ఆధ్యాత్మ-యోగ విద్యలను, జప విధానాన్ని- ఫలితాన్నీ,
జ్ఞానయోగాన్ని
వివరించిన భీష్ముడు
ఆస్వాదన-106
వనం
జ్వాలా నరసింహారావు
సూసూర్యదినపత్రిక
(06-02-2023)
ఆచార విధులను
గురించి భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు అ ఆతరువాత ఆధ్యాత్మ విద్య గురించి
తెలపమని అడిగాడు పితామహుడిని.
జీవాత్మ కడలి
కెరటాల లాగా పుట్టుతూ-గిట్టుతూ వుంటుందని,
భూమి, నీరు,
కాంతి, గాలి,
ఆకాశం, అనేవి పంచ భూతాలని, వీటి స్వభావాలైన వాసన, ద్రవం,
తేజస్సు, చలనం,
శబ్దం అనేవి ఇంద్రియాల ద్వారా గ్రహింపునకు వస్తాయని చెప్పాడు భీష్ముడు. చెవి, ముక్కు,
నోరు, తోలు,
కన్ను అనే ఇంద్రియాలు వాసనను కలిగించే పంచభూతాల గుణాలు అనుభవానికి రావడానికి
ఉపకరణాలుగా పనిచేస్తాయని, అయితే ఈ ఉపకరణాల ద్వారా అనుభవం
కలగడానికి ఆధారభూమి మనస్సని, ఆ మనస్సు ద్వారానే విషయజ్ఞానం
లభిస్తుందని అన్నాడు. ఈ విధంగా ప్రాపంచిక విషయజ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని
రేకెత్తించి జనన మరణ చక్రంలో పడేసి తిప్పుతుందని, ఆ చక్ర భ్రమణం నుండి బయట పడాలంటే ఇంద్రియాలను మళ్లించి మనస్సుతో
వాటిని చేర్చితే బుద్ధిని అణచి వేయవచ్చని,
ఆవిధంగా పురుషుడు అంతర్ముఖుడైనప్పుడు అతడిలో బుద్ధి గోచరించని స్థితి కలుగుతుందని
వివరించాడు భీష్ముడు.
ఇంకా ఇలా
చెప్పాడు భీష్ముడు: ‘ఆత్మ జీవంతో చేరి భూతాత్ముడని, శరీర తత్త్వం తెలిసిన
క్షేత్రజ్ఞుడని, శరీరం తాను కానని తెలిసి పురుషుడని,
పరమేశ్వరుడని, బుద్ధికి ఎడంగా నిలిచి బుద్ధి సాక్షి అని, తత్త్వదర్శనంతో జనరహితుడని పిలువబడుతూ
వుంటాడు. ఆత్మ పరమేశ్వరుడైనప్పుడు అతడు విశ్వమయుడు. సృష్టి అంతా అతడిలో
గోచరించేదే. అదే సృష్టి తిరిగి ఆత్ముడికి ఇంద్రియానుభవం ద్వారా గోచరిస్తున్నదంటే
అర్థం అదంతా మాయ వల్ల స్వప్న సదృశమైన అయదార్థం మిథ్య తప్ప అన్యం కాదు. మాయ కారణాన
ఆత్మ తనను తాను కాంచలేక, మోసానికి గురై,
పరమాత్మకు వెలియై అలమటిస్తున్నది. మిథ్యాజ్ఞానమే మాయ. ఆ మాయకు నరుడిలోని
గుణత్రయమైన సత్త్వరజస్తమములు శరీరం. కాబట్టి మాయతత్త్వం గ్రహించి తమస్సును, రజస్సును మొదలు వదిలేయాలి. ఆ తరువాత రజస్సును
వదలివేయాలి. అప్పుడు ఆత్మ శుద్ధసత్త్వరూపంతో వెలుగుతూ వుంటుంది. ఆ తరువాత ఆ
సత్త్వాన్ని కూడా తొలగించుకోవాలి. అప్పుడు కేవలం జ్ఞానం-విమల బోధ కలిగి ఆత్మ
పరమాత్మగా పరిణమిస్తుంది’.
భీష్ముడు చెప్పడాన్ని
కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘గుణత్రయ రాహిత్యమే కైవల్యం. గుణత్రయ రాహిత్యమే మాయా
నాశనం. సత్త్వగుణం సుఖమయం. రజస్సు నితంతర దుఃఖనిలయం. తమస్సు జ్ఞానమాంద్యంగా దర్శనం
ఇస్తుంది. సమతా దృష్టితో ఆయా గుణాలను,
స్వభావాలను దూరం చేయాలి’.
ఆధ్యాత్మ
విద్యను వివరించిన భీష్ముడు అనంతరం ఆధ్యాత్మ విద్యకు ఉపకరించే యోగవిద్యను
వివరించాడు ధర్మరాజుకు. మనస్సు చలించకుండా ఏకాగ్రమై నిలిచి వుండాలని, అంటే గట్టి నిశ్చయం అవసరమని, మనస్సులో ఆలోచన సహజంగా వుంటుందని, గాలి కారణాన మనస్సు చలిస్తుందని, కాబట్టి మనో నిగ్రహం కొరకు వాయువును
నిరోధించాలని అన్నాడు. వాయువును నిగ్రహించడం సులభంకాదని, అది క్రమక్రమంగా సాగాలని, ఆయాసపడడం,
విసుగుచెందడం కుదరదని, స్థిరమైన సంకల్పంతో యమ నియమాదులైన
ఎనిమిది సాధనాలతో వాయు నిరోధానికై ప్రయత్నించాలని, ఆ ప్రయత్నంలో ముందుగా ఆలోచనలు కరిగిపోతాయని, తరువాత సందేహం కలుగుతుందని, ఆ తరువాత వాయువును క్రమబద్ధం చేయగలగడం
జరుగుతుందని భీష్ముడు చెప్పాడు. క్రమబద్ధమైన వాయువు శరీరాంతర్గత నాడుల ద్వారా
ప్రయాణం చేస్తూ, శరీరంలోని బ్రహ్మస్థానాన్ని చేరుకొంటుందని, అప్పుడు మనస్సు నిశ్చలమై, శాంతి పూర్ణమై,
బ్రహ్మానందాన్ని అందుకుంటుందని, ఆ తరువాత ఆ ఆనందంలో లీనమైపోతుందని
అన్నాడు.
తన తరువాత
సందేహాన్ని వినిపించాడు ధర్మరాజు భీష్ముడికి. జపం చేసే విధానాన్ని, జపం చేసేవారు పొందే ఫలితాన్నీ తెలియచేయమని
కోరాడు. జపించాల్సిన అంశం గురించి యమధర్మరాజుకు, కాలపురుషుడికి, మృత్యుదేవతకు,
బ్రాహ్మణుడికి, ఇక్ష్వాకువంశరాజుకు మధ్య జరిగిన సంవాదం
ఆధారంగా, అ ఇతిహాసాన్ని వినిపిస్తూ ధర్మరాజు సందేహానికి వివరణ ఇచ్చాడు భీష్ముడు.
ఇస్తూ ఇలా అన్నాడు: ‘జప విధిని వేదాంతవేత్తలు ఆమోదిస్తారు. ఒక సమతలం మీద దర్భలను
ధరించి ఆసీనుడై జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించి
ఏకాగ్రచిత్తంతో జపం చేయడానికి పురుషుడు ఉద్యుక్తం కావాలి. ఆ విధంగా జపవిధిని
నిర్వహిస్తే, అలాంటి నిష్ఠాభరితమైన జపం సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతమైన శాశ్వత స్థానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే, జప విధానాన్ని సరిగ్గా పాటిస్తేనే మోక్షం
కలుగుతుంది. అదే జపంలో శౌచాది లక్షణాలు లోపిస్తే, నైచ్యానికి పాల్పడితే నరకం కూడా
ప్రాప్తించవచ్చు. జపశీలురు, యోగులు పుణ్యగతులు పొందుతారు’.
జ్ఞానయోగాన్ని
గురించి చెప్పమని కోరాడు ధర్మరాజు తాత భీష్ముడిని అ ఆతరువాత. మను-బృహస్పతి అనే
పేరుతో వున్న ఇతిహాసాన్ని ఉటంకిస్తూ ధర్మరాజు సందేహాన్ని తీర్చాడు భీష్ముడు.
జ్ఞానయోగానికి మూలం మంచి కర్మయోగమే అని,
అనిష్టాన్ని తొలగించుకొనడానికి, ఇష్టాన్ని అందుకొనదానికి, మానవుడు కర్మ చేస్తాడని, ఏవైతే సుఖాలుగా అందుతాయో అవే అనంతర కాలంలో
దుఃఖాలుగా పరిణమిస్తాయని, ఏనరుడైతే తాను చేసే కర్మను ఫలం
ఆశించకుండా తన విధిగా మాత్రమే చేస్తాడో అతడు గొప్ప జ్ఞానం ద్వారా గొప్ప సిద్ధిని, ముక్తిని పొందుతాడని భీష్ముడు బృహస్పతి
మాటలుగా చెప్పాడు.
జ్ఞానయోగం
మానసిక ప్రక్రియ అని, ఆత్మజ్ఞత, అనాత్మజ్ఞత మానసిక చర్యలని, మనస్సు కలతదేరి, కల్మశానికి దూరమై, నిర్మలంగా వున్నప్పుడు పురుషుడు ఆత్మజ్ఞుడు
కాగలడని, తనను తాను గ్రహించగలడని, అయితే ఆ మనస్సు కలతతో క్షుబితమై వున్నప్పుడు
అతడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడని, అనాత్మజ్ఞుడుగా, అజ్ఞానిగా మిగిలిపోతాడని భీష్ముడు అన్నాడు.
ఇంద్రియాలు అదుపు-ఆజ్ఞలలో వుండకుండా తమతమ పనులు తాము చేసుకుంటూ పోతే కష్టాలు
తప్పవని, వాటిని అదుపు చేస్తే సుఖసంతోషాలు, శాంతి-సౌభాగ్యాలు
కలుగుతాయని, అందువల్ల ఆత్మను ఇంద్రియాల బారిన పడకుండా
రక్షించుకోవాలని భీష్ముడు చెప్పాడు.
భీష్ముడు ఇంకా
ఇలా వివరించాడు: ‘పాపాలు నశిస్తే జ్ఞానం కలిగి ప్రకాశిస్తుంది. అప్పుడు శరీరంలోని
ఆత్మ తనను తాను అద్దంలో లాగా చూసుకోగలుగుతుంది. జ్ఞానం ఆత్మలో ఐక్యమౌతుంది.
సృష్టిలో మూల ద్రవ్యాలు ఐదున్నాయని తాత్త్వికులు పలుకుతారు. అవి నేల, నీరు,
కాంతి, గాలి,
ఆకాశాలు. ఈ ఐదూ సృష్టిలో మిగిలినవాటన్నిటికన్నా పెద్దవే అయినా వాటిలో
తారతమ్యాలున్నాయి. హెచ్చుతగ్గులున్నాయి. ఇవి ఒకదానికంటే మరొకటి పెద్దవి. కాకపొతే
పెద్దవైన పంచభూతాలకంటే కూడా పెద్దది నరుడి మనస్సు. ఆ మనస్సుకంటే పెద్దది నరుడిలోని
భాగమైన బుద్ధి. వీటన్నిటి కంటే మించిన పెద్దరికం కాలానిది. దానికంటే కూడా
మించినవాడు దేవుడు. అతడు సర్వోన్నతుడు. అతడే ఈ లోకాలన్నిటికీ ప్రభువు’.
‘ఆ దేవదేవుడు
ఆది మధ్య అంతరహితుడు. కాబట్టి నాశనంలేనివాడు అతడు. అతడే లోకంలోని
జ్ఞానవిజ్ఞానఖనులని భావించబడే నాలుగు వేదాలకు,
ఆత్మ-అనాత్మ, ఆస్తిక-నాస్తిక మతాలకు ఆధారభూతమై వెలుగొందేవాడు, సంసారాన్ని అధిగమించే శక్తిని ఇచ్చేవాడూ అతడే.
ఆ పరతత్త్వం ప్రపంచంలో మనం జ్ఞానం అనుకొనే సర్వాన్ని లోగొంటుంది. తరువాత శాంతిని
పొందుతుంది. ఆ శాంతి భేదంలేని మంచి గొప్ప వెలుగు. నిజానికి ఆ శాంతిని వర్ణించి
చెప్పడం అసాధ్యం. అది ఆలోచనకు, భాషకు అందనిది. ఇతర కర్మల ద్వారా కూడా
దానిని పొందలేం’.
‘మనస్సు, బుద్ధి,
లోకజ్ఞానం, నరుడినుండి తొలగిపోతే తప్ప అతడికి శాశ్వత
సర్వవ్యాపి జ్ఞానమయ తత్త్వం, పరమేశ్వర స్వరూపం గోచరించదు. అయితే ఆ మూడూ తొలగే
మార్గం ఏది? తత్త్వజ్ఞులకు ఇది సులభమే. మనస్సుతోనే
మనస్సును లోబర్చుకోవాలి. తరువాత తొలగించుకోవాలి. బుద్ధితోనే బుద్ధిని లోగొని
అనంతరం లీనం చేయాలి. ఆ తరువాత జ్ఞానాన్ని పరతత్త్వేతరమైన తెలివితేటలన్నిటినీ
జ్ఞానంతోనే వశపరచుకొని పిమ్మట తొలగించుకోవాలి. ఈ విధంగా పరతత్త్వాన్ని అందుకోవాలి.
ఆ పరతత్త్వం గొప్ప వెలుగు. ఆ వెలుగు మృతిలేనిది, చ్యుతిలేనిది, మలినం లేనిది, కొలత లేనిది, నాశం లేనిది, చివర లేనిది. దానిని యమనియమాది సాధన సంపత్తితో
ప్రశాంతమై నిలిచిన చిత్తం ద్వారా గ్రహించవచ్చు. అప్పుడే ఆ పరతత్త్వం అనుభవానికి
అందుతుంది’.
బృహస్పతి
మనువుకు ఉపదేశించిన జ్ఞానయోగాన్ని భీష్ముడు, బృహస్పతి మాటలుగా ధర్మరాజుకు చెప్పి ఆ
మాటల అర్థాన్ని శ్రద్ధతో గ్రహించి, మనస్సులో మననం చేసి, పరతత్త్వ ప్రాప్తికొరకు మనస్సును
అభ్యాసమార్గాన పెట్టమని బోధించాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment