ప్రభవిస్తున్న ‘భారత’ రాజనీతిజ్ఞుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (17-02-2023)
(తెలంగాణ శాసనసభ బడ్జెట్
సమావేశాలలో 2023 ద్రవ్యవినిమయ బిల్లుకు సంబంధించి జరిగిన చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి
కేసీఆర్ వెలువరించిన అద్భుత ప్రసంగం ఆసాంతం విన్నవారికి కేసీఆర్ లోని ఒక గొప్ప
నాయకుడు దర్శనమిస్తాడు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, దేశ పురోగతి, ప్రాతిపదికగా, రాజధర్మానికి
అనుగుణంగా ఆ మహోపన్యాసం కొనసాగింది. వర్తమాన రాజకీయ నాయకులలో కేసీఆర్ దార్శనికత అరుదైన
విషయం-ఆంధ్రజ్యోతి సంపాదకుడు)
ఇటీవల ముగిసిన రాష్ట్ర శాసనసభ బడ్జెట్
సమావేశాలలో 2023 ద్రవ్యవినిమయ బిల్లుకు సంబంధించి జరిగిన చర్చకు సమాధానమిస్తూ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఉదాహరణలను ఉటంకిస్తూ, మధ్యమధ్యలో ప్రఖ్యాతిగాంచిన ప్రచురణలలో, కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలను సందర్భోచితంగా
ప్రస్తావిస్తూ, సభ్యుల హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలువరించిన అద్భుత ప్రసంగం ఆసాంతం విన్నవారికి
కేసీఆర్ లోని ఒక గొప్ప నాయకుడు, అసామాన్య రాజనీతిజ్ఞుడు దర్శనమిస్తాడు. అణుమాత్రం సంకోచం లేకుండా, సాక్ష్యాధారాలతో, కఠినమైన వాస్తవాలతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వేలెత్తి చూపుతూ, ఆయన
నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను సవివరంగా సభకు తెలియచేస్తూ, గడచిన ఎనిమిదిన్నర సంవత్సరాలలో దేశం అన్ని రంగాలలో ఎలా
వెనుకబడిందో కేసీఆర్ పేర్కొన్న విధానం, నాయకత్వ లక్షణాలకు, రాజనీతిజ్ఞతకు ఒక
ప్రతీక. దేశంలో విపరీతమైన పరిస్థితులు నెలకొన్నందువల్లే, జరిగిన, జరుగుతున్న, జరగబోయే వైఫల్యాలను సరిదిద్దడానికే భారత్
రాష్ట్రసమితి ఆవిర్భావం జరిగిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం 2024 తరువాత వందశాతం
కుప్పకూలడం ఖాయమన్న ప్రభల విశ్వాసాన్ని వెలిబుచ్చిన కేసీఆర్, బీఆర్ఎస్ కోరుకుంటున్న ఆ పార్టీ సారధ్యంలోని ‘అబ్ కీ బార్
కిసాన సర్కార్’ అధికారంలోకి రావడం తధ్యమని ఘంటాపధంగా
అన్నారు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన తరువాత, సాక్షాత్తు వాజ్ పాయి
లాంటి వారే ఆమెను దుర్గామాతగా నిండు సభలో పొగిడినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెది తితుగులేని నాయకత్వం అని అందరూ ఆకాశానికి
ఎత్తినప్పటికీ, ఆమెకు పోటీగా సమీపదూరంలో ఎవరూలేరని రాజకీయ
విశ్లేషకులు అంచనావేస్తున్న నేపధ్యంలో, ఎలా ఆమెకు వ్యతిరేకంగా జనతా నాయకత్వం ఉద్భవించిందో, ఎలా ఆమెను పదవీచ్యుతిరాలిని చేసిందో, తదనంతరం ఆ పార్టీ తప్పులు చేస్తే ఆమెనే అధికారంలోకి
తెచ్చిందో సోదాహరణంగా వివరించారు కేసీఆర్, ప్రజాస్వామ్యంలో పదవి తాత్కాలికమని, అవసరమైనప్పుడు ప్రజలు సరైన పాఠం చెప్తారని అన్నారు. అదే
మోదీకి కూడా జరగబోతున్నదని వ్యాఖ్యానించారు. ఈ దేశం చేసుకున్న దురదృష్టం 2014 లో,
ఆ తరువాత 2018 లో మోదీ గెలవడమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేయనందువల్ల బీజేపీని గెలిపించారని, మోదీ గెలిచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాని
భారతదేశ ప్రజలు మాత్రం ఓడిపోయారని వ్యాఖ్యానించారు కేసీఆర్.
‘నేను బీఆర్ఎస్ పార్టీని నిర్మాణం
చేస్తున్నది ఎన్నికలలో ప్రజలు గెలవడానికే. ప్రజలే గెలవాలని మేము ఖచ్చితంగా
చెప్పుతున్నాం. అది ఖచ్చితంగా నిజం కావాలి. వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్
పార్టీని గెలిపించి ప్రజలు గెలిచారు. ఇందులో తమ గెలుపు వుందని భావించి రెండవసారి
కూడా గెలిపించారు. లక్షలాదిమంది పించన్
దారులు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, యావత్ మహిళా లోకం గెలిచారు. 24 గంటలు విద్యుత్, రైతుబంధు, రైతు బీమా
పొందుతున్న రైతన్నలు గెలిచారు. వలసలు పోవడం మానిన పాలమూరు బిడ్డలు గెలిచారు.
తండాల్లో గ్రామ పంచాయితీలు సాధించుకున్న తెలంగాణ గిరిజన బిడ్డలు గెలిచారు. గురుకుల
విద్యార్థులు, చేనేత కార్మికులు, యాదవబిడ్డలు, మత్స్యకారులు, లక్షలమంది
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులు గెలిచారు. మేము
తెలంగాణాలో ఎన్నో మంచిపనులు చేశాం. భవిష్యత్ ఎన్నికల్లో కూడా గెలుపు
ప్రజలదే....బీఆర్ఎస్ దే’ అన్నారు కేసీఆర్.
జవహర్లాల్ నెహ్రూ పాలనా కాలాన్ని
మినహాయించి, కాంగ్రెస్ పార్టీని సాధారణంగా
తీవ్రంగా విమర్శించే కేసీఆర్, తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించుకుంటూ, యూపీయే సారధ్యంలోని ప్రధాని మన్మోహన్ సింగ్ సాధించిన కొన్ని
అద్భుతమైన విజయాలను, దరిమిలా ఆ విజయాలు మోదీ హయాంలో ఎలా తిరోగమన దిశగా పయనించాయో పోల్చి చూపి
చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ తన ప్రసంగం ఆరంభంలోనే ద్రవ్యవినిమయ బిల్లుకు
సంబంధించిన చర్చలో పాల్గొన్న ప్రతిపక్ష సభ్యుల సూచనలను, అమూల్యమైన సలహాలను
ప్రస్తావిస్తూ, ప్రభుత్వ పక్షాన వారికి ధన్యవాదాలు
తెలియచేస్తూ, వాటిని పరిగణలోకి తీసుకోవాలని
సంబంధిత మంత్రులను ఆదేశించారు.
భారతదేశం లాంటి ఒక శక్తివంతమైన
ప్రజాస్వామ్య వ్యవస్థలో కావాల్సింది ప్రతిపక్ష సభ్యులతో సత్సంబంధాలే అని సభానాయకుడైన
కేసీఆర్ చెప్పకనే చెప్పారు. అలాగే సహకార సమాఖ్య పునాదులమీద వెలసిన ఈ
ప్రజాస్వామ్యంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ప్రధాని-ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు కూడా
వుండాలని అర్థంవచ్చే రీతిలో చెప్పారు. కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడు, రాజకీయనాయకుడు ఇలాంటివి అనుసరించడంలో తుచ తప్పకుండా
సాంప్రదాయాలను, నియమనిబంధనలను పాటిస్తున్నారనేది
తెలియచేప్పేవి ఆయన ప్రసంగంలోని మాటలే. కేంద్రానికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకత
వున్నప్పుడు ఇచ్చే విషయంలోనూ, ప్రజాభీష్టానికి విరుద్ధంగా వున్న విధానాలతో విభేదించే విషయంలోనూ కేసీఆర్ ది ఒక
ప్రత్యేక దృక్ఫదం అనడంలో అతిశయోక్తి లేదు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి!! దట్ ఈజ్
కేసీఆర్!!
జవహర్లాల్ నెహ్రూ పాలనా కాలంలోని
సుపరిపాలనను ప్రస్తావిస్తూ, ఆయన తదనంతరం వచ్చిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనల్లో ప్రజలను, ప్రజాప్రతినిధులను ఎలా చీకట్లో అవి పడవేశాయో
వివరించారు కేసీఆర్. ‘నెహ్రూగారు జైళ్లలో పడి, కష్టపడి, కుటుంబాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుని, దేశంకోసం
కొట్లాడాడు కాబట్టి, నవభారత నిర్మాత కాబట్టి, ఆ తపన మనిషిలో వున్నది, బాధ్యత
వున్నది. అందువల్ల వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక, దేశానికో దారి, దిక్కు, ఒక ప్రణాళిక రూపొందించాడు. ఆయన పాలనలో ప్రణాలికా శాఖ, ప్రణాలికా సంఘం అంటే గొప్పగా వుండేవి. ఆయన తరువాత
ఆగమైపోయాయి. ఈ రోజు వరకు మళ్లీ కోలుకోలేదు’ అన్నారు కేసీఆర్. ఇవ్వాళ మన ప్రయాణం ఎటువైపని, దేశం ఏదిశగా పయనిస్తున్నదని, ఎక్కడికి చేరుకుంటుందని, లక్ష్యం, ధ్యేయం లేనటువంటి దేశం ఏమైపోవాలని ఆవేదనతో ప్రశ్నించారాయన.
దురదృష్టవశాత్తు కొందరు రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులు, మన్మోహన్ సింగ్ ను, నెహ్రూను, కేసీఆర్ పొగడడం తప్పుగా
అర్థం చేసుకుని విమర్శిస్తున్నారు. కొందరు మరికొంత ముందుకు వెళ్లి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు వుండబోతున్నదని జోస్యం కూడా
చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు అంశాల ప్రాతిపదికన వుండాలి కాని, కేవలం విమర్శ కోసమే వుండకూడదు. కేంద్ర విధానాలు మంచివైన
సందర్భంలో మద్దతు ఇచ్చిన సందర్భాలున్నాయి. కానప్పుడు వ్యతిరేకించిన సందర్భాలూ
వున్నాయి. ఒకప్పుడు మద్దతు ఇచ్చి, అవి అనుకున్న రీతిలో ప్రజలకు ఉపయోగపడడం లేదని భావన కలిగినప్పుడు
పునరాలోచించుకున్న సందర్భాలూ వున్నాయి. దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం వుందా? ఏది, ఏవిధంగా చేసినా, శాస్త్రీయ దృక్ఫదంతో, సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగానే కేసీఆర్ నిర్ణయాలు
వుంటాయనేది ఆయన ప్రసంగ సారాంశం అనుకోవచ్చు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికగా, దేశాభివృద్ధి ప్రాతిపదికగా, రాజధర్మానికి అనుగుణంగా
కేసీఆర్ ప్రసంగం కొనసాగిందినేది నిర్వివాదాంశం. వర్తమాన రాజకీయ నాయకులలో ఇది అరుదైన
విషయం.
కేసీఆర్
ద్రవ్యవినిమయ బిల్లుమీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ప్రసంగించిన తీరుతెన్నులను,
ప్రజాస్వామ్య స్ఫూర్తి కలబోసిన ఆయన వివేకం, రాజకీయ చతురతలోని మరోకోణం అడ్డం పట్తున్నాయి. ప్రసంగం
ఆరంభంలోనే, దేశంలో నెలకొన్న విచిత్రమైన పరిస్థితులను, వింత ధోరణులను, చిత్రవిచిత్రమైన పోకడలను ప్రస్తావిస్తూ, ఎందుకు ఇలా జరుగుతున్నాయనే విషయంలో ఆలోచించాల్సిన అవసరం,
చర్చించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిమీద వుందన్న అభిప్రాయం వెలిబుచ్చారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో, జాతినిర్మాణ రంగంలో పనిచేసే ప్రతిఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలని
ఆయన ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.
శాసనసభను పవిత్రమైన దేవాలయంగా
అభివర్ణిస్తూ, అక్కడ నువ్వెంత అంటే నువ్వెంత అనేరీతిలో ఆషామాషీగా కాకుండా, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, మధ్యమధ్యలో చెలరేగే ఆక్రోశాల
సమాహారంగా ప్రజాజీవితంలో వుండేవారు చర్చ జరపాల్సిన అవసరం వుందని స్పష్టం చేశారు.
దురదృష్టవశాత్తు పార్లమెంట్ తో సహా చట్ట సభల్లో జబ్బలు చర్చుకుంటూ మాట్లాడడం, అసలు విషయం విడిచిపెట్టి ఇంకేదో మాట్లాడడంలాంటి రకరకాల పెడ
ధోరణులు కనబడుతున్నాయన్నారు. అదానీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, పార్లమెంటులో ప్రధానమంత్రి ఘోరమైన ఉపన్యాసం చేశారని, ఈ దేశం వుంటుందా? లేదా, దేశం పరిస్థితి ఏమిటో అర్థం
కావడంలేదని, ఇది మారాల్సిన అవసరం వుందని, మారకపోతె దేశానికి ఏరకమైన మేలు జరగదని ఆవేదనతో అన్నారు. అందుకే బీఅరేస్
ఆవిర్భవించింది అన్నారు.
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం
ప్రదర్శిస్తున్న వివక్షను, ప్రత్యేకించి ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపులను ఉటంకిస్తూ
ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ
ప్రభుత్వ హయాంలో, నరేంద్ర మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూపిస్తూ, పూజా మెహ్రా అనే జర్నలిస్ట్ రాసిన ‘ద లాస్ట్ డకేడ్’ అన్న
పుస్తకంలోని అంశాలను ప్రస్తావించిన కేసీఆర్, మోదీ కన్నా మన్మోహన్ బాగా పని చేసినప్పటికీ ప్రచారం తక్కువ
చేసుకున్నారని, చేసింది చెప్పుకోలేదనీ, మోదీ చేసింది తక్కువైనా, ఆర్భాటంగా ఎక్కువ ప్రచారం
చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
ఎంత జనాభాకు ఎంత ఎకానమీ వుండాలనేది
ముఖ్యమని, అసలు విషయమని, తలసరి ఆదాయంలో అసలు విషయాలు బయటపడుతాయని, ఎంత సైజు జనాభాకు ఎంత ఎకానమీ వుందనేది తెలుస్తుందని, ప్రపంచంలోని 192 దేశాలలో మనదేశం రాంక్ 139 అని, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల కంటే మన రాంక్
తక్కువని, పార్లమెంటులో, శాసన సభల్లో దీనిమీద, ఇలాంటి అనేక విషయాల మీద చర్చ
జరగాలని, అంతేకాని ఎవరెన్ని ప్రభుత్వాలను కూల్చారన్న విషయంలో కాదని,
ప్రతిపక్షాలవారిని పార్లమెంటులో మాట్లాడకుండా బుల్డొజ్ చేయడం సరైన పద్ధతికాదని
కేసీఆర్ స్పష్టం చేశారు. తన వాదనను ఇంకా బలంగా వినిపిస్తూ, కేసీఆర్, మనదేశం అన్ని రంగాలలో వెనుకబడి పోతున్నదని, దేశప్రజలు పౌరసత్వం వదులుకుని ఇతరదేశాలకు పోతున్నారని, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నదని శాసనసభ వేదికగా లైవ్ టీవీ
మాద్యమం ద్వారా గౌరవ సభ్యులతో సహా యావత్ ప్రజలకు తెలియచేశారు కేసీఆర్.
మోదీ
అధికారంలోకి రావడం, భారత దేశ ప్రజలు ఓడిపోవడం, ఆ ఓటమిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఓడిపోవడం
ప్రస్తావిస్తూ, తెలంగాణ మాదిరిగా భారతదేశ ప్రభుత్వం
పనితీరు వున్నా, లేదా, మోదీ స్థానంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ వున్నా రాష్ట్ర
జీడీపీ రు. 13 లక్షల కోట్లకు బదులు రు 16 లక్షల కోట్లు వుండేదని, ఆ విధంగా రు. 3
లక్షల నష్టం రాష్ట్రానికి కలిగిందని కేసీఆర్ అన్నారు.
దేశంలో రాష్ట్ర జనాభా 3% మాత్రమే
అయినప్పటికీ, దేశ జీడీపీకి మన వాటాగా ఇస్తున్నది 4.9% అని, అయినా తెలంగాణ పురోభివృద్ధికి
అవసరమైన నిధులు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడంలేదని శాసనసభ సాక్షిగా
చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కాని, బీజేపీతో కాని దేశాన్ని బాగుచేయడం కాలేదని, అందుకే చూసి-చూసి విసిగిపోయి రిటైర్డ్ అయ్యే సమయంలో జాతీయ
రాజకీయాలలోకి రావాలన్న నిర్ణయం తీసుకున్నానని, ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అవతరించిందని, తాను తెలంగాణ గడ్డమీద పుట్టినా భారతీయుడినే అని, దేశ సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన
ఆవశ్యకత వున్నదని ఆయన స్పష్టం చేశారు.
(17 ఫిబ్రవరి, 2023 సిఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా)
Informative sir...
ReplyDeleteసర్వ మతిమాత్రాయదోషమ్ వనం గారూ. ఇంత పొగడ్త భయంకరంగా ఉంది.
ReplyDelete