Sunday, February 26, 2023

విధి చేష్టలు బలీయాలని, ధైర్యమే పరమౌషధం అని, కాలమే కర్తని ప్రవచించిన భీష్ముడు ..... ఆస్వాదన-109 : వనం జ్వాలా నరసింహారావు

 విధి చేష్టలు బలీయాలని, ధైర్యమే పరమౌషధం అని,

కాలమే కర్తని ప్రవచించిన భీష్ముడు

ఆస్వాదన-109

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-02-2023)

ఇంద్ర-ప్రహ్లాద సంభాషణ సారాంశాన్ని భీష్ముడి ద్వారా ఆలకించిన ధర్మరాజు తన తరువాత ప్రశ్నగా ‘రాజు సిరిని ఏ కారణాన కోల్పోతాడు అని అడిగాడు. పూర్వం దేవేంద్రుడికి, బలిచక్రవర్తికి సంవాదం జరిగిందని, ఆ వృత్తాంతంలో ధర్మరాజు ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని, ఆ వివరాలను చెప్పాడు భీష్ముడు.

‘లోకంలో క్రమంగా ప్రాణికోటికి మేలు-కీళ్లు, చావు-బతుకులు, సుఖానుభావాలు, దుఃఖపీడనలు వచ్చి పడుతూ వుంటాయి. అయితే ఎప్పుడు మేలు జరిగినా, ఎప్పుడు కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, దుఃఖం ముంచుకొచ్చినా, మనిషి సమభావంతో నిలిచి వుండాలి. అప్పుడే ఆ మేలు-కీడుల ప్రభావం అలాంటి వారిమీద ప్రసరించదు. లోకంలో వున్న నరులలో శరీర బలం, బుద్ధి, వివేకం, పనులలో ఎంతో సామర్థ్యం కలవారున్నారు. ఇవేవీ లేనివారు కూడా పుష్కలంగానే వున్నారు. కాని కాలుడు మాత్రం కాలం సమీపించినప్పుడు ఆ ఇరుతెగలవారినీ స్వేచ్చగా, తిరుగులేకుండా హరించివేస్తూనే వున్నాడు. కాలుడి దగ్గర బలవివేక సామర్థ్యాలేవీ కొరగావడం లేదు. త్రిగుణాలు శాంతించి ఉన్నవారిలో అలుక కలగదు. విధి కోరికను బట్టి ప్రాణుల జీవితాలలో వికాసం కానీ, వినాశం కానీ జరుగుతుంటుంది. విధి చేష్టలు బలీయాలు. ఇతరుల దైన్యాన్ని చూసి ఎకసెక్కాలాడడం నీచ స్వభావం. సత్యం, ధర్మం, దమం, దానం అనే గుణాలు లక్ష్మీ నిలయాలు. అవి ఎక్కడ వుంటే అక్కడే లక్ష్మి వుంటుంది. ఈ గుణాలకు అదనంగా వేదశాస్త్ర విహితాలైన ధర్మాలను ఆచరించే సల్లక్షణం ఉన్నవారి దగ్గర కూడా లక్ష్మి నిలుస్తుంది’.

 ఈ విధంగా దేవేంద్రుడికి, బలిచక్రవర్తికి జరిగిన సంవాద సారాంశాన్ని వినిపించిన భీష్ముడు ‘దేవేంద్ర -నముచి సంవాదం లోని అంశాలను కూడా ప్రస్తావించాడు. సృష్టిలో ఎల్ల ప్రాణులకు ఏలిక ఒకడున్నాడని, అతడి ఏర్పాటు ప్రకారం ఏ ప్రాణికి ఏది ఎప్పుడు లభించాలో, ఆ ప్రాణికి, అది అప్పుడు సులభంగా వచ్చి చేరుతుందని, ఫలానాది జరగాల్సి వుండే జరిగిందన్న గట్టి నిశ్చయంగల యోగ్యుడికి ఆనందం, దుఃఖం, సంపత్తి, విపత్తి లాంటి ద్వంద్వాలు వుండవని, ఏదైనా కార్యం అలభ్యమని దైవం నిర్ణయించి వుంటే దానిని నరుడు ఎలాంటి పరిస్థితుల్లోను పొందనేలేడని, జీవితంలో మేలు, కీడు అనేవి కాలవశాన తప్పకుండా నరుడిని చేరేవే తప్ప కోరితే వచ్చేవి కావని, వద్దంటే పోయేవి కావని, కాబట్టి అలాంటి మేలు, కీడుల విషయంలో చింతించడం పనికి రాదని భీష్ముడు, నముచి అనే రాక్షస రాజు దేవేంద్రుడికి చెప్పిన మాటలుగా ధర్మరాజుకు తెలియచేశాడు.

ఏదైనా చెడ్డ అవస్థ నరుడికి కలిగినప్పుడు అతడు ఏవిధంగా ప్రవర్తించి ఆ దుర్దశను దాటగలగాలని ప్రశ్నించాడు ధర్మరాజు భీష్ముడిని. దురవస్థలు ఏ విధమైనవైనా వాటన్నిటికీ ధైర్యమే ఔషధం అని, ధైర్యంతో గట్టి నిర్ణయం తీసుకొన్న మనస్సు ఎలాంటి నిండు శోకాలలోనైనా, దుఃఖాలలోనైనా చలించకుండా నిలుస్తుందని, కష్టనష్టాలను అతిక్రమిస్తుందని, ధైర్యం ఆరోగ్యాన్ని ఇస్తుందని, ధీరగుణం ప్రకాశించే సిరులు కురిపిస్తుందని, ధీరస్వభావం యశస్సును ఉన్నతంగా పెంచుతుందని అంటూ భీష్ముడు ధైర్యం కలగాలంటే నరుడికి కాలపు నడకను గూర్చిన జ్ఞానం వుండాలని చెప్పాడు. ఇదే విషయానికి చెందిన ఇంద్ర-బలి సంవాదం అనే వృత్తాంతం సారాంశాన్ని, బలి దేవేంద్రుడికి చెప్పిన హితవచనాలను కూడా వివరించాడు భీష్ముడు.

‘విధి చేష్టలవల్ల ఏపాటివారికైనా అప్పుడప్పుడు హైన్యదైన్యాలు తప్పవు. విధి చేష్టలకు తిరుగు లేదనే జ్ఞానంతో నరుడు ధైర్యం కలిగి వుండాలి. జీవితాన సుఖదుఃఖాలు క్రమంగా ఒకదాని తరువాత మరొకటిగా నరులకు కలుగుతుంటాయి. ఆ క్రమం తప్పించరానిది. కాబట్టి నరుడు ధైర్యంతో మెలగుతూ, సుఖం కలిగినప్పుడు గర్వాన్నీ, దుఃఖం కలిగినప్పుడు విషాదాన్నీ, ప్రకటించకుండా అణచుకోవాలి. నరుడి మహర్దశకు కాని, దుర్దశకు కాని, దైవమొకటే కారణం కాని ఇతరులెవరూ కాజాలరు. స్నేహితులు, చుట్టపక్కాలు, సహాయకులు, సంపదలు, సమృద్ధులు, ఎన్ని వున్నా నరుడికి చెడుకాలం దాపురించినప్పుడు. దుర్దశ ఆవహించబోతున్నప్పుడు తొలగించజాలవు. ఇది గ్రహించి నరుడు జీవించాలి. జీవితం ఎప్పుడూ ఏకరీతిలో కొనసాగదని గ్రహించి జీవించాలి’.

‘నరుడికి వాటిల్లే శుభాశుభాలు రెండింటికీ కాలం ఒక్కటే కర్త తప్ప నరుడు కాబోడు. కాల ప్రవర్తన ఊహకు అందనిది. కాలం దేనినీ సరకుగొనదు. అన్నీ కాలానికి లొంగిపోవాల్సిందే కాని అది దేనికీ లొంగదు. కాలం వల్లే నరులకు అన్ని తీరులు, ఎల్ల అవస్థలు, సకల దశలు కలుగుతాయి. కాలం ప్రమాదం ఎరగకుండా జాగరూకతతో ప్రవర్తిస్తూ వుంటుంది. దాని గమనంలో పరాకుకు స్థానం లేదు. కాలం తననుతాను రూపంలో సమకూర్చుకుంటూ, పెరిగి-పెరిగి చివరకు జగత్తునే కబలిస్తుంది. విశ్వంభరగా లోకమంతా తానే అయి కాలం సర్వస్వాన్నీ స్వాధీనం చేసుకొంటుంది. నరులంతా చివరకు కాలాధీనులై పోతారు. కాలం ఒక నది. నిరంతర ప్రవాహశీలి. తన గమనంతో నరుడిని లోగొని అణచివేస్తుంది. నరుడు ఈ వాస్తవం గ్రహించలేడు. నరుడు కాలమహిమను గ్రహించలేక, జరిగే హటాత్సంఘటనలను చూసి ఆశ్చర్యపోతాడు. నరుడు అంతర్ముఖుడై జిజ్ఞాసతో, నిరంతర తపనతో కాలతత్త్వాన్ని అన్వేషించాలి. అపుడు నరుడు విద్వాంసుడు అవుతాడు. కాల ప్రవృత్తి స్పష్టంగా గోచరిస్తుంది’.

ఈ విధంగా భీష్ముడు, దేవేంద్రుడికి బలిచక్రవర్తి చెప్పిన విధంగా కాల మహిమను, ధర్మరాజుకు వివరించాడు. జీవుడు దేనివల్ల వృద్ధి పొందుతాడని, దేనివల్ల నశిస్తాడని ప్రశ్నించాడు భీష్ముడిని ధర్మరాజు. ఈ విషయాన్ని వివరించడానికి ‘శ్రీ శక్ర సంవాదం వున్నదని, దాని సారాంశాన్ని చెప్పాడు భీష్ముడు.

‘గురువుల పట్ల భక్తి చూపేవారి దగ్గర; దేవతలను, పితృదేవతలను పూజించేవారి దగ్గర; సత్యం పలికేవారి దగ్గర; దానం చేసేవారి దగ్గర; ఇతరులకు చెందిన ధనం, స్త్రీలపట్ల విముఖత చూపేవారి దగ్గర; విప్రుల మీద ప్రీతి కలిగినవారి దగ్గర; పగటిపూట నిద్రించని వారి దగ్గర; వృద్ధుల, బలహీనుల, దీనుల, స్త్రీల మీద దయచూపేవారి దగ్గర; బాహ్యంగాను, అంతరంగికంగాను శౌచం పాటించేవారి దగ్గర; అతిథుల్లాగా వచ్చినవారు భుజించగా మిగిలిన దానిని మాత్రమే భుజించేవారి దగ్గర తానుంటానని, అలాంటివారిని మెచ్చుకుంటానని లక్ష్మీదేవి అంటుంది. ధర్మహీనులై, కామక్రోధాలు ఎక్కువగా కలిగి, గర్వంతో కూడినవారై, పూజార్హమైన కానుకగాని, బిక్షగాని పెట్టకుండా కఠినమైన మాటలు మాట్లాడుతూ, క్రూరమైన ప్రవర్తన కలిగేవారిని లక్ష్మీదేవి మెచ్చదు’. అలా లక్ష్మి చెప్పినట్లు చేస్తే ఆమె స్థిరంగా నిలిచి పోతుందని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు.

తన తరువాత ప్రశ్నగా ధర్మరాజు, ‘ప్రజలకు ఏ రకమైన ఆచారం వల్ల, ఏ విధమైన శీలం వల్ల, ఏ చదువు వల్ల ముక్తి దొరుకుతుంది అని భీష్ముడిని అడిగాడు. సమాధానంగా ‘దేవల-జైగీషవ్య సంవాదం’ అనే పూర్వ గాథను వినిపించాడాయన.

దాని సారాంశం: ‘పరులు పొగడినా, తెగడినా ప్రీతికాని, అప్రీతికాని లేకుండా వుండడం, అలాగే పరులు కొట్టినా-తిట్టినా కోపం లేకుండా వుండడం జ్ఞానులైనవారి గుణాలు. సంతోషం, అభిమానం, అసహనం, అపరాధం, మదించడం, తన గొప్పతనాన్ని గురించి కాని, తక్కువతనాన్ని గురించి కాని చింతిస్తూ వుండడం అనేవి నిరసించబడిన గుణాలు. అంతరిందరియ నిగ్రహం కలవాడు తనకు అవమానం జరిగితే అమృతం తాగినట్లుగా తృప్తి పొందుతాడు. సమ్మానం జరిగితే విషం తాగిన భావన కలుగుతుంది. సమ్మానం కావాలని కోరడు. అవమానం జరిగితే కలత చెందడు. ఆత్మతత్త్వం తెలిసినవాడికి ఏ విధమైన జనులను చూసినా భేదభావం కలగదు. జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను జయించినవాడు హృదయంలో శాంతి పొందుతాడు. శాంతివల్ల వాడికి శాశ్వత సుఖం కలుగుతుంది. అప్పుడు అతడిలో ఏ విధమైన వికారాలు కలగవు’.

‘సమస్త జనులకు, సకల ప్రాణులకు ప్రియమైనవాడు ఎవరు అని పితామహుడిని ప్రశ్నించాడు ధర్మరాజు. పూర్వం ఉగ్రసేనుడికి, శ్రీకృష్ణుడికి, నారదుడి విషయంలో ఒక సంవాదం జరిగిందని, ఆ సంవాదంలో ధర్మరాజు ప్రశ్నకు జవాబున్నదని, దానిని వివరించాడు. శాస్త్రజ్ఞానం, సదాచారం కలిగి వుండడం; ఇసుమంతైనా అహంకారం లేకపోవడం; చక్కటి శీలం; వికారం లేని వేషం; మాత్సర్యం, గర్వం, మదం అనే దుర్గుణాలు లేకపోవడం; ప్రసిద్ధి పొందిన పుట్టుక, తపస్సు, తేజస్సు, బుద్ధి, వినయం, నీతి; ధీరత్వం, మధురమైన మాటలు కలిగి వుండడం; శఠత్వం, దీనత్వం, కోపం, లోభం అనే దుర్గుణాలను ఈసడించుకోవడం; ఈర్ష్య, గర్వం, అసూయ, తిరస్కారభావం తెలియకపోవడం లాంటివి కలిగిన నారదుడి కున్న గుణగణాలు అందరికీ ప్రియమైనవని, సమస్త ప్రాణులకు ఇష్టమైనవని భీష్ముడు అన్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థ-పంచమాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment