మోక్ష కారణమైన జ్ఞానాన్ని, సద్గుణ లక్షణాలను,
విధి చేష్టితాన్ని వినిపించిన భీష్ముడు
ఆస్వాదన-108
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (20-02-2023)
మిథిలానగరాధీశ్వరుడు
జనక మహారాజు ఏ కర్మ వల్ల ముక్తిని పొందగలిగాడని తాత భీష్ముడిని ప్రశ్నించాడు
ధర్మరాజు. జవాబుగా భీష్ముడు చెప్పాడిలా. ‘జనక మహారాజుకు వందమంది ఆచార్యులున్నారు.
వారు సత్యనిరూపక పరమాత్మ స్వరూపమైన శాస్త్రాన్ని ఆయనకు వినిపిస్తూ, శాస్త్రార్థాలను మాత్రం వేర్వేరు విధాలుగా
తెలియచేసేవారు. వారు ఏవిధంగా వినిపిస్తే రాజు ఆవిధంగానే వారివద్ద నేర్చుకునేవాడు.
అలా ఆయన వింటున్న రోజుల్లో ఒకనాడు సత్యజ్ఞానంతో గొప్పవాడైన (కాపిలేయుడుగా పిలవబడే)
పంచశిఖుడనే బ్రాహ్మణుడు ఆయన ఆస్థానానికి వచ్చాడు. జనకుడి నూర్గురు ఆచార్యులను ఆయన
తన హేతుపూర్వక వాదనతో జయించి వారిని నిరుత్తరులను చేశాడు. అతడి విశేష
పరిజ్ఞానానికి ఆశ్చర్యపడిన జనకుడు, తన గురుశతకాన్ని విడిచి అతడిని ఆశ్రయించి, తనకు తత్త్వోపదేశం చేయమని అర్థించాడు.
పంచశిఖుడు ఆ రాజుకు మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన ఉపదేశ సారాంశం
ఆయన మాటల్లోనే చెప్తాను’.
‘మాయ కోరికకు
కారణం. కోరిక కర్మకు కారణం. కర్మ పాప పుణ్యాలకు మూలం. ఆ పాపపుణ్యాల అనుభవం కొరకు
ప్రాణికి పునర్జన్మ అవసరం అవుతుంది. మాయ పేరాశ. మాయకు లోభ, మొహాలు దోహదపడగా అదే బహుకర్మలకు ఆధారంగా మారి, నరుడిని జనన మరణ చక్రాన పడేసి తిప్పుతుంది.
గుణత్రయాన్ని ఆత్మతత్త్వంలో లీనం చేయాలి. అప్పుడవి తమ ఉనికిని కోల్పోతాయి. నరుడు
తన మనస్సును లౌకికాలైన సుఖదుఃఖాల వెంటబడిపోకుండా అంతర్ముఖంగా తిప్పేసి ఆత్మలో
చేర్చగలగాలి. ఆ విధంగా ఆత్మలో చేర్చబడ్డ మనస్సు తన ఆకారాన్ని కోల్పోతుంది’.
పంచశిఖుడు
చెప్పిన వాక్యాలకు జనకుడు ప్రభావితుడయ్యాడని, ఆ మాటలు అతడిని విరక్తుడిని చేసిందని, దాంతో జనకుడు తన మిథిలానగరం కాలిపోతున్నా ఏమీ
పట్టనట్లు వూరుకున్నాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. పితామహుడి పలుకులు విన్న
ధర్మరాజు మరొక ప్రశ్న అడిగాడు. ‘ఎలాంటి వాడు సుఖంతోను, శుభంతోను కూడి నిర్భయుడై జీవించగలడు’ అని
ప్రశ్నించాడు. దమం సద్గుణాల రాశి అని,
శౌచాదులు సద్గుణాలని, దమము అనే ఒక్క లక్షణంలో ఎన్నో సద్గుణాలు ఇమిడిపోతాయని, అలాంటి సద్గుణ లక్షణాలుగల ధన్యజీవికి ఇహలోక
విషయాల వల్ల కాని, పరలోక విషయాల వల్ల కాని, ఎలాంటి భయం ఏర్పడదని, అతడు శాంతికి, సుఖానికి నిలయమైనవాడని,
జ్ఞానం వల్ల సౌమ్యమైన ఆకారంతో వెలుగొందేవాడని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు.
వ్రత నిర్వహణలో
వున్న కొందరు భోజనాలు చేస్తే వారికి వ్రత భంగం కలగడా అని ప్రశ్నించాడు ధర్మరాజు.
జవాబుగా భీష్ముడు, ఉపవాస వ్రతంలో వున్నవారు వేదోక్తాలైన భోజనాలను
బ్రాహ్మణుల నిర్దేశానుసారం చేయడంలో తప్పులేదని,
అయితే, మోక్షార్థి అయిన సాధకుడు సదా ఉపవాసిగా, బ్రహ్మచారిగా వుండాలని అన్నాడు. రోజుకు రెండు
పూటలా భోజనం చేస్తూ మధ్యమధ్య ఏమీ తిననివాడు సదోపవాసని; ఋతుకాలంలో మాత్రం
ధర్మపత్నితో సంగమించే సచ్చీలుడు సదా బ్రహ్మచారని; దేవతల, పితరుల, అతిథులకొరకు వండి వడ్డించి ఆ తరువాత
మాత్రం భుజించేవారు అమాంసభోజులని; తనతో తన పంక్తిలో భుజించే వారితో పాటు
సమానంగా మాత్రమే భుజించే వాడు (భుక్తశేషభోజి) విఘసాశనుడని; సేవకులంతా భుజించిన
తరువాత మాత్రమే తాను భుజించే పుణ్యాత్ముడు అమృతాశి అని; పగటి పూట నిద్రపోని వాడు అస్వప్నుడని భీష్ముడు
చెప్పాడు.
కర్మలు, సంస్కార
వశాన నరుడికి మంచి చెడులు కలిగిస్తూ వుంటాయని, ఆ
కర్మలకు కర్త నరుడౌనో, కాడో, నిర్ణయించడంలో తనకు స్పష్టత కావాలని ధర్మరాజు
అడిగాడు. దానికి బదులుగా భీష్ముడు ధర్మరాజుకు ఇంద్ర-ప్రహ్లాద సంభాషణ అనే
వృత్తాంతాన్ని ఉదహరిస్తూ చెప్పాడు. దాని సారాంశాన్ని ఇలా క్లుప్తీకరించాడు
భీష్ముడు.
‘సంపదలు
యత్నించి ఆర్జించక పోయినా తమంతట తామే వచ్చి పడతాయి. ప్రయత్నించి సమార్జించి తెచ్చి
వుంచితే వూరికే నశించిపోతాయి. కాబట్టి పరిశీలించి చూస్తే అవి విధికి లొంగి
వుండేవేకాని నరుడి ప్రయత్నానికి లొంగినవి మాత్రం కావు. జీవితంలో నరుడికి అనేక
కష్ట-నష్టాలు వస్తుంటాయి. ఇదంతా విధాత ఆడించే ఆట తప్ప అన్యం కాదు. తాను కర్తను అని
నరుడు అనుకోవడం అజ్ఞానం. నిజంగా తాను కర్త అయితే ఏ లాభం ఏర్పడకుండానే అన్ని పనులను
చేస్తున్నవాడు కాబట్టి చేసేది అంతా విదాతే అవుతాడు. అంతేకాని నరుడు కానేరడు. నరుడు
అహంకారిగా జీవించేటప్పుడు విధి చేష్టితాన్ని కూడా తన పనిగానే భావించి, ఆ కర్మ
ఫలితంలో తగుల్కొంటాడు. దానికి అతడి అహంకారమే మూలకారణం. అయితే, అహంకారానికి లొంగని నరుడు మాత్రం విధిచేతను
తనదిగా భావించడు కాబట్టి, అతడికి ఆ కర్మఫలితాన్ని తోసివేసే శక్తి వుంటుంది. ఆ
శక్తి అతడి అనహంకార శీలం వల్ల లభించింది’.
‘కర్త విధి
కాబట్టి, ఆ విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో వూరకనే
చూస్తూ వుండాలి. ఆ కర్మలు సిద్ధించినప్పుడు సుఖాన్నీ, సిద్ధించనప్పుడు దుఃఖాన్నీ పొందకుండా
వుండడంకొరకు నరుడు తన మనస్సును విషయాల నుండి తొలగించే ఉపాయం కనుగొనాలి. ఆ విధమైన
ఉపాయం గొప్పది. నరుడు దాంతి, శాంతి,
ప్రజ్ఞ కలిగినవాడైనప్పుడు అతడి చిత్తం ఏవిధంగానూ ఆయాసంతో అలసిపోదు. నిష్కపటమైన
ప్రవృత్తి, దయాగుణం, తాను శరీరం కాదు-ఆత్మ అనే భావన, పరాకులేకుండా జాగ్రత్తగా వ్యవహరించడం, పెద్దల పరిచర్యాలలో నిజమైన ఆసక్తి మొదలైన
సద్గుణాలు నరుడికి శుభాన్ని కలిగిస్తాయి. జ్ఞానం, శాంతి అనేవి కాలక్రమేణా తమంతట తామే నరుడిలో చోటు చేసుకుంటాయి’.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment