకు, తేడా కనిపిస్తున్నది. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కలపదు. రెండు కుటుంబాలను, ఇరు కుటుంబాల సంబంధీకులను, రెండు వంశాలను, ఇరు వంశాల సంబంధీకులను, వేస్తుంది. ఇక ఆ బంధం విడదీయరాని అనుబంధమే. క్రమేపీ పిల్లలు పుట్టడం, వంశాభి వృద్ధి చెందడం, ఇరు వంశాలకు చెందిన వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడం, వీరికి, వారికి చెందిన వ్యక్తుల మధ్య మరిన్ని వివాహ సంబంధాలు కుదరడం, ఇలా ఒక నిరంతర ప్రక్రియలాగా సాగుతూ, ఆ బంధం మరింత దృఢ పడుతుంది. ఆ బంధం తెంచుకోవడమంటే సంప్రదాయాలను ధిక్కరించడమే.

అదృష్టం ఏమిటంటే, పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం ఎంతో తీవ్రంగా భారతీయుల మీద, హిందూ వివాహ వ్యవస్థ మీద పడుతున్నప్పటికీ, తప్పనిసరి తంతుగానో, కుటుంబ నేపధ్య ఒత్తిడుల వల్లనో, ఇరు పక్షాలలో కనీసం ఒకరైనా సంప్రదాయం పాటించాల్సిందేనని పట్టుదలతో వుండడం వల్లనో, స్వయంగా వధూవరులిద్దరూ కోరుకుంటున్నందువల్లనో, ఇంకా హిందూ వివాహ సంప్రదాయం కొనసాగడం కొంతలో కొంత మేలనాలి. అయితే సంప్రదాయాన్ని పాటించి, వివాహం చేసుకున్న కొద్దిమందిలో, కనీసం నూటికి, కోటికి ఒక్కరైనా, ఆ ప్రక్రియను ఆసాంతం అర్థంచేసుకొనే ప్రయత్నం చేసి, దాని వెనుకనున్న అంతరార్థాన్ని గ్రహించి, ఇతరులకు తెలియ చేయగలిగితే, ఈ సాంప్రదాయిక వేడుక అజరామరంగా సూర్యచంద్రులున్నంత వరకూ కొనసాగు తుందనడంలో అతిశయోక్తి లేదు. దీనికొరకు హిందూ వివాహ వ్యవస్థలో, అంచలంచల ఏర్పాట్లు చేసారు పూర్వీకులు. ఇవి ఇప్పుడు పూర్తిగా పాటిస్తున్నారా అంటే ఇదమిద్ధమైన సమాధానం లేదు.

ఆరోజుల్లో, మారోజుల్లో, పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన, ఇరువురికీ కావాల్సిన ‘పెళ్లి పెద్దలు’ సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వధూవరుల తల్లిదండ్రులు అడక్కపోయినా, స్వయంగా తమ నెత్తిమీద ఒక సామాజిక బాధ్యతలాగా వేసుకుని, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఇరుకుటుంబాలను ఒప్పించి, భవిష్యత్ కార్యక్రమానికి నాంది పలికేవారు. సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు, మిత్ర, సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, కాబోయే వధువును చూసేవారు. అబ్బాయి, అమ్మాయి, వారి తల్లిదండ్రులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమయ్యేవారు. పరస్పర సంప్రదాయాలు, కుటుంబ పద్ధతులు, ఆచార వ్యవహారాలు చర్చించుకునేవారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, కట్న కానుకలు, ఇచ్చి, పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవడం జరిగేది. దీంట్లోని శాస్త్రీయత అమోఘం.

మా పెళ్లికి ముందు కూడా ఇవన్నీ జరిగాయి. 1968వ సంవత్సరంలో, అప్పుడే నేను డిగ్రీ పాసయ్యి, రాజకీయ కారణాల దృష్ట్యా, మా వూళ్లోనే వుంటూ వ్యవసాయం చేయిస్తున్నాను. పక్క గ్రామంలో వుంటున్న మా పెదనాన్న గారి  కుమారుడు, నా పాఠశాల క్లాస్ మేట్ దూరపు బందువల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అది పూర్తిగా పెద్దలు కుదిరించిన పెళ్లి. వివాహం తర్వాత పెళ్లికొడుకు ఇంట్లో జరిగిన ‘మూడు నిద్రల’ తంతు (హిందూ వివాహ వ్యవస్థలో ఒక ముఖ్య భాగం) లో భాగమైన ‘మేజువాణి’  కార్యక్రమంలో పాట పాడిన పెళ్లికూతురు కజిన్ గురించి మా పెదనాన్నను అడిగితే, ఆమె తండ్రి గారికి చెప్పి సంబంధం కుదిరించడానికి నిశ్చయించుకున్నాడప్పుడు. ఆవిధంగా అప్పట్లో జరిగిన పెళ్లిళ్లు, తదనంతర తంతు కార్యక్రమాలు, ఒక విధమైన సామాజిక సమావేశాలు. అమ్మాయిలు, అబ్బాయిలు కలవడానికి, ఒకరినొకరు నచ్చడానికి వేదికలు. ఇప్పట్లో ఇవి అరుదు. అంతా యాంత్రీకం.

ఆ తరువాత కొద్దిరోజులకు ఒక నాడు, పెదనాన్న మా పక్క గ్రామానికి చెందిన కాబోయే మామ గారిని, ఆయనతో పాటు మాకు కూడా తెలిసన ఒకరిద్దరిని తీసుకొని గ్రామంలో వున్న మా ఇంటికొచ్చారు. అంటే సందానకర్తలు మా ఇరు కుటుంబాలను కలిపి వివాహం జరిపించాలనుకున్నారన్నమాట. మా అమ్మా, నాన్న వెంటనే వారి ప్రతిపాదనకు అంగీకరించి, పెళ్లి చూపులకు వస్తామని చెప్పారు. పెళ్లి చూపులతో మా వివాహ ప్రక్రియ మొదలవడానికి నాంది జరిగిందలా. ‘పెళ్ళి చూపుల’ సాంప్రదాయం ప్రకారం మేమందరం, మా బంధు-మిత్ర-సపరివార సమేతంగా కాబోయే మా మామ గారింటికి వెళ్ళి, అమ్మాయిని చూశాం.

నా వయస్సు అప్పటికి 20 సంవత్సరాలు. కాబోయే శ్రీమతి వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే. అయినా, వధూ-వరులు పరస్పరం నచ్చారన్న నిర్ణయానికి ఇరు పక్షాల బంధువులు వచ్చారు. అది నిజంకూడా. అయితే ఎలా నిజం? అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇక ఆ తర్వాత జరగాల్సింది ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవడం. పరస్పర సంప్రదాయాలు, కుటుంబ పద్ధతులు, ఆచార వ్యవహారాలు చర్చించుకోవడం. పెళ్ళి చూపుల కార్యక్రమం అయింతర్వాత, మిగిలిన విషయాలను మాట్లాడుకోవడానికి మర్నాడు మా ఇంటికి రమ్మని మా నాన్నగారు వాళ్లను ఆహ్వానించారు. వారూ సమ్మతించారు. మా ఆహ్వానం మేరకు మర్నాడు ఆడ పెళ్లి వారి పెద్దలందరూ మా ఇంటికి భోజనానికి వచ్చారు. మాటా-మంతీ జరిగింది. అన్నీ మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవడంతో అంచెలంచల ఘట్టంలో మరో అడుగు పడింది.

ఒకే ఒక్క రోజులో పెళ్ళి సంబంధం కుదిరినందుకు మా మామగారి తరఫు బంధువులంతా సంతోషించారు. ఫలానా రోజున లగ్నాలు పెట్టుకుందామని చూచాయగా అనుకున్నారు. అటువైపు, ఇటు వైపునుంచి మా ఇంటికి వచ్చిన పెద్దలు మా ఇరు వంశాల వారి గురించీ, వారి గొప్పదనాన్ని గురించీ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇది సహజంగా ప్రతి పెళ్ళిముందరా జరిగేదే. ఇరుపక్షాలకు చెందిన పురోహితులో, ఎవరైనా పెళ్లి పెద్దలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వంశ క్రమం ప్రస్తావన తెస్తారు. ఎవరెంత గొప్పవారైందీ, ఎంత మందీమార్బలం వున్నవారైందీ చెప్పుకుంటారు. అదే జరిగింది మా ఇంట్లో కూడా. అప్పట్లో ఇదీ వివాహం పూర్వరంగంలో మొదటి దశ ఆనవాయితీ. ఇప్పుడు ఇవి ఎంతవరకు పాతిస్తున్నారనేది కోటి రూకల ప్రశ్న!!! అసలే లేదా అంటే అదీ చెప్పలేము!!!

ఇక తరువాత దశ నిశ్చితార్థం, లాంఛనంగా లగ్ననిశ్చయం.

No comments:

Post a Comment